‘‘ఏం పండగల్లేవోయ్’’ ప్రసాదూ! నన్నడిగితే పండుగ నాడు దండగ ఎక్కువవుతూంటుంది అంటాను నేను. నువ్వు పండగ అంటే ‘అదనం’ అన్నావ్ చూడూ! ఆ అదనంవల్లే ‘వృథా’జరుగుతుంది. మన పెద్దలు అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. కంచం ఊర్చుకుని మరీ భోంచేయాలనీ, ఏదీ పారేయకుండా తిని, తిన్నాక కూడా కంచం శుభ్రం గాముందులా కనబడితే అలా తిన్నవారికి మరింత ఐశ్వర్యం అబ్బుతుందనీ మా అమ్మమ్మ అంటూండేది. అసలు ‘మారువడ్డన’ లేకుండా ముందే కావలసినంత పెట్టించుకు తినేవాడు మా మామయ్య. కొందరు భోంచేసాక చూస్తే ఆ విస్తరో, కంచమో వదిలేసిన ఆహార పదార్థాలతో ‘తిన్నది కన్నా పారేసిందే ఎక్కువ’ అన్నట్లు కనబడుతూంటాయి. నిజానికి వృథా అవుతున్న ఆహారం గురించి తలుచుకుంటే బాధవేస్తుంది. తినడానికి పట్టెడన్నం దొరకక ఆకలితో అలమటించేవారు కోట్లాదిగా ఒకపక్కనుండగా, విందులూ వినోదాల పేరునే కాదు మామూలుగా దినసరి భోజనంలోనూ తినకుండా పదార్థాలు వదిలి పారేసేవారున్నారు. నిజానికి వారు మిగిల్చింది ముందుగా దక్కినా కడుపునిండి కళకళలాడగలవారు కోట్లాదిగా వున్నారంటే అతిశయంకాదు’’ అన్నాడు శంకరం.
‘‘నువ్వన్నది నిజం శంకరం! ఈమధ్యే నేనూ చదివాను ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోందనీ, ఎవరికీ దక్కక మట్టిపాలవుతోందనీ యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ. అంటే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఆహార ఉత్పత్తిలో సగం మటుకే సద్వినియోగం అవుతూ మిగతాది పలురకాలుగా వేస్ట్ అవుతోంది. అంతెందుకు ఒక్క మన భారతదేశంలోనే ప్రతి ఏడూ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువచేసే ఆహారం చెత్తకుండీల పాలవుతోంది. వృథా అవుతున్న తిండి గురించి తెలుసుకుంటే నిజంగా మానవత్వం వున్నవారెవరికైనా బాధవేస్తుంది. దేశంలో ప్రతిరోజూ ఇరవై కోట్లమంది జనాభా కాలే కడుపులతోనే రాత్రి నిద్రిస్తున్నారు. కడుపులో ఆకలి మంట నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వదు. క్రిందటి సంవత్సరం 70 లక్షల మంది పిల్లలు సరైన తిండి లేకనే చచ్చిపోయారని ఒక అధ్యయనం ఋజువు చేసింది. మన హైదరాబాద్ నగరంలోనే రెండువందల టన్నుల ఆహారం వృథా అవుతోందిట’’ అన్నాడు రాంబాబు ఆర్తిగా.
‘‘అవును రాంబాబూ! పెళ్లిళ్లూ, వేడుకల సందర్భంగా విందుల్లో అయ్యే వృథా అంతాఇంతా కాదు. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ చేసిన ఒక సర్వేలో బెంగుళూరులో జరుగుతున్న వివాహవేడుకల్లో ఏటా 943 టన్నుల ఆహారం వృథాఅవుతోందని తేలింది. ఇవాళ పార్టీలన్నీ అధిక శాతం ‘బఫే’లే! నిజానికి ‘బఫే’లో ఎవరికివారు వడ్డించుకు తినడమే! అయినా భేషజాలకుపోయి తినేదానికన్నా ఎక్కువ వడ్డించుకుని వృథాగా పారేయడం జరుగుతూంటుంది. ‘బఫెట్’లో ఇరవై రెండు శాతం, సంప్రదాయ వడ్డనల్లోనూ ఇరవై శాతం భోజనం వృథా అవుతోందిట. ఇంత ఆహారం మిగిలిపోతున్నా ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు తిండి లేక దొరకక బాధపడుతున్నారంటే ముద్ద తినేముందు ప్రతి ఒక్కరూ నిబద్దిగా ఆలోచించనక్కర్లేదా’’ అన్నాడు శంకరం.
‘‘అన్నపురాసులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట
హంస తూలికలొకచోట
అలసిన దేహాలొకచోట’’
అంటూ ప్రజాకవి కాళోజీగారు ‘వ్యత్యాసాలు’ గురించి మానవ వేదన అభివ్యక్తంచేసారు. ఇదంతా తెలిసీ నేటి సమాజం ‘లైట్ తీస్కో’అంటే కుదరదు. ఒకప్పటి తరంతో పోలిస్తే ఈ తరం ఆర్థికంగా మంచి స్థాయిలోనే వుంటున్నారు. యువతరం తలుచుకుంటే ఇటువంటి విషయాల్లో అభ్యుదయదాయకంగా ఆలోచించి ఆచరణలో ముందడుగు వేయగలదు. అన్నార్తులను ఆదుకోవాలనే ఆర్తి వుంటే తమ వృథాను యువత అరికట్టుకోగలదు. అదేం పెద్ద కష్టంకాదు’’ అన్నాడు ప్రసాదు.
‘‘నేటి యువతలో సదాశయ సాధకులూ వున్నారు ప్రసాదూ! అంతగా నైరాశ్యం అక్కర్లేదు. కానీ వారికి ప్రోత్సాహం, చేయూత ఇచ్చి ఆ ఆశయ సాధనలో వారికి తోడ్పడగలగాలి. అంతెందుకు ఉదాహరణకు హైద్రాబాద్లోని ‘గ్లోటైడ్ సొసైటీ డెవలప్మెంట్’కు చెందిన ఒక పుంజీడు యువత స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్ళు ఇలా ఎక్కడైతే ఆహారం మిగిలిపోయే అవకాశం వుందో అక్కడి వాళ్లను ఒప్పించి ఆ ఆహారాన్ని వసూలుచేసుకుని నిరుపేదలకు పంపిణీ చేస్తోంది. బస్తీవాసుల దగ్గరకు నిత్యంవెళ్ళి వారికి ఆహారం పొట్లాలను అందించి వారి కడుపునింపుతోంది. అలాగే సారూప్యత కలిగిన కొన్ని స్వచ్ఛంద సంస్థలూ ముందుకొస్తున్నాయి. వీధి బాలలను, అనాధలను చేరదీసే సంస్థలున్నాయి. కానీ ఆ పిల్లలను పోషించడం ముఖ్యం కదా! దాతలనుండి నిధులు వస్తేనే మనుగడ కదా! అంచేత అలాంటి సంస్థలకూ మిగులు ఆహారం వుండే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్యాకేజ్ ఫుడ్స్ తెప్పించే కంపెనీల యాజమాన్యాలకు నడుమ అనుసంధానం ఏర్పరచి, మిగిలిందే చాలు అన్నార్తుల కడుపునింపేదిగా పంపిణీ చేయడంలో ముందుకు వచ్చే సంస్థలూ, వ్యక్తులూ అంతా అభినందనీయులే. ‘వృథా చేయని సరదా వ్యథాభరితులకు దసరా’ అవుతుంది. అదీ అభిలషణీయం’’. అంటూ లేచాడు రాంబాబు.
1 comments:
nijame alaanti vyaktulanu/samsthalanu abhinandinchadame kaadu ika mumndu manam edainaa party/bhojanaalaku vellinappudu kaasta taginattu tino akkada telisina vaallaki vivarinchadamo cheste baaguntundi :)
Post a Comment