ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts
Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts

Monday, July 9, 2018

పిఠాపురం పుస్తకం -పాలమూరు పుస్తకం



ఆంధ్రభూమి 
వారపత్రిక 

5.జూలై '2018 సంచికలో 
వచ్చిన 
రెండు పుస్తక సమీక్షలు 

1.పిఠాపురం క్రానికల్స్ -
          -శ్రీ కంభంపాటి రవీంద్ర 

2.సాహితీవనంలో ఒక మాలి 
       కపిలవాయి లింగమూర్తి 
         -డా.కొల్లోజు కనకాచారి 








Saturday, June 23, 2018

పుస్తక ప్రపంచం



రెండు గ్రంథ  సమీక్షలు 

ఆంధ్రభూమి వారపత్రిక 28.6.2018 ప్రచురణ 




1.మన జీవితాలు -జిడ్డు కృష్ణమూర్తి వ్యాసాలు 
                               
                               అనువాదం: శ్రీమతి అబ్బూరి చాయాదేవి



2.అంతర్యామి (నవల)

                              -సింహప్రసాద్ 




                       

Friday, June 22, 2018

అదో గౌరవప్రదమైన అంశం!


S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.





పీఠికా, అచ్చుతప్పుల పట్టి
కా లేని తెలుగు పుస్తక స్వరూపాన్ని ఊహించడం కష్టం అనేవారు ఆరుద్ర. తమ గ్రంథాలకు ఏ సాహితీ ప్రముఖుల చేతనో, ఆత్మీయ మిత్రుల చేతనో మున్నుడి రాయించుకోవడం చాలామంది రచయితలు చేసే పనే. అడిగి రాయించుకుంటున్నారు కాబట్టి ఆ ముందు మాటలు రాసే సాహితీ ప్రముఖులు గ్రంథకర్తను, అతని రచనను ప్రశంసించడమే ప్రధానంగా చేస్తారు. అయితే తమ పీఠికల ద్వారా ఆ గ్రంథం గురించీ, ఆ గ్రంథకర్త గురించే కాకుండా సందర్భోచితంగా ఓ సాహితీ చర్చనో, సాహిత్య సమాచారాన్నో అందులో నిక్షిప్తం చేసే వారుంటారు. పీఠిక పేరుతో తమ పాండిత్య ప్రదర్శన చేసేవారూ వుంటారు. పనిలో పనిగా తమ గురించీ చాటింపు వేసుకునే వారుంటారు.

నిజానికి పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు తెలుగు సాహిత్య విమర్శలో.. గుర్తించదగిన అంశాలు. పీఠికలను సాహిత్య విమర్శలో భాగంగా గుర్తించడానికి అవి సింహభాగం ఆ రచన పట్లా, ఆ గ్రంథకర్త పట్లా ప్రశంసా పత్రాలుగా వుంటాయన్న భావన అవరోధం కావచ్చు. కానీ నిజానికి పీఠికలే అసలు గ్రంథాలుకన్నా విలువైనవిగా భాసించిన ఘట్టాలు సాహిత్య చరిత్రలో లేకపోలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానంకు చలం యోగ్యతా పత్రం వంటివి అందుకు ప్రబల నిదర్శనాలుగా వున్నాయి. కట్టమంచి, రాళ్లపల్లి, విశ్వనాథ, కుందుర్తి, రా.రా., జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారి పీఠికలకు సాహిత్య గంథం ఎంతో వుంది. ఎందరో కవులను, రచయితలను కె.శివారెడ్డి, అద్దేపల్లి వంటి వారు ప్రోత్సహిస్తూ ముందు మాటలు రాసినా వారికి విమర్శకులుగా కన్నా కవికుల గురువులుగానే గౌరవం వుంది. సినారె, ఎన్.గోపి వంటి వారు వందలాది ముందు మాటలు రాశారు. కానీ వాటన్నింటినీ సాహిత్య విమర్శలో ఒక ప్రత్యేక భాగంగా గుర్తించడానికి చాలామందికి మనస్కరించకపోవచ్చు.

విమర్శకులుగా పేరొందిన వారిచేత పీఠికలు రాయించుకోవడం వల్ల ఆ తరువాత ఏ పత్రికల్లోనో వారి పాలబడకుండా ముందస్తు బెయిల్ పొందినట్లు భావించి ప్రసిద్ధులనిపించుకున్న విమర్శకులను తమ గ్రంథాలకు పీఠిక సంతరించమని కోరే తెలివిడి కవులు, రచయితలు కూడా లేకపోలేదు. అడిగినంతనే మొహమాటానికో, కాదంటే అహంకారి వంటి ఏ ముద్రనో వేయించుకోవలసి వస్తుందనో, నాలుగు మంచి మాటలు చెప్పి రచయితను ప్రోత్సహించడం సాహితీవేత్తలుగా గుర్తింపు పొందిన వారి కర్తవ్యమేననే సహృదయ భావనతోనో పీఠికలు సంతరించే వారున్నారు. అయితే నిజానికి పీఠిక రాయడం ఓ గౌరవప్రదమైన అంశమే! కొందరి పీఠికలు నిజంగా పుస్తకాలకు విలువ తెస్తాయి. ఆయా గ్రంథకర్తలకు ప్రోత్సాహకరంగా వుంటూనే సరియైన పంథాలో సాగే మార్గదర్శనం చేస్తాయి.

ఇవాళ మంచి సాహిత్య విమర్శకులలో ఒకరుగా పేరుగాంచి సాహిత్య అకాడెమీకి సలహా సంప్రదింపులు ఇచ్చే కీలక స్థాయిలో వున్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు తాను ఇతరుల పుస్తకాలకు ముందు మాటలు రాసే దశకు ఎదిగీ, వాళ్ల గురువు ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పీఠికల్ని సంకలనం చేసి ప్రచురించిన వైనాన్ని గుర్తించిన రాచపాళెం వారి శిష్యుడు డా.తన్నీరు నాగేంద్ర ఆయన పట్ల గౌరవాదరాలతో పూనుకుని రాచపాళెం వారి నలభై అయిదు పీఠికలను తానే ఆర్థిక భారం వహించి ప్రచురించాడు. ఇది గురువు పట్ల అభిమానాన్ని చాటుకోవడానికే కాక సాహిత్య విమర్శకు అందించిన ఒక మంచి ఉపాయనంగా అభినందనీయ విషయం.

గోర్కీ వ్యాసాలకు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వ్యాస సంకలనానికి, కేతవరపు రామకోటి శా
స్త్రి , సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జూలూరి గౌరీశంకర్, కొండ్రెడ్డి, వినోదిని, రజని, గాయత్రి వంటి వారి పుస్తకాలకు రాచపాళెం రాసిన పీఠికలు, ముఖ్యంగా సీమ రచయితలు పలువురి గ్రంథాలకు ఓ గురుస్థానీయునిగా రాసిన పలుకులు వీటిల్లో చెప్పుకోదగినవి.

‘మార్క్సిస్టు విమర్శకుల్లో సిద్ధాంతాలు చెప్పేవాళ్లు ఎక్కువ. సిద్ధాంతాన్ని అన్వయించి సాహిత్య విమర్శ చేసేవాళ్లు తక్కువ. అప్లికేషన్ దాకా వచ్చినా ఎక్కువమంది దృష్టంతా వస్తువు మీద, దాని నేపథ్యం మీద కేంద్రీకరిస్తారు. శిల్పం జోలిగి వెళ్లేవాళ్లు అతి తక్కువమంది.’

‘తెలుగు విమర్శకులలో కవిత్వ ప్రియులు ఎక్కువ. అందుకే కవిత్వ విమర్శ ఎక్కువగా వచ్చింది. కథ, నవలల విమర్శకు ఒక కొత్త సంస్కారం కావాలి. కవిత్వంలో విమర్శకులకు పద ప్రయోగ వైచిత్రి సహకరిస్తుంది. కథలో, నవలల్లో ఆ వీలు లేదు. అందుకే ఎక్కువమంది విమర్శకులు ఇటు మొగ్గరు.’

‘పరిశోధించి సిద్ధాంత గ్రంథం రాయడమంటే సాహిత్య విమర్శ రంగంలోకి అడుగుపెట్టడమనే అర్థం. అదే సర్వస్వమని మీసాలు మెలేసుకోకూడదు.’

‘మన విమర్శకులు గుర్తించవలసిన అంశం మరొకటున్నది. ఇప్పటికే చర్చల్లో బాగా నలిగిన విషయాల మీద విమర్శ రాయడంలో విమర్శకులు రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అంశాల మీద కొత్త సమాచారం అందించడం, పాత సమాచారం ఆధారంగా కొత్తగా వ్యాఖ్యానించడం. సమాచారం పాతదై వ్యాఖ్యానమూ పాతదైతే విమర్శను వర్తమాన గుణం వుండదు.’

‘సమీక్షించే గ్రంథాన్ని సమగ్రంగా చదవడం ఒక ఎత్తు. చదివి జీర్ణమైన దానిని నిర్మాణాత్మకమైన పద్ధతిలో, నిర్మాణాత్మకమైన భాషతో చెప్పగలగడం మరో ఎత్తు. ఈ రెండు ఎత్తులకూ ఎదిగిన వారే నమ్మదగిన సమీక్షకులవుతారు.’

పీఠికా రచన మూలకందంగా ఇలాంటి ఉపయుక్త అంశాలను రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు వెలువరించినందునే ఈ గ్రంథం సాహిత్య విమర్శలో భాగంగా ఆమోదయోగ్యమవుతోంది. మంచి సంకలనం అందించిన నాగేంద్రకు అభినందనలు.

-సుధామ

రాచపాళెం పీఠికలు
సంకలనం: డా.తన్నీరు నాగేంద్ర
వెల: రూ.150
ప్రతులకు: పాల్యం (విలేజ్ అండ్ పోస్ట్)
పమిడి మండలం
అనంతపురం, ఆం.ప్ర.
99493 44032

Andhra Bhoomi (Daily): Maatru Bhoomi: Published Friday, 22 June 2018

Wednesday, March 21, 2018

ఓ మహిళ జీవన కథనం



S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.



గంటి సుజల ‘అనూరాధ’ వ్రాసిన మాతృసదనం నవల ఒక సాధికారిక మహిళ జీవన కథనం. చిన్నవయసులోనే ‘మాస్టర్ చెఫ్’ పోటీలో విజేతగా నిలిచిన అమ్మాయి కథ. ఆ అమ్మాయి మామూలు అమ్మాయి, అందమైన కుటుంబ నేపథ్యం వున్న స్త్రీ కూడా కాదు. ఆమె వెనుక వున్న జీవితం ఒక దారుణ బాధామయ గాథ. ఆమె తల్లి మానసికంగా ఎదగని శాపగ్రస్త. అంతేకాదు అరాచకానికి గురై తల్లి అయి బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి తల్లికి పుట్టిన బిడ్డ సమాజంలో ఎదగడమంటే మాటల! తన కన్నీళ్లను, కడగండ్లను అధిగమించి, శక్తిసామర్థ్యాలతో ఎదిగిన ఆ అమ్మాయి ప్రణతి. తల్లి ‘రోజా’ పిచ్చిపిల్ల అయినా, ఆ పిచ్చిపిల్లకు పిల్లగా, ఆంటీ ప్రసూన అండతో ప్రణతి - కోటిరూపాయల బహుమతిని గోల్డెన్ చెఫ్ కోట్‌తో - అందుకునే స్థాయికి ఎలా ఎదిగిందీ, ఈ నవల ఉత్కంఠభరితంగా చదివిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు సాధించలేనిది లేదని నిరూపిస్తుంది.

అమిత్‌ను ప్రేమించి మోసపోయిన ప్రసన్న అబార్షన్ చేయించుకుని తనదైన జీవన మార్గాన్ని వేసుకోవడం, ప్రణతికి ఆంటీగా స్ఫూర్తిదాయకం కావడం కూడా ఒక విశేషం.
 నవలలోని పాత్రలన్నీ జీవితపు అనుభవాల చిత్రికలుగా గోచ రిస్తాయి. మానవులు మృగాలుగా మారి అరాచకాలు చేస్తున్న మానవత్వం ఇంకా నిలచి వుందనే తార్కాణంగా ఇందులోని మహలక్ష్మి చిత్ర, ప్రసన్న పాత్రలను సుజలగారు అద్భుతంగా తీర్చిదిద్దారు.

కొడుకుల స్వార్థపరత్వాన్ని గ్రహించిన మహలక్ష్మి భర్త స్వార్జితమైన ఆస్తిని వారి పరంకాకుండా, తెలివిగా మిత్రురాలు సుభద్ర సహకారంతో అనాధలకు అండగా నిలచే ‘మాతృసదనం’ స్థాపించి ఎందరో పిల్లల ఎదుగుదలకు ఆసరా అవుతుంది. ఆ సదనంలోనే చిత్ర మానసికంగా ఎదగని రోజాని సాకుతుంది. 

ఆడుకోడానికని వాచ్‌మెన్ కళ్లుగప్పి గేట్ దూకి పార్క్‌కు పోయిన రోజా ఆ తర్వాత నాలుగు రోజులకుగానీ దొరకదు. కొన్ని నెలల తరువాత రోజా గర్భవతి అని తెలుస్తుంది. చిత్ర రోజాను దానికి సిద్దం చేస్తుంది మానసికంగా. ఏ కాముకుడి దౌర్జన్యానికి చిహ్నమో తెలియని రోజాకు పుట్టిన పాపాయే ప్రణతి. 

మాతృసదనంలో అకౌంట్స్ చూడడానికి చేరిన వెంకట్రావ్‌గారు కూడా సదనం అభివృద్ధికి తోడ్పడతారు. మహలక్ష్మిగారు మరణించడంతో వారంతా మాతృసదనానికి దూరమైపోతారు. ప్రసన్న రోజాని, ప్రణతిని తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది. ఉద్యోగం చూసుకుని ప్రణతికి చదువు చెప్పిస్తుంది. ప్రసన్న ఇంట్లో లేనప్పుడు తల్లికి సాయం చేయడానికి ఆమె పనుల్లో పాలుపంచుకుంటూ వంటపట్ల ఆసక్తి పెంచుకున్న ప్రణతి అలా కొత్తకొత్త వంటలు చేస్తూ ఎలాగైనా స్వతంత్య్రంగా నిలవాలనే అభిలాషతో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్‌లో దిగుతుంది. తన ఆశయ సాధనలో ఆమె ఎలా ముందుకు వెళ్లిందీ, తల్లి రోజాను ఎలా చూసుకున్నదీ చక్కగా చిత్రించారు రచయిత్రి. తన ఆశయాన్ని సాధించిన ప్రణతి తిరిగి ఎలా అనాధలకు అండగా మళ్లీ మాతృసదనం స్థాపించిందన్నదే నవలకు పరాకాష్ఠ.

అనేక పాత్రలతో, ఘటనలతో నవల అనేక వొంపులు తిరుగుతూ నడుస్తుంది. కథలో కథలుగా అనిపించే ఘట్టాలే అయినా వేటికవి ఓ లక్ష్యంతో ఉదాత్తతతో కానవస్తాయి. ముందు మాటలో పబ్లిషర్ శ్రీమతి జ్యోతి వలబోజు అన్నట్లు ‘ఈ నవల చదువుతుంటే ఏదో సినిమా కథలా, అభూతకల్పనలా అనిపించదు. మన చుట్టూనే జరుగుతున్నట్లుగా ఉంటుంది. కుళ్లు, కుతంత్రం, స్వార్థపరులతోబాటు మంచీ, మర్యాద, ఆప్యాయత, అభిమానాలు ఉన్నవారు కూడా మన మధ్య తప్పకుండా ఉంటారని రచయిత్రి స్పష్టంగా చెప్పారు’
-సుధామ
మాతృసదనం (నవల)
-అనూరాధ (సుజలగంటి)

వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి
303, అలేఖ్య రెయిన్‌డ్రాప్స్
ప్లాట్ నెం.17-18,
గౌతమి ఎన్‌క్లేవ్
కొండాపూర్, హైదరాబాద్-84
ఫోన్:77023 19351
040-40203226

Monday, March 19, 2018

సినీమాకి కలం పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.




తెలంగాణ సినీగేయ వైభవం
-డా.కందికొండ
తెలంగాణా సాహిత్య అకాడెమీ ప్రచురణ
కళాభవన్, రవీంద్రభారతి
హైదరాబాద్-4
వెల: రూ.125

*
‘స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ సినిమాకి పాట అనవసరం. కానీ పాటల్లేని సినిమాలు చాలా తక్కువ. ఒక్కోసారి పదిహేను ఇరవై పాటలున్న సినిమాలు కూడా వచ్చాయి. పాట సినిమాకు మూలాధార నాడి అయిపోయింది. ఓ పాట కోసమే సినిమాని పలుమార్లు చూసిన వాళ్లూ ఉన్నారు’ అని శ్రీశ్రీగారు 1982 దుందుభి ఉగాదికి ఆకాశవాణి వివిధభారతి జనరంజనికి ఇంటర్వ్యూ చేసినప్పుడు స్వయంగా ఈ సమీక్షకునితో అనడం గుర్తొస్తోంది. సినిమాల విజయానికి పాటలు బాటలు వేసిన రోజులెప్పుడూ వున్నాయి. నిజానికి జన సామాన్యం దృష్టిలో కవులంటే అధికంగా సినీ గేయ రచయితలే! సినీ కవులు కావడం వల్లే - గ్లామర్ సంపాదించుకున్న కవులున్నారు. ఏ పత్రికలోనో రాస్తూనో, ఓ కవితా సంకలనం వేసాకనో కాక, నేరుగా సినీ రంగాన కాలిడి కవులుగా గుర్తింపు పొందినవారూ ఉన్నారు.

సినిమాలకు గీత పరీమళాలందించిన కవుల గురించీ, అందునా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతపు సినీ గేయ రచయితల గురించీ, ‘తెలంగాణ సినీ గేయ వైభవం’ పేర - ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సినీ సన్నివేశ గీతాల మీద పరిశోధన చేసిన డా.కందికొండ, గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాసిన గ్రంథాన్ని, తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించింది.

తొలి తెలుగు సినీ టాకీ 'భక్త ప్రహ్లాద’లో - ‘పరితాప భారంబు భరియింప తరమా’ అనే పాట రాసింది తెలంగాణ ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించిన చందాల కేశవదాస్. అలా తొలి తెలుగు సినీ గేయ రచయితగా వెండితెరపై వెలిగింది ఆయనే. భక్తప్రహ్లాద చిత్రంలో పోతన పద్యాలతోబాటు, ధర్మవరం రామకృష్ణమాచార్యుల గారివీ పద్యాలున్నాయి. కానీ తొలి తెలుగు సినిమా పాటకు బాట వేసింది చందాల కేశవదాస్‌గారే. దాశరథి, సినారె వంటి లబ్ధ ప్రతిష్ఠుల నుండి, నేటి వడ్డెపల్లి కృష్ణ, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, గోరటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ వంటి 24 మంది తెలంగాణ సినీ గేయ కవుల కృషిని ఈ గ్రంథం పరిచయం చేస్తోంది. ఆ కవుల జీవన రేఖలను, పాటల సొబగును వివరిస్తోంది.

2010లో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నేటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారు చక్రి సంగీత దర్శకత్వంలో తెలంగాణ ఉద్యమ గీతం - ‘గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు’ అంటూ - ఉద్యమ నేతగానే కాక, కవిగా తనకున్న అభినివేశాన్ని చాటుకోవడం కూడా కందికొండ నమోదు చేయడం ఆనందం! 
అలాగే ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’ చిత్రంలో అన్ని పాటలూ రాసి, తొలి తెలంగాణ సినీ గేయ కవయిత్రిగా ‘పెళ్లిచూపులు’ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల్లో తన కలంతో కలకలం సృష్టించిన కరీంనగర్ జిల్లా మంచిర్యాల కవయిత్రి ‘శ్రేష్ఠ’నూ యశ్‌పాల్, మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ వంటి వారిని ‘తెలంగాణ సినీ గేయ వైభవం’లో పరిచయం చేశారు. 

అయితే సినీ గీత పరిశోధనలే చేసిన డా.కందికొండ - తెలుగు సినిమాకు తన కలం వెలుగులందించిన కీ.శే.అచ్చి వేణుగోపాలాచార్యులు గారినీ, నేటి వౌనశ్రీ మల్లిక్‌గారినీ వారు తెలంగాణ ప్రాంతీయులే అయినా, విస్మరించడం విస్మయం కలిగించింది.

‘పట్నంలో శాలిబండ - పేరైనా గోల్కొండ’ అనే ‘అమాయకుడు’ చిత్రంలోని పాట ఎంత ప్రసిద్ధమో! కె.బి.తిలక్ దర్శకత్వంలోని ‘ముద్దుబిడ్డ’ చిత్రంలో ‘చుక్కల చీర కట్టుకుని పట్టుగుడ్డ రైక తొడుక్కుని’ అనే జానపద గీతం, ‘పి.పుల్లయ్యగారి ‘వేంకటేశ్వర మహాత్మ్యం’లో (1960) ‘పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడ’ ‘తిరుపమ్మ కథ’ చిత్రంలోని ‘శ్రీ వేంకటేశా దయాసాగరా’ భక్తిగీతం, ఇవన్నీ రాసింది ఎ.వేణుగోపాల్ అనే అచ్చి వేణుగోపాలాచార్యులుగారే! 1930 జూన్ 12న కుత్బుల్లాపూర్‌లో జన్మించారాయన. పూర్వీకులు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గర్లోని అవునూతుకు చెందిన వారు. పురానాపూల్ ప్రైమరీ స్కూల్‌లో చదివి, ఉర్దూలో హెచ్.ఎస్.సి. చేసి, టీచర్ ట్రైనింగ్ పొంది, 1952లో హైద్రాబాద్‌లో టీచర్‌గా పనిచేశారు. ఉస్మానియా నుండి ఎం.ఏ. తెలుగు చేశారు.
మద్రాస్‌లో ఆత్రేయ, కొసరాజు వంటి వారు సృష్టించిన అడ్డంకులు ఎదుర్కొంటూ - తెలంగాణ సినీ కవి ఎ.వేణుగోపాల్ మమకారం, భాగ్యవంతులు, పచ్చని సంసారం, దేవుడున్నాడు, అమాయకుడు, దక్షయజ్ఞం, పునాదిరాళ్లు, ఉషా పరిణయం, ఆరాధన వంటి ఇరవైకి పైగా చిత్రాలకు పాటలు రాశారు. కష్టసుఖాలు, రాజాధిరాజు, పచ్చని సంసారం, భాగ్యవంతులు తదితర చిత్రాలను తమిళం నుంచి తెలుగులోకి అనువదించారు. కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్‌గా కూడా పని చేశారు. తిరుపతమ్మ కథ (1963) మాటలు, పాటలూ రెండూ ఆయనవే! అలాగే ఘంటసాల గళంలో ప్రసిద్ధి చెందిన ‘ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా’ ‘నీకొండకు నీవే రప్పించుకో’ వంటి భక్తిపాటలు వేణుగోపాల్ రాసినవే. హైదరాబాద్ = గోషామహల్, లాలాపేట్, షాద్‌నగర్ పాఠశాలల్లో పనిచేసి, హెడ్మాస్టర్‌గా రిటైరయ్యారు. 85 ఏండ్ల వయసులో గుండెకు, వెనె్నముకకు ఆపరేషన్లు జరిగాయి. చాలాకాలం పౌరోహిత్యం కూడా చేశారు. ఆ మధ్యే కాలధర్మం చెందారు.
అటువంటి తెలంగాణ సుప్రసిద్ధ కవిని ఈ పుస్తకంలో చేర్చకపోవడం పెద్ద లోటు. 

అలాగే వరంగల్ జిల్లా వర్థన్నపేటకు చెందిన మౌనశ్రీ మల్లిక్ 1976 మార్చి 4న జన్మించారు. తప్తస్పృహ, దిగంబర, గరళమ్ వంటి కవితా సంకలనాలు వెలయించి, అటు టీవీ సీరియల్స్‌కూ, తెలుగు చిత్రాలకు నేడు ఎన్నో పాటలు అందిస్తున్న మౌనశ్రీ మల్లిక్ గురించి కూడా ఈ గ్రంథం విస్మరించడం సబబు కాదు. నాలో తొలిసారిగ, మండే టు సండే, చేతిలో చెయ్యేసి, థ్రిల్లింగ్, గుడ్‌మార్నింగ్ వంటి చిత్రాల ద్వారా మౌనశ్రీ మల్లిక్ సినీ గేయ రచయితగా ఎదిగారు.

ఏమయినా ‘తెలంగాణ సినీ గేయ వైభవం’ గ్రంథం సంతరించిన డాక్టర్ కందికొండ కూడా స్వయంగా ప్రముఖ సినీ గేయ రచయితగా పేరొందినవారే! శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, ఇడియట్, టెంపర్, మున్నా, శివమణి వంటి విజయవంతమైన చిత్రాలలో జనరంజకమైన పాటలెన్నో రచించారు. ఇకనయినా మలి ముద్రణలో విస్మృత తెలంగాణ సినీ కవులను కూడా చేర్చి, ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్ది తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించగలదని ఆకాంక్షిద్దాం.


-సుధామ



Saturday, December 9, 2017

పదునైన వ్యంగ్య రచనలో రారాజు






కీ.శే.కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి అంటే ఎవరో అనుకోవచ్చు. కానీ పతంజలి అనగానే తెలుగు సాహిత్య లోకం కె.ఎన్.వై.పతంజలి అని సులభంగానే గుర్తిస్తుంది. ఎందుకంటే రాచపుట్టుక పుట్టిన ఆయన రచయితగా బడుగు ప్రజల పక్షం వహించి ‘రాజ్యం’లోని దుర్మార్గాలపై వ్యంగ్యపు పదునుతో కలాన్నే కత్తిచేసి దునుమాడినవాడు. 

నేటి విజయనగరం జిల్లాలో విలీనమైన నాటి విశాఖ జిల్లాలోని అలమండ గ్రామం ఆయన పుట్టిన ఊరు. 29 మార్చి 1952లో జన్మించి ఆ జనపదం నుంచే జ్ఞానపథం వైపు మరలాడు. ఆరు వందల సంవత్సరాల ఆలమండ అణువణువునూ తన పరిశీలనతో భద్రపరచుకున్న ఆయన బుద్ధి, హృదయం అందుకే తన రచనల్లో ప్రభావోపేతంగా ప్రతిఫలించాయి. చోడవరం, కొత్తవలసలలో విద్యాభ్యాసం చేసి, చిన్ననాటనే అపరాధ పరిశోధక నవలలు, ఇంట్లో వున్న ఇతరేతర పుస్తకాలు, ఆంధ్ర పత్రికలు చదివి నిరంతర పాఠకుడయ్యాడు. ఆ దశలోనే అన్నయ్య దగ్గర శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం, బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి అక్కడ చలం ‘స్ర్తి’ చదవడం పతంజలిలో మార్పునకు మూలధాతువులయ్యాయి. 

విజయనగరంలో డిగ్రీ చదువుతున్నప్పుడే అద్దె గదిలో పతంజలి అక్షర యాగానికి అంకురార్పణమైంది. పదకొండేళ్ల ప్రాయంలో రాసిన ‘అస్థిపంజరం’ డిటెక్టివ్ నవల అలా వుంచితే 1963 నుండి ఓ పుష్కర కాలం పొందిన అనుభవంతో, సామాజిక అవగాహనతో 1968లో ‘చివరి రాత్రి’ అనే కథానికతో మొదలుపెట్టి పలు కథలు రాశారు. చలంలా రావిశాస్ర్తీలా రాయడమనే ప్రేరణ ఆ దశలోనిది. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికలో 1975లో ఉపసంపాదకునిగా చేరడంతో తన జర్నలిస్టు వృత్తి జీవితం మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం తనలోని జ్ఞానాగ్నిని రగుల్కొల్పింది. ప్రాచ్య పాశ్చాత్య రచయితలను, వారి సాహిత్యాన్ని అవలోకనం చేశాడు. జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాలతో పెనవేసుకున్న ఆత్మిక భావన పతంజలిని విశ్వ మానవ సౌభ్రాతృత్వం వైపు మరల్చింది. తన ‘వీరబొబ్బిలి’ నవలను ‘డాగిష్ డాబ్లర్’గా తానే ఆంగ్లంలో అనువదించుకునేంత ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో మన్ననలు పొందగలిగాడాయన.

పతంజలి రచనలన్నీ త్రికరణ శుద్ధితో వెలువడినవే. మాటకు, రాతకు, చేతకు పొంతనలేని రచయితల కోవకు ఆయన చెందడు. మాట పడడం నచ్చనివాడు. తన రచనలు ప్రమోట్ చేసుకోవడం, పురస్కారాల వెంపర్లాట ఏ కోశానా లేనివాడు. మనుషులను ప్రేమించినవాడు. పత్రికా ప్రపంచంలో నిజాయితీ గల జర్నలిస్టు ఇమడగలగడం ఎంత కష్టమో తానెదుర్కొన్న ఇబ్బందులతో స్వయంగా గ్రహించిన వాడాయన. ‘పతంజలి పత్రిక’ అని విశాఖలో సొంతంగా దినపత్రిక పెట్టి చేతులు కాల్చుకున్నాడు కూడాను. ఆ తర్వాత వృత్తిపరంగా పతంజలి రూపెత్తిన సరికొత్త కేశ తైలాన్ని కనుగునే ఆయుర్వేద వైద్య ఫణితి, నిల్వ పచ్చళ్ల తయారీకి దిగి శ్రమ జీవనానికి ఆహ్వానం పలకడం కొందరికి అచ్చెరువును కలిగించాయి కూడాను. తండ్రి నుంచి ఆయుర్వేద వైద్యాన్ని వారసత్వంగా అందుకుని బతుకుతెరువు గడుపుకున్నాడు. 57 ఏళ్ల వయసులో 2009లో తనువు చాలించాడు.

పేరు కోసం కాక, తన రచనా ప్రవృత్తిని వ్యవస్థలోని చెడునీ దుర్మార్గాన్నీ వెక్కిరిస్తూ ప్రశ్నిస్తూ సాగించాడు. అన్యాయాన్ని రచ్చకీడ్చడమే తనకానందం. అందుకే పతంజలి కలం పదునైన వ్యంగ్యానికి ప్రతీకగా మారింది. ధర్మాగ్రహం, బాధలకు ప్రతిస్పందన తన వ్యంగ్యం. ‘అస్త్రాలు అనేవి ఉంటే పాశుపతాస్త్రం తీవ్రాతి తీవ్రం అని నేను విన్నాను. దానికన్నా తీవ్రమైన అస్త్రం వెక్కిరింత. అది నా జిల్లాలో, నా కుటుంబంలో చాలా ఎక్కువ బహుశా అది నా రక్తగతం’ అని స్వయంగా ప్రకటించుకున్న పతంజలి వైయక్తిక సంభాషణలు కూడా హాస్యస్ఫోరకంగా ఉండేవి. సునిశిత వాదన వ్యంగ్య వాగ్ధార తనది. లోకానుభవం మూలకందం. 

దిక్కుమాలిన కాలేజీ (1976), చూపున్న పాట (1998), అదర్రా బంటి (1984 ఉదయం పత్రిక సీరియల్. ప్రచురణ 2005), కథా సంపుటాలు, ఖాకీవనం, రాజుగోరు.. వారి వీర బొబ్బిలి, పెంపుడు జంతువులు, అప్పన్న సర్దార్, ఒక దెయ్యం ఆత్మకథ, గోపాత్రుడు, పిలక తిరుగుడుపువ్వు, నువ్వే కాదు లేదా మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు వంటి నవలలు నవలికలు 1970 లగాయితు ఓ మూడు దశాబ్దాలపాటు పాఠకులను పతంజలి విలక్షణ శైలితో విశేషంగా అలరించాయి. 1984 నుండి 1986 వరకు ‘ఉదయం’ దినపత్రికలో తాను కాలమ్‌గా రాసిన వ్యాసాల సంకలనం ‘పతంజలి భాష్యం’ (1989) అతని ఉన్నత శ్రేణి ఉదాత్త భావజాలాన్ని పరివ్యాప్తం చేసింది. ‘రచయిత కాలేని వాడు మంచి పాత్రికేయుడు కాలేడు. శ్రీశ్రీ, గోరాశాస్త్రి  మంచి రచయితలు, మంచి పాత్రికేయులు అయ్యారు’ అన్న పతంజలి తానూ ఏ పత్రికలో వున్నా తను రాసే సంపాదకీయాలతో ప్రజాదరణ పొందాడు. తెలుగు నాటక రంగం గురించిన ఓ సంపాదకీయంలో ‘ఒకే ఒక్క గొప్ప నాటకంతో బతికేస్తున్న జాతి బహుశా ఇదొక్కటే’ అంటూ కన్యాశుల్కం తరువాత జన జీవితంలో భాగమై ప్రభావం వేయగల నాటకం మరొకటి రాకపోవడాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.

పతంజలి రచనల్లో స్త్రీపాత్రల ప్రాముఖ్యత ఎందుకో తక్కువే! అయితే ఆయన ఇతివృత్తాల, రచనా సంవిధానాల పరిధిలోనే ఆ పాత్రలున్నాయి. స్ర్తివాదం మీద సానుకూల దృక్పథం గల పతంజలి ‘స్త్రీల బాధలు రచనల్లో ప్రతిఫలించాలి. స్త్రీలే ఆ విషయాలు మాట్లాడాలిస్త్రీలు మాత్రమే అవి రాయాలి’ అని స్త్రీవాదం ప్రబలంగా రావాలనే అభిలషించారు. తాను రాసిన కవిత్వం మాత్రం తక్కువే! 

వచన రచయితగానే పతంజలిది పదునైన కలం. రాయడం గొప్పతనంగా కాక బాధ్యతగా రాసిన రచయిత పతంజలి. రష్యన్ వచన మహా రచయితల్ని అతను జీర్ణం చేసుకున్నట్లుగా మరెవరూ చేసుకోలేదేమోనన్న కె.శివారెడ్డి మాట సత్యదూరం కాదు. పత్రికా రచనలో తెగువ, మెలకువ కలిగి కథా రచన నుండి నవలా రచయితగా పరిపక్వమైన ప్రతిభామతి కె.ఎన్.వై.పతంజలి గురించి కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ సాహిత్య నిర్మాతలు పరంపరతో గ్రంథాన్ని వెలువరింపజేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం. ఉత్తరాంధ్ర జీవద్భాషతో తెలుగు కథా రచన చేస్తూ, వికర్ణ అదిగో ద్వారక వంటి పురాణ పునర్మూల్యాంకన రచనలతో సమాజాన్ని వివేచింపజేస్తూ వున్న ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు గారి చేత ఈ ‘మోనోగ్రాఫ్’ రాయించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది. పతంజలి వ్యక్తిత్వ, సాహిత్య విరాడ్రూపానికి చక్కటి ఫ్రేమ్ కట్టి అందించిన చిత్తరువు ఈ గ్రంథం.
-సుధామ


కె.ఎన్.వై.పతంజలి
-చింతకింది శ్రీనివాసరావు
సాహిత్య అకాడెమీ ప్రచురణ
ప్రధాన కార్యాలయం, రవీంద్రభవన్ 35, ఫిరోజ్‌షా రోడ్ న్యూఢిల్లీ - 110 001
వెల: రూ.50
** ** ** ** ** ** ******



ఆంధ్రభూమి *దినపత్రిక*అక్షర*శనివారం*9.12.2017



Wednesday, November 29, 2017

తెలంగాణ కథకులకు ‘కొండ’Oత అండ





‘నియంతృత్వ నిజాం పాలన’ అంటే ఇప్పటి ప్రభుత్వమూ, బేషరతుగా దాని వత్తాసు పలికే సాహిత్య కూటములూ ఒప్పుకోవేమో గానీ, పౌర స్వేచ్ఛ లేని పాలనగా భావించిన నాటి తెలుగు ప్రజలు - తెలుగు భాష ఉద్ధరణ కోసమూ, తెలుగు వారి సర్వాంగీతాభివృద్ధి కోసమూ తపించిపోయారు. తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యాన్ని ఉద్దీపింపజేయడంలో ‘గోలకొండ పత్రిక’ పాత్ర అవిస్మరణీయమైనది. నిజాం రాష్ట్రంలో తెలుగు వారిని ఏకతాటికి తేవడానికి, తెలుగేతరుల హేళనలను ఎదుర్కొని ఆంధ్ర మహాసభల నిర్మాణం చేసేందుకు సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదత్వంలో ‘గోలకొండ పత్రిక’ పోషించిన పాత్ర కీలకమైనది.

గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ‘ఆధునిక భాష కవిత్వ తత్వము’ అనే వ్యాసంలో శ్రీ ముడుంబ వెంకట రాఘవాచార్యులు గారు ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అని చేసిన వ్యాఖ్య, కురుంగంటి సీతారామాచార్యులు గారు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ పేర ఆధునిక సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో అసలు కవి పండితులే లేనట్లు తెలంగాణ సాహిత్యం పట్ల చూపిన ఉదాసీనత, నిరాదరణ సురవరం వారిని కలచివేసిన కారణంగానే ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా 1934లోనే ‘గోలకొండ కవుల సంచిక’ను మూడు వందల యాభై నాలుగు మంది కవుల రచనలతో, జీవిత రేఖలతో వెలువరించారు. గోలకొండ పత్రిక చందాదారులకు ఒక్క రూపాయికి, ఇతరులకు రెండు రూపాయలకు ‘గోలుకొండ కవుల సంచిక’ అమ్మారు. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం 1935లో రాగా, అంతకు ముందే 1934లోనే తెలంగాణ అస్తిత్వ పతాకను ‘గోలుకొండ కవుల సంచిక’తో ఎగురవేసింది సురవరం ప్రతాపరెడ్డిగారే. 9.7.1934 గోలుకొండ పత్రిక సంపాదకీయంలో తాము వెలువరించిన సంచికపై వచ్చిన విమర్శలను కూడా తిప్పి కొడుతూ రాశారు. ‘మా తల్లిని మేము ప్రేమించిన నితర తల్లులను నసహ్యముతో చూచితిమని తగువు పడకూడదు’. ‘మా రాష్టమ్రుపై మా కభిమానముండిన మా కితరులపై ద్వేషమున్నదని వాదింపగూడదు’ ‘మీరు హైదరాబాదు భాషను వెక్కిరించుచున్నారు’ అంటూ ఆ సంపాదకీయంలో తెలంగాణ ప్రాంత అభిమానాన్ని నిర్ద్వంద్వంగా నిర్భయంగా ప్రత్యేక అస్తిత్వ భావనతో అభివ్యక్తీకరించారు.

గోలుకొండ పత్రిక 1926లో మే 10వ తేదీన మొదట అర్ధవార పత్రికగా బుధ, శనివారాల్లో వెలువడేది. 31.07.1933 నుండి సోమ, గురువారాల్లో వచ్చేది. 2.8.1937 నుండి జాతీయ పత్రికగా తనను తాను అభివర్ణించుకుంది. 1947లో దినపత్రికగా రూపుదాల్చింది. నిజానికి గోలకొండ పత్రిక వార్తాపత్రికే కానీ పద్యాలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, కథలు ప్రచురిస్తూ గోలకొండ పత్రిక నాటి తెలంగాణ సమాజంలో అపూర్వ సాహిత్యసేవ, భాషా సేవ చేసింది. జాతీయోద్యమాలన్నింటినీ నిలువరించింది. అనేక సంఘ సంస్కరణోద్యమాలకు బాసటగా నిలిచింది. ఎందరి చేతనో కలం పట్టి రచనలు చేసేలా చేసింది. తొలి దశలో సురవరం వారే పలు కలం పేర్లతో రచనలు చేసేవారు. పత్రికలో కథలను ప్రచురణకు ఆహ్వానిస్తూ 1926 మే 26 బుధవారం సంచికలో నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర సంఘం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావుగారు ప్రకటన ఇచ్చారు. అత్యుత్తమ కథలకు అయిదు రూపాయల బహుమానం ఇస్తామంటూ ‘బహుమాన కథ’ పేర ఆ ప్రకటన వచ్చింది. నియమాలు వివరిస్తూ మొదటగా నిజాం రాష్ట్రాంధ్రులలో కథలను వ్రాయు పద్ధతిని ప్రోత్సహించుటకై ఈ బహుమానము ఏర్పరుపబడినది అని పేర్కొన్నారు. కథ యొక్క విషయము (ప్లాట్), సాంఘికము (సోషల్), అయినను, చారిత్రకము (హిస్టారికల్) అయినను ఉండవలెను. నిజాం రాష్ట్రాంధ్ర దేశమునకు సంబంధించి యుండుట శ్రేష్ఠతరము. భాష సులభముగా నుండవలెను అని ప్రకటించారు.
1933 జులై 31 బుధవారం నుండి గోలుకొండ పత్రికలో సారస్వతానుబంధము వారమునకొక మారు నాలుగు పుటలు ప్రకటించడం కూడా జరిగింది. వాటిలో చిన్న కథలను వేశారు. 1934 నుండి ‘మా చిన్న కథ’ అంటూ ఓ శీర్షికన తెలంగాణలోని నాటి కథకుల కథలను ప్రత్యేకించి వెలుగులోకి తెచ్చిన ఘనతా ‘గోలుకొండ పత్రిక’దే!
గోలకొండ పత్రికలో 1926 నుంచి 1949 వరకు చాలా కథలే వచ్చాయి. కొన్ని కథలు ‘కథాంజలి’ శీర్షికనా ప్రకటితం అయ్యాయి. పాత గోలకొండ పత్రికలన్నీ ఈ కథల సేకరణ కోసం డిజిటల్ సంచికలన్నీ ప్రెస్ అకెడమీ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ నుంచి గాలించి యామిజాల ఆనంద్, డా.వి.వి.వెంకటరమణ మహోపకారం చేశారు. దాదాపు అలా సేకరించిన వంద కథల నుండి ‘గోలకొండ పత్రిక కథలు’ పేర యాభై రెండు కథలను నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించడం ఏటుకూరి ప్రసాద్ గారన్నట్లు ‘తెలంగాణ సాహిత్యం శిగలో మరో పువ్వు’.

ప్రముఖ పత్రికా రచయిత, విమర్శకులు కె.పి.అశోక్‌కుమార్ ‘పఠనాసక్తులను పెంచిన చిన్న కథలు’ అంటూ తమ ముందు మాటలో ఇందులోని కథలను విశే్లషించారు. ఈ కథల్లో ఎక్కువ శాతం హాస్య కథలు, ప్రేమ కథలు ఉన్నాయి. అధిక శాతం కథలు సాంఘికాలే! ఈ కథల్లోని భాష కొన్నింటిలో గ్రాంథికంగానూ, తతిమ్మావి పూర్తి వ్యావహారికంగానే వున్నాయి. నైజాం ప్రాంతపు కథకులే అయినా తెలుగు భాషను సంపద్వంతంగానే ప్రయుక్తం చేశారని గుర్తించాలి. ఉర్దూ పదాలు ఇక్కడి తెలుగులో ఎంత సహజంగా కలిసిపోయాయో కొన్ని కథల్లోని పాత్రల సంభాషణల్లో అందంగా ఒడిసి పట్టుకోవచ్చు. జాతీయోద్యమ స్ఫూర్తిగల ‘సుశీల’ (నెల్లుట్ల శేషగిరిరావు రచన), వెట్టిచాకిరికి బలి అయిన తల్లీకొడుకుల ‘రెండు శవాలు’ (ఉన్నవ వెంకటరామయ్య) కథ, జహంగీరు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో డబ్బు మదంతో వాగ్దానాలు మరిచి వ్యవహరించిన ఫర్ఖుందా వల్ల ఛిద్రమైన హమదాబేగం కుటుంబాన్ని ఆదుకున్న నవాబు ఔదార్యం తెలిపే ‘్ఫకీరు బిడ్డ’ (్భవకవి రామమ్మూర్తి) కథ, అలాగే పాశ్చాత్య వ్యామోహాన్నీ, ఆధునికత పేరిటి అవకతవకలనూ చూపుతూ ప్రబోధాత్మకంగా ముగిసే ‘బారిష్టరు గోపాల్ కిషన్‌రావు’ కథ, ‘ప్రణయబంధము’ (శేషాద్రి రమణ కవులు రాసినది) మేనరికం కాదన్నందుకు ఆ ప్రణయ జీవులు ఆత్మహత్య చేసుకోవడం చిత్రిస్తే ఆ తరహా ప్రేమ వృత్తాంతాలతోనే ‘వన భ్రాంతి’ ‘్భగ్న హృదయుడు’ ‘నిరీక్షణము’ ‘ఆనంద బాష్పములు’ వంటి కథలున్నాయి. (కటంగూరి నరసింహారెడ్డి, సారథి కె.పి.డబ్ల్యు.డి, సురవరం ప్రతాపరెడ్డి, ని.యె.యాదగిరిరావుల రచనలు). భావకవి రామమ్మూర్తి అనేది సురవరం వారి కలం పేరనీ అలాగే ‘గిరి’ పేర నందగిరి వెంకటరావు గారు కథలు రాశారనీ పీఠికాకర్త వివరించారు.

గోలకొండ పత్రికలో వచ్చిన వివిధ రచయితల ఈ కథాసంకలనంలోని కథలన్నీ గొప్పవి కాకపోవచ్చు. వెంటాడి, వెన్నడే స్మరణీయాలు కాకపోవచ్చు. కానీ మానవ మనస్తత్వ చిత్రణలతో, ఆనాటి సాంఘిక జీవన ప్రతిబింబాలుగా, నాటి కథకుల రచనా ధోరణులను తెలియపరిచేవిగా ఉన్నాయి. అప్పట్లోనే హరిజన వివక్ష గురించిన కథ రావడం ఒక విశేషం కాగా, హాస్య, వ్యంగ్యాలకు కథలలో నాటి నుంచే మంచి ప్రాతినిధ్యం ఉందని నిరూపించేవి కొన్ని.

ఏమయినా ఈ సేకరణ - కూర్పు నేటి ఒక చారిత్రక అవసరం కూడాను. తెలంగాణ ప్రాంతం నుంచి కథలు రాసిన కథకుల కథలను ఇలా గోలకొండ పత్రిక మూలకందంగా సంకలనం చేయడం, నవచేతన వాటిని ముద్రించడం ఆహ్వానించదగిన అంశాలు. ఈ సంకలనంలో అనుబంధంగా సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ కొంగు బంగారం - గోలకొండ పత్రిక’ అనే పరిశోధక వ్యాసాన్ని సంతరించడం ఔచితీమంతంగా భాసిస్తోంది.
‘మన రాష్టమ్రు నుండి తెనుగు దినపత్రిక నెలకొల్పుట ఎంత పవిత్ర కార్యమో అంతే కష్ట కార్యము’ అన్న సురవరం వారు నిజంగానే చీటికిమాటికి నిజాం ప్రభుత్వాధికారుల నుంచి బెదిరింపులు తట్టుకుని పత్రికను నిర్వహించారు. నిజాం ప్రభుత్వాన్ని ఎండగడుతూ సురవరం వారు ‘పిరికిపందలు’ అనే వ్యాసం రాయగా ఉపసంపాదకుని పొరపాటు వల్ల ‘పిరికి పందులు’ అని అచ్చుతప్పుతో అచ్చయ్యిందిట!
అసలే పందులు అనే పదం ఇస్లాం మతస్తులలో నాడు కోపం తెప్పించే అంశం. దీన్ని ఆసరాగా చేసుకుని కావాలనే ఆ పదాన్ని వాడారని చెబుతూ పత్రికను మూసేస్తామని అధికారులు బెదిరించారుట. జన్నరెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు నిజాం అండతోనే దోపిడీలను దౌర్జన్యాలను చేస్తూంటే నిర్ద్వంద్వంగా ఖండిస్తూ దేశ్‌ముఖ్‌ల పట్ల విముఖతతో సురవరం వారు వారి దౌర్జన్యాలను సహించేవారు కాదుట. సంగిసెట్టి శ్రీనివాస్ అనుబంధ వ్యాసంలో ఇలంటి ఆసక్తిదాయక అంశాలున్నాయి.

ఇంత మంచి కథలను, విశేషాలను పొదువుకున్న ఈ కథాసంకలనం పదిలపరచుకోదగిన రికార్డు గ్రంథం. ఆనంద్, రమణ, ప్రసాద్, అశోక్, శ్రీనివాస్ అందరూ బహుదా అభినందనీయులే.
-సుధామ



గోలకొండ పత్రిక కథలు-1 (కథాసంకలనం 1926-1935)
సేకరణ, కూర్పు: యామిజాల ఆనంద్, డా.వి.వి.వెంకటరమణ
వెల: రూ.190
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్ గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్) జి.ఎస్.ఐ. పోస్టుహైదరాబాద్-68.

                                  Andhrabhoomi : Daily :Akshara :25.11.2017: Saturday 

Saturday, November 18, 2017

తెలుగు కథల్లో ఆంగ్లంపై ‘వాత్సల్యం’ ఎందుకు?



మేం గోదారోళ్లమండి’ అన్నట్లుగా, రాజమండ్రి మహిళా కళాశాలలో చదువుకున్న ‘మణి వడ్లమాని’ కౌటుంబిక జీవన స్థిరత్వం తరువాత ఓ ఏడేళ్ల క్రితమే రచనా వ్యాసంగానికి పూనినా, ఈ ఏడేళ్లలో నలభైకి పైగా కథలు రాసి, చేయి తిరిగిన రచయిత్రి స్థాయికి చేరుకున్నారు. ‘జీవితం ఓ ప్రవాహం’ అని ఓ నవల కూడా రాశారు. అంతర్జాలంలో తొలి కథ ‘కృష్ణం వందే జగద్గురుం’ కౌముది మాసపత్రికలో వెలుగు చూసింది లగాయితు, ఆవిడ కలం పరుగులెత్తింది. భర్త, పిల్లలు ప్రోత్సహించడంతో - మొదటిసారిగా ఇరవై నాలుగు కథలతో ఇప్పుడు వెలువడిన కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’.

అంతర్జాలంలోంచి అడుగుపెట్టినా, ఆపై అచ్చుగా అచ్చుపత్రికల వైపు మరలి, తెలుగు వెలుగు, స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, జాగృతి, చినుకు, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో పలు కథలు రాసి, కొన్నింటికి మంచి బహుమతులు కూడా సొంతం చేసుకున్నారు. 


సంకల్పాలు చెప్పుకుని బతికే సుబ్బుశాస్త్రి  హోరున కురిసే వాన కారణంగా ఆకలికి భార్య వర్థనమ్మతో బాటు అలమటించిన వేళ - ఆ బడుగు బాపన దంపతులను ఈశ్వర సంకల్పమే ఎలా ఆదుకుందో వివరించిన కథ సంపుటి శీర్షిక పేరిటి ‘వాత్సల్య గోదావరి’. అలాగే గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన జీళ్లు అమ్మే సూరిబాబు - జులాయితనం నుంచి మంచిని పంచే దిశగా మరలి, మానవత్వంతో పదిమందికి సాయం చేసే వానిగా ఎదిగిన కథనం ‘జీళ్ల సూరిబాబు’. మణిగారి కథల్లో ఇలా మనుషుల పట్ల సానుభూతినీ, ప్రేమనూ, కరుణనూ పరివ్యాప్తం చేసే ధోరణి పాత్రలూ, సంఘటనలూ ద్యోతకం అవుతూ, రచయిత్రి రచనా సంస్కారాన్ని చూపుతాయి. ‘మేనిక్విన్’ కథలో రాజయ్య చీరల షాపు షో కేసులో బొమ్మకు చీర కట్టేందుకు కూడా, నైతికతను ప్రదర్శించడం - ఉదాత్త విలువల పట్ల దృష్టిని ఉన్నతీకరించడమే! బొమ్మలోనైనా సరే స్త్రీల  మాన మర్యాదలకు విలువనివ్వడం నిజంగా విశేషం!

తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీరైనా తండ్రి టైలరింగ్ షాపులో పనిచేసేవారి ఉపాథి పోకూడదని, ఆ వృత్తిని కొనసాగించిన యువకుడు సునీల్ కథనం - ‘రెయిన్‌బో టైలర్స్’. వృద్ధులకు, అందునా మంచం పట్టిన వారికి అహరహం సేవలు చేయడం కష్టతరమైన అంశమే! కానీ నిస్సహాయ స్థితిలోని పెద్దావిడకి హృదయవాసిగా మారిన శోభ ఆదర్శనీయమైన సేవాతత్పరతా కథ ‘అనుబంధం’. వలసలు ఎక్కువైన నేటి కాలాన - మూలాలు వెదుక్కుంటూ, తాత అభీష్టం తీర్చడం కోసం స్వదేశానికి వచ్చి, అనుబంధాలు నిలుపుకునే వారధిగా మారిన ‘సోహం’ కథ కదిలిస్తుంది. పది మందికి ఉపయోగపడితేనే సంపాదించిన డబ్బుకి విలువ అని వేరుశనక్కాయలమ్ముకునే కుర్రాడి ద్వారా స్ఫూర్తి కలగడం - ‘అన్వేషి ’ కథలో చూస్తాం. అలాగే ‘కుటుంబ భారతం’, ‘సౌగంధికా లావణ్యం’ వంటి కథలలో చక్కని సంవిధానం చూపారు రచయిత్రి. 


అయితే ఒక్క విషయం-

మొబైల్ రింగ్ అవుతోంది. టీవీ చూస్తున్న చైతాలీ సౌండ్ తగ్గించి ఎవరి దగ్గర నుంచా అని చూసింది. అది సీమా నుండి వచ్చింది. వెంటనే ఆన్సర్ బటన్ ప్రెస్ చేసి ‘హాయ్ సీమా! గుడ్‌మార్నింగ్. పొద్దున్నేకాల్ చేసావు? ఏంటి విశేషం?’ అంది.


అవతల నుంచి సీమ ‘అరె చైతూ! అదే.. ఇవాళ మనకు లంచ్ పార్టీ ఉంది మర్చిపోలేదు కదా? అదీకాక డ్రెస్‌కోడ్ మారింది. అది చెబుదామని కాల్ చేశాను. నేను పెట్టిన మెసేజెస్ ఏవీ చూడలేదని అర్థమయ్యింది. మనం ముందు అనుకున్న యెల్లో బదులు లెమెన్ యెల్లో కలర్ శారీస్ కట్టుకుందామని డిసైడ్ అయ్యాము.’


కథారచన ఇలా - నేటి తరం ఇలానే మాట్లాడుతోంది కదా అని సమర్థించుకుందామన్నా, ఒక వాక్యంలో అన్నేసి  ఆంగ్ల పదాలతో రాయడం అనే ధోరణి ప్రశంసనీయం కాదు. ఇప్పటికే తెలుగు చచ్చిపోతోందన్న ఆర్తి ప్రబలుతున్నప్పుడు నిజానికి భాషను పరిరక్షించవలసిన కర్తవ్యం సాహిత్యకారుల మీద ఉంది. తెలుగు కథను తెలుగుతనంతో పరిపుష్టం చేయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది. పాత్రోచిత సంభాషణలు అనే మిష మీదనయినా ఆంగ్ల పద ప్రయోగం కొంత అర్థం చేసుకోవచ్చు గానీ, రచయిత్రే కథాసంవిధానంలో ఆంగ్ల పద ప్రయోగాల మోజులో పడకుండా ఉండడం అవసరం. 


మణి వడ్లమాని అన్ని కథలలో ఈ అనౌచిత్యానికి పాల్పడ్డారనడం లేదు గానీ, తెలుగు భాషకు, సంభాషణల్లో తెలుగు తనానికి మరింత ప్రాధాన్యం కల్పించి, తన కథల ద్వారా మానవీయ విలువలకూ, ఉదాత్త పాత్రలకూ, స్ఫూర్తిదాయక సంఘటనలకే కాక చక్కని తెలుగు నుడికారానికి, తెలుగు వాక్య నిర్మాణానికీ కూడా తోడ్పడాలని అభ్యర్థనం.

ఏమయినా తన తొలి కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’తో ఈ తరం పాఠకులను అలరించ వచ్చిన రచయిత్రి భావితరాలు కూడా తలుచుకునే మంచి రచయిత్రిగా మరింత ఎదగాలని శుభాకాంక్షలు.
-సుధామ


వాత్సల్య గోదావరి (కథల సంపుటి)
-మణి వడ్లమాని
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి, 2-2-185/53/3
స్ట్రీట్ నెం.13, శ్రీ దత్త హాస్పిటల్ ఎదురుగా
సోమసుందర్ నగర్, బాగ్ అంబర్‌పేట
హైదరాబాద్-13.


** *** *** ***




Saturday, November 4, 2017

యువతకు స్ఫూర్తిదాయకం ‘హిట్ రిఫ్రెష్’






యాజమాన్యపు పని ఒత్తిడులతో నిరంతరం వుండే వ్యక్తి - ‘రచన’ అనే ఒక సృజనాత్మక కార్యం చేయడం అంత సులభమైన సంగతేమీ కాదు, అది ఏ విషయం మీదనైనా కానీయండి! కానీ ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మూడేళ్ల క్రితం నియమితుడైన మూడవ సి.ఇ.ఓ. ఒక తెలుగు బిడ్డ కావడం, తాను పగ్గాలు చేపట్టడంతోనే కంపెనీలో గుణాత్మక మార్పులకు హేతుభూతుడు కావడం ఒక ఎత్తుకాగా, రానున్న యువతకు స్ఫూర్తిదాయకంగా తన అనుభవ సంపత్తిని ఏడాదిగా ఓ గ్రంథంగా మలచి రాయడం ఒక ఎత్తు.

సత్య నాదెళ్ల అనే ఈ నాదెళ్ల సత్యనారాయణ అనంతపురం జిల్లా ఎలనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన 1962 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కుమారుడు. ఆయన 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పని చేసినవారు. ఐ.ఎ.ఎస్. అధికారిగా కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బి.ఎన్.యుగంధర్, ప్రభావతి దంపతులకు సత్య నాదెళ్ల హైదరాబాద్‌లోనే జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మణిపాల్ ఐఐటిలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బిఈ చేసి, ఆపై అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొంది, చికాగో యూనివర్సిటీ నుంచి ఎం.బి.ఏ. చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించి గ్రీన్‌కార్డు తీసుకున్నారు. 

మొదట్లో సన్‌మైక్రో సిస్టమ్స్‌లో పని చేసి, 1992లో మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టారు సత్య నాదెళ్ల. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర వహించారు. తొమ్మిదివేల కోట్ల కంపెనీ వ్యాపారం అయిదేళ్లలో ముప్పైఒక్క వేల కోట్లకు చేర్చిన ఘనత సత్యకే దక్కుతుంది. నెలకు సుమారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ వేతనం తనది.

సత్య తన తండ్రి స్నేహితుడు మరో ఐఎఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ కుమార్తె, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదివిన అనుపమను వివాహమాడి, వాషింగ్టన్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన కొడుకుకి కొంత బుద్ధిమాంద్యం ఉండటంతో, అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఓ పాఠశాల పెట్టారు.


మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు బిల్‌గేట్స్ సత్య సామర్థ్యాన్ని గుర్తించి అబ్బురపడ్డారు. స్టీవ్ బాల్మేర్ తరువాత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ.గా 4 ఫిబ్రవరి 2014న బాధ్యతలు చేపట్టారు. పెళ్లయిన ఏడాదికే ఆ కంపెనీలో చేరిన సత్య, సంస్థకు అత్యధికంగా లాభాలు సమకూర్చే సర్వర్ టూల్ బిజినెస్ విభాగానికీ, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ విభాగానికి రెండింటి బాధ్యతలూ నిర్వహించడం విశేషం! భవిష్యత్ ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న ‘క్లౌడ్’ - ప్రత్యేకించి - ‘అజూర్’పై సత్యకు గొప్ప పట్టుంది.

తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలోని పరిణామాలూ, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాటి విషయాల మూలకందంగా - సత్య నాదెళ్ల రచించిన ఆంగ్ల గ్రంథం ‘హిట్ రిఫ్రెష్’. గ్రెగ్‌షా, జిల్‌ట్రసీనికోల్స్ అనే సహ రచయితల సహకారంతో, సత్య నాదెళ్ల రాసిన ఈ పుస్తకం ఈ సెప్టెంబర్‌లోనే విడుదలై పాఠకుల ఆసక్తికి ఆలవాలమైంది.

తొమ్మిది అధ్యాయాల్లో తన జీవన ప్రయాణం, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రస్థానం రెండింటి మేళవింపు ఈ గ్రంథం. అయితే మొదటి అధ్యాయాలంత ఆసక్తిగా తదుపరి అధ్యాయాలు కొందరికి ఉండకపోవడానికి - టెక్నికల్‌గా విషయ రచన సాగడం కారణం కావచ్చు. కానీ ఇందులో సత్య చెప్పిన విషయాలేవీ ‘సత్యదూరాలు’ కావు. తన వ్యక్తిత్వంలోని మార్పులనూ, సంస్థాగత పరిణామాలనూ వివరించిన తీరు ఆసాంతం ఆసక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ పనితీరును నిష్కర్షగా అధిక భాగం వివరించారు. ఇన్నోవేషన్ స్థానంలో బ్యూరోక్రసీ ప్రవేశించినప్పుడు - సృజనను అధికారం ఎలా కబళిస్తుందో, సంఘటిత కృషి విచ్ఛిన్నమై ఆఫీస్ రాజకీయాలు పనిచేసే సంస్కృతిని ఎలా దెబ్బతీస్తాయో ఈ పుస్తకంలో సత్య చక్కగా వివరించడం మాత్రమే కాదు, ఆ దురవస్థను అధిగమించిన తీరుతెన్నులను చక్కగా విశదపరిచారు.

ఒక సమయంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకన్న వెనుకబడి పోతూ వచ్చినప్పుడు మను కార్నెట్ అనే కార్టూనిస్టు మైక్రోసాఫ్ట్ సిబ్బంది గ్యాంగులుగా విడిపోయి, ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకుంటున్నట్టు గీసిన కార్టూన్ - తనను ఎలా కలవరపెట్టిందీ, ఒక అంతర్మథనంతో తాను - సంస్థ సంస్కృతిని పునరుద్ధరించవలసిన అగత్యం గుర్తించి, 2014 ఫిబ్రవరిలో సి.ఇ.ఓ. పదవి చేపట్టగానే సిబ్బందికి లేఖ రాయడం గురించీ పేర్కొన్నారు. నిజంగానే ఆ లేఖ ఒక గుణాత్మక సంచలనంగా చరిత్ర సృష్టించింది టెక్నాలజీ రంగంలో. సైకాలజిస్టు మైఖల్ జెర్వైస్‌చే మైక్రోసాఫ్ట్ కంపెనీ లీడర్‌షిప్ టీమ్‌కు అందింపజేసిన సలహాల వల్ల కలిగిన ఉపయోగాలను సత్య ఈ పుస్తకంలో ఆసక్తికరంగా చెప్పారు.

‘గొప్ప ఉత్పత్తులు చేయడం, వినియోగదార్లకు మంచి సేవలందించడం, మదుపు దార్లకు లాభాలు సమకూర్చడం ముఖ్యమే. కానీ అంతమాత్రం చాలదు. మనం తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మీద, పౌరుల భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయనేది కూడా వాణిజ్య సారథులుగా అంచనా వేయగలగాలి’ అంటారు సత్య టెక్నాలజీ అధినేతల గురించి.

నిజానికి వృత్తిలో తలమునకలై ఉండి కూడా, ఇలా తన అనుభవాలనూ, సంస్థాగత విషయాలనూ సత్య నాదెళ్ల గ్రంథస్థం చేయడం విశేషం! నిజానికి ఏ పదవీ విరమణ తరువాతనో అనుభవజ్ఞులుగా చెప్పే విషయాలను, ఒక బాధ్యతాయుతమైన సి.ఇ.ఓ. పదవిలో వుండి రాయడం విలక్షణతే కాదు, పనిచేసే సంస్కృతికి మంచి ప్రేరణ. యువ సాంకేతిక తరానికి మార్గదర్శనం. 


‘ప్రతి ఇంటా ప్రతి డ్రాయింగ్ రూమ్ బల్ల మీదా కంప్యూటర్ వుండాలనేదే’ మైక్రోసాఫ్ట్ తొలి నినాదం. ఇవాళ కంప్యూటర్ ఒక గృహోపకరణంగా మారింది. మొబైల్స్ ప్రవేశించి పర్సనల్ కంప్యూటర్స్ కూడా మందగించాయి. మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని విషయాల్లో వెనుకబడిపోయిందనీ, నేటి వినియోగదారుల అవసరాలను గుర్తించి వారికి తగిన ఉత్పత్తులను అందించవలసిన బాధ్యత ఈనాడు వుందనీ, మైక్రోసాఫ్ట్ రిఫ్రెష్ బటన్‌ను హిట్ చేయాల్సిన అగత్యాన్ని గుర్తించే ఈ పుస్తకం రాశాననీ పేర్కొన్నారు సత్య నాదెళ్ల. సి.ఇ.ఓ. అనే మాటలో ‘సి’ అంటే కల్చర్ అనీ, ఓ సంస్థ సంస్కృతిని కాపాడే క్యూరేటర్‌గా ఈ పదవిని భావిస్తానంటారాయన.

‘హిట్ రిఫ్రెష్’ అనే ఈ గ్రంథానికి బిల్‌గేట్స్ పీఠిక రాశారు. గత రెండు దశాబ్దాలకు పైగా సత్య తనకు తెలుసనీ, కంపెనీపై తన ముద్ర అవిస్మరణీయమనీ ప్రశంసించారు. తన తల్లిదండ్రులు, భార్య అను, తన పిల్లలు ఒక కుటుంబం అయితే, మైక్రోసాఫ్ట్ సంస్థ పరివారం అంతా మరో కుటుంబంగా భావించి - సత్య ఈ గ్రంథాన్ని ఆ రెండు కుటుంబాలకూ అంకితం చేశారు.

ఇతరులతో తాదాత్మ్యం చెంది అర్థం చేసుకోవడం, ఏదీ శాశ్వతం కాదనే ఎరుక కలిగి ఉండడం అనే బుద్ధుని బోధనల తాత్త్విక పార్శ్వం సత్య నాదెళ్ల ఈ రచనలో ద్యోతకమవుతోంది. మిక్సడ్‌రియాలిటీ, ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే మూడింటి ప్రధాన ఆలోచనా స్రవంతిగా ఈ రచన సాగింది.


 తన హైదరాబాద్ జ్ఞాపకాలను, తన క్రికెట్ క్రీడా ఉత్సుకతను, ఇండియన్ బ్యాట్స్‌మెన్ జయసింహపై గల తన అభిమానాన్ని, తన ఇరవై ఏళ్ల వయస్సులోనే అమెరికాకు వచ్చేయడం, అనూతో పెళ్లయ్యాక ఒక సమయంలో గ్రీన్‌కార్డు వదులుకుని స్వదేశానకి వచ్చేయాలనిపించిన మనఃస్థితినీ, మైక్రోసాఫ్ట్ రంగంలో గత అయిదేల్లలో ముఖ్యంగా పొడసూపిన పరిణామాలనూ ‘హిట్ రిఫ్రెష్’ గ్రంథంలో సత్య వివరించిన సంగతులు ఎంతో హృదయంగమంగా అలరించి, పాఠకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రపంచంలో టెక్నాలజీ రంగ భవిష్యత్తును గురించి కూడా ఇందులో చర్చించారు. తాను, తన కుటుంబం, తాను పని చేస్తున్న కంపెనీ, తన ప్రజలు, జీవిత ప్రయోజనం అనే అంశాలన్నింటి పట్లా అవగాహన, అభినివేశం, ఉపయుక్త ఆలోచనలు కలిగిన సత్య నాదెళ్ల ఒక అద్భుత టెక్నాలజీరంగ అధిపతిగానే కాదు, రచయితగా సకాలంలో ఉపయుక్త అంశాలను జనావళితో పంచుకునే సృజనకారునిగా కూడా ఈ పుస్తకంతో వ్యక్తం కావడం అభినందనీయం. సరికొత్త అధ్యాయాలను చేరుస్తూ ఎప్పటికప్పుడు ‘హిట్ రిఫ్రెష్’ను నవీకరించే అవకాశం ఉంది. సత్య నాదెళ్ల మున్ముందు ఆ సీక్వెల్స్‌ను అందించి, రాబోయే తరాలకూ స్ఫూర్తిదాయక మార్గదర్శిగా, దారి దీపంగా వెలుగొందాలని ఆశిద్దాం. ఈ పుస్తక పఠనంతో యువతరం స్ఫూర్తిమంతం కావాలని ఆశిద్దాం.
-సుధామ

హిట్ రిఫ్రెష్ (బిల్‌గేట్స్ ముందు మాటతో)
-సత్య నాదెళ్ల
హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్
195 బ్రాడ్‌వే, న్యూయార్క్
ప్రింటెడ్ అండ్ బౌండ్ ఇన్ ఇండియా బై థామ్సన్ ప్రెస్ ఇండియా లిమిటెడ్.
వెల: రూ.599



(4.11.2017 Saturday:Akshara)