ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, July 13, 2013

అక్షరాల్లో ఒదిగిన అనుభూతుల సారం


తానొక నాటక రచయిత. అలాంటి ఇలాంటి నాటక రచయిత కాదు. రాష్ట్ర స్థాయిలో ఆరుసార్లు నంది అవార్డులు, తెలుగు విశ్వవిద్యాలయం నాటక సాహిత్య పురస్కారంతోపాటు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డునూ అందుకున్న ప్రతిభామతి. డి.విజయభాస్కర్ ఆధునిక తెలుగు నాటక రంగానికి చిరపరిచితుడు. తన నాటకాలు అనేకం పలు భారతీయ భాషల్లోకీ, ఇంగ్లీషులోకీ అనువదితమై ప్రదర్శితమయ్యాయి. నాటక రచనలో తనదైన ముద్ర వేసుకున్నవాడు. 


‘‘ఇంతవరకు శూన్య రంగస్థలంపై జీవన్నాటకాల్లోని ఘర్షణలను నాటకీకరించిన నేను, మహాసంఘర్షణకు వేదికైన శూన్యాన్ని ఇప్పుడు కారుూకరించే ప్రయత్నం చేశాను’’అంటూ, ‘అనుభవ కావ్యం’ అంటూ- డా. దీర్ఘాశి విజయభాస్కర్ వెలువరించిన - యాభై కవితాఖండికల ఏకసూత్ర సమాహారం: ‘మహాశూన్యం’.

ఆకాశానికి ‘శూన్యం’ అని పేరు. చిన్నతనం నుండీ ఆకాశ పరిశీలనంటే కలిగిన ఇష్టంవల్లనే కాబోలు, తనలో రేగిన అనంత ఆలోచనల అబ్దాలను, ఇప్పుడిలా ‘కవిత్వ చినుకులు’గా వర్షింపచేస్తున్నాడు! పొడచూపిన ప్రశ్నార్థకాల్లో- ‘ఒక్క ప్రశ్నకు ప్రశే్న సమాధానమయ్యింది. కొన్నిటికి సమాధానపరుచుకోవడమే శరణ్యమయ్యింది. ఇం కొన్నిటికి సమాధానం లేదని రూఢీ అ యింది’అంటూ - అనేక స్తరాల్లో కలిగిన సందేహాల నివృత్తిలో పడిన వేదన నుండి పెల్లుబికిన భావోద్రేకాలే ఈ ‘మహాశూన్యం’ అంటాడు.


‘‘శాస్ర్తియ విజ్ఞానం అందిస్తున్న ఆవిష్కరణల వెలుగులో మానవ చైతన్యం దేదీప్యమానవౌతోంది. ఇక్కడే మానవాళి రెండు నేరాల మధ్య నిలిచిందనుకుంటాను. గత వైభవ ఉన్మదంలో శాస్ర్తియతను అంగీకరించకపోవడం. ఆధునిక దృక్పథాల పెడసరితనంతో శాస్త్రాన్ని పక్కనపెట్టడం. రెండింటి సమన్వయం వర్తమాన ఆవశ్యకత’’ అంటాడు విజయభాస్కర్.


‘‘లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుదినలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెలుగునతని నే సేవింతున్’’


అన్నాడు పోతన మహాకవి.


‘‘ఎవరి ఊహ/ జీవుని ఆలోచనకీ ఆలంబనో
ఎవని శ్వాస/ ఇలపై ఊపిరికి స్థానమో
ఎవని రూపం/ సకల కళావిలాసస్థావరమో
ఎవని అంతరంగం/ విశ్వ నాటక రంగస్థలమో
ఎవని స్వస్వరూపం/ తుది లేని మహాశూన్యమో
అట్టివానికి ప్రణమిల్లి/ నేను కవితలల్లెదన్’’ 

అంటాడు అదే బాటలో విజయభాస్కర్. 

‘అసి’- అంటే కత్తి, ఖడ్గం అనే కాదు, అల్పమైన, కొంచెమైన అనే అర్థం వుంది. విజయభాస్కర్ ఇంటి పేరు ‘దీర్ఘాశి’. అది ‘దీర్ఘాసి’అయి వుంటే- దీర్ఘమైన అల్పత్వం అయ్యేది. అందులో తాను అనుభావించే తాత్త్వికత వుంది. ‘అశిత’అంటే తినేవాడు. ‘అశితం’అంటే అన్నం. (సరే! ‘అశీతి’ అంటే ఎనభై అనుకోండి!) ఈ కవి శూన్యాన్ని దీర్ఘంగా భుజించినవాడు. పరబ్రహ్మ స్వరూపమైన ‘అశితం’- మనిషికి ముకుళిత స్థితిని, వికసిత గతిని రెండింటినీ అందించేదే! దీర్ఘాశి- ‘మహాశూన్యం’అంటే సృష్టి నాణెపు బొమ్మాబొరుసులంటాడు.


 ‘మహాశూన్యం’నుండి ‘విశ్వరూపం’వరకూ సాగించిన ఈ కవితాప్రస్థానంలో- నిగూఢమైన తాత్త్విక భావాలను, అందులోని సున్నితమైన పొరల్ని అనుభవించి, అనుభవింపచేసే యత్నం ద్యోతకమవుతుంది. ‘మాతృగర్భం’గురించి రాస్తూ- ‘చీల్చుకువచ్చిన గర్భమే- చివరకు పొదువుకుంటుంది- ఆ గర్భమే- అప్పుడు పంపింది మహాచైతన్య స్రవంతిలోకి.- ఇప్పుడు పంపబోతోంది- అగాధ శూన్యంలోకి అంటాడు కవి. ‘జననం’మహాచైతన్యస్రవంతి అనీ, ‘మరణం’ మహాశూన్యం అనీ స్థూలంగా ఇక్కడ వ్యక్తమవుతున్నా, నిజానికి ‘గర్భం’ సృష్టిగర్భమే! ప్రకృతినుంచి జనించినవే జనన మరణాలు రెండూ. స్ర్తికి ‘ప్రకృతి’ అనే పేరున్నది జనన పార్శ్వంవల్ల. మృత్యువూ ‘ప్రకృతి’ ప్రసాదించేదే చివరకు. ‘మహాశూన్యం’అంటే ఏమీలేకపోవడం కాదు. సర్వవ్యాపితమై వున్నది. సర్వత్రా ఇమిడి వున్నది.


‘‘అందుకే ఇక్కడ
పాత వారెవరూ ఉండరు
కొత్తవారెవరూ రారు.
ప్రతి వ్యక్తీ/ సనాతన విశ్వచేతనకు
ఓ అధునాతన అభివ్యక్తి’’
అంటాడు. అయితే ‘ప్రయాణం’
ఎవరిది వారిదే!
ఎవరి కృషి వారికో సిద్ధాంతం
ఎవరి పలుకు వారికో మేలుకొలుపు
వాదోపవాదాల మధ్య/ తర్కవితర్కాల నడుమ
బ్రతుకు నావ ప్రయాణం ఆత్మచేతనా సాగరపు సమ్యక్ తీరానికా 

లేక విశ్వాంతపు విలయార్భాటాల స్తరానికా 

అని ప్రశ్నిస్తాడు. ‘అనుభవం’ అంటే ఒక దానివెంట అనుగమించడం. ఈ ఖండికల్లో- అనేక సందేహాల, ప్రశ్నల, తర్కవితర్కాల, వాదోపవాదాల వీచికలు విస్తృతంగా తాకుతూ వుంటాయి. అయితే కవిలోని ‘సమ్యక్ దృష్టి’ పాత కొత్తల అనుసంధానం చేస్తూంటుంది. ‘‘నాగరీకమైన భావనంతా నాశనం వైపు దారితీస్తోంది- ఒకటి అంతంకానిదే- మరొకటి అస్తిత్వంలోకి రావడం లేదు. ప్రపంచాన ఆధ్యాత్మికత ఓ గొప్ప వాణిజ్యవస్తువుగా మారింది. ప్రవచనాలన్నీ పరులకు చెప్పే హిత భాషణాలయ్యాయి. కవి స్వార్థపు విషం త్రాగి- జీవుడు ఏనాడో మృతప్రాయుడయ్యాడు. ఇప్పుడు కనిపిస్తున్నవి కళేబరాలు కప్పిన ప్రాణశకలాలు’’అని బలీయంగా చెప్పిన వర్తమాన సామాజిక స్పృహ వుంది కవిలో! దానిని తాత్త్వికతతో ముడివేయడానికే అతని యత్నం. ‘ప్రకృతిని ప్రేమించే మనిషిని పుట్టించవా’-అని ఇప్పుడతని ప్రార్థన!


‘‘మనసు విరిసిన/ ఈ సంశయాత్మక మాయాజాలానికి
చిక్కేకన్నా/ దేవుడు వేసిన నిస్సందేహపు
కాలపు గాలానికి/ చిక్కుకు ‘పోవడమే’
బ్రహ్మానంద కారకం!’’
అనేస్తాడు. 


ఎందుకంటే ‘‘ప్రకృతిని సృజించడానికి ముక్కోటి దేవుళ్ళు కావాలేమోగానీ, వినాశనానికి మాత్రం ఒక్క మనిషి చాలు!’’అని నిరూపితమవుతోంది కదా! అనిపించేస్తాడు. కానీ- ‘‘మనిషి ఆలోచనే దీపమై భావితరాలకు వెలుగునిచ్చి మరణానంతరం బ్రతుకుతుంది’’ అనీ అంటాడు. పడిలేచే ఈ ద్వంద్వంలోంచే నిర్ద్వంద్వంగా - ‘‘ఒక్కటయ్యేవరకు- రెండువైపులా నేనే వున్నాను’’అంటూ, ‘జనన మరణాలు అభేదమని, అవిభాజ్యమని తెలుసుకుని జ్ఞానినయ్యాను’ అంటున్న కవి- ‘మహాశూన్యం’ అంటే మనిషీ భగవంతుడూ అభేదమూ, అవిభాజ్యమూ అయిన పెనుచీకటి కావలి ‘స్వరూపమే’ అని తెలియచెపుతాడు. ‘మహాశూన్యం’ అనుభవ కావ్య రచనతో దీర్ఘాశి విజయభాస్కర్ జగన్నాటక రచయితగానే కాకుండా, కవిగానూ అక్షరకాంతులు వెదచల్లుతున్నాడు.


‘‘నేను చేస్తున్నదే నాలాంటి అందరూ
చేస్తున్నారు.
మనందరి మధ్య ఏమీ తెలియని
తెలిసిన తనమొకటుంది
తెలుసుకున్నవారు కూడా
తెలియచెప్పలేని తెలివితక్కువతనమది’’


అంటూ ‘మహాశూన్యం’ అంతంలోనూ, విశ్వపదార్థం యొక్క విశాలతత్వంలో, విశ్వరూప రహస్యంలో ‘తల్లీనం’ కావడం- తన జ్ఞానంలోని అజ్ఞానాన్ని గ్రహించడమే! అలా గ్రహించడమే జ్ఞాని లక్షణం. దీర్ఘా
శికి శుభాశంస.!  • - సుధామ

మహాశూన్యం (అనుభవ కావ్యం)
- డా. దీర్ఘాశి విజయభాస్కర్

పాలపిట్ట బుక్స్ ప్రచురణ;
ఎల్‌ఐజి క్వార్టర్స్, 127 1/2ఆర్‌టి,
ఆంధ్రా బ్యాంకు దగ్గర,
విజయనగర్‌కాలనీ,
హైదరాబాద్-57. వెల: 70రూ./-
0 comments: