ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 3, 2012

జంటపదాలు.. భాషకు సిరిసంపదలు


ఆమె ‘అందచందాలు’ ఎంతగానో నచ్చాయి. ‘ఊరూవాడా’ ఆ విషయం తెలుసు. ‘చీకుచింత’ లేకుండా ‘ఈడుజోడు’ అయి బ్రతకాలంటే ‘చేదోడువాదోడు’గా వుండాలి.

ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ వుండేవే. వీటిల్లో అందచందాలు, ఊరూవాడా, చీకుచింత, ఈడుజోడు, చేదోడువాదోడు వంటివాటినే ‘జంటపదాలు’ అంటాం.

ఇలాంటి జంట పదాలు ప్రయోగించడంలో గొప్ప సొగసువుంది. వట్టి సొగసు మాత్రమే కాదు ఎంతో అర్థవంతమైన భావవినిమయం వుంది. అందచందాలు అన్న జంటపదమే చూడండి. అందం అంటే సౌందర్యం. నిజానికి సౌందర్యం అనేది ఒక విధానంలో, రీతిలో సజావుగా వుండాలి. చందము అన్నదానికి విధము, రీతి, ప్రకారము అని అర్థం. అందం చందం రెండూ వున్నప్పుడే పూర్ణత్వం. చందము అన్నదానికి కర్పూరం అనే అర్థం కూడా వుంది. బంగారానికి తావి అబ్బినట్లు అంటూంటాం. అలాగే సౌందర్యం పరిమళవంతం అయితే విలువ ఎక్కువ. అందచందాలు అనడంలో అంత విశేష అర్థస్ఫూర్తి వుంది.
మన భారతీయ సంప్రదాయంలో దాంపత్య బంధానికి ఎంతో విలువ. అందునా స్ర్తికి ప్రథమస్థానం. ‘భార్యాభర్తలు’, ‘అమ్మానాన్న’ వంటి జంట పదాలను ప్రయుక్తం చేయడంలోనే కాదు సీతారాములు, ఉమామహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు వంటి వాటిని కూడా జంటపదాలుగా వ్యవహరిస్తూ స్ర్తిని ప్రథమగణ్యగా ఉటంకిస్తూంటాం.

జంటపదాలులో ‘తికమక’ ఏం లేదు. భావనలను ‘తారుమారు’ చేయదు. జంటపదాల ‘తళుకుబెళుకు’ల్లో ‘ఎగుడుదిగుడు’లు ఏమీ ఊహించనవసరంలేదు. ‘మాటామంతీ’లో జంటపదాలు ‘ముందువెనుక’లు చూసి ప్రయోగించుకుంటే, ‘చదువు సంధ్యలు’లో వాటి ఉపయుక్తం గ్రహించుకుంటే మన భావాభివ్యక్తి ‘బాగోగులు’ జంటపదాలు చూసుకోగలుగుతాయి.

సుఖ దుఃఖాలు, సిరిసంపదలు, కలిమిలేములు, పాపపుణ్యాలు, చీకటి వెలుగులు ఇవన్నీ జంటపదాలే. కొన్ని జంటపదాలు ఒక అంశం యొక్క ఇరుపార్శ్వాలను ప్రతిబింబించేవయితే, మరికొన్ని ఆద్యంత సమాహారాన్ని సూచించేవి. ఇంకొన్ని సమర్థక, వ్యతిరేకార్థక సమన్వయ సూచికలు. ‘కష్టసుఖాలు’ జీవితం ఇరు పార్శ్వ ప్రతిబింబకాలు. ‘సూర్యచంద్రులు’ అన్న జంటపదం ఒక రోజు యొక్క ఆద్యంత సమాహారమే. ‘మంచిచెడు’ అనేది సమర్థక వ్యతిరేకార్థక జంటపదమే.

రూపురేఖలు, వేషభాషలు, వేళాపాళా, సిగ్గు ఎగ్గు, కూలీనాలీ, ఇంచుమించు ఇలాంటి జంటపదాలన్నీ విరివిగా వింటూనే వుంటాం. ‘ఇంచుమించు’ అన్న జంటపదంలో ఇంచు అన్నదానికి అల్పత్వము, న్యూనత్వము, ఇంచుకతనము అని అర్థం కాగా, ‘మించు’ అన్నదానికి ఒప్పు, శోభిల్లు, అతిశయించు, తళతళ మెరియు అనే అర్థాలున్నాయి. కానీ ‘ఇంచుమించు’ అని వాడినప్పుడు రమారమి, ఎక్కువ తక్కువగా అనే రూఢ్యర్థంలోనే వాడుతున్నాం. అదీ దీని సొబగు. ఇంచు అన్నదానికి చెఱకు అనే అర్థం కూడా వుండడంవలన చెఱకు విలుకాడు అయిన మన్మధుడిని ఇంచువిల్తుడు అనడమూ వుంది. సరే! అది వేరు సంగతి.
‘చిటపట’లాడాడు, ‘గడబిడ’ చేసాడు ‘చీటికిమాటికి’ గుర్తుచేస్తున్నాడు, ‘పాపపుణ్యాలు’ దేవుడెరుగు, ‘మూటముల్లె’ సర్దుకున్నాడు ‘కట్నకానుకలు’ కోసం ‘కోపతాపాలు’ చూపడం, ‘అవాకులు చెవాకులు’ పలకడం సరికాదు. ఇలా వాక్యాలు జంటపదాలు ఎన్నిటినో ప్రయోగించడం జరుగుతూనే వుంటుంది.

జంటపదాలు విడగొట్టి మొదటి పదానికి అర్థం రెండోపదానికి అర్థం విడివిడిగా చూసుకుంటే కనబడే సొగసులు వేరు. ఒకటిగా ఆ జంటపదం ప్రయుక్తం అయినపుడు ఒక్కోసారి ద్యోతకమయ్యే సొగసు వేరు. శ్రద్ధ్భాక్తులు, భయభక్తులు, ధనధాన్యాలు, ధూపదీపాలు, పేరుప్రతిష్ఠలు, భోగభాగ్యాలు అంటూ ఇలా జంటపదాలు అనేకం వున్నాయి. ఏ రెండుపదాలు పడితే ఆ రెండు పదాలు కలిపేస్తే జంటపదాలు అయిపోతాయనుకుంటే పొరపాటు.

జంటపదాల నిర్మితిలో ఓ సొబగు వుంది. అది భాషలో విలక్షణమైనది, విశిష్టమైనది కూడాను. కూడుగుడ్డ, ఇల్లూ వాకిలి, ఉప్పుపప్పు, ఉలుకు పలుకు, ఇంపుసొంపు, గొడ్డుగోద, చెట్టుచేమ ఇలా జంటపదాలు గురించి ‘చాటుమాటు’ కాక ‘చేదునిజాలు’గానే భాషాసౌందర్యాన్ని ‘తప్పుఒప్పులు’ లేకుండా పట్టుకోవచ్చు.

భాషలోని ఈ జంటపదాల సౌందర్యం కూడా ‘అతీగతీ’ లేకుండా పోయే పరిస్థితి రాకుండా ఇవాళ మనం ప్రసార మాధ్యమాల్లో యాంకరింగ్ అని చెప్పుకునే వ్యాఖ్యానాల్లో సందర్భోచితంగా చేర్చి ప్రయోగిస్తుంటే తెలుగు సౌందర్యం తేజరిల్లడమే కాదు నిజంగా శ్రవణంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి. యాంకర్ విజయానికి ఇవి ‘అండదండలు’గా వుండగలుగుతాయి.

‘ఆదరాబాదరా’ కాకుండా సావకాశంగా జంటపదాలును అధ్యయనం చేసి చూడండి. వాటి ‘బాగోగులు’ అర్థమవడమే కాదు భాషకు అది ఎలాంటి ‘సిరిసంపదలు’ అయి నిలుస్తున్నాయో కూడా తెలుస్తుంది. భాషలోని సొగసు పార్శ్వాన్ని అందివ్వడమే ఇక్కడి వంతు. అల్లుకుపోవడం భాషాభిమానులైన అందరి తంతు. ఏమంటారు.

నుడి(3.3.2012)

12 comments:

www.apuroopam.blogspot.com said...

మంచి విషయమే చెప్పారు బాగుంది. ఇంకా చాలా జంట పదాల్ని పరిచయం చేయాలి. అందం చందంలో చందానికి విధము అంటే ప్రవర్తించే తీరు అని అర్థం తీసుకోవాలి.కేవలం అందంగా ఉంటే చాలదు ప్రవర్తించే తీరు కూడా బాగుంటేనే శోభిస్తుందని అందం చందం అంటారు. అలాగే చేదోడు వాదోడు అన్నప్పుడు వాదోడు అంటే వాక్కుతోడు--మాట సాయం అన్నమాట.చేతి సాయం మాట సాయం కలిపి చేదోడు వాదోడు అయ్యాయి.భాష లోని నిసర్గ సౌందర్యాన్ని ఇటువంటి పదాలు సామెతల ద్వారా యువతరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సుధామ said...

ధన్యవాదాలు గోపాలకృష్ణ గారూ!.మీరన్నట్లు నేటి యువతకు వాచవిగా పరిచయంచేయడంకోసమే ఇది. .మీ వంటి పెద్దల చేదోడువాదోడు లభించినప్పుడే నిజంగా మరి అందంచందం.

సో మా ర్క said...

సుధామ గారూ!చక్కని జంట పదాలను పరిచయం చేశారు.నేటి యువతకే కాదు విద్యార్ధులకు బాగా తెలియాలి.మంచి ప్రయత్నం!

సుధామ said...

ధన్యవాదాలు సో మా ర్క గారూ!

ఏల్చూరి మురళీధరరావు said...

సుధామ గారూ!

మీ బ్లాగును ఈ రోజే చూశాను. చాలా బాగుంది.

భిన్నమూలాలై ఏకార్థీకృతాలైన జంటపదాలను, తదన్యంగా ఇతరేతరయోగం ఉన్న ద్వంద్వపదాలను ఆకృతిగణంగా పరిగణించారు కాని, చక్కని జంటలను పరిచయం చేశారు.

మీ వ్యాసం చదువుతున్నపుడు - సంప్రదాయవాదులు నాస్తికతను విమర్శించటం కోసం అవాక్కులు చార్వాకులు అన్నదే అవాకులుచెవాకులు అయిందేమో అనిపించింది.

సుధా - ధామ జంటపదాలు ఏకపదమైతే సుధామ అనవచ్చునా?

ఏల్చూరి మురళీధరరావు

సుధామ said...
This comment has been removed by the author.
సుధామ said...

మురళి గారూ! నమస్కారం. మీ పాండితీ గరిమ ముందు నేను వినమ్రుడిని. యువత కు తెలుగు భాషపట్ల అభిరుచి పెంచడానికి వాచవి గా మాత్రమే పునశ్చరణ చేస్తున్న చిరు ప్రయత్నం ఇది.మీ అభిమానానికి సదా అథమర్ణుడిని.

మరువం ఉష said...

సుధామ గారు, చెప్పిన మంచి విషయాలకి కృతజ్ఞతలు. ఒక్క సందేహం తీర్చగలరని ఇక్కడ పెడుతున్నాను. నేను రాసుకున్న జంటపదాల్లో ఎడాపెడా/ఎడపెడ, చెడమడ ఉన్నాయి. చెడామడా జంటపదమా కాదా అన్నది తెలీట్లేదు. అలాగే శ్రీ Muralidhara Rao Elchuri గారు తన అభిప్రాయంలో "భిన్నమూలాలై ఏకార్థీకృతాలైన జంటపదాలను, తదన్యంగా ఇతరేతరయోగం ఉన్న ద్వంద్వపదాలను ఆకృతిగణంగా పరిగణించారు" అన్నదానిపై ఇంకాస్త అధ్యయనం చేయాలని నాకు ఆసక్తి కలిగింది. మీకు తెలిసిన సమాచారం/పుస్తకాలు తెలుపగలరా?

(ఈ వివరాలు కాస్త సమాచారానికే: వృత్తిరీత్యా ఐటీ రంగంలో ఉన్న నాకు తెలుగు భాష మీద ఎక్కువ పట్టు లేదు. 'మరువం' బ్లాగులో మునుపు భావ/అనుభూతి కవిత్వం రాసుకునేదాన్ని. నేను చికాగో ప్రాంతాల్లోని 5-15 ప్రాయపు పిల్లలకి తెలుగు నేర్పుతున్నాను. ప్రస్తుతం "గలాగలా, భగభగ" వంటి పదాలు విశేషణాలుగా ఎలా వాడొచ్చో చెప్తున్నాను. తర్వాతి పాఠం జంటపదాల మీద రాస్తూ, అలా సమాచారం వెదుకుతూ ఇటూగా వచ్చాను.)

ఏల్చూరి మురళీధరరావు said...

అమ్మా,

నా వాక్యానికి స్పందనగా మీరడిగిన ప్రశ్నకు ఆఱేడు దళాలలో సమాధానం వ్రాసే ప్రయత్నం చేస్తాను.

