ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 2, 2013

వేరు గా‘పురం’








‘‘మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అసాధ్యంగా మారి, ఒక ఆకాంక్ష పూరిత ‘సెంటిమెంట్’గా మాత్రమే నిలచి వుంది. అవసరార్థమూ, సౌలభ్యంకోసమూ, వైయక్తిక ప్రగతి కోసమూ విడివిడిగా ఒక కుటుంబంలోని అన్నదమ్ములు వేరుపడి కాపురాలు చేసుకోవడం, విడిగా నివసించడం, నేటి కాలంలో మామూలే! పెళ్లయితే కూతురు అత్తారింటికి వెళ్లడం ఎంత సహజమో, ఇవ్వాళ కొడుకులూ ఉద్యోగాల గురించీ, తన కుటుంబం గురించీ, అమ్మానాన్నలతోకాక, వేరుగా వుండడం అతి మామూలు విషయమే అయిపోయింది! అందువల్ల ‘విడిపోవడం’అనేది, గుం డెలు బాదుకుని బాధపడాల్సిన సంగతేమీ కాదు. ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలు కలిగి వుంటూ, ఎవరి ఇంట్లో వారు, తమ కుంపటీ తాము రాజేసుకోవడంలో తప్పేం లేదు ఇవాళ. అందువల్ల ‘ప్రత్యేక రాష్ట్రం అంటే’ ఆహ్వానించదగిన వేరుకాపురమే. వేరుకాపురం వల్ల ప్రేమాభిమానాలు- దూరంగా వుంటూ మరింత దగ్గరయ్యేలా నిలుపుకోవడం ముఖ్యం.’’ అన్నాడు శంకరం.

‘‘నిజమే! ఇది దెబ్బలాడుకుని విడిపోవడంగా భావించకపోతే, అలాంటి అభిమానాలు నిలుస్తాయి! తన వాటా తనకిమ్మని ఆస్తి పంపకానికి తమ్ముడు పట్టుపట్టినప్పుడు, ‘అమ్మ’యే దానికి సంతోషంగా ఒప్పుకున్నప్పుడు, ఇది వైమనస్యంగాకాక, ఎవరి అస్తిత్వంవారు నిలబెట్టుకునేందుకు, ఎవరి కాపురం వారు- మరొకరి పెత్తనమూ, ప్రమేయమూ లేకుండా చేసుకునేందుకు, వెసులుబాటుగానే భావించాలి. అన్నదమ్ముల్లో ఎవరి తెలివితేటలు వారివి. ఎవరి సంసారం వాళ్లు, వాళ్లకి కావలసినట్లుగా, మరొకరి ప్రమేయం లేకుండా, నిర్వహించుకోదలుచుకున్నప్పుడు, పిల్లలు విడిపోవడం ‘అమ్మ’కే అభ్యంతరం లేనప్పుడు, ఎవరి బ్రతుకు వాళ్ళు హాయిగా బ్రతుకుతూ తనను పట్టించుకుని ఆదరిస్తే చాలనుకున్నప్పుడు వేరుకాపురాలు వద్దనడం ఎందుకు?’’ అన్నాడు సన్యాసి.


‘‘అవునయ్యా! కానీ కొన్ని ఉమ్మడి వ్యవహారాల సంగతేమిటి? అన్నదమ్ములిద్దరూ బాధ్యులయిన ప్రగతి ఫలాలను ఆస్తులుగా పంచుకోవడం దగ్గర సమస్యలు రావా? ఇద్దరూ కలిసి తవ్వించిన బావిని రెండు ముక్కలు చేయడమో, ఇద్దరూ కలిసి కొన్న కంప్యూటర్‌ని రెండుగా విడదీయడమో కుదరదు కదా! వాటిని ఎవరు తీసుకోవాలన్న దగ్గర గొడవ పడకుండా పరిష్కరించుకోగలగాలి. ఇద్దరూ ఒకదాని గురించి తనకే కావాలని పట్టుబడితే కుదరదు. పట్టువిడుపులుండాలి. కానీ అక్కడే సమస్యలొచ్చే అవకాశం వుంది! ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడం అనేది ఖరారయిపోయింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నదగ్గరే తేలవలసిన సమస్యలుంటాయి. సీమాంధ్ర రాజధాని ఏర్పడేంతవరకు- పదేళ్ల కాలంలోనూ హైదరాబాద్ మీద పెత్తనం తెలంగాణాకు వుంటుందా, లేక కేంద్రానికి వుంటుందా అన్నది ప్రధానాంశం అవుతుంది. సