‘సుధామ’ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన బహుముఖీన సాహితీ వేత్త శ్రీ అల్లంరాజు వెంకటరావు తల్లిదండ్రులు కీ.శే. అల్లంరాజు రాజేశ్వరమ్మ, కీ.శే. అల్లంరాజు కామేశ్వరరావు గార్లు.హైదరాబాద్ లో పనిచేసి తనదయిన ఒక వ్యక్తిత్వ ప్రతిభతో గుర్తింపు సాధించిన సుధామ, కవి, సమీక్షకుడు, రచయిత, కార్టూనిస్ట్, చిత్రకారుడు, సినీ విశ్లేషకుడు, కాలమిస్టు, వక్త, పదబంధ ప్రహేళికానిర్మాత, అన్నిటినీ మించిన వక్తృత్వ పటిమతో సాహితీలోకానికి సుపరిచితులు. ఐదు కవితా సంపుటులు, రెండు వ్యాస సంపుటులు, మూడు కాలమ్ వ్యాసాలు ఆరు ఇతర ప్రచురణలు మొత్తం 16 గ్రంథాలు వెలయించి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వీరి శ్రీమతి ఉషారాణి కూడా ఆకాశవాణిలో స్వీయ ప్రజ్ఞాపాటవాలను కనపర్చిన విదుషీమణి.
సుధామ సాహిత్యంలో సహజంగానే వారి వ్యక్తిత్వ ముద్ర ప్రకాశిస్తుంటుంది. సుధామతో దాదాపుగా మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నాకు ఎప్పుడూ వారిలో లవలేశమయినా గర్వరేఖలు కన్పించలేదు. సాహిత్యం బహిఃప్రాణంగా సాగిన జీవనయానంలో అందరితో మైత్రీ భావంతో మెలుగుతూ తర్వాతి తరాలకు కూడా మార్గదర్శకుడయ్యారు. ప్రాచీన సాహితీ పరిమళాలు అద్దుకొని, తెలుగు సుగంధాలను నల్దెసల వెదజల్లి. ఆకాశవాణిలో ఎందరో మహనీయమూర్తుల సాంగత్యంలో అక్షరశిల్పిగా రూపొందారు. ‘యువభారతి’ సంస్థ ప్రచురణలకు ప్రధాన సంపాదకులుగా సుధామ అందించిన సేవలు అపూర్వమైనవి. సినారె, శేషేంద్ర, ఉత్పల, దివాకర్ల, దాశరథి… ఎందరో దిగ్దంతులతో యువావస్థలోనే వేదిక పంచుకున్న కవివతంసులు. మాట, గీత, రాత అద్భుతంగా ఉంటాయి. మంచి మనసున్న ”(మీ) మన సుధామ” గురించి రాస్తున్నప్పుడు మనసంతా ఆత్మీయత, ఆనందం, స్నేహపు వెలుగులతో నిండిపోతుంది.
వివేకానందుని బొమ్మ ఏడవతరగతిలో వేసి బహుమతి పొందింది మొదలు బాపు చిత్ర సహానుగామిగా, సచిత్ర లిఖిత మాసపత్రిక ”యువమిత్ర” పత్రికా సంపాదకులుగా… ఎన్ని పనులు… ఎన్నెన్నో ప్రశంసలు! 1968 సం||లో ‘లత’ పత్రికలో ప్రచురించబడిన తొలి కార్టూన్ మొదలు కార్టూన్ల సుధామగా కొనసాగారు. ‘శూలబంధు’ పిల్లల పత్రికలో 1965 సం||లో మొదటి కథ రాశారు. ‘యువభారతి’ తొలి వచన కవితా సంపుటి ”వీచికలు” నలుగురు కవుల్లో సుధామ ఒకరుగా ఆ పుస్తకానికి ముఖచిత్రం వేసి మహాకవి సినారెచే ”కవితలో బొమ్మ గీస్తాడు. బొమ్మలో కవిత రాస్తాడు” అని ప్రశంసలందుకున్న నాటి యువకవి, నాడు విశ్వరచన, హాస్యప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రిక, జయశ్రీ, ఆంధ్రప్రదేశ్, ఈనాడు, ఆంధ్రభూమి, ప్రజావాహిని, ఉదయం, హైదరాబాద్ మిర్రర్, శుభసందర్భ కార్డులు, పుస్తకాలకు ముఖచిత్రాలు, శంకర్స్ వీక్లీ (ఇంగ్లీష్ కార్టూన్స్), ఆకాశవాణిలో ‘హ్యూమరసం’, హాస్యనాటికలు, ధారావాహిక ప్రసారాలు చేయించారు. 1983లో ఆకాశవాణి జాతీయ కవిసమ్మేళనానికి తెలుగు కవిగా ఎంపిక కావటం సుధామ ప్రతిభకు నిదర్శనం. గుసగులు, లిటరేచర్, బంగారు పాళీలు, హ్యూమర్‌మరాలు, పూతరేకులు, జాలీట్రాలీ, సం.సా.రా.లు, సినీటాక్, సినీమానిసి, సుధామధురం పజిల్స్, హాస్యచేతన, ఇలా పలు పత్రికల్లో కాలమ్స్.. గళ్ళనుడికట్లు నిర్వహించారు. కార్టూన్ల గురించి విశేష వ్యాసాలు రాసిన చిత్రప్రియుడు. సుధామ చేతిరాతలా ఏ కొద్దిమందిదో ఉంటుంది. అచ్చంగా ప్రింటులా అన్పించే అందమైన చేతిరాత వారి వ్యక్తిత్వ చిహ్నం.
రచనల్లో కూడా సున్నితంగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని చొప్పించగల సుధామ రాసిన ‘ఎక్సర్సైజ్’ కథ చదివితే మన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి చంద్రవంకలా నింగికెగురుతుంది ఒక ఇల్లాలు తన ఇంట్లో పనిమనిషి తోమిన అంట్లల్లో ఒక వెండిగిన్నె కనపడక ఉదయాన్నే పరుగెడుతున్న ‘అబ్బూచి’ని దొంగ అనుకొని పట్టించి తన్నటం, ఆపై ఆ గిన్నె ఆమె ఇంట్లోనే మరో గిన్నెకింద దొరకటం, ‘అబ్బూచి’ సన్నటి శరీరాన్ని బలిష్టం చేసుకోటానికి ఎక్సర్సైజ్ చేస్తూ పరిగెత్తాడని అందరికీ తెలియటం… కథా ఇతివృత్తం. లోక సహజంగా మనుషుల స్వభావ చిత్రీకరణతో పాటు ‘అబ్బూచి’ దెబ్బలు తిన్నా మళ్ళీ పరుగందుకోవటం ఆనందింపజేస్తుంది.
”కార్టూనిస్టులంతా ఆనందవర్ధనులు” అంటూ కార్టూన్లలో ఒక ధ్వని సిద్ధాంతాన్ని కనిపెట్టిన లాక్షణిక శాస్త్రవేత్త సుధామ. వ్యంగ్య చిత్రాలలో రెండు భాగాలుంటాయంటారు. ఒకటి శబ్దాశ్రీతం, రెండోది రేఖాశ్రితం. ఈ రెంటి సమ్మేళనం సమస్థాయిలో ఉండేదే ఉత్తమ వ్యంగ్య చిత్రం. దీనికి వ్యంజనాశక్తి ఆధారం. ఇది మూడు శబ్దశక్తుల్లో ఒకటి. ఇదే ధ్వని గూఢార్థం… కార్టూన్లలో అప్పడాలకర్ర ధ్వని ఒక కాలంలో ఎక్కువగానే వచ్చింది. ఒక్కొక్క కార్టూనిస్టు యొక్క ధ్వని సిద్ధాంతస్థాయిని వివరించగలిగితే అదొక పెద్ద సిద్ధాంత గ్రంథమౌతుంది. ఇలా అనేక మంది వ్యంగ్య చిత్రకారుల అలంకార, రేఖా, ధ్వని సిద్ధాంతాలను వివరించిన సుధామతో బాటు మనం కూడా కార్టూనిస్టుల్లో పీఠికాకర్తలు, సిద్ధాంతకర్తలు, విమర్శకులు, వ్యాసకర్తలు, జీవిత చరిత్రకారులు, ఆత్మ కార్టూన్ (కథ) రాసుకునేవాళ్ళు కావాలి.. రావాలని ఆకాంక్షించాలి.
”వయసు చిన్నదే అయినా, అతడు ప్రదర్శిస్తున్న కవిత్వపు భావగరిమ పెద్దది” అంటూ కవిప్రముఖులచేత విద్యార్థి దశలోనే ప్రశంసలు పొందారు సుధామ. ప్రసార మాధ్యమ ప్రయోక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వివిధ సాహితీ ప్రక్రియల్లో అస్తిత్వాన్ని ప్రకటించారు. ఆకాశవాణి కోసం అనేక లలిత గీతాలు రాశారు. బాలల గేయాలూ రాశారు.
”ఊరేదైనా, పేటేదైనా, మాటాడే ఆ భాషేదైనా బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే” అనే ఈ పాట బహుళ ప్రచారం పొందింది. ఉచ్ఛారణలో స్పష్టత. ఆకట్టుకునే స్వర మధురిమ సుధామ సొంతం. ”గడ్డి మొలవని భూమి” లాంటి ఉత్తమ కథలు రాసిన ఈ కథకుడు జీవితపు లోతుల్ని తరచి చూసే తాత్వికతతో మనల్ని కదిలిస్తారు.
‘కాలం వెంట కలం’ వ్యాస సంపుటికి ప్రముఖ సాహితీవేత్త విహారిగారు రాసిన పీఠిక సుధామ పరిణత ప్రజ్ఞను ప్రకటిస్తుంది. ‘మహతి’లో కార్టూన్లు, జోకులగురించి సుధామ రాసిన వ్యాసం ఆనాడే (1972) ఒక న్యాయమైన అంచనా. ఆధునిక నవలారచన ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. సామయిక కవిత్వం గురించి మరింత విశ్లేషణ జరగాల్సి ఉందనీ, ప్రయోజనకరమైన చిన్న కథలు మరింతగా వెలువడాల్సిన అవసరం గురించి వివరించారు. ‘కాలం వెంట కలం’ పేరుతో వెలువడిన సుధామ వ్యాససంపుటిలో అనేకమంది ప్రాజ్ఞులు, పండితులు, సాహితీ దిగ్గజాలు, సంస్థలు, భాషల గురించి ఉన్నత ప్రమాణాలతో రాసిన వ్యాసాలు మనలో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. ఒక అంశం తీసుకొని వ్యాసం రాశారంటే సమగ్ర సమాచారంతో బాటు తన విశ్లేషణను సునిశితంగా వెల్లడించగల నేర్పరి సుధామ.
సుధామ ప్రజ్ఞాకోణం మరోటి … అది కవిత్వం..
”రాయటం మానేశాను
అని చెప్పని దొక్కటే!
అదే నా కవిత్వం”
ఇలా చెప్పగల సత్తాగల కవి వీరు.
”వృద్ధాప్యం
వసంతం వలసపోయిన
శూన్యపు తోటలా వుంటుంది”
అంటూనే అది ఉడిగిపోయినా గాడితప్పని దివ్య
జీవనం అంటూ ఉగాదిలో వృద్ధాప్యాన్ని నిక్షేపించారు..
దీపావళి అంటే –
”నిన్ను నువ్వు వెలిగించుకుని
నీ వారిని వెలిగించటమే,
వ్యష్టి సమష్టిలో ప్రకాశనం కావడమే!”
ఇది దీపంలాంటి మనిషికే సాధ్యమయ్యే జీవితసత్యం.
‘సందర్భ’లోని వ్యాసాలు చూస్తే వాటిలోని సారాన్ని గ్రహిస్తే సుధామగారి అద్వితీయ సాహితీమూర్తిమత్వం కన్పిస్తుంది. భాషమీద పట్టు, సముచిత పదప్రయోగం, సమున్నత సంస్కారం, సమగ్ర విషయ పరిశీలన, వాఙ్మయాన్ని మధించిన ధీశక్తి విదితమౌతుంది. విద్యార్థుల కోసం పరిచయ వ్యాసాలలో కూడా ఘనిష్ట నిబద్ధతను పాటించారు. వెలువరించిన అన్ని గ్రంథాలలో సుధామ భాష, భావగరిమ ఆకట్టుకుంటుంది. సుధామ వ్యక్తిత్వాన్నీ జీవితాన్నీ, సాహితీ జీవితాన్ని వింగడించి చూస్తే అది ఒక పెద్ద సముద్రం. అందులోని అలల్ని లెక్కించలేము. అసలు, ఒక వ్యక్తి ఇన్ని రంగాలలో ఎలా రాణించగలరు అన్పిస్తుంది. ఆయా రంగాలలో ప్రజ్ఞ కన్పరచటమేకాదు, వ్యక్తిగా సుధామ అందరికీ ప్రీతిపాత్రులు. ఒక సోదరునిలా, స్నేహితునిలా అందరితో కలిసిమెలిసి ప్రవర్తించే సుధామ రాసిన ప్రతి అక్షరం ప్రతి క్షణాన్ని సద్వినియోగపర్చుకుని రూపుదాల్చినదే! ‘సుధామ’ సప్తతి సందర్భంగా ఆత్మీయమైన శుభాకాంక్షలు తెలుపుతూ మరింతగా ఎన్నుకున్న రంగాలలో ముందుకు నడుస్తారని ఆకాంక్షిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు.
0 comments:
Post a Comment