ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, April 24, 2011

శ్రీవిరించి 'ఉద్యోగంకోసం'







ఉద్యోగం కోసం
(రచన: శ్రీ విరించివెల: రూ. 100/-ప్రాప్తిబుక్స్, పోస్ట్‌బాక్స్ నెం. 5018బిసెంట్‌నగర్ , మద్రాసు-60090)




రేడియో రచన అనేది ఒక ప్రత్యేక కళ.



అందునా రేడియో నాటికలు, రూపకాలు విషయానికి వస్తే మరీను.






రేడియో శ్రవ్య మాధ్యమం కాబట్టి నాటికలో అంతా వాచ్యంగానే పాత్రల సంభాషణాదులతో రూపుకట్టించాలి. రంగస్థలం మీదవలె సుదీర్ఘ సంభాషణలు సరికావు. పాత్రల హావభావాలు కనబడవు. కనుక రేడియోలో వినబడేలా పాత్రధారులు ఆ రసభావాలను గొంతులోనే పలికించగలగాలి అంటే తదనుగుణంగా సంభాషించేందుకు కూడా ధ్వనులూ, మాటలే ఉపకరించాలి. అలాగే రూపకాల విషయంలోనూ..




రేడియో రూపకాల్లో ఒక్కొక్కసారి పాత్రలు అంటూ ప్రత్యేకించి ఉండవు. ఒకటవ గొంతు, రెండవ గొంతు అన్న విధంగా విషయగత రూపకాన్ని మిగడించి వివరిస్తూ డాక్యుమెంటరీ పద్ధతిలో నడుమనడుమ నేపథ్య సంగీతం, ధ్వనులు, నిర్దేశిత వాస్తవ వ్యక్తుల స్వరాలు వంటివి వినిపించడం జరుగుతుంది. అందువల్ల రేడియోలో నాటికలయినా రూపకాలయినా శ్రవ్య సంబంధులే.రేడియో నాటకాల్లో, రూపకాల్లోని మరొక విశేషజ్ఞత ఏమిటంటే రంగస్థలంమీద చూపలేని సముద్రంలోని నౌకా ప్రయాణ కథలు, విమానయాన ఇతివృత్తాలు, అలాగే ప్రకృతి బీభత్స నేపథ్య గాధలు వంటివాటిని కూడా కడునేర్పుగా, రసోద్దీపకంగా శ్రోతలకు చేరవేయగల అవకాశం ఉంది.




రంగస్థల నాటకానికీ, దృశ్య నాటకానికీ రచనలో కల తేడాను నాటకరచయితలు స్పష్టంగా గ్రహించగలగాలి. రంగస్థల నాటకాన్ని రేడియోకి అనుగుణంగా మార్చగల వీలుంటుంది కానీ, అద్భుతమైన రేడియో నాటకాన్నో, రూపకాన్నో రంగస్థలానికనుగుణంగా అంటే మొత్తం తిరగరాసుకోవాల్సిందే ఒక్కోసారి.




1958 నుండి 1994 మధ్యకాలంలో కథారచయితగా ప్రముఖులైన శ్రీవిరించి భారతి, తెలుగు స్వతంత్ర వంటి పత్రికలకు రాసినవి, ఆకాశవాణి మద్రాసు, కొత్తగూడెం కేంద్రాల్లో ప్రసారానికి రాసిన అపురూపకాలు - శ్రవ్యనాటికలను ‘ఉద్యోగం కోసం’ పేరిట గ్రంథ రూపంగా ప్రకటించారు. సీరియస్‌కథా రచయితగా జిడ్డుకృష్ణమూర్తి ఆధ్యాత్మిక భావధార గలవారిగా గుర్తింపబడిన శ్రీవిరించిలోని హాస్యాత్మక పార్శ్వాన్ని కూడా ఈ శ్రవ్య నాటికలు కొన్నింటిలో చూడగలం.నిరంతర సత్యానే్వషి పేర జిడ్డుకృష్ణమూర్తి ఫిలాసఫీని రేడియో రూపకంగా మలచిన తీరు గంభీరమైన విషయాన్ని శ్రోతృజనరంజకంగా మలచడం అభినందించదగిన విషయం.




రేడియో నాటికలు కొన్నింటిలో ‘లోనికివచ్చిన చప్పుడు’, ‘ఇద్దరూ వెళ్లిన చప్పుడు’ వంటి బ్రాకెట్లలోని కొన్ని సూచనలు తమాషాగా అనిపించినా రచయితగా శ్రవ్యనాటికకు అవసరమైన ధ్వనులను స్వరస్థాయిలను నాటిక నిర్వాహకులకు పాత్రధారులకు నిర్దేశించి చూపడం అభినందనీయమైన అంశమే. రచనాకాలాన్ని, ప్రసార తేదీలను కూడా సూచించి వుంటే బావుండేది.




‘తప్పనిసరి అతిథి’ వంటి ఇతివృత్తాలు రేడియోనాటికల్లో మామూలేగానీ ‘నీడలజాడలు’ వంటివి విలక్షణంగా ఉన్నాయి. ‘జాతక ప్రభావం’ ఆంధ్ర ప్రభలో ప్రచురితమైన నాటకం. ఆఫీసు నేపథ్యంలో సాగే విషయం. శ్రీవిరించిగారి నాటకాల్లో ముఖ్యంగా పాత్రోచిత సంభాషణలు జనరంజక వైఖరి బాగా కనిపిస్తాయి. చదువరులకు, శ్రోతలకు ఆహ్లాదం కలిగించిన ఆనాటి ఈ రచనలను ఇలా పుస్తకరూపేణా రికార్డు చేయడం సంతోషం.-సుధామ

0 comments: