‘‘ఇది మరీ బాగుందోయ్! ప్రతి చిన్నదీ ఆయనే ఎలా పట్టించుకుంటాడు? ‘ఫైల్స్’ మెయిన్‌టైన్ చేసేది ఆయన కాదు కదా! ఆయనకు ఫైల్స్ పుటప్ చేసేవారూ, ఆయన సంతకాలయ్యాక వాటిని సంబంధిత అమలుపరిచే వ్యక్తులకు పంపేవారూ, వేరే ఉంటారు కదా! అసలు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ‘ఫైలు’- ‘మూవ్’అయ్యే పద్ధతి ఒకటుంటుంది. ‘ఇన్‌వర్డ్ సెక్షన్’నుంచి సంబంధిత అధికారులందరి ఆమోదముద్రా వేయించుకుని ఒక ‘ఫైల్’ బయటకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు! క్లర్కులు, సూపరింటెండెంట్‌లు లగాయితు, పెద్ద అధికారివరకూ ఫైలు ప్రయాణిస్తూంటుంది. ఆ ఫైళ్ళు ఒకచోటనుంచి ఒకచోటికి పంపడంలో గ్రూప్ ‘డి’స్ట్ఫా ప్రమేయమూ విధిగా వుంటుంది. ఫైల్ ‘డ్రాఫ్టింగ్ స్టేజ్’నుంచి ‘అప్రూవ్’అయ్యి, ‘ఆర్డర్లు’ వెలువడి, అమలుకు నోచుకునేంతవరకూ బోలెడు ‘ప్రాసెస్’ వుంటుంది. ‘ఫైలు’ ఓ పట్టాన కదలకపోవడం, ‘రెడ్ టేపిజం’, ఫైలుకదలడానికి బల్లకింద చేతులు పెట్టడం, బరువుపెట్టడం లాంటి మాటలన్నీ ‘ఫైల్స్’కు సంబంధించినవే’’ అన్నాడు శంకరం.
‘ఫైలేరియా’అంటే- ‘ఫైల్ వుండే ఏరియా, అంటే ‘చోటు’అని చమత్కరించాడట ఒకాయన. ఫైలు చంకన పెట్టుకుని తిరగడం అనేది ‘గుమస్తా’ఉద్యోగానికి ఓ ‘సింబల్’గా నిల్చిపోయింది. ఫైల్లో కాగితాలు ఓ క్రమంగా పెట్టడం, ఎప్పటికప్పుడు అన్నీ ‘ఫైల్’చేయడం ఓ గొప్ప కళ. ఫైళ్ళు గుట్టగా పేరుకుపోతున్నాయంటే ‘అలసత్వం’ రాజ్యమేలుతున్నట్టన్న మాట! ఆర్డినరీ, అర్జంట్, యమర్జెంట్ అంటూ ఫైళ్ళు ప్రసిద్ధం. ‘ఫైల్ ప్యాడ్’, ‘ఫైల్ కవర్’, ‘టాగింగ్’, ‘పంచింగ్’, ‘పిన్నింగ్’అన్నీ ‘ఫైల్’కు సంబంధించినవే. ‘ఫైల్’లేని ప్రభుత్వ కార్యాలయం ఊహించలేంకదా!’’ అన్నాడు ప్రసాద్.
‘‘కానీ చూసావ్! ఇవాళ కంప్యూటర్లు వచ్చినా ‘ఫైల్’ అనే మాట పోలేదు. ‘డేటా’ సేవ్ చేసేది ‘ఫైల్’లోనే! ‘టెక్స్ట్’ ఫైల్స్, ‘ఇమేజ్’ ఫైల్స్ వుంటాయి. కాగితాల బొత్తి, ఫైల్ కవరు, ఫైల్ ప్యాడ్ లేకున్నా అన్నీ కంప్యూటర్ ‘ఫైల్స్’గానే ‘స్టోరీ’ అయి చెలామణి అవుతున్నాయి. ఆఫీసుల్లో ‘సెంట్రలైజ్డ్ సిస్టం’ ఏర్పడి, ఎవరి టేబుల్ దగ్గర కంప్యూటర్లో వారే ఫైల్‌ను ఓపెన్ చేసి చూసే సౌలభ్యం వచ్చింది. కాగితాల ఫైల్స్ పోయి, ఫైల్స్ ‘ఈమెయిల్స్’గా కూడా చరిస్తున్నాయి ఇవాళ. కంప్యూటర్లో ‘సేవ్’చేసుకోవాల్సిన ఫైల్స్- సేవ్‌చేసి, డిలీట్ కాకుండా చూసుకోవడం, అవసరమైన ఫైల్స్ ‘సేఫ్టీ’కోసం ‘పెన్‌డ్రైవ్’లోకో, ‘సిడి’లోకో, ‘హార్డ్ డిస్క్’లోకో ఎక్కించి వుంచుకోవడం ఇవాళ మామూలైపోయిందిలే.’’ అన్నాడు సన్యాసి.
‘‘మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి గురించి ఒక మాట చెప్తూండేవారు. క్రింది అధికారులు ఏదైనా‘ఫైల్’ ఆయన ఆమోదానికి ‘పుటప్’చేస్తే ఆయన ముందు ‘నాట్ అప్రూవ్‌డ్’ (NOT APPROVED) అని రాసేవారట. ‘నాట్’కూ, ‘అప్రూవ్‌డ్’కూ మధ్య కొంత ‘గ్యాప్’విధిగా ఉంచేవారుట! ఆ తరువాత ఉత్తరమో, దక్షిణయే పడితే- అంటే ‘ఈ పనికింత’అని ఆయన నిర్దేశించిన ‘టారిఫ్’ననుసరించి ‘ముట్ట’వలసినది ‘ముట్టింది’అని తెలిసాక- ఆ ‘నాట్’ను ‘నోట్’అని ఒక్క ‘ఇ’అనే అక్షరాన్ని ఆ ‘గ్యాప్’లో చేర్చి(NOTE APPROVED), విషయం సానుకూలమయ్యేట్లు చేసేవారుట.
ఆఫీసులో టేబుల్ మీద ‘ఇన్’ట్రేలు, ‘ఔట్’ట్రేలు వుంటాయి. టేబుల్ మారే ఫైలు- ఒక ‘ఔట్ ట్రే’నుంచి, మరో ‘ఇన్‌ట్రే’లోకి వెడుతూ, ఫైనల్‌గా అందరికంటే పై అధికారి దగ్గర సంతకం అయ్యాక, ఆయన ‘ఔట్‌ట్రే’ నుంచి ‘డిస్పాచ్’సెక్షన్‌కు వెళ్ళిపోతుంది. అక్కడనుంచే ‘ఆర్డర్స్’ ఇష్షూ’ అవుతాయి. దీనే్న ‘ఫైలాయణం’ అనేవారు ఆరోజుల్లో. ‘ఆయనం’ అంటే ‘ప్రయాణం’, ‘యాత్ర’ కనుక, అది ‘ఫైల్’ యాత్ర అన్నమాట! ఆ ‘ఫైల్స్’లో, ఆ ‘ఫైల్స్’తో ఎందరెందరి జీవితాలూ, ఎనె్నన్ని పనులు ముడిపడి వుంటాయో చెప్పగలమా?’’ అన్నాడు శంకరం.
‘‘ ‘ఫైల్’కు ‘ఇన్’ అండ్ ‘ఔట్’వుంది. ఇప్పుడు ‘ఫైలిన్’ అంటే ‘తుఫాను’అనే అనుకుంటారంతాను! ‘తుఫాన్’ లాంటి ‘ఫైల్ వర్క్’లు జరుగుతున్నాయి కూడాను. ఫైల్స్ ‘డిస్పోజ్ చేయడానికి గతంలో ‘వారోత్సవాలు’ కూడా చేస్తూండేవారు. కార్యాలయాల్లో గుట్టలుగా ‘ఫైళ్ళు’ పేరుకుపోతే, వాటి వెనక ఎవరు వున్నారా అని వెతుక్కోవలసి వచ్చేది కూడాను. కొత్తగా చేరిన మహిళా ఉద్యోగినిని ఆఫీసర్‌గారు సూపరింటెండెంట్‌కు పరిచయంచేస్తూ- ‘ఫైల్స్ విషయంలో ఇబ్బందులేమయినా వస్తే ఆయన్ను సంప్రదించు. ఆయనతో ఏదయినా ఇబ్బందొస్తేనన్ను సంప్రదించు’’ అన్నాడట! కోపం వస్తే ‘ఫైల్స్’విసిరేసే ఆఫీసర్లుండేవారు. ఇప్పుడు ఫైల్స్ కంప్యూటర్లలో వుండడం మంచిదయింది. ఎంత కోపం వచ్చినా ‘కంప్యూటర్లు’ విసిరేయలేరు కదా! ‘ఫైలిన్’, ‘ఫైలౌట్’ వ్యవహారాలు ఇవాళ వేరు. ఇప్పటికే ‘నోట్’ ప్రిపేరై ఫైలు కెక్కాల్సిందే. కానీ ఆర్డినెన్స్‌లే చింపేయగల- ‘చింపింగ్’సామర్థ్యం వున్న అప్రకటిత అధికారులున్నారు. ‘నోట్’ ఏం ఖర్మం! తలుచుకుంటే ‘ఫైలే’ చింపేయగలరు. ఫైల్సే ‘తగలెట్టేయగలరు’కూడాను. ‘అనవసరంగా పాత ఫైల్సన్నీ సంవత్సరాలుగా పడి వున్నాయి. తగలెట్టేయమంటారా?’ అని స్టోర్ కీపర్ అడిగితే- ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్‌గారు ‘‘అలాగే చేయ్! అయితే ఎందుకైనా మంచిది. అన్నిటికీ ఒక ‘జిరాక్స్ కాపీ’ తీసి, వుంచి, తర్వాత కాల్చేయ్!’’ అన్నాట్ట. ‘ఫైలిన్స్’తో దేశం ఇలాగే కదుల్తోంది’’ అని నవ్వుతూ లేచాడు ప్రసాద్.
0 comments:
Post a Comment