ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label ముఖచిత్ర కథనం. Show all posts
Showing posts with label ముఖచిత్ర కథనం. Show all posts

Sunday, March 31, 2019

నవచేతనా వసంతం




కాలచక్ర పరిభ్రమణంలో విళంబి తప్పుకుని, కొత్త సంవత్సరాది ‘వికారి’ని ప్రవేశింపచేస్తోంది. తిథి, వార, నక్షత్రాల ఊసే లేక, ఇంగ్లీష్ తేదీ, వారంతోనే కాలం గడిపేసుకునే - అలవాటయి పోయాక, ఉగాది కొత్త సంవత్సరం అంటేనే - ‘జనవరి ఒకటి కదా న్యూఇయర్! మళ్లీ ఇదేమిటి?’ అని నివ్వెరపోయే తరం స్థిరమైపోతోంది. ఇది మన తెలుగుతనం, తెలుగు వత్సరాదియే ఉగాది పండుగ. అభ్యంగన స్నానాలు, కొత్త బట్టలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, ఉదయాన్నే  ఉగాది పచ్చడి సేవనం ఇవన్నీ మన తెలుగు అస్తిత్వాలు. వాటిని క్రమేపీ మటుమాయం చేసుకుంటూ పరాయీ కరణం చెందడం విషాదమే మరి!
అయితే నేటికీ మన పల్లెసీమల్లో మామిడి తోరణాలతో ఇంటి ద్వారాలను అలంకరించుకుని, వాకిళ్లలో ముగ్గులు పెట్టుకుని కోయిల కుహూ రావాలతో, వేపపూలతో, మామిళ్ల గుబురులతో, పూల సౌరభాలతో, పిండి వంటలతో, బంధు సమాగమంతో, ఆలయాల్లో పూజాదికాలతో వేద పండితుల ఆశీర్వాదాలతో పండుగను నిండుగా నిలుపుకుంటున్న ఛాయలు పూర్తిగా మటుమాయం కాలేదు. మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవాదరాలు, మానవీయ విలువల పట్ల సమాదరణలు కలవారున్నారు.

వసంతకాలే సంప్రాప్తే
కాకం కాకః పికం పికః

అన్నట్లు కోయిలలేవో, కాకులు ఏవో ఆమని ఏమని వివరించాలా అని సందిగ్ధపడదు. చైత్రమాస సంరంభమే కొత్త ప్రకృతికి ఆవిష్కరణమై కాలం విలువను, ఉగాది ఉనికిని ఉల్లాసభరితం చేస్తుంది. సూర్యమండల మధ్యమున శ్రీమన్నారాయణుడే హిరణ్మయ స్వరూపంలో కాలచక్రాన్ని నడుపుతున్నాడని మనవారి విశ్వాసం.
మహత్తర తపశ్శక్తి సంపన్నులైన మన ఋషులు నవగ్రహాలను, వాని భ్రమణాలనూ గుర్తించి, అనంతమైన కాలస్వరూపాన్ని నిరూపిస్తూ - కాలం కాలమానానికై ఘడియలు, విఘడియలు, దివారాత్రాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ మాసాలను ఏర్పరచారనీ, ముఖ్యంగా చాంద్రమానాన్ని తెలుగు వారు పాటించడం జరుగుతోందనీ అనూచానంగా మనం చెప్పుకుంటున్న విషయం. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 3 సెకన్లు పడుతుందట. అమావాస్య వెళ్లిన పాడ్యమి నుండి మరల అమావాస్య వరకూ చంద్రుడు ఒక భూప్రదక్షణం చేస్తూ ఒక రాశి నుండి మరో రాశికి భూమితోపాటు చేరుతూంటాడనీ, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 54 నిమిషాల కాలం పడుతుందనీ, భూమి సూర్యుని చుట్టి వచ్చిన కాలానికే సౌరమాన సంవత్సరమని పేరు పెట్టారనీ మన జ్యోతిషవేత్తలు చెప్పే మాట.
చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం నెల, అలాంటి పనె్నండు నెలలు ఒక సంవత్సరం అదే చాంద్రమాన సంవత్సరం. సౌరమానానికీ, చాంద్రమానానికీ రెండింటికీ కొద్ది రోజులు తేడా వస్తుంది. మన జ్యోతిష్కులు ఋతువులతో స్పష్టంగా కాన వస్తున్న సౌరమాన సంవత్సరాన్నీ, శుక్ల, కృష్ణ పక్షాలతో కానవస్తున్న చాంద్రమాన సంవత్సరాన్ని దేనినీ వదులుకోలేక ఆ తేడా వచ్చే రోజులను సరిపెట్టేందుకే ‘అధిక మాసం’ సృష్టించారు. ఈ ఆచారం ఋగ్వేద కాలం నుండీ వుందని పురాణాల వల్ల తెలుస్తోంది. సంవత్సరాది పండుగ జరుపుకునే ఆచారం వేదకాలం నుంచీ ఉందట!
రాత్రింబగళ్ల కాలం సమానమయ్యే వసంతకాలమే వేదయుగంలో కూడా ఉగాదిగా పరిగణింపబడింది. యజ్ఞయాగాదులు ఆ దినానే్న ప్రారంభించి సంవత్సరం పొడుగునా చేసేవారట! అనాది నుంచి ఈ సంవత్సరాది భిన్న ప్రాంతాల వారికి, భిన్న భాషల వారికీ భిన్నంగానే ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్రులు ఈ ఉగాది వేడుకల విషయంలో మనకు దగ్గర. తమిళులు, బెంగాలీల సంవత్సరాది వేరు.
జీవితం షడ్రుచుల సమ్మేళనం అన్నదానికి ప్రతీకగానూ అన్నింటినీ స్థిరచిత్తంతో స్వీకరించాలనీ, స్థితప్రజ్ఞత అవసరమనీ ఉగాది పండుగ ఉదయానే్న వగరు, పులుపులతో కూడిన మామిడి పిందెలతోను, పులుపు, తీపులతో మిళితమైన కొత్త చింతపండుతోనూ చేదయిన వేపపువ్వుతోనూ, కొత్త బెల్లంతోనూ తయారయిన పచ్చడిని సేవించడం, కొన్ని పల్లెల్లోనయితే గ్రామ పురోహితుడే ఇంటింటికీ వచ్చి ఆ పచ్చడిని తెచ్చి ప్రతివారికి ఇవ్వడం జరిగేది. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో పల్లె ప్రజలు ముఖ్యంగా రైతులు ఉదయం నుండీ కొత్త గోగునారతో పగ్గాలను తయారుచేసుకుని, సాయంత్రం తమ నాగలికి పూజలు చేసి సకుటుంబంగా తమ పొలంలో ఏరువాక ప్రారంభించి పాలేళ్లకు, జీతగాళ్లకు కానుకలివ్వడం, ఒక సమష్టి జీవన సంవిధానాన్నీ, పరస్పర ప్రేమాదరాలనూ ప్రతిఫలింప చేయడమూ ఉంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసుకుని తదనుగుణంగా తమ జీవన విధానాలనూ, కార్యక్రమాలను ప్రణాళికాబద్ధం చేసుకోవడం సంప్రదాయం పట్ల విశ్వాసానికి నిదర్శనం. పంచాంగ శ్రవణం యజ్ఞ ఫలంతో సమానమనే భావన వుంది.
క్రితం మాటు వికారి నామ సంవత్సరం 1959లో వచ్చినప్పటికి అంతకు ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలుగా ఛిన్నాభిన్నమైన తెలుగు జాతి ఏకజాతిగా సుసంఘటితం కాగా, ఈ వికారి 2019కి మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడివడి అసలు దేశం మొత్తం ఎన్నికల సంరంభంతో రాజకీయ నానా వికారాలతో సాక్షాత్కరిస్తూండడం విధి వైచిత్రియే మరి!

ఏ పేరు పూని వచ్చిన
నీపై మా కోర్కులెల్ల నెలకొనునయ్యా
ప్రాపై ఏటికి యేడున్
చూపుము నీ మంచితనపు సౌరది నుగాదీ!
బొడ్డు బాపిరాజు గారన్నట్లు, పేరేదైనా తీరేదన్నదే మనకు ముఖ్యం. ఆ సౌరు బాగుండాలనే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అసలు ఉగాది అంటేనే వసంతం, కోకిలలు, పూలకారు ప్రకృతి అందాలు.
ఆకులందున అణగిమణగీ
కవిత కోకిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమందభిమానములు
మొలకెత్తవలెనోయ్!

అని గురజాడ వారన్నారు అంటే - కవి కోకిలలకు బాధ్యత వుందనీ, వారి కూతలు దేశానికి ప్రగతి చేతలు కావాలనీ, అలాంటి నేతలును ఎన్నుకునే చైతన్య స్ఫూర్తి నివ్వాలనీ సత్సంకల్పం. కానీ కవిత్వమూ రాజకీయమై పోయి సమష్టి చేతన కులాలుగా, ప్రాంతాలుగా శకలాలు శకలాలుగా ఛిద్రమై పోతుంటే ఆర్తియే కలుగుతోంది.
మావి గుమ్మ కొమ్మ మాటున
పల్లవము మెక్కి కోయిల పాడుటేల
పరుల తనియించుటకో - తన బాగు కొరకో
గానమొనరింపక బ్రతుకు గడువబోకొ?

అని కృష్ణశాస్త్రి గారన్నట్లు కవిత్వం మానవీయ విలువల శిఖరాయమానం కవి తన గురించి తాను రాసుకున్నట్లు కనబడినా అందులో పరహితార్థ చింతన వుంటుంది. ఉండాలి. కవిత్వమే జీవితం అన్నంత స్వచ్ఛత ఉండాలి. ఉగాదిని లక్ష్మిగా, సౌందర్య దేవతగా సంభావించడమూ వుంది.
ఉగాది లక్ష్మిని చూదాము
వసంతలక్ష్మిని కొలుతాము
రారండి! రారండి!
రంగురంగులా పూలివిగో
కమ్మని పూలా తావిదుగో
పూలను చేరే రేడిడుగో
ఝుమ్మను తుమ్మెద రవమిదిగో
గున్నమామిడి కొమ్మదిగో
కొమ్మ చివరా చివురిదిగో
చివురుల మేసే పికమిదిగో
రాగము కూర్చే స్వరమిదిగో
రారండి! రారండి!!

అని పిల్లలమర్రి హనుమంతరావు గారు పిల్లలకు కూడా సుబోధకంగా ఉగాది లక్ష్మిని ఆహ్వానించారు. మామిడులు, కోకిలలు, పూలు, తుమ్మెదలు లేని ఉగాది కవిత అందునా సంప్రదాయ కవుల పద్యాలే లేవు.
1959 నాటి సుప్రసిద్ధ స్ర్తిల మాసపత్రికగా పేరొందిన కేసరి కుటీరం వారి ‘గృహలక్ష్మి’ ఉగాది సంచికలో వికారి నామ సంవత్సర ‘ఉగాది కానుక’ అంటూ కవిభూషణ బిరుదాంకితులైన కల్లూరు అహోబలరావుగారు రాసిన పద్యాలివి కొన్ని-

పండుగ నేడుగాది, పరిపాటిగ భామినులెల్ల, నిండు పూ
దండలు గ్రొత్త పుట్టములు దాల్చి, సుభూషణముల్ ధరింత్రు; నీ
వండజయాన! శ్రీకరము - హాస మనోహర వేషభూషలన్
నిండుగ దాల్చి రమ్ము; తరుణీ! వరదమ్మ - వికార వేషముల్
హృదయానందకరీ! సౌ
ఖ్యదరీ! నారీ! ఒయారి! కడు శృంగారీ!
ముదమొసగెడు, సంసారీ!
ఇదె మా స్వాగతము! స్వీకరింపు, వికారీ!
కలరుతములు బలికెను, కో
యిలగమి, మలయా నిలంబు లింపుగ వీచెన్
లలిసుమములు వర్షించెను
కోలు వింపారంగ జేసికొమ్ము, వికారీ!
... ...

జిలిబిలి పల్కులన్ తెలుగు జినె్నలువనె్నలు జిందులాడ, కో
కిలకలనాదముల్ వెలయఁ గినె్నరసానులు, నట్టువాడగా
గలకలఁదెల్లు కబ్బములు, కమ్మగవ్రాయ గవీంద్రకోటి, మే
ల్కొలుపుము శ్రీ వికారి! కయికొమ్ము! జోహారులుగాది కానుకల్.

1959లో రాజుగా గురువు, సేనాధిపతి చంద్రుడు, మంత్రిగా కుజుడు వున్న వికారి వస్తే ఇప్పుడు రాజు, సేనాధిపతి, అర్ఘ్ధాపతి కూడా శనియేననీ, మంత్రి రవి అనీ, సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు అనీ ధాన్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు అనీ, రసాధిపతి శుక్రుడు అనీ జ్యోతిష పండితులు అంటున్నారు. మరి ఈ ‘వికారి’ ప్రారంభమే ఎన్నికల వేళ అనేక రకాల రాజకీయ వికారాలతో అడుగు పెడుతూంటే ఏ విధమైన ఫలితాలు లభిస్తాయన్నది సందేహాస్పదమే అయినా ఆశాజీవులం కనుక మంచినే అభిలషిస్తాం. అభిలషిద్దాం.
ఉగాది సంప్రదాయవాదులకే అనుకోవడం నేడు పొడచూపుతున్న ఓ విడ్డూర వైఖరి. ఉగాదిని జరుపుకోవడం కూడా వర్ణగత ఆధిపత్య భావజాలం అనే వ్యాఖ్యలు నేడు కొన్ని వినబడుతూండడం కూడా ‘ఎక్కడికి పోతున్నాం మనం? అగాధ పాతాళ కుహరాలలోకా? ఉత్తుంగ హిమవన్నగ శృంగాల వైపునకా?’ అని సి.నా.రె. ప్రశ్నను వేసుకోవాల్సి వస్తోంది.
గత వికారికి విశాలాంధ్ర దినపత్రికలో ‘ఉదయభాను’ అనే నాటి, కవి ‘సమీక్ష’ అని ఉగాదినిలా సంభావించాడు.

ప్రేయసి ఉత్తరంలా వచ్చింది ఉగాది
పేకాటలో జోకరులా వచ్చింది
విచ్చిన ఉషస్సులా విచ్చేసింది ఉగాది
ఇరాక్‌లో ఖాసింలా వచ్చింది
ఎడద ఎడదను కొత్త కోర్కెలే పండీ
గుండె గుండెకు క్రొత్త నెత్తురులు నిండీ
వింతగా ఉంటుంది ఉగాది వేడుక
ఇది కాలం పుట్టిన రోజు పండుగ
తెలుగు సాహితీ లోకంలో శ్రీశ్రీలా
అక్షరాలా అతని మహాప్రస్థానంలా
సామ్యవాద జగతీ సంస్థాపనా
లక్ష్యసంఘటిత ప్రజాపోరాటంలా
ఈ ఉగాదిలో నిండుదనం నిండి వుంది
ఏదో నిత్యనూతనత్వం నిబిడి వుంది
ఆమని చిగురించి నేడు మామిళ్లు కాసి
వేపలు పుష్పించి నేడు వేకువలు వెలిగి
ఎదురేగి ఎదమ్రోగి హారతిచ్చాయి
సిగ్గుపడుతూ చైత్ర మనునయించింది.
మనిషి మనిషికి మధ్య దూరాలు త్రెంచి
మనసు మనసుకు మధ్య వైరాలు త్రుంచి
సముజ్జ్వల భావికై బాట వేసేను
ఈ రోజు
మరో మంచి లోకానికి నాంది చేసేను
ఇది ప్రస్థాన యాత్రలో ఒక మైలురాయి
అంచేత నేడు గతాగతాల సమీక్ష వ్రాయి.

అంటాడు ఆ కవి.
ఆ స్వతంత్ర స్వర్గమునకు మేలుకో భారతీయుడా
ఈ వికారి వత్సరమున ఇంపుసొంపు గులుకుచుండ
దైన్య జడత లేని మనోధైర్య స్థైర్య సహితమైన
నిశ్చలత్వమంది నీవు నిక్కినడచు ఠీవి గల్గి

అంటూ డి.రాజన్న అనే కవి గృహలక్ష్మిలోనే వికారి గేయము రాస్తూ నాటి దేశభక్తి జనితమైన భావనలను జమలికగా ఇలా అంటుకట్టాడు.
సత్యధర్మ మహింసా శాంతి దాంతులొల్కునట్టి
నిత్యవౌ ప్రభుత్వరీతి నెగడుగా వికారిలోన
దేశపిత మహాత్మాగాంధి తెలిపినట్టి విశ్వప్రేమ
దేశదేశములను నెగడి తేజరిల్లు వికారిలోన
భారత త్రిమూర్తులరయ గాంధి, టాగూరు, అరవిందులూ
వారి వేద సత్యఘోష నీ ‘వికారి’లో వెలయగా
ఆటంబాంబు లలజడిని ఆత్మబల్మి నణగద్రొక్కి
పంచశీల జండా నూత్న వత్సరమున వెలయుగా
ఈ వికారి వత్సరమున నే వికారములు లేక
పాడిపంటలెల్ల భోగభాగ్యములు జేకూరుగా!

అని అభిలషించి ఆశావహ సందేశగీతి పలికాడు. ప్రస్తుతం మహాత్మాగాంధీ 150వ జయంతి సమాపన వేడుకలు సాగుతున్నాయి. ‘గాంధీ అనేది ఒక పేరు కాదు ఈ కాలానికి అవసరమైన ఒక జీవన విధానం’ అని ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి పెరల్‌బక్ అన్నట్లు నేటి తరానికి గాంధీ మార్గం గురించిన పునర్ముల్యాంకనం అవసరం. పంచశీల సూత్రాలు అప్పట్లో ప్రాచుర్యంలో వున్నాయి. నిజానికి ‘దేవుడే సత్యం’ అని మొదట్లో అన్న గాంధీ ఆ తరువాతి కాలంలో ‘సత్యమే దేవుడు’ అని విశ్వసించి నడిచి నడిపించాడు.
తుపాకీల హతం చేసి
కృపాకీల వెలిగించుడు

అని కవి దాశరథి అన్నట్లు అణుబాంబులు కాక అహింస యొక్క ఆవశ్యకతే ఈ తరానికీ అవసరం. భోగభాగ్యాలతో, పాడిపంటలతో దేశం విలసిల్లాలంటే అన్నదాత రైతు ముందు క్షేమంగా ఉండాలి. ప్రస్తుత వ్యవస్థ పట్ల ‘రోసి’ నిజామాబాద్‌లో రైతులు తామే అధిక సంఖ్యలో పార్లమెంట్ నామినేషన్ పత్రాలు వేసి ఓ హెచ్చరికను చూపారన్నప్పుడు నిజంగా భూమిని నమ్ముకున్న రైతు నేలను అమ్ముకుని పోకుండా జీవించగలిగే సుఖమయ తరుణమే అభిలషణీయంగా కదా మరి!విశిష్టమైన కాలపురిక్క అనే భావనకు ఈ ‘వికారి’ ఓ సంకేత పదం అన్నాడో కవి. నిజంగా నక్షత్ర కాంతితో కాలం వెలుగొందాలని ఈ వికారిలోని అర్థాన్ని పరిణామయుక్తం చేసుకోవడం దోషమేమీ కాదు కదా!
దేశరాజు భారతీదేవి అరవై ఏండ్ల క్రితం తన కవితలో సంభావించినట్లుగా అందుకోదగిన అశంసల భావశబలత ఇది.

సగుణబ్రహ్మము నీ మహామహిముచే సంజాతమై యందు నీ
జగతీ చక్రము గల్గె నీ వలననే, సర్వంబు నీ కార్యమే
యగు గాదే; నిను దప్పుకోగలుగు బ్రహ్మంబొండు మాత్రంబె, ని
త్యగుడౌనేమో, వికార శూన్యతను బెంపారన్ ‘వికారీ’ నమః
శుభం భూయాత్ !
-సుధామ 
98492 97958

Home

Thursday, January 18, 2018

పల్లెకాంతి... సాహితీ సంక్రాంతి




అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పండుగ వైభవ ప్రాభవాలన్నీ పల్లెల్లోనే వెల్లివిరుస్తాయి. గ్రామ జీవన ఆత్మీయ మానవీయ బంధాలన్నింటినీ దృశ్యమానం చేసే కనుల పండుగ మనసు నిండుగ సంక్రాంతి పండుగ. ఆరుగాలం శ్రమిస్తూ భూమిని నమ్ముకుని ఉన్న నేలకే బ్రతుకు ముడుపు గట్టిన రైతులకు పంటలు చేతికొచ్చే కాలం. కనుకనే ధాన్యలక్ష్మి రూపేణా నట్టింటికి నడిచొచ్చే సౌభాగ్యలక్ష్మి ఆ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ జరుపుకునే సంబురమే నిజానికి సంక్రాంతి. అందుకే అచ్చమైన జానపదుల వేడుకగా, పల్లీయుల ఉల్లాలను రంజిల్లచేసే పండుగగా సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అనే వ్యవహారం కూడా ఉంది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్’ అని సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ముదిమి వయసు మీరిన వారయినా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కాలధర్మం చెందినా పుణ్యలోక ప్రాప్తి సంభవిస్తుందని సంభావిస్తారు. సంక్రాంతి రోజు పితరులకు తర్పణాలు వదలడం కూడా ఉంది. అంతేకాదు వ్యవసాయాధారిత జీవనులు పంటలు పండేందుకు తమకు తోడై బ్రతుకుతున్న పాలేళ్లు, జీతగాళ్లకు కూడా తమ ధనధాన్యాల నుండి, ఆర్జించిన ధనం నుండి, వస్తూత్పత్తి నుండి దానం చేయడం - కుటుంబంలో ఒకరిగా సమిష్టి జీవన ఆత్మీయబంధాన్ని ప్రకటిస్తారు.

‘లా కేత్వమీయ నేరరు’ అన్నట్లు లేదనకుండా తమ శక్తిమేరకు ఇలా దానశీలతను, ఔదార్యాన్నీ వెలారుస్తారు. కనుకనే సంక్రాంతి రోజులైన ధనుర్మాసమంతా హరిదాసులు, జంగమదేవరులు, బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వారు, ఒగ్గు కథకులు, విప్రవినోదులు, పగటి వేషగాళ్లు ఒకరేమిటి ఎందరెందరో సంచార జీవనులు, కళాకారులు వచ్చి గృహస్థుల నుండి తృణమో పణమో పొంది ఆనందంగా ఆశీర్వదించి వెడుతూంటారు.
పల్లె శోభాయమానంగా ప్రకృతి అందాలతో కానవచ్చే కాలం సంక్రాంతి.

కొసరి నూరిన పచ్చి పసుపు పుంత మొగాన
గుమ్మడి పూ దుమారమ్ము నద్ది
కండరేగడి నార పండి కన్పండువై
పొలయు మిర్యపు పండు బొట్టు పెట్టి
వలిపమ్ము నొకనొక్క వాసి హెచ్చినట్టి
నుసమంచు తెలిచీర నూలుగొల్పి
బంతిపువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి
కబరీ భరమ్ము చక్కన గుదిర్చి
పంట కళ్లాల మున్ బరాబరులు సేయ
గూడు గట్టిన తెలిమబ్బు గొడుగు నీడ
కదలివచ్చెను భాగ్యాల కడలివోలె
మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి
అంటారు కవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తిగారు.

శుభ సంక్రాంతి నవోదయ వేళ ఆ చిరుచలి నవ యువతనే కాదు ముసలి జంటలనయినా ‘ఏకాకీ న రమేత’ అనిపిస్తుందంటాడు దాశరథి.

మంటలు వేసిన యంతనె
మన చలి పరుగెత్తేనా
జంటలలో దొరుకు వేడి
మంటలలో లేదోరుూ! 
అంటాడు ‘సంక్రాంతి రాత్రి’లో.

మంచు ముసుగు వేసి పొంచి చూచెడి తూర్పు
పడతి మొగము నుండి పొడచినాడు
బాలభాస్కరుండు, పచ్చని సంక్రాంతి
శుభ ముహూర్తము నందు, నభము నందు

కొద్దిగా గిలిగింతలు గొలుపు చలినె
పులకరింపగ జేసెడి ప్రొద్దు పొడుపు
ఉల్లమున మల్లెపువ్వులు చల్లునపుడె
కొసరి గోరింట ముళ్లను గ్రుచ్చసాగె

అంత చలిలోనూ ఈ రోజుల్లో ముంగిట ముగ్గులు ముదితలు వేస్తూంటారు. భోగిమంటలు మాలిన్యాలను క్షాళన చేస్తూంటాయి.

ఒక్కవైపు జాలి, ఒకవైపు చలిగాలి
ఒకవైపు మ్రుగ్గు, ఒకట సిగ్గు
నాల్గువైపులందు నాల్గు నిర్బంధాలు
కదలలేక వెలది కంపమందె
శుభ సంక్రాంతి నవోదయ
ముభయుల హృదయాల వెల్గుటుయ్యెల లూపెన్
నభము, ధరతాల మొకటై
అభయమ్మిడె నుభయులకు మహానందముగా

అంటూ జంటలు కనుల పండుగగా, మంగళకరముగా, మహదానంద సుందరంగా దరిచేరే వలపు పంటల కాలం కూడా సంక్రాంతి అంటాడు దాశరథి.
పంట ఇంట నుండు పబ్బంబునాటికి, పిండివంట కొరకు చింతలేదు కనుకనే కొత్త అల్లుళ్లకు అత్తింటి మర్యాదల మహద్వైభవ కాలమూ ఇదే. పట్నం ఉద్యోగమే కాదు, అమెరికా ఉద్యోగం అయినా సంక్రాంతి పండుగకు సౌంత పల్లెకు చేరాలనే ఆరాటం. అందుకే నేటికీ తెలుగువారి జీవితాలలో తరగలెత్తుతూనే ఉంటోంది.
పైడి పంటలతోడ ప్రభవించె భూమాత
పాడిపంటల తోడ భాసిల్లె గోమాత
అత్తవారింట అర్ధాంగి వలపు పంట
విందులతోడ ఆనందించె జామాత

పరికిణీ పాదాలపైన చిందులు త్రొక్క
అక్క వేసిన మ్రొగ్గు త్రొక్కకుండగ నడిచి
హరిదాసు తల మీది అక్షయపాత్రలో
దోసెడు బియ్యమ్ము పోసె ముద్దుల చెల్లి

ఎండనక వాననక ఏడాది కష్టపడి
పండించుకున్న క్రొంబసిడి ధాన్యపురాశి
పంటకళ్లము నుండి ఇంట చేరినదన్న
సంతృప్తి మెరసె కర్షకుల కన్గొనలందు

-అన్న కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సమానత్వానికీ, సామ్యవాదానికీ ప్రజాస్వామ్య జీవన సంవిధానానికీ బొమ్మలకొలువు ప్రతీకాత్మక సందేశంలా సాక్షాత్కరింపజేశారు.

పులిప్రక్క మేక, ఏన్గుల మధ్య కుందేలు
పూరిల్లు - మేడ, మోటారు - ఎద్దులబండి
రాజు - బంటును, సామరస్యంబు సమకూర్చ
కనులవిందయ్యె సంక్రాంతి బొమ్మల కొలువు

-అంటూ స్వర్ణక్రాంతిని పొడగట్టించారు.

సంక్రాంతి పల్లె శోభను డా.సి.నారాయణరెడ్డి తమ కావ్యంలోని ‘హేమంత ఖండం’లో స్వీయ జీవన ఘటనలతో అనుభూతి రమ్యం చేస్తారు. సంక్రాంతి రోజుల ప్రకృతి శోభను ప్రస్తావిస్తూ

జనపద రంగమ్ములందు
సస్యరమణి ఆకుపచ్చ
చేలమ్ముల బదులు పసుపు
చీరలు ధరియింపసాగె

పెరడులోను తీగనిండ విరిసిన గుమ్మడిపూవులు
కన్పించెను క్షేత్రలక్ష్మికై బంగరు గిన్నెలవలె
అచ్చటచ్చట పండిపోయినట్టి మిరప పండ్లు కనం
బడెను నీరు దిగని మేలి పగడమ్ము గుత్తులట్లు

పొంగారిన ముద్దబంతి పూలనుగన తోచెనాకు
మించుభయముతో రూపము మార్చుకున్న తామరలని
కోతలన్ని ముగిసెను, వరికుప్పల నూర్పిళ్లయ్యెను
కాపుల కాపురములు సంక్రాంతికి శిబిరములయ్యెను

నేడే సంక్రాంతి ఊరివాడలన్ని గంగిరెద్దుల
కొమరాడెడు చిందులతో ‘కూచిపూడు’లై పోయెను 
అంటారు.

ఆబాలగోపాలం ఆనందంగా పరవళించే పర్వం సంక్రాంతి. పల్లెల్లో తెలుగు లోగిళ్లు రంగవల్లులతో మెరిసిపోతూంటాయి, తెలతెల వారకముందే భోగిమంటల కోలాహలం. పండుగ పూటా అభ్యంగన స్నానాలు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసే వేడుక. అలాగే భోగిరోజు కొత్తగాజులు వేయించుకోవడం, గాజుల వ్యాపారికి కొత్తవడ్లను ఇవ్వడం ఒక ఆచారం. సంక్రాంతి బొమ్మల కొలువులు, పేరంటాలు, బియ్యం పప్పులు, కూరలు నిండిన అయిదు మట్టి కుండలపై మూతలు పెట్టి నువ్వు ఉండలుంచి పరిచితులకు పంచిపెట్టడం కొన్నిచోట్ల ఆచారం. అయితే, ఒడిబియ్యం పెట్టడం మరికొన్ని చోట్ల ఆచారం. సంక్రాంతి రోజుల్లో తిలాదానం విశిష్టమని భావిస్తారు. అలాగే పెరుగును దానం చేయడమూ దధివ్రతం పేర మహాభారత కాలం నాటి నుంచీ వుందట. అలాగే తమ జీవనానికి నోరు, వాయి లేకపోయినా శ్రమించి సహకరించే పశువులను కొలవడం కూడా మూడు రోజుల పండుగ చివరి రోజు కనుమ పండుగగా ప్రసిద్ధం. వ్యవసాయ పరికరాలను కూడా ఈ సందర్భంగా పూజించడమనే ఆనవాయితీ ఉంది. పొలాల్లో పొంగళ్లు, కోడిపందేలు, ఎద్దుల ఊరేగింపులు, గ్రామదేవతకు నైవేద్యాలు పశువుల పండుగ సందర్భంగా రివాజయిన సంబురాల సంక్రాంతి కాంతియే!

అనేక వృత్తుల వారు, జానపద కళాకారులు కనువిందు చేసే గ్రామీణ వైభవం పల్లెల్లో సంక్రాంతినాడే సాక్షాత్కరిస్తుంది. జంగమదేవర, సాతానిజియ్యరు, గంగిరెద్దుల వారు, మాసాబత్తినివారు, నూనెగుడ్డలవారు, కాటికాపర్లు, కొమ్మదాసర్లు, తత్త్వాలుపాడే బైరాగులు, గోసాయిలు, దీవెనలు ఇచ్చే పకీర్లు, పిట్టలదొరలు, చెంచుదొరలు ఇలా సంక్రాంతి వేళ పల్లెలు జన జీవన వైవిధ్యాన్నంతా రాశిపోయే కాలం. కమ్మరి, కుమ్మరి వంట వృత్తుల వారికి ఆత్మీయంగా మిరిసి చెల్లింపులు ఇచ్చుకునే కాలం కూడా ఇదే. సంక్రాంతినాటి పల్లీయ ప్రకృతిని పింగళి కాటూరి, దువ్వూరి, కవికొండల, బాపిరాజు, తుమ్మల వంటి కవులు తమ రచనలలో దృశ్యమానం చేశారు. పల్లెల నుండి పట్నాలకు వలసపోయే దౌర్భాగం ఎవరికీ దాపరించకూడదనే ఆర్తి ఒకప్పుడు మిళితంగా ఉండేది. కొనకళ్ల వెంకటరత్నం ‘బంగారి మామ పాటల’ నాటికీ ఆ స్థితిని చిత్రించాడు.

ఈన మోపై వున్న పైరులు
ఏటి మునకల పాలుజేసి
కొంపగోడూ విడిచి పట్టెడు
కూటికై ఊరేగవలెరా

ఒళ్లు పెంచిన గడ్డమీదే
ఒరిగిపొయ్యే రాతలేదో
ఊరుగానీ ఊరిలో చితి
పేర్చుకొమ్మని నొసటి వ్రాలో
అన్న అర్తి గీతం రాశాడు. పల్లె సంక్రాంతి వైభవాలు మందగించి సామ్రాజ్యవాదపు పల్లకీ బోయీలమవుతున్న విషాదం ఏనాడో గుర్తించినట్లుగా రెంటాల గోపాలకృష్ణ ‘పల్లకీ బోయీల పాట’లో చీకటి తప్పు చేయడానికి పొరుగూరు వెడుతున్న పెద్దమనిషి పల్లకీని మోసే బోయీల విషాద గీతిక రాశాడు.

రాళ్లైనా మోయచ్చు
రథమైనా లాగచ్చు
గుండెలేనీ మనిషి
కూర్చున్న పల్లాకి
రంపాలతో కోసి
నట్టూగ ఉండాది’
(సర్పయాగం కవితాసంపుటిలోని ‘పల్లకీ బోయీలు’ కవితలో)

ఎంత ఆధునికతను సంతరించుకున్నా, సాంకేతికాభివృద్ధి జరిగినా మానవ జీవనంలోని మధుర పార్శ్వాలను కోల్పోకూడదు. స్టీవ్‌జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’ చదివే పరిజ్ఞానం లేకున్న తెలుగు పడతిచుక్కల ముగ్గులతో చక్కని చక్కగా గీతలను కలుపుతూ ఇంటి ముంగిలినే కాదు అంతర్జాల వేదికనయినా కళాత్మకం చేస్తూనే ఉంది.
ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి
గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి
ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి
పగడాలు చెడగొట్టి పట్టిలేయించి
అంటూ ముగ్గుల ప్రాధాన్యపు మురిపాల పల్లె గీతాలు బతికే వున్నాయి. సంతోషం, సంబరం, సుహృద్భావం, స్వాగతం, సమిష్టి జీవనం ఈ విలువలన్నింటికీ ప్రతీక సంక్రాంతి పర్వం.

సంకురాత్రి పండుగొచ్చె సిద్ధేశ్వరా
తల్లిపిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
సాంబమూర్తి కరుణకల్గి సిద్ధేశ్వరా
కలకాలం వర్థిల్లు సిద్ధేశ్వరా
ఏడాదికొక్కసారి సిద్ధేశ్వరా
వాడావాడ కొత్త నుండి సిద్ధేశ్వరా
అంటూ శంఖం ఊదుతూ గంటవాయిస్తూ ఒకనాడు సంక్రాంతి వేళ కనబడే జంగమదేవర యే కాదు, ఇవాళ అనేక సంచార జీవన కృత్తులవారు మాత్రమేనా కులవృత్తుల వారూ స్థానచలనమో, స్థానభ్రంశమో చెందుతూనే ఉన్నారు. పల్లెలే ప్రకృతికి పట్టుగొమ్మలై, శాంతి, సౌఖ్యాలతో పచ్చదనపు పరిశుభ్రాలతో విరాజిల్లే స్థితి ‘నగరీకరణం’ పేర క్రమేపీ మటుమాయమయ్యే దౌర్భాగ్యం ఆవరించకుండా మన సహజ సంపదలను, మానవ వనరులను, మనుషుల మధ్య ప్రేమాభిమానాలను, ఆత్మీయతలను ,మానవీయతను పరిరక్షించుకోవలసింది మనమే. పండుగలను దండగలనుకోకుండా ,మన ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను, మహోన్నత మానవీయ విలువలను నిలుపుకొని మనగలగడం మన చేతుల్లోనే ఉంది.
పోయిన సంక్రాంతినాడు
పొగ చూరిన ఇల్లు నేడు
కాంతి స్నానమ్ములాడె
కాలమెంత విలువైనది (ఋతుచక్రం- సినారె)

అని భవిష్యద్గానం చేసుకునే బంగరు సంక్రాంతులే మున్ముందు నిగ్గులు చిలికేలా తెలుగు వెలుగులు తేజరిల్లేలా ముందడుగు వేద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. *

-సుధామ


                                                           ఆదివారం 14 జనవరి '2018

Sunday, August 27, 2017

తెలుగుకి వెలుగేదీ ?





‘అయ్యయ్యో! మన భాషయే - 
మకరంద బిందు బృందరస స్యందన సుందరమగు మాతృభాషయే - 
మహానంద కందళ సందోహ సంధాన తుందిల మగు మాతృభాషయే - 
కమ్రతకు గమ్రత, కఠినతకు కఠినత - వదలునకు వదలు, బిగికి బిగి, జోరునకు జోరు, నెదురెక్కున కెదురెక్కు - మందతకు మందత - ధాటికి ధాటియు - 
నన్ని వనె్నలు, నన్ని చినె్నలు, నన్ని వగలు, నన్ని వద్దికలు, నన్ని తళుకులు, నన్ని బెళుకులు - నన్ని హొయలు, నన్ని యొయ్యారములు గలిగిన మన మాతృభాషయే - వ్యాసమునకు నుపన్యాసమునకు - గవిత్వమునకు - గానమునకు సంపూర్ణార్హత గల భాషయే - పైవారే యా భాషను బట్టుదలతో బ్రయత్నమున నభ్యసించుచుండగా - మనవారే దానినంత యధమాధముగా జూచుట తగునా?’


‘ఆంగ్లేయ భాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను. ఇంతకన్న నధిక జ్ఞానమును గూడ నీ వా భాషలో సంపాదింపుము. నాకు మరింత యిష్టము కాని నీ యాంగ్లేయ భాషా జ్ఞానమెందులకో నీ వెరుగుదువా? ఆంగ్లేయ భాషయే కాదు, ఇంక ననేక భాషలు కూడ నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాష నభివృద్ధి పఱచుటకే. నీ భాషను భాగ్యవత్తరమును జేయుటకే - నీ భాషను బరభాషా గ్రంథ ప్రశస్త్భాప్రాయములతో వనె్న పెట్టుటకే. అంతకంటె వేరుకాదు’

- ఇప్పుడు కాదు తొంభై ఆరేళ్ల క్రితం 1921 జులై 23 ఆంధ్రపత్రికలో కీ.శే.పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు సాక్షి వ్యాసాలలో ‘స్వభాష’ పేరిట రాసిన వ్యాసంలోని తెలుగు భాషా స్థితిని గూర్చిన ఆర్తి అది. ఈనాడు తెలుగు భాషా స్థితిని గూర్చిన ఆవేదన ఇబ్బడిముబ్బడి అవుతోంది. అంతరించిపోయే భాషల పట్టికలో తెలుగు భాష పేర్కొనబడడం శోచనీయం కాక మరేమిటి?

తెలుగు మాట్లాడే దీపాలు
తెల్లవార్లూ వెలుగుతూంటాయి

-అన్నాడు ఆరుద్ర. అలా తెల్లవార్లూ వెలుగుతూంటే విద్యుత్ శాఖ లోపమనీ, విద్యుత్ దుర్వినియోగమనీ అనుకుంటారని కాబోలు. భాష పేరునే పార్టీలో కలిగి వుండి అధికారంలో వుండి తాము పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే తెలుగు వెలుగులకు కోత విధిస్తున్న వైఖరి బాధాకరంగా ఉంటోంది.

అసలే తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం ఇంకా జీర్ణించుకోలేని దశలో, ఇరు రాష్ట్రాలలో తెలుగు భాష అస్తిత్వం గురించిన తులనాత్మక పరిశీలనం కొందరు విజ్ఞులకు మరింత ఆవేదనాభరితంగా మారిపోయింది.
పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో అక్కడి వారు తమ మాతృభాష పట్ల చూపుతున్న శ్రద్ధకీ, పట్టుదలకీ, అభిమానానికి భిన్నంగా అదే మూల ద్రావిడ భాషలలోని మన తెలుగు పట్ల మన రాష్ట్రాలలో మాత్రం పొడచూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం బాధాకరంగానే ఉంటోంది.

తెలంగాణలో కనీసం కొంతమేరకు నయం అనిపిస్తోంది. భాష పట్ల, సాహిత్యం పట్ల, తెలుగు భాషా రచయితలు, కవులు, కళాకారుల పట్ల తెలంగాణలో కనబడుతున్నంత ఆదరణ తమదే అయిన మరో రాష్ట్రంలో మసకబారడం, శ్రద్ధాసక్తులు లోపించడం ప్రశ్నార్థకమవుతోంది.

ఉదాసీనత వేరు. 
పనిగట్టుకుని తెలుగు భాషాభివృద్ధికి అవరోధాలు కల్పించడం, 
చేజేతులా అణగద్రొక్కడం వేరు. 
ఆంధ్రప్రదేశ్‌లో-

‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’

అన్న కాళోజీ ఆగ్రహ వాక్యమే నినదించవలసిన పరిణామాలకు అక్కడి పాలక వర్గీయులే పూనుకోవడం శోచనీయం.

ఏ భాష అయినా వికసించాలంటే, అభివృద్ధి చెందాలంటే నాలుగు విధాల పురోగతి జరగాలి. 
తెలుగులో మాట్లాడటం, 
తెలుగు చదవటం, 
తెలుగు రాయటం, 
తెలుగులో ఆలోచించడం 
అన్న సమగ్ర పార్శ్వాలలో నేటి తరం, రానున్న తరాలు పొందగలిగితే తప్ప భాషకు -అంతరించిపోయే స్థితికి ప్రమాదఘంటికలు మ్రోగక తప్పదు.

తెలుగు నేలపై, తెలుగు తల్లిదండ్రులకు పుట్టి తెలుగు సంప్రదాయాలు అభ్యసించి, తెలుగు జాతీయ తత్త్వ సంపత్తిచే అభివృద్ధి చెంది, తెలుగు భాషలో పండితులై, తెలుగులో గ్రంథాలు రచించి భాషామతల్లికి అమూల్య అలంకారాలుగా అర్పించి తెలుగు సీమ సేవ నాచరించి తమ అంగములు, అసువులు, ఆత్మలు పవిత్రములుగా చేసుకుని ప్రాణములను బాసి పరమపదాన్ని చేరిన మహనీయులు ఎందరో వున్నారు. వారి జీవికకు గానీ, వృత్తికి గానీ తెలుగు భాష తోడ్పడిందే తప్ప అవరోధం కాలేదు. 

తెలుగు భాషఉపాధి, ఉద్యోగాలకు పనికిరాదని, తెలుగులో చదువుకుంటే అభివృద్ధి శూన్యమనీ అనుకునే, అనే స్థితి దాపురించడానికి కారణం కూడా మనమే కానీ మరెవరో కాజాలరు. భారతదేశం పరదాస్య శృంఖలాలలో నుండి విడివడి స్వతంత్య్ర దేశం అయింది గానీ ఈ డెబ్బై సంవత్సరాలలో భావదాస్యం నుండి ఇంకా విడివడలేదు. ముఖ్యంగా పలు భాషల ఏకత్రిత జాతి అయిన మన దేశంలో తెలుగుకు మునుపెన్నడూ లేనంత పతన స్థితిని చేజేతులా కల్పించుకుంటున్న దౌర్భాగ్యం మనదే అనిపిస్తోంది. అమెరికాలో విద్య, ఉద్యోగాలే పరమావధి అన్న ధోరణిలో మన తెలుగువారు పడిపోయినంతగా దేశంలో మిగతావారెవ్వరూ తమ భాష విషయంలో, ఆలోచనా ధోరణి విషయంలో మునిగిపోలేదు.

తెలుగు మాట్లాడటం నామోషీ అనే దశ విస్తరించడం విచారకరం. 
ఆంగ్లం నేర్చుకుంటే తప్ప గతి లేదు అనే స్థితికి పతనమయితే 
మన పరిపాలకుల ప్రయోజనం ఏముంది? 
క్రమక్రమంగా పాఠశాలల నుండి తెలుగును తొలగిస్తూ, తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేస్తూ అంగన్‌వాడి దశ నుండి ఆంగ్లమే శిరోధార్యం అనే ఆలోచనలు ,తదనుగుణమైన చర్యలు అశనిపాతాలే! 

ఇవాళ తెలుగు మాట్లాడటం మటుకే వచ్చిన పిల్లలు పెరిగిపోతున్నారు. వారికి తెలుగు చదవటం మాత్రం రావడంలేదు. తెలుగులో రాయడమూ రాదు. తాము మాట్లాడే, వినే తెలుగుని ఇంగ్లీషు అక్షరాలలో రాసుకుని చదువుతూ, తమ తెలుగును ఇంగ్లీషు లిపిలోనే రాస్తూ అదే తెలుగు భాషోద్ధరణ మనుకునే దశలో పడిపోవటం జరుగుతోంది. కంప్యూటర్లలో, స్మార్ట్  ఫోన్స్ ల్లో  లిపి వినియోగించగల సౌకర్యం వున్నా తెలుగులో రాయడం, చదవడం రాక ఇంగ్లీష్ లిపిలోనే తెలుగును కూర్చడం అలవాటుగా మారిపోయిన వారున్నారు. సహజమైన తమ మాతృభాష తెలుగులో ఆలోచించే శక్తి కూడా సన్నగిల్లి అభివ్యక్తీకరణకు కూడా ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇది భాషాభివృద్ధికి గొడ్డలిపెట్టు.

అయ్యయ్యో! తెలుగువాడే. తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవాడే. తెలుగునేల గాలి పీల్చినవాడే.. ఇక్కడి నీరు ఇక్కడి ఆహారం పారణమొనర్చిన వాడే... అలాంటి వాడు ఆంగ్ల భాషను అభ్యసించిన మాత్రాన, ఏ అమెరికాకో వలస పోయి వుండవలసినంత మాత్రాన తెలుగును మరిచిపోవాలా? తెలుగు మాట్లాడనక్కరలేదా? తెలుగు చదవడం రాయడం విసర్జించేయాలా? అయిదేళ్లయినా రాకుండానే ప్లేస్కూల్ అంటూ పంపివేసి పిల్లలకు అప్పటి నుండే ఆంగ్లంలోకి నెట్టేస్తున్నది మన వైఖరికాక మరేమిటి? కనీసం పదవ తరగతి వరకు తెలుగులో చదవడం విధాయకంగా వుండాలి. ఆంగ్ల మాధ్యమ బోధనలు వున్నా తెలుగు విధిగా మాట్లాడటం చదవటం, రాయటం అనే నిబంధన ఉండాలి. నేడు అలాంటి నిబంధనలు విధించుకోవాల్సినంత స్థితికి తెలుగు భాషను నెట్టివేసుకున్నది మనం కాదా?! ఇప్పటికయినా కళ్లు తెరవకపోతే తెలుగు బడులు మూతపడితే ఇంక తెలుగు మనుగడే మృతశయ్య నెక్కుతుంది.

ఇలా చేస్తేనే ఫలితం!

అధికార భాషా సంఘం, గ్రంథాలయ వ్యవస్థ, సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీ, బాలల అకాడెమీ వంటి సంస్థలకు విశేష అధికారాలు, వనరులు సమకూర్చి, ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకులలో, పరిపాలనలో తెలుగు వినియోగాన్ని విధాయకం చేయాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వారికి మాత్రమే తెలుగు రాష్ట్రాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వీలుంటుంది అనే నియమాన్ని ఏర్పరచి, ఆ నిబంధనను కఠినంగా అమలు చేయాలి. అలా చేయడం పాలకులకు కష్టమేమీ కాదు.


 భాష పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. పరభాషలు నేర్చుకోవద్దని ఎవరూ అనడం లేదు. కానీ పరభాషా దాస్యం, వ్యామోహం తగదు. అవసరం మేరకే పరభాష. అంటే వృత్తి ఉద్యోగాలలోని అవసరాల మేరకే. అక్కడ కూడా స్వభాష వచ్చిన వారితో పరభాషా వినియోగం పరిహరించాలి. పానుగంటి వారన్నట్లుగానే ‘పరభాషా పదముల కర్థము తెలిసినంత మాత్రమున బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును. అది మీకసాధ్యము’ అసాధ్యమే కాదు ఆ దాస్యమూ అనవసరం. ‘తల్లి స్తన్యముతో గూడ నే భాష మనము త్రావుదుమో యా భాషలోనే మనమెన్నటికైన గఠిన ప్రయత్నమొనర్చిన యెడల నుపజ్ఞా సహితమగు నుత్తమ గ్రంథములను వ్రాయగలము.’

అప్పట్లోనే ఆందోళన

పరభాషా దాస్యం మనకు కంఠగతమై పోతోందన్న ఆవేదన 1921లోనే పానుగంటి వారు ‘స్వభాష’ సాక్షి వ్యాసంలో హెచ్చరికగా వివరించారు.

నాయనలారా! మన కింగ్లీషు మాటలతో చెప్పినగాని ఏ అంశము కూడ మనస్సున కెక్కదు. అట్టి అభ్యాసము చిరకాలము నుండి అస్థిగతరోగమై వున్నది. ఆయుర్వేద వైద్యుడు వచ్చి ‘అయ్యా! కరివేపాకు పొడుముతో పథ్యము పుచ్చుకొనుమని నీతో చెప్పగా, నీకు ఆ మాట నచ్చదు. నానె్సన్స్! కరివేపాకు పొడుము ఎందులకయ్యా అని నీవు ఆ ఆయుర్వేద వైద్యుని అధిక్షేపింతువు. ధనియాలు ‘డైజెషన్’కు మంచివి. మిరియాలు ‘లివర్’ మీద ‘ఆక్ట్’ చేయును. కరివేపాకు ‘గాల్‌బ్లాడర్’కు సత్తువనిచ్చును అని ఎవడో ఎల్.ఎం.పి. మనవాడే చెప్పిన యెడల నీకది శ్రుతి ప్రమాణము. నాయనలారా! మనమెంత లక్షాధిపతులమైనను, కోటీశ్వరులమైనను మన బ్రతుకులు ముష్టి బ్రతుకులు కాక మరియొకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో ఇంగ్లీషు మాటలు కూడ ఎందులకు? ఆ ఏడుపేదో మాతృభాష తోడనే ఏడ్చిన మంచిది కాదా? మన ఏడుపు సహజముగాను, సాపుగాను స్వతంత్రము గాను ఉండునే. ఏడుపులో కూడ మనకు అస్వతంత్రత ఏమి ఖర్మం? అందుకు సర్వ స్వతంత్రులము సంపూర్ణార్హు లమే కదా? 

ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయవారపు బ్రాహ్మణుడనయ్యా యని అరవక ‘బాయ్! రూమ్‌లో నున్న పాట్‌లో రైస్ యేమైన నున్నదేమో కైండ్లీ గెటిట్ హియర్, థాంక్యూ ఇన్ ఆంటిసిపేషన్’ అని నీతో సంభాషింపగా నీవాతనికి ముష్టివేయుదువా?’ మూతి మీద ఈడ్చి ఒక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీషు మాటలు కూడ అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు నమ్ముడు.’

మాట్లాడే తెలుగులో కూడా ఇంగ్లీషు పదాలే ఎక్కువై పోయిన ధోరణి నేడు ప్రబలిపోయింది. టీవీ ఛానల్స్‌లో యాంకర్లు భాషను ఎంత భ్రష్టు పట్టించాలో అంతా పట్టిస్తున్నారు. ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం యువతకు గగనమై పోతోంది. విద్యావ్యవస్థ పటిష్టంగా తెలుగు బోధన పట్ల నిబద్ధమై వుండాలి. అప్పుడే భాషాభివృద్ధి, వికాసం సాధ్యం అవుతాయి. నిజానికి సాంకేతికాభివృద్ధితో తెలుగు వినియోగం సులభతరమైంది. ఇవాళ తెలుగులో మాట్లాడితే స్మార్ట్ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఎక్కడైనా అదే తెలుగు రాసేసే లిపి ప్రత్యక్షమవుతోంది. కానయితే స్వయంగా తెలుగు రాయడం అనే దానికి అది విఘాతం కాకూడదు. అలాగే తెలుగు లిపిని చదవడం యువతకు వచ్చి తీరాల్సిందే. మనం ముందే అనుకున్నట్లు బాలబాలికలూ, యువతీ యువకులు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం, తెలుగులో ఆలోచించడం అనే దిశగా జీవన విధానంలో రూపొంది తీరాలి. అందుకు కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, పాలకులు, ప్రభుత్వం అన్నీ సహకరించేవిగా ఉండాలి.

ఏ భాషలోనయినా యాసలు, మాండలీకాలు ఉంటాయి. తెలుగు భాషలో ప్రాంతీయ జీవనాలను బట్టి ఈ వైవిధ్యమూ అనంతంగా ఉంది. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ భాషగా వున్న వైవిధ్యం మళ్లీ ఆయా ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలను బట్టి యాసలుగా, మాండలికంగా ప్రతిధ్వనించినా అంతా తెలుగు భాషే! తెలుగు అక్షరాలు అవి అచ్చులైనా, హల్లులైనా తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అక్షరాలు విడిపోవు, విడిపోలేవు. తెలుగు వర్ణమాల ఇరు రాష్ట్రాలకు ఒక్కటిగానే ఉంది, ఉంటుంది. పుట్టుక చేతనే కాక, బుద్ధిచేత, స్వభావము చేత, యోగ్యత చేత తెలుగు వారమనిపించుకునేలా పురోగతి చెందవలసిన అగత్యం నేడు మరింతగా ఉంది
.
‘మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి’ అన్న చందాన మన ప్రాచీన తెలుగు వైభవాన్ని కీర్తించుకుంటే సరిపోదు. గత వైభవ స్మరణం, కీర్తనం మంచిదే కానీ అది భవిష్య కార్యాచరణకు స్ఫూర్తిమంతం, ప్రేరకం కాగలగాలి. భాష సజీవ స్రవంతి. తిరుపతి వేంకట కవులన్నట్లు ‘తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది’. వ్యాకరణం అంటే ఏమిటి? అది కచ్చితంగా ప్రయోగ శరణం! ఎప్పటికప్పుడు భాషకు నవీన వ్యాకరణం, నూత్న నిఘంటువులు రూపొందించుకోవాల్సిందే! భాష అనేది ఎప్పుడైనా భావ వినిమయ సాధనమే! కాలానికి అనుగుణంగా భాషలో కొత్త పదాలు చేరుతూంటాయి. అన్య భాషా పదాలను యథాతథంగా స్వీకరించడం కొంత మేరకు సహజమూ, సమంజసమే గానీ వ్యవహారంలోకి వస్తున్న సరికొత్త వాటికి తెలుగులో సమానార్థక పదాలను సృజించుకుని వినియోగంలోకి తెచ్చుకుని ప్రజాబాహుళ్యంలో పరివ్యాప్తమయ్యేలా చూసుకోవడం మన భాష పట్ల శ్రద్ధ, ఆసక్తి, అభిమానం అందరికీ వున్నప్పుడే సాధ్యం కాగలుగుతుంది.

ఎన్నో పదాలు అంతరించిపోతున్నాయి. వ్యవహారంలోంచి చ్యుతమై పోతే వాటి అస్తిత్వమూ, వాటి అర్థాలూ కూడా మనకే అంతుబట్టనివి అయిపోతాయి. ప్రజలు వాడే భాషకు పట్టం గట్టినప్పుడే జనమమేకమై పాలన సాగడం కూడా సాధ్యమవుతుంది. ఇవాళ తెలంగాణ ఒక మాండలికం కాదనీ, తెలంగాణ ఒక భాష అని తెలంగాణ ఒక రాష్ట్రంగా రూపొందడానికి చెలరేగిన భావావేశం ఇక చల్లారిపోకూడదంటే సమగ్ర తెలంగాణ భాషా నిఘంటువు ఇంకా రూపొందాల్సే ఉంది. లక్ష పదాలతో తెలంగాణ నిఘంటువు రూపొందిస్తామని ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఒక ప్రకటన చేశారట! 

తెలంగాణ సాహిత్య ఆకాడెమీ, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్తు సమన్వయ కృషి చేసి ఒక బృహత్ నిఘంటువును రూపొందించడం అత్యవసరమైన పనియే!
నిజానికి కవులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు తెలంగాణలో లభిస్తున్న ఆదరం, ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్ఫూర్తిదాయకం కావాల్సి ఉందన్న భావన ప్రచురితంగా కనబడుతోంది. అది యదార్థమే. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఎంతో వివాదాస్పదమయ్యాయి. తెలుగు భాషాభివృద్ధికి వికాసానికి కాక అక్కడి చర్యలు పరభాషా దాస్యానికే మరింతగా దోహదకారులుగా వున్నాయనీ తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు దొరకవని ప్రచారం చేయడం ఆత్మహత్యా సదృశమని భాషాభిమానులు, మేధావులు అంటున్నారు. ఆంగ్ల విద్య ఆవశ్యకమే కానీ అందుకు తెలుగును పణంగా పెట్టి తెలుగును మృతభాషగా మనమే మార్చుకునే వైఖరి గర్హనీయం. చైనా వంటి దేశం ఇంగ్లీష్‌ను తలకెత్తుకోకుండానే అమెరికా వంటి దేశంలో తలెత్తుకుని తన వ్యాపారాధిపత్యాలను సైతం పెంచగలుగుతోంది. పరారుూకరణం చెందకుండా మన అస్తిత్వాన్ని నిలుపుకోగలగడం అసాధ్యమేమీ కాదు.

తెలుగు వారు ఎక్కడున్నా ఒక్కటే
తెలుగు భాష ఎన్ని వైవిధ్యాలతో కూడినదైనా తెలుగు భాషే
రెండు రాష్ట్రాలకీ తెలుగు వెలుగే ధ్యేయం కావాలి

‘ఇది తెలుగు గడ్డ’ అనే కవితలో విశ్వంభరాకవి కీర్తిశేషులు డా.సి.నారాయణరెడ్డి గారన్నట్లుగా ఇరు రాష్ట్రాలకూ దేనికి దానికిగానే వర్తించుకునేలానే ఒక ఐక్యతా భావన అత్యావశకం. అదే ఇది-

ఇది తెలుగు గడ్డ గాం
డ్రించు పిల్లి కూతొద్దురా
ఇది తెనుగు పలుకు, కురి
సే తేనె చినుకు - ఈ
పలుకెపుడు నీరు గారొద్దురా - తీపి
చిలికితేనే చెవికి ముద్దురా
ఇది తెలుగు తెలివి; రగిలే
నిప్పు కొలిమి - ఇది
ఎప్పుడూ మండుతుండాలిరా - బూది
కప్పినా ఉరుముతూండాలిరా
ఇది తెలుగు కీర్తి; కది
లే రణమూర్తి - ఇది
సాగరాలే దాటిపోయిందిరా -న
యాగరాల్ మీటి వచ్చిందిరా
... ...
... ...
ఇది తెలుగు ప్రతిన! ఒక
టే దీని తపన! ఈ రాష్ట్రం
పురోగమించాలిరా! ప్రజల
రాజ్యం త్రివిక్రమించాలిరా
పలుకులో పదునులో
తెలివిలో కలిమిలో
గీతిలో రీతిలో
కీర్తిలో స్ఫూర్తిలో
కొసకొమ్మలను ఒడిసిపట్టాలిరా
కుళ్లు బుద్ధులు పాతిపెట్టాలిరా!


తెలుగు భాషకు జేజేలు
తెలుగు వెలుగుకు జేజేలు.
**

-సుధామ


Monday, June 8, 2015

గుర్తొచ్చానా వానా

గతి తప్పిన రుతురాగం

  • 07/06/2015
  • -సుధామ, 
వాన రాకడ... ప్రాణం పోకడ... -అని మనవాళ్లు ఊరికే అనలేదు. ఈ రెండూ ముందుగా గుర్తించడం అసంభవం. ఎంత శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరిగినా, అంచనాలు వేయడమంటూ జరిగినా, అనుకున్నట్టుగానే జరుగుతుందని అస్సలు చెప్పలేం! అయితే ‘అతివృష్టి’ - లేకుంటే ‘అనావృష్టి’ అన్నట్లు పరిస్థితులుంటూంటాయి. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా - ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా’ అని వర్షం పాటలు ఎన్ని పాడుకున్నా, అది రాదలచుకుంటే వస్తుంది. లేదంటే లేదు. వచ్చినా ఎంత శాతంగా తన ‘పాతం’ నమోదు చేసుకుంటుందో, జరిగాక కానీ చెప్పలేం! 

వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో - ఆ వ్యవసాయం కూడా ప్రధానంగా వర్షాధారితం కనుకనే, ‘వాన రాకడ’ పట్ల మనకంత నిరీక్షణలూ, మమకారాలూ! కానీ, రోజులు మారిపోతున్నాయి. మేధోమథనాలు, మేఘ మథనాలు వచ్చాక ‘దృక్పథాలూ’ మారిపోతున్నాయి. ఒకప్పుడు వానతో ముడివడిన అనుభూతులు క్రమంగా అంతరించి పోతున్నాయేమోనన్న బెంగా కలుగుతోంది. 

‘వానల్లు కురవాలి వానదేవుడా 
వరిచేలు పండాలి వానదేవుడా’ 

‘వానావానా వల్లప్పా’ 
అని పాడుకునే పిల్లలు ఇప్పుడు - ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అని పాడుతున్నారు. వరుణుడికి కోపం వస్తే రావచ్చు మరి. 

‘ఎల్.కె.జి. రైమ్‌కీ, ‘ఎల్‌నినో’కు సంబంధం ఉంటుందా? అంటే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అయిపోవచ్చు. మెయిల్ కాదు గానీ, ‘మొయిలు’ అంటే మేఘం అనే. ‘బ్లాక్‌మొయిల్’ అనగా నల్లని మేఘం అంటే వర్షవాహికగా భావిస్తాం మరి! ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటామా’ - అలా చేస్తే ఇప్పటికే తాగునీరు సమస్య పెరిగిపోతోంది. అది మరీ గుక్కెడు నీరు అందని విపత్కర పరిస్థితి తెచ్చేయవచ్చు. గుంపులు గుంపులుగా కనపడ్డ మబ్బులు గుప్పెడు నీళ్లయినా చల్లకుండా తేలిపోవచ్చు. ‘కుంభవృష్టి’ అనగా కుండపోత నీరు పడడం పోయి వాన వాటర్‌బాటిల్ ఒంపినట్లుగా పడి ముగిసిపోనూ వచ్చు. 

అసలు ‘వానాకాలం’ అనే దానికి గొప్ప ప్రాధాన్యం. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. వర్షం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అంటూ బిందు వ్యవసాయంలోకి దిగితే ‘డిప్రెషన్’ రావచ్చు. రైతు ఆత్మహత్యలకు వర్షాభావ పరిస్థితులూ హేతువులవుతున్నాయనే మాట ఉంది. పర్యావరణ సమతుల్యతను చేజేతులా మనమే దెబ్బతీసి అడవులు, చెట్లు నరికివేస్తుంటే ఇక సహజ వర్షాలను చేజేతులా అడ్డుకున్నట్లే అని శాస్తవ్రేత్తలు ఘోషిస్తూన్నారు. 

‘వానలో తడవనివాడు’ మనిషే కాడు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సహజసిద్ధంగా జీవనం గడపవలసిన మనిషి ఆ సహజాతాలకు దూరంగా ఆ కాలానికి తగినట్లుగా కాక ప్రతికూలతలను సౌకర్యాలుగా సంభావించి అనుభవించడం నేర్చుకుంటున్నాడు. వానలో తడిస్తే మొక్క మొలిచి పోతానన్నట్లు భయపడుతున్నాడు. వివేకం బదులు విలువలు నశించి బుర్రలో మట్టి పెరుగుతున్నప్పుడు సదరు భయాలు సహజమే అనిపిస్తోంది కూడాను.

 మునుపు ‘వానాకాలం చదువులు’ అనేవారు. వర్షపురోజుల్లో బడులు, బోధనలు సెలవులెక్కువ పుచ్చుకునేవి అప్పుడు. కానీ, వానాకాలం చదువు అంటే నిజమైన వ్యవసాయ విద్య అనే భావనా వుండేది. చెట్లు చేమలతో, పొలాలతో ప్రకృతితో ప్రతి మనిషికీ అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలు కొందరు బియ్యం చెట్లకు కాస్తాయనుకుంటున్నారంటేనూ, ఏది ఏ పొలమో, ఏది ఏ చెట్టో మొక్కో చాలామంది గుర్తించలేని స్థితిలోనే వున్నారంటేనూ వానతో, ప్రకృతితో వారికి అనుబంధం ఎడమై పోవడమే. 

సన్నగా వర్షం పడుతూంటే రేడియోలో వివిధభారతిలో ఏ హిందీ పాటనో వింటూ, వేడివేడి పకోడీలో, మిరపకాయ బజ్జీలో తినడంలోని అనుభూతి- ఆ మజా అనుభవిస్తే గానీ తెలియదు కదా! ఇప్పుడు రేడియో ఔట్ ఆఫ్ డేటెడ్ కదా పాపం! ‘బర్సాత్ కీ ఏక్ రాత్’, ‘వర్షం కురిసిన రాత్రి’ లాంటి కథలు సాహిత్యంలో హృదయదఘ్నంగా చేరువైన రోజులూ వెళ్లిపోతున్నాయి. ‘కొమ్మచాటు పువ్వు తడిసె - ఆకుచాటు పిందె తడిసె’ అని వర్షపు గీతాలు, సినిమాల్లో వర్షపు సన్నివేశాలు ఎంతగా ఎందరి అనుభూతి ప్రపంచాన్ని చుట్టుకున్నాయో మాటల్లో చెప్పడం కష్టమే! వర్షంతో ముడిపడిన కథలెన్నో! కావ్యాలెన్నో! ‘నగరంలో వాన’ అని కుందుర్తి సుదీర్ఘ వచన కవిత రాశారు. అలాగే, వర్షం గురించి వంగపల్లి విశ్వనాథం అనుభూతి వీచికలు కవితాత్మకం చేశారు. సినిమాల్లో వాన పాటలు, వాన దృశ్యాలకు కొదవే లేదు. మబ్బు మరణించి వానగా మారిపోవు విత్తు మరణించి మొక్కగా మారిపోవు అంటూ మృత్యుకేదారముననె జీవి సుమించుట చూస్తాం- అని తాత్త్విక కవిత నల్లిన వారున్నారు. వానలు ముంచెత్తితే వరదలే! గాలివాన ఒక బీభత్స దృశ్యమే. పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఇప్పుడు తుపానులు కూడా కొత్తకొత్త పేర్లు పెట్టుకుని వస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘హుద్‌హుద్’ తుఫాను అందాల విశాఖను ఊడ్చిపారేసింది. ఇప్పుడిప్పుడే విశాఖ మళ్లీ ప్రకృతి అందాల చిగుళ్లు తొడుక్కుంటోంది. వరద బీభత్సాలు పంటలను, గ్రామాలను పాడుచేస్తే వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు తెస్తాయి. వానలు పడక పోవడమంత దురదృష్టం మరొకటి లేదు! 

వర్షాల గురించి అధ్యయనాలు ఇవాళ ప్రపంచమంతటా సాగుతున్నాయి. వాతావరణ శాఖ వాన రాకడ అంచనాలకు అహర్నిశలూ కృషి చేస్తూ ఉంది. డైనమిక్ థియరీ, జెట్ స్టీమ్ థియరీ వంటి కొత్తకొత్త పరిశోధనలు వచ్చాయి. ఎల్‌నినో ఏర్పడితే వర్షాభావ పరిస్థితులెదురై కరువు కాటకాలకు దారి తీస్తుందంటున్నారు శాస్తజ్ఞ్రులు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో వచ్చే ఉష్ణోగ్రతల్లోని పెనుమార్పులే ఎల్‌నినోకు కారణం.సాధారణ ఉష్ణోగ్రతలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మధ్య తూర్పు పసిఫిక్ జలాల్లో సంభవించి మిగిలిన సముద్ర ప్రాంతాలకు విస్తరించడమూ జరుగుతోందిట! వేడి నీటి ప్రవాహాలు సముద్రంపైన గాలిలో నీరు చేరేందుకు అడ్డుపడి, వర్షాభావంతో కరువులకు నెలవులు అవుతూంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వేగం తగ్గడం కూడా ఎల్‌నినో ఏర్పడడానికి సంకేతం అంటున్నారు శాస్తజ్ఞ్రులు. నీటి ఉష్ణోగ్రత సామాన్య స్థితికన్నా బాగా తగ్గిపోవడంవల్ల ‘లానినా’ సంభవిస్తుంది. ‘ఎల్‌నినో’ అయినా, ‘లానినా’ అయినా ఉష్ణోగ్రతల్లో తారతమ్యాల వల్ల ప్రమాద సూచికలయ్యే వీలుంది మరి! 

భూగర్భ జలాలు కూడా క్రమేపీ తగ్గిపోతున్నాయి. చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురై, కాంక్రీటు భవనాలు లేచిపోతుంటే పర్యావరణం దెబ్బతినక ఏమవుతుంది? దారికి ఇరుపక్కలా మొక్కలు నాటించిన, బావులు తవ్వించిన అశోకుడు వంటివారు ఇవాళ చరిత్ర పుటలకే పరిమితమై పోయారు. వ్యక్తి స్వార్థంతో ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొక్కలు నాటడం కన్నా నరకడం పరిశుభ్రత అనుకునే దుస్థితి వచ్చింది. ‘వన మహోత్సవం చేద్దాం మొక్క నాటడానికి చోటు చూడండి’ అని అధికారులు ఆదేశిస్తే, ‘గత సంవత్సరం నాటిన చోటు బానే వుందండీ! అక్కడే నాటేద్దురుగాని’ అని సమాధానమిచ్చే సహాయకులు, స్వచ్ఛ భారత్ చేయాలంటే చీపుర్లు పట్టడం కోసం ఆ నేతలకు సమీపంలోనే చెత్త చేర్చేవారు రూపొందుతున్నారు. ‘వాన నీటిని వృథా కాకుండా కాపాడాలి’ అన్నది నినాదంగా మిగిలిపోకూడదు. వానలు అరుదై పోతే వాననీరు మరీ అరుదై పోతుంది. 

కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షాలే అవుతాయ గానీ రుతుపవనాలతో సహజసిద్ధంగా వర్షించినవి కాజాలవు కదా! నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుండి జూన్ మొదటి వారంలో ప్రవేశించడం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి కారణంగా సెప్టెంబర్ వరకు వానలు పడే వీలుంటుంది. అయితే, వర్షపాతం ఎక్కువ, తక్కువలు అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. మబ్బులు ఏర్పడటంతో సరిపోదు. అవి సరియైన దిశగా పయనించి కొండలను తాకి తాము ధరించిన నీటిని వర్షించడం ముఖ్యం. ఈ పరిణామం సహజంగా ఎంత చక్కగా జరిగితే వర్షపు పరిమాణం అంత హర్షదాయకం అవుతుంది. 

నీరే ప్రాణాధారం అన్నారు. భూమినైనా మూర్ఛ నుంచి తేర్చేది వర్షపు నీరే. వర్షం రైతు నేస్తం మాత్రమే కాదు. సర్వ జీవరాశి జీవన నేస్తం కూడాను. వానల కోసం భారత విరాట పర్వ పారాయణాలు చేయడం, కప్పలకు పెండ్లి చేయడం ఈ భరత భూమిలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. వానాకాలం అంటే ప్రాణకోటి జీవనకాలం. ప్రకృతితో మమేకమై విలువల జీవధార నిలుపువడం ఎప్పటికీ అవిస్మరణీయ అంశం. 

Saturday, March 21, 2015

మనో మథన ' మన్మథ ' ఉగాది

21 మార్చి ' 2015 శనివారం   
నేటి ఆంధ్రభూమి 
దినపత్రిక
ఉగాది సంచిక ' భూమిక ' పేజిలో 
తెలిసిన విష యాలకే వ్యాస రూపమిచ్చిన 
ఉగాది గురించిన నా వ్యాసం 






Sunday, January 11, 2015

నవచైతన్య దీప్తి సంక్రాంతి





కేవలం- 
మతంతో ముడిపడి కాకుండా 
ప్రకృతితో, పర్యావరణంతో ముడివడి 
సకల మానవాళీ సమాదరించదగిన అసలు సిసలు పండుగ సంక్రాంతి. 

సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అని వ్యవహారం. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులకు విస్తరించిన పర్వం కావడంవల్లనే ఇంత పెద్ద పండుగ మరొకటి లేదు అంటారు. నిత్యం కనబడే కర్మసాక్షి సూర్యుడు. సూర్యుడు అటు ఆధ్యాత్మికంగానూ, ఇటు వైజ్ఞానికంగానూ సకల చరాచర ప్రపంచంలో అస్తిత్వం కలిగి, గ్రహగతులకు, కాలచక్ర పరిభ్రమణకు మూలాధారమై నిత్య నూతన ప్రకృతిగా ఉదయాస్తమయాలతో ఉనికి, మనికి గలవాడు.

 ఖండఖండాంతరాలలో కూడా రీతులూ, రివాజులూ వేర్వేరయినా జన హృదయాలను దోచుకున్న ఆనందహేల సంక్రాంతి. రవి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథ ప్రవేశం చేసే శుభ ముహూర్తం మకర సంక్రమణం. నవ జీవన సమ్యక్ క్రాంతి సంకేతంగా ‘సంక్రాంతి’ అంటున్నాం. 

ప్రాచీన కాలంలోనే ఖగోళ విజ్ఞానాన్ని మన భారతీయం అనితర సాధ్యంగా అందిపుచ్చుకుంది. గ్రహగతులు, గ్రహణాలు ఆయన క్రమం, ఋతువుల విశే్లషణం ప్రకృతిని అవలోఢనం చేసి అభివ్యక్తీకరించింది భారతీయులే. నిజానికి ఏడాదిలోని పనె్నండు నెలల్లోనూ సంక్రమణాలుంటాయి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రమణంగా పేర్కొంటాం. 

కర్కాటక రాశి ప్రవేశ సంక్రమణం దక్షిణాయనం కాగా మకర సంక్రమణం ఉత్తరాయణం. మకర రేఖ నుండి ఉత్తర దిశగా సూర్యుడు పయనించే పుణ్యకాలమే ఉత్తరాయణంగా, మకర సంక్రమణంగా, సంక్రాంతిగా సంభావించడం జరుగుతోంది. ఇదంతా ప్రకృతి పరిణామ మూలమే. తమో గుణ ప్రధానమైన మనిషి మనస్సును ఉజ్జ్వల భావ అంతర్లోకాల వైపు దృష్టిపెట్టమని వైజ్ఞానిక ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే అసలు సిసలు ప్రకృతి పండుగ సంక్రాంతి. 

ఉత్తరాయణ మార్గం జ్యోతిర్మయం అనీ, దక్షిణాయణ మార్గం తమోమయం అనీ భగవద్గీత పేర్కొంటోంది. ఉత్తరాయణా గమనం అంటే సంకల్ప వికల్పాలు లేని అమనస్క యోగ సిద్ధి. అదే ఉత్తమగతి అని యోగశాస్త్ర నిర్వచనం. అమనస్క యోగ సిద్ధి పొందిన ఆత్మ ఉత్తరాపథంలో పయనించి, ‘స్వాదిష్ఠాన’మనే వైతరణి నదిని దాటి, ‘పింగళనాడి’ అనే మార్గంలో ముందుకు సాగి, ‘సోహం’ అనే విమానం ఎక్కి, సూర్య ద్వారంగా చెప్పబడే ‘సుషుమ్న’లో లీనమై, అనంతత్వాన్ని పొందుతుంది. ‘ఉత్తరాయణం’ అనే దానికి ఇంత అర్థం ఉంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలని, పరమాత్మను చేరగోఱే జీవాత్మ ఆరాటపడుతుందిట! దివి భువి కలిసిన పవిత్ర ప్రాంతం ఉత్తర దిశలోనే ఉందంటారు పెద్దలు. అంపశయ్య మీద వున్న భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షించి ప్రాణాలు వదిలింది అందుకేనట! 

సంక్రాంతి పెద్ద పండుగే కాక, పెద్దల పండుగ అనీ ఎందుకంటారంటే- ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల ఆత్మలు సుషుమ్నా వికాసం కలిగి, విశ్వవ్యాప్తమైన ‘ఈథర్’ రూపంలో ఉంటాయని ఆర్య వాక్యం. 

ఆధ్యాత్మిక, వేదాంతపరమైన అంశాల కోణంలో కాక, వైజ్ఞానిక ఉపపత్తులతో చూడగోరే ఆధునికులైనా- ‘సంక్రాంతి’ వైశిష్ట్యాన్ని అంగీకరిస్తారు. ఉత్తరాయణమనే ఈ కాలంలో ఉత్తర దిక్కోణం నుండి ప్రభవించే సూర్య కిరణాలు ‘ఆల్ట్రా వయొలేట్ రేస్’ అనబడుతున్నాయి. ఈ కిరణాలకు సమస్త రోగనాశక శక్తి ఉంది. 

‘ఉద్యాసద్యా మిత్రమః అహోరున్నుత్తరాం దినం హద్రోగం మమసూర్యాహరి మాణాంచ హరయ...’ అని సాగే వేద మంత్రం - ఉత్తర దిక్కోణం నుండి ఉదయిస్తున్న బాలభాస్కరుని కిరణాలు మా యొక్క బాహ్యాభంతర రోగాలను హరించుగాక, అన్న అర్థం వలనే! 

ఉత్తరాయణంలోనే బహిరాకాశంలో సూర్యుడితోబాటు, ‘అగస్త్యోదయం’ అనే నక్షత్ర సముదాయం వస్తుంది. ఈ నక్షత్ర కాంతిపుంజాలలోని రేడియో ధార్మిక శక్తితో, సూర్యశక్తి కలిసి, మన భూమి మీదున్న జల నిదులను, గాలినీ, నదీనదాలను నూతన జవసత్త్వాలతో నింపుతుంది. గత మాలిన్య రహితమై, నవ్య క్రాంతి పరిఢవిల్లుతుంది. ఈ భౌతిక ప్రక్రియ మన చర్మచక్షువులకు అందేది కాదు. కానీ ఆధునిక వైజ్ఞానిక ఉపకరణాలు ఈ మార్పును గుర్తిస్తున్నాయి. సంక్రాంతి అంటే ఇలా భౌతిక, ఆధ్యాత్మిక, యోగశాస్త్ర యుతమైన నవ్యతా పరిణామం. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి కాక, సంక్రాంతియే నిజానికి కొత్త సంవత్సరంగా సంభావించదగిన విశిష్టమైన పండుగ. 

చలిని తరిమివేసి, రోగకారకాలైన క్రిమికీటకాల నాశనానికై వేసే మంటయే భోగిమంట’. నిజానికి ఆవు పిడకలతో వేసే భోగిమంటయే ఆరోగ్యదాయకం. ఆవు పిడకలతో వేసే భోగిమంటతో వెలువడే పొగ, వేడి, ఆరోగ్య కారకాలని శాస్తజ్ఞ్రులు అంగీకరించిన విషయం. సంక్రాంతి పెద్ద పండుగ. దీని వేడుకలు అపారం. సంక్రమణం పర్వం పితృకార్యానికి శ్రేష్ఠం. కనుమరోజు గ్రామ దేవతలకు నివేదనలు చేస్తారు. పాడి పశువులతోబాటు ధాన్యలక్ష్మి పసిడి చిందులు వేస్తుంది. ఈ మూడు రోజులూ బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. సంక్రాంతి పర్వం ధాన్య లక్ష్మి పూజాపర్వం. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆవుపేడతో కళ్లాపుజల్లి రంగవల్లులు అలంకరించడాలు, కేవలం సరదాతో కూడినవే కాదు, ఆచారం వెనుక వైజ్ఞానిక సూత్రం, పర్యావరణ పరిరక్షణం ఇమిడి వున్నాయి. ఇది భారతీయ దార్శనికుల విశిష్ఠత. సంక్రాంతి రోజుల శోభ వర్ణనాతీతం. జానపద కళారీతుల నిదర్శనాలుగా రంగవల్లులతో ముంగిల్లు, ధాన్యరాశి దరహాస చంద్రికలు, వైభవోపేత ఆలయాలు, గొబ్బిళ్లు, భోగిమంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ల సంబరాలు ఆబాలగోపాలం అష్టాదశ వర్ణాల వారూ జరుపుకునే పండుగ సంక్రాంతి. 

సంక్రాంతి గురించి కథలకూ కొరతేమీ లేదు. అపార దాన గుణ పరాయణుడైన బలి చక్రవర్తి, వామనుడికి మూడడుగులు దానం చేసి, పాతాళవాసి అయ్యాడు. అయితే తన సామ్రాజ్య వైభవాన్ని తిలకించడానికి ఏడాదికి ఒకసారి భూలోక దర్శనానికి ఆ మహావిష్ణువు అనుమతినిచ్చాడు. మహాదాత అయిన తమ చక్రవర్తి రాక సందర్భంగా ఏటేటా భూలోక పౌరులు రంగవల్లులతో, ధన ధాన్య, దాన కార్యాలతో చేసుకునే పండుగే సంక్రాంతి అంటారు. అలాగే మకర సంక్రాంతికి చేసే ‘పితృకల్పం’ మనిషికి పూర్వజన్మ స్మృతులతో ఉత్తమ పథగామిని చేయగలదని హరివంశంలో ప్రస్తావించబడింది. 

ముందే చెప్పినట్లు - ఈ పండుగ కొన్ని ప్రాంతాలకే పరిమితం అనుకోనక్కర్లేదు. పేర్లు, పద్ధతులు భిన్నమైనా, దేశదేశాల్లో మానవ నాగరికతలో వైవిధ్యభరితమై అలరారుతోంది ఈ ప్రకృతి పర్వం. 

‘నామ్ ఫెస్టివల్’ అని ఈజిప్టులో ఈ సంక్రాంతి పండుగ ఉంది. నామ్ అంటే మకర రాశితో సాన్నిహిత్యంగల ఈజిప్టు వారి జల దేవత. ఈ సంక్రమణ సమయంలో నైలునది పొంగి, తమను సజీవులను చేస్తుందని వారి విశ్వాసం. జలదేవతారాధనం చేసిన నదికి ఫల పుష్పాలు సమర్పించి, వారు ఈ పండుగ సంబరాలు చేస్తారు. 

గ్రీకు దేశంలో మకర రాశి అనగా సగం చేప, సగం మేక ఆకారం వున్న జలదేవత. పైభాగం మేక, క్రింది భాగం చేప రూపున వుండే ఈ దేవత ఒక రాక్షసుని బారి నుండి రక్షించుకోవడానికి ఈ రూపం ధరించిందట. విచిత్ర రూపంగల ఈ జలదేవత ‘మకర రాశి’ అని గ్రీకుల విశ్వాసం. ఈ దేవతను వీరు ‘చౌకన్’ అంటారు. సంక్రమణ దినాన వారు ఈ దేవత ప్రీత్యర్థం ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. 

రోమ్‌లో ‘బేకన్’ పర్వంగా సంక్రాంతి చేస్తారు. సంతానార్థులు, అవివాహితులు మన్మధ పూజాపర్వంగా మన కాముని పున్నమ, వసంతోత్సవం రీతిలో కాలపురుషుడి ఆశీర్వాదంకై ఉత్సవం చేస్తారు. 

యూరప్‌లో మన భోగిమంట తరహాలో సంక్రాంతిని ‘అగ్ని ఉత్సవం’గా చేస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి, అంతా నృత్యగానాలు చేస్తారు. మనం ఎలా పితృకార్య పర్వంగా సంభావిస్తామో, అలాగే స్వీడన్‌లో దీనిని అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుతారు.

ఖండఖండాంతరాలలోనూ మకర సంక్రమణ పండుగ - మనుష్యులు సర్వతోముఖాభివృద్ధి చెంది ఉత్తమ జీవన విలసితమైన ఉత్తరపథ మార్గులు కావాలనే సంకల్పంతోనే వివిధ రూపాలలో సంక్రాంతి పండుగ చేసుకుంటారు.

 ‘ఇది మా పండుగ కాదు’ అని మానవాళిలోని ఏ ఒక్కరూ అనుకోనవసరం లేని ప్రకృతి పర్వం సంక్రాంతి అని గ్రహించవలసిన విషయం. చపలచిత్తులైన మనుషుల్లో ధార్మిక ప్రవృత్తిని, దాన ధర్మాది సుగుణ సంపత్తిని, తమ పుట్టుకకు హేతువైన పితృ, మాతృగణం పట్ల కృతజ్ఞతాబద్ధతను పెంపొందింపచేయడానికి, సంక్రాంతి పర్వం సంకల్పించబడి నట్లుంటుంది. అలాగే పరిశ్రమోపజీవులైన మన పూర్వులు, తాము పండించుకున్న పంటలను, పెంపు చేసుకున్న పాడిని, సంతోషంతో పంచభూతాలకర్పించి, తామూ, తమపై ఆధారపడి జీవిస్తున్న వారూ, కలిసి చేసుకునే పర్వంగా రూపుదిద్దుకున్న పర్వం సంక్రాంతి. 

దక్షిణాయనపు జీవితపు క్లేశకాలం పరిసమాప్తి చెంది, దేవతలకు సైతం ప్రీతిపాత్రమైన ఉత్తరాయణ ఆగమనమైన సంక్రాంతి - నిజంగా సంతోషాల కాలం. పంటలు పండి, గాదుల నిండా ధాన్యం నిండి, ఆరోగ్యం ఐశ్వర్యం తాండవించే కాలం. ఉత్తరాయణంలో మార్గశిర మాసం మరీ శ్రేష్ఠమైనదిగా, మాసాలలో తాను మార్గశిర మాసాన్ని అని గీతాకారుడు చెప్పుకున్నాడు.

 ప్రకృతిలో విశేషమైన మార్పులు గోచరించే అభ్యుత్థాన కాలం ఇది. తొలకరిలో మొలకెత్తిన సజ్జ, జొన్న, నువ్వు, పెసర, కంది, సెనగ వంటి మెట్టపైర్లు, రాగి, వరి వంటి మాగాణి పంటలు, కార్తీక, మార్గశిర మాసాలకు పండి, భూమి పంట బరువుతో కళకళలాడుతూ, ఎటు చూసినా కాంతులీనుతూంటుంది. చేమంతి, బంతి నిండార పూలతో నేత్రపర్వంగా హేమంత కాంతులీనుతూంటాయి. జీవితం నవ్య భావోన్మీలనంగా ఉంటుంది. 

బ్రతుకంతా ఎలా వున్నా ‘మూడునాళ్ల ముచ్చట’ అన్న కారణం భోగి, సంక్రాంతి, కనుమల వైభోగ పర్వం వల్లనే. పంట రక్షణకై రాత్రిళ్లు కాపలాకాచి, వేసుకునే చలిమంటల జాగరూకత చిహ్నంగానే భోగిమంట వెలసిందని అనేవారున్నారు. రైతు బ్రతుకు ఆనంద రమణీయమయ్యే కాలం సంక్రాంతి. దేశానికి రైతు వెనె్నముక అయినట్లే. సకల పర్వాల ప్రకృతికి వెనె్నముక పండుగ, సంక్రాంతియే! ధనుర్మాసంలో ‘రంగడే దైవంగా - పొంగలే ప్రసాదం’గా స్వార్థం పరమార్థం రెండంచులుగా భాసిస్తాయి. కనుమ పండుగ పూర్తిగా కర్షక జీవిత సంబంధియే. పశు పూజ ప్రాధాన్యమానాడు. ‘పాల పొంగలి - పశువుల పొంగలి’ అనే నానుడి వచ్చింది అందుకే. పొంగలి ‘బలి’ చక్రవర్తి సంకేతంగా భావించేవారున్నారు. పొంగలిని దేవతలకు నైవేద్యం పెట్టాక, పొలానికి వెళ్లి పొంగలి మెతుకులు చల్లేవారు. ‘దీనినే ‘పొలి చల్లుట’ అనేవారు. అలా చేయడం వలన పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఎర్ర గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టేవారు. అది బలిపశువు శిరస్సుకి ప్రత్యామ్నాయం! అలా జీవహింసకూ దూరంగా వున్నారు. పశువుల సంబరంలో భాగమే గంగిరెద్దుల హంగులు 

డూడూడూడూ బసవన్నా 
డూడూడూడూ వెంకన్నా 
అయ్యగారికీ దండం పెట్టూ 
అమ్మగారికీ దండం పెట్టూ 

అని గంగిరెద్దుల వారు సన్నాయి మేళాల సవ్వడిలో అడుగగా, గంగిరెద్దులు తల ఆడించడం, వాని మూలాన భావి శుభాలను తెలియచెప్పడం, పశుగణం పట్ల గౌరవ బుద్ధికి తార్కాణాలు మరి! 

ప్రకృతికి, జానపదులకూ విడదీయలేని సంబంధం. అందుకే ప్రకృతిపర్వమైన సంక్రాంతిరోజుల్లో, ముఖ్యంగా పల్లెసీమల్లో జీరేనుగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, మలిపోని కాసులోళ్లు, బేరటోపిగాళ్లు, జంగమ దేవరలు, బారెమూరెండోళ్లు, శీర్లాశిల్పులు, హరిదాసులు అసంఖ్యాకంగా కనపడేవారు. పండుగ మూడు రోజులూ పనీపాటలకు సెలవిచ్చి, ఆనందించడమే ప్రధానంగా సంబరాలతో గడిపేవారు. సంక్రాంతి రోజు మన్నానికి అంటే పొలానికీ, గోవులకాయనూ పోరట! 

మన్నానికీ పోను మన్ననీ రోజూ 
నా వనె్నల వీరన్న బావా 
సంక్రాంతి పండుగా సరసరా వచ్చేరా 
సల్లంగా నేనైతే సూడాలోయి 
సంక్రాంతి వేళల్లో వెనె్నల సెంద్రున్ని 
సక్కగా ముద్దిడుచు 
మక్కువతో నుంటాను 
ఓ నా వనె్నల వీరన్న బావా.. 

అన్న జానపద గీతం - పల్లె పడుచులు తమతమ భర్తలతో సరస సల్లాపాల్లో మునిగి, సంక్రాంతి రోజుల్లో కాలక్షేపం చేస్తారని చెప్పకనే చెబుతోంది. క్రొత్తగా పండిన రాగులను కోడిపుంజులకు తినిపించి, సంక్రాంతి కనుమ వేళకు కోడిపందేలు ఆడేవారు. 

నా కోడి భీమన్నరా ఓహో 
నా కోడి హనుమన్నరా 
నా కోడి నీ కోడి ఏకమై కలబడితె 
సాకెండ్ల సిన్నదే సంకలే ఎగరేసి 
మ్రుక్కుపై వ్రేలిడి సక్కగా సూచురా 

అన్న గీతం రాయల కాలం నాటి నుంచి ప్రసిద్ధి. రాయల కాలంలో దివిటీల పట్టే చాకలి పిల్లయే సాకెండ్ల సిన్నది. సంక్రాంతి రోజు విరూపాక్ష స్వామి దేవాలయంలో, ప్రాంగణంలోనూ, మండప స్తంభశాలలోనూ, మూడు రోజులపాటు, వేయి వత్తులతో, అఖండ దీపాలను ఆరిపోనీక వెలిగించే వాడుక వుండేదట. అందుకు ఆ సిన్నది మూలకందంగా నిలిచేదట. 

ఉయ్యాలవాడ నివాసి, ధర్మదాత అయిన బుడ్డా వెంగళరెడ్డి - సంక్రాంతినాడు పండి, అప్పుడే తన ఇంటికి చేరిన ధాన్యరాశిలో - సగానికి పైగా దానంగా పంచిపెట్టేవాడట. బ్రాహ్మణులందరికీ గోదానం చేసేవాడట. ఇప్పటికీ మహాదాతగా వెంగళరెడ్డిని తలచేవారున్నారు. జానపద గీతాలూ వున్నాయి.

 ఇలా సంక్రాంతి పర్వం ప్రకృతితో, జనపదాలతో భౌతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలతో పెనవేసుకున్న అసలు సిసలు పెద్ద పండుగ. ఒక విధంగా సంక్రాంతియే నవహర్షారంభం. నవ వత్సరారంభం! 

కీ.శే.బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారన్నట్లు- 

చేరువైన సంక్రాంతి గూర్చిన తలంపు 
చాలుననె తోచు రమ్య దృశ్యములు వేలు 
హృదయమున పూలజల్లులై, ఇంద్రచాప 
శబల వర్ణమ్ములై, నవాశలను పెంచె! 

ఆశావహ అభ్యుదయ అభ్యుత్థాన మానవాళి సర్వం - సంక్రాంతి. 
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!! * 

-సుధామ 

88888888888888888888888888888888888888888888888

నీరు చల్లిన ముంగిట్లో 
-ప న్నీరు చల్లిన వాకిట్లో 
దారి పొడుగునా ముగ్గుల్లు! 
ము త్యాలు పోసినా ముగ్గుల్లు 
నారుపోసిన ముంగిట్లో 
గ నే్నరు పూచిన వాకిట్లో 
జారు జడలా కనె్నల్లూ - 
ఒ య్యారి నడలా కనె్నల్లూ - 
ఒ య్యారి నడలా జారు జడలా
కనె్నలుంచినా గొబ్బిళ్లూ 

-కృష్ణశాస్ర్తీ 

‘వేయి పాదముల్ మకర ప్రవిష్టము లయి 
తడబడుట లేక చక్కగా నడువు పూష 
అవ్యయమ్మైన యుత్తరాయణము వెలయ 
నవ్య మార్తాండకేళీ సనాథమగుచు’ 

-నాయని సుబ్బారావు 


చెలి చూపులు చలిమంటలుగా 
చెలి నవ్వులు తొలి పంటలుగా 
అరుదెంచెను నవసంక్రాంతి 
విరబూసెను చిరు చేమంతి 

ఈ ధాన్యపు రాసుల మాటున 
ఈ వాగుల వరదల చాటున 
ఏదో ఒక నవ చైతన్యం 
ఎదలో చిలికించును హర్షం 

పులకించిన తొలి సంక్రాంతివి 
దిగి వచ్చిన తీయని శాంతివి 
ఈ చలిలో నీ కౌగిలిలో 
ఇమిడిపోయె లోకాలన్నీ 

పాత సంప్రదాయపు గోడలు 
పడద్రోసెద వెలుతురు కోసం 
తరుణత్వం మెచ్చకపోతే 
తిరుగబడెద దేవుని మీద 

నవచేతన కాలంబనగా 
అవతరించినావే నీవు 
రవికరముల రాగిల్లెడు 
నీ నవహృదయం నాదైపోనీ 

-దాశరథి 


జీవితంలో కళాభిజ్ఞత చేర్చి కూర్చిన పాటగా 
కాలం మార్పు సూచించే 
సూర్యదేవుని కొత్త బాటగా 
అందంగా హాయిగా 
ఆనందానికి స్థాయిగా 
సాగిపోతుంది సంక్రాంతి! 

-కుందుర్తి ఆంజనేయులు

Andhrabhoomi Daily 
Sunday Suppliment Coverstory 11.1.2015