1. సాధారణంగా జంటపదాలలో అనుప్రాసయుక్తములైన రెండు పదాలుంటాయి. కొంపా గోడూ; అభమూ శుభమూ; అన్నెం పున్నెం మొ।।

2. అర్థం చెప్పవలసి వస్తే మొదటి పదం అర్థమే రెండవ పదానికీ వర్తిస్తుంది. “పిల్ల మేకా”లో రెండవ పదానికి ఉన్న విశిష్టార్థం మొదటిదానితో కలిసిపోతుంది.

3. ద్వంద్వసమాసాలన్నీ జంటపదాలు కావు. రెండు పదాలకూ వేర్వేఱు అర్థాలుండి, రెండిటి వేర్వేఱు అన్వయమూ ఉంటే అవి జంటపదాల పరిధిలోకి రావు. “పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి” అంటే – తల్లిదండ్రులు జంటపదం కాదు. జంటలున్నంత మాత్రాన జంటపదాలు కావు. “సిరిసంపదలు” అన్నప్పుడు సిరులు-సంపదలు అర్థాలు ఒకటైపోతాయి. వేఱు అర్థాలలో ప్రయోగిస్తే అది ద్వంద్వసమాసం మాత్రమే.

4. మీరడిగిన “ఎడా పెడా” అన్నది “పదే పదే”, “అనేకపర్యాయాలు” అన్న అర్థంలో జంటపదాలే. “ఎడమ వైపు, కుడి వైపు చూసుకొంటూ నడిచాను” అన్న అర్థంలో వ్యస్తంగా వాడితే అవి జంటపదాలు కావు.

5. మీరన్న “చెడా మడా” వంటివి అన్యదేశ్యాలైన వాడుకలు. అవీ జంటపదాలే.

6. “అవాకులు చెవాకులు”, “గాసట బీసట” వంటి జంటపదాలలో రెండు అర్థాలూ ముఖ్యమైనవే అయినా – ఆ రెండింటికి తాత్పర్యంగా వేఱొక వ్యంగ్యార్థాన్ని గ్రహించటం పరిపాటి. వాటి అర్థాలను మీరు గుర్తించి విద్యార్థులకు నేర్పితే పాఠం ఆసక్తిదాయకం అవుతుంది.

7. ధ్వన్యాద్యనుకరణ శబ్దాలన్నీ జంటపదాలే. “గణగణ”, గుసగుస” మొదలైనవి. వీటి అర్థాలు అనేకవిధాలుగా ఏర్పడి ఉండవచ్చును. వ్యుత్పత్తి తెలిసిన కొద్ది మీకు ఆ జంటపదాల అవసరం, “అందచందాలు” అనుభవంలోకి వస్తాయి.

శ్రీ సుధామ గారి చక్కటి ఈ వ్యాసం మీ వంటి విద్యాబోధకులలో ఆసక్తిని కలిగించినదంటే – వ్యాసరచనోద్దేశం సాఫల్యాన్ని సంతరించికొన్నట్లే.
మీ విద్యార్థిత్వానికి, మీలోని విద్యార్థిత్వాన్ని మేలుకొలిపిన విద్వత్తల్లజునికీ నా అభినందనలు.

ఏల్చూరి మురళీధరరావు

మరువం ఉష said...

సుధామ గారూ, ముందుగా నా సందేహం తీరటానికి ఇలా శ్రద్దగా మురళీ గారిని సంప్రదించినందుకు కృతజ్ఞతలు.

ధన్యవాదాలు మురళీధరరావు గారూ! ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలుగు భాషపట్ల అభిరుచి, ఆసక్తి పెంచడానికి, పంతుల గోపాల కృష్ణ గారు వ్యక్త పరిచినట్లుగా భాషలోని సౌందర్యాన్ని సరళమైన పద్దతుల్లో (కథలు, నాటికలు) పరిచయం చేస్తూనే, నా అవగాహన, పరిజ్ఞానం విస్తృతి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. మీరిచ్చిన వివరాలు చాలా ఉపయోగం నాకు.

సుధామ said...

అది మురళి గారి ఔదార్యం తప్ప నా గొప్ప కాదు ఉష గారూ!

HANUMAN BANDREDDI said...

తెలుగు భాషాపండితులకు వందనములు.జంట పదాలు గురించి వివరంగా చెప్పారు.
1.'బాగోగులు' అనే పదంలో రెండు పదాల కలయిక ఉందా?
2.మాటలలో వాడే 'బడీగిడీ','నీళ్లూగీళ్లూ' వంటివి జంట పదాలేనా?దయచేసి వివరించగలరు.