ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, January 14, 2021

ఆ'కర్షక' సంక్రాంతి


ఆ'కర్షక' సంక్రాంతి 

వ్యవసాయాధారితమైన మనదేశంలో ఆంధ్రదేశానికి ‘అన్నపూర్ణ’ అని పేరుండేది అంటే అందుకు కారణం – తెలుగునేల వ్యవసాయానికి పెట్టింది పేరు. సుక్షేత్రమైన వ్యవసాయ భూములకు కాణాచి. తెలుగునాట రైతు కుటుంబాలు అసంఖ్యాకంగా వర్ధిల్లుతూ ‘దేశానికి వెన్నెముక రైతు’ అన్న మాటకు నిదర్శనంగా తెలుగునేల పండిన పంటలు దేశాన్ని అన్నివేళలా ఆదుకునేవి. అందుకే పంట ఇంటికొచ్చే పర్వంగా తెలుగువారి పెద్దపండుగగా ‘సంక్రాంతి’ శోభిల్లుతూండేది. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులే కాదు ఈ మాసం అంతా ఉత్సవాలతో, పచ్చదనాల ప్రకృతి శోభ కళకళలతో విరాజిల్లుతూండేది. పల్లెల శోభతో పట్టణాలూ మురిసేవి. సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, జంగమదేవరలు, గాలిపటాలు, కోడిపందేలు, బొమ్మల కొలువులు, గోపూజలు, అల్లుళ్ళ రాకలు, పిల్లలకేరింతలు, ధాన్యపురాశులు, భోగిపళ్ళు, నూతన వస్త్రాలు, ధాన్యాల వితరణశీలత… ఎన్నెన్ని మధుర ఘట్టాలు! ఎంతెంత సందడి – సంబరాలు.

ఎప్పుడో యాభైరెండేళ్ళ క్రితం పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో కృష్ణాపత్రిక రసమంజరిలో ప్రచురితమైన ‘సంక్రాంతివర్షము’ అనే నేను రచించిన కవిత ఒక తలుచుకునే తరుణం మరి!-

రమణుల్‌ రచించిన రంగవల్లికలతో
ఇంటింటి ముంగిళ్ళు ఇంపుమీర
మంచుభయము తోడ మారిన తామర
లనిపించు బంతిపూవరుసతోడ
పచ్చపచ్చని చేల పండినపంటల
ప్రజలముఖములు ప్రభలవెల్గ
అచ్చమైనట్టిదీ ఆంధ్రుల పబ్బంబు
సంక్రాంతినిచ్చెరా సంతసమును

పంట యింటనుండు పబ్బంబునాటికి
పిండివంటకొరకు చింతలేదు
కొత్తబట్ట తొడుగు కోరికయునుదీరు
ఏమి లోటు లేదు ఏటి కంత

ఏటికొక్క తఱిన ఏతెంచు నియ్యది
నేడునొసగె ముదము నెంతగానొ
నిజము చూడ నూత్న వర్షమ్మిదియెగాన
నెంతు కలుగు మీకు నెంతొ శుభము

కానీ కాలంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతమార్పు! ఒకనాటి సంక్రాంతి కళాకాంతులు ఈనాడేవీ? అప్పటి మానవసంబంధాలు పరస్పర ఆత్మీయతలు, పదిమందికి పెట్టుపోతలు ఈనాడు మసకబారుతున్న దృశ్యాలు కానవస్తున్నాయి. ఇది చూసే కనుల లోపంకాదు జనులలోపమే. ఆనాడు రైతుకున్న విలువ నేడు ఎక్కడుంది? వ్యవసాయ భూములు సైతం రియల్‌ఎస్టేట్‌ కబంధహస్తాల పాలవుతూ అసలు వ్యవసాయమే పనికిరాని వృత్తి అన్న భావనలు ఎగసివస్తున్నాయి.

రైతు పంటలు పండించడం తన ‘వృత్తి’ అని ఏనాడూ అనుకోలేదు. అది తన జీవన’ధర్మం’గా భావించాడు. వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో నెరపలేదు. సమాజాభ్యున్నతికి ప్రజల ఆకలి తీర్చడం తన సామాజిక బాధ్యతగా తలపోశాడు. నేలను నమ్ముకుని బ్రతికాడేగాని అమ్ముకు బ్రతుకాలని భావించినవాడు కాడు. అలాంటి దేశానికి వెన్నెముక వంటి రైతు జీవనమే నేడు వెన్నెముక విరిగినట్లవడం విషాదం.

ప్రజ కడుపు నింపే రైతునే శాసించే పాలకులు రూపొందడం నిజమైన కర్షక సంక్రాంతికి ఒక అవరోధం. ఏ పంటలు పండించాలో తాను చెప్పినట్లు వినాలన్నాడు ఓ ముఖ్యమంత్రి. రైతునేస్తం అంటూనే పథకం ప్రకారమే రైతుల ఆశలకు గండికొడతాడు మరో ముఖ్యమంత్రి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఇవాళ రైతు హస్తాలు మొక్కవోని సంకల్పంతో పైకి లేస్తూనే వున్నాయి. తమ హక్కులకోసం కర్షకులు క్షత్రియులుగా పోరాట యోధులు కావాల్సి రావడం కన్న కాలవైపరీత్యం ఏముంది. అన్నదాతలపై హర్యానా సర్కార్‌ విరుచుకుపడి లాఠీఛార్జి, జలఫిరంగులు, బాష్పవాయు ప్రయోగంతో యుద్ధవాతావరణాన్ని సృష్టించిన వార్త పాలకదాష్టీకానికి పరాకాష్ఠ కాదా! అసలు పైరుపాట పాడుకునే రైతు పోరుబాట పట్టడమే, పట్టకతప్పని పరిస్థితులు సంభవించడమే -కళతప్పిన సంక్రాంతికి సూచిక అనిపిస్తుంది.

ఇవాళ కర్షకుల ప్రయోజనాల కన్నా కార్పొరేట్‌ ప్రయోజనాలు ముఖ్యమైపోతున్నాయి. రైతు వ్యతిరేక చర్యలు స్పష్టంగా కానవస్తున్నప్పుడు రైతు బ్రతుకు తాడుతెగిన గాలిపటంలా అవుతున్నప్పుడు క్షోభకాక మరేమిటి? రైతులపై కార్పొరేట్‌ శక్తుల దోపిడీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. బాస్మతి వరి పండించే రైతులకు కిలోకు 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తూంటే అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూస్‌ స్పెషల్‌ బాస్మతీరైస్‌’ అనే బ్రాండెడ్‌ ఉత్పత్తికి కిలోకు రెండువందల ఎనిమిది రూపాయలకు చొప్పున అమ్మకాలు చేస్తోందంటే ప్రయోజనాల మధ్య వ్యత్యాసం ఎంతగా వుందో తెలీడం లేదా!

వ్యవసాయం, ఆహారభద్రత, పర్యావరణం, విత్తన సార్వభౌమాధికారం ఇలాంటివన్నీ రైతు బ్రతుకులతో ముడిపడి వున్నవే. నిజానికి ప్రజాప్రయోజనాల కోసం తమ జీవితాలను అంకితం చేసేదీ, చేస్తున్నదీ రైతులేకానీ రాజకీయ చదరంగాలాడే పాలకులు కాదు. అందువల్ల రైతు సంక్షేమంలోనే నిజమైన సంక్రాంతి వుంది. సంకురాత్రిని రైతులకు త్రిశంకురాత్రిగా మార్చే పరిణామాలను అడ్డుకోవలసిందే!

ఇది మకర సంక్రమణ వేళ. చచ్చినా బ్రతికినా విలువచేసే గజేంద్రుల వంటి రైతులు మకరం బారిన ‘లా’ వొక్కింతయులేదు’ అంటూ ఆర్తితో ‘సంరక్షింపు భద్రాత్మకా!’ అని మొరపెట్టుకోవడం అలవైకుంఠపురవాసి అయినా కరుణతో కదలిరావాల్సిన ఘట్టం. అలాంటిది పాలకులే కార్పొరేట్‌ దిగ్గజాల ముందు గంగిరెద్దు డూడూ బసవన్నలై వ్యవహరించడం సరికాదు. ఇళ్ళ ముంగిళ్ళు రంగవల్లులతో శోభిల్లాలేగానీ రాజకీయం ముగ్గులోకి దింపి ప్రజా సంక్షేమాన్ని పరిహాసపాత్రం చేయకూడదు.

నిజానికి సంక్రాంతి ప్రకృతితో ముడివడిన కర్షకపర్వం అనేది నిత్యసత్యం. నిజానికి ఇవాళ ప్రకృతి తన సహజతను తిరిగి సంతరించుకుంటోంది. 2020 ‘కరోనా’ కారణంగా జరిగిన ఒక గొప్ప మేలుగా ఈ పర్యావరణ సమతుల్యతను, ప్రకృతికి తనదిగా దక్కిన ప్రశాంతతను సంభావించాలి. అందుకే మనిషితప్ప అనేక జీవరాశులకు కరోనా స్వేచ్ఛావరదాయిని అయింది. ప్రయాణాలు – అవి రహదారులపైనయినా, గగనతలంపై అయినా నియంత్రితమై నేలా ఆకాశం కూడా కాలుష్యరహితమై కొంత సేదతీరాయి. ఒకప్పుడు కనబడని దూరపుకొండలూ, వనజీవాలూ స్పష్టంగానూ, స్వేచ్ఛగానూ దర్శనమిచ్చాయి.

గడచిన సంవత్సరం ‘కరోనా’ మనిషికి ఎన్నో కొత్తపాఠాలు నేర్పింది. ఈ సంక్రాంతి వేళకి వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేసింది. వ్యాధిబారిన పడకుండా టీకా చేతుల పరిశుభ్రత, మాస్క్‌, భౌతికదూరంకు తోడయి రక్షిస్తుంది. అంచేత సంక్రాంతి ఓ కొత్తధైర్యాన్ని ఇస్తోంది. కానయితే గతంలోని నిర్లక్ష్యాలను మళ్ళీ తిరగదోడుకోకుండా మనిషి తానే ఒక ‘వైరస్‌’ కాకుండా సాటివారిపట్ల మానవీయబంధాలతో మరింతగా ముడిపడాలి. శార్వరి అనే కటిక చీకటి తొలగి వి(శిష్టమైన) ‘ప్లవ’లోకి అడుగిడబోతున్నాం. ప్లవ అంటే నావ, లోతు అనే అర్థాలు కూడా వున్నాయట’. అందువల్ల లోతు అయిన మానవసంబంధాలతో ఈ కష్టాల కడలిని నావతో దాటేసి అసలుసిసలు సంక్రాంతిశోభలను భవిష్యత్తులో మునుపటి విలువలతో సహా నవనవోన్మేషంగా అందుకోగలమని ఆకాంక్షిద్దాం.

0 comments: