ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 14, 2013

పీఠికలూ-కథలూ




ఒకటేమిటి.. అరచేతి అద్దంలో.. అన్నీ





ఒక పుస్తకానికి పీఠిక సంతరించడం అంటే ఆ రచనను, రచయితనూ ‘అరచేతిలో అద్దంలో’ చూడడంగానే సంభావిస్తారు పోరంకి దక్షిణామూర్తిగారు. దాదాపు నలభై మంది రచయితలు కోరిన మీదట వారి వారి గ్రంథాలకు రాసిన పీఠికలను గ్రంథస్తం చేస్తూ దానికి ‘అరచేతి అద్దంలో..’ అని పేరుపెట్టారందుకే. వేదగిరి రాంబాబు, టి.శ్రీవల్లీరాధిక, డా.ఆర్.ఎం.వి.రాఘవేంద్రరావు, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, కాలువ మల్లయ్య, శ్రీ మామునూరి నరసింహారావు, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి, పోలవరపు కోటేశ్వరరావు, గంటి భానుమతి, కందుకూరి వెంకట మహాలక్ష్మి, ఎ.సూర్యప్రకాశ్, శైలజామిత్ర, పింగళి వెంకటరమణరావు, కస్తూరి అలివేణి, ఇల్లిందల సరస్వతీదేవి, మునిపల్లెరాజు, శ్రీపాద, ఎన్.తారక రామారావు, మురయా, యర్రమిల్లి మల్లికార్జునుడు, అవసరాల రామకృష్ణారావుగార్ల కథాసంపుటాలకు పోరంకివారు పీఠికలు సంతరించారు. సీనియర్ కథకులు, కథానిక మీద సాధికారిక సిద్ధాంత గ్రంథం వెలయించిన వారు కావడంవల్ల కథకులు పోరంకి వారి ముందు మాటలు ఆశించడం సహజమే. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలకు, కవితా సంపుటికి కూడా పోరంకి వారి పీఠికలు వుండడం ఇందులోని విశేషం. కొత్త కథకులను ప్రోత్సహిస్తూ పీఠికలు రాయడంతోపాటు ఈసరికే ప్రసిద్ధులైన వారి గ్రంథాలకు పీఠికలు రాస్తూ బేరీజు వేయడం వీటిల్లో గమనించగలం. పోరంకి వారి పీఠికలు ఆయా రచయిత/త్రులతోటి తమకుగల ఆత్మీయతనూ ఆ పరిచయాల పూర్వాపరాలను కూడా స్పర్శిస్తూ ఆత్మీయంగా సాగుతాయి. కథల గురించి చెప్పేదానికన్నా ఆ కథకుల గురించి చెప్పేదే విశేషంగా ఆకట్టుకునే తావులూ ఉంటాయి. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి ‘నా రేడియో అనుభవాలు-జ్ఞాపకాలు’ గ్రంథానికి, కాశీ మజిలీ కథల మీద గంధం సుబ్బారావు గారి పిహెచ్‌డి పరిశోధనా గ్రంథానికీ రాసిన పీఠికలు వైవిధ్యభరితమైనవి. పీఠికలకు పోరంకివారు పెట్టే శీర్షికలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ‘ఇదిగో, ఇందుకు’, ‘వారూ వీరూ ఒకరేట’, ‘గురి దీపంలో నారీమణి’, ‘తక్కువేమి మనకు’, ‘లోలోపలి చీకటి వెలుగులు’, ‘అంతేమరి’, ‘ఏముక్కకాముక్కే చెప్పుకోవాలి’, ‘ఎవరయా మురయా?’ వంటి శీర్షికలు పెట్టడం నిజంగా కథకునిగా సుప్రసిద్ధులైన పోరంకి వారికే చెల్లింది. ఈ పీఠికలు చదువుతున్నప్పుడు కేవలం ఆ పుస్తకాంశం గురించి మాత్రమే కాకుండా ఆయా రచయితలతో, ఆయా రచనల నేపథ్య అంశాలతో పోరంకి వారికి వున్న విశేష పరిచితి, గాఢానుభవాలు, జ్ఞాపకాలు కూడా పాఠకులకు అందుతాయి. అందువల్ల ఈ పీఠికలు అరచేతి అద్దంలో అనేక ఆత్మీయ మానవీయ అంశాలను కూడా స్పృశిస్తూ ఆకట్టుకుంటాయి. అవసరాల రామకృష్ణారావుగారి ‘పేక ముక్కలు’ గ్రంథానికి పీఠిక రాస్తూ ముగింపులో ‘వస్తువు, శిల్పం, భాషా శైలి అన్న కథాంశాలతో మూడు ముక్కలాట ఆడటంలో అవసరాల రామకృష్ణారావుగారు బహు నేర్పరి అనీ కడుగడుసరి అనీ నేను చెప్పాలా?
అన్నట్టు నాకు తెలియకడుగుతాను- చీట్ల పేకలో ఎక్కడైనా ఏభై రెండు తురఫు ముక్కలే ఉంటాయా?’’ అని ముగిస్తారు. పీఠికలను సంతరించడంలో పోరంకివారు బహు నేర్పరి కడు గడసరి అని ఈ ‘అరచేతి అద్దంలో’ మనకు చక్కగా కనపడుతుంది. ఇంకేం కావాలి?



అరచేతి అద్దంలో
(కొన్ని పుస్తక పీఠికలు)
-పోరంకి దక్షిణామూర్తి
ప్రతుకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ రోడ్,
కాచిగూడ చౌరస్తా,
హైదరాబాద్-27
వెల: రూ. 140/-

*

అనగనగా..దీక్ష



ఇరవై కథల ‘దీక్ష’ కథా సంపుటి కథకులు సూర్యప్రసాదరావుగారు వెలువరించింది. ఆయన జంతు శాస్త్ర అధ్యాపకులు అయినా ‘మేన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్’ కనుక, మానవ స్వభావాలను కూడా బాగా పట్టుకున్న వారు. సద్భావ సందేశ వైఖరి ఆయన లక్షణం. పాతివ్రత్యానికి భర్త ఎన్ని పరీక్షలు పెట్టినా సహించిన అరుంధతి పౌరాణిక పాత్రనూ ‘సడా ఉపవాసి’ అనిపించుకున్న విశ్వామిత్రుడూ, ‘అస్ఖలిత బ్రహ్మచారి’ అనిపించుకున్న వశిష్టుడూ ఎలా తమ దక్షతను చూపుకున్నదీ ఆ వైనాన్ని కథా సంపుటి పేరిట ‘దీక్ష’ కథలో చిత్రించారు. దేవుడు మీద నమ్మకం లేకపోయినా భార్యకు వున్న విశ్వాసాలను మన్నిస్తూనే ఆమె మూఢ నమ్మకాల్ని ఆమెచేతే గుర్తింపచేసిన కథ ‘మాధవ సేవ’. ఓ తాత తన అనుభవాలూ అనుభూతులనే కథ చెప్పమన్న చిన్నారులకు అనగనగా ఒక రాజు! ‘ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’ అంటూ చెప్పడం నేపాల్ రాజు మహేంద్ర కథను తద్రూపంగా విశే్లషించడం ఓ కథలో చూస్తాం. ‘అంకితం’ అమరగాయకుడు ఘంటసాల గారికి అంకితంగా రాసిన కథ. ఈ కథలో ఊర్మిళ పాత్ర ఘంటసాల అర్ధాంగి సావిత్రిగారిని తలపింపచేస్తుంది. ఎవరి పాటవల్ల మహానటుడి నటనకు బంగారానికి తావి అబ్బినట్టయిందో అటువంటి మహానటుడి అభిజాత్యాన్ని, అంతకన్నా ఒక ఆటోవాడి అసలైన ఆరాధనా భావాన్ని విశదపరిచే ఈ కథ ఎన్నో సంవత్సరాలు అచ్చుకు నోచుకోక తిరిగి వచ్చి ఈ సంపుటిలో ప్రత్యేకించి చోటు చేసుకుంది అని రచయితే చెప్పుకున్నారు. ఒక మహానటుడిపై విమర్శలా గోచరించడమే బహుశా అందుకు కారణం కావచ్చు. కానీ నిజానికి కథాంశం కటిక వాస్తవం. తెలుగు భాషపై మక్కువ చూపే కథ ‘దక్షిణ’. పబ్బం గడుపుకోవడానికి అవతలివారిని ‘దేవుళ్లు’ అనే నైజాన్ని విశదీకరించే కథ ‘దేవుళ్లు’. పరిష్వంగం, నిరుపేద, కృతజ్ఞత వంటి కథలు కూడా ఆకట్టుకుంటాయి. ‘మిమిక్రీ’ ప్రకృతి సహజంగా రాణించడం చూపిన ఎలమంద కథ కూడా బాగుంది. ఈ కథల్లో సూర్యప్రసాదరావుగారు సినిమా పాటల పంక్తులను ఉటంకించడం కూడా కొన్నింటిలో సందర్భోచితంగా రాణించింది. మానవ సంబంధాలలోని లోటుపాట్లను సున్నితంగాను, వ్యంగ్యంగాను చెబుతూ మంచికి ప్రోదు చేసే సరళ భావ ప్రాతిపదకాలుగా ఈ కథలు చదివిస్తాయి.

  • -సుధామ

దీక్ష (కథాసంపుటి)
-సూర్యప్రసాదరావు
స్వరాజ్యలక్ష్మి ప్రచురణలు
5-6-18/బి, పాకబండ బజార్, పెట్రోల్‌బంక్ వెనక,
ఖమ్మం -507001
వెల: రూ. 100/-







0 comments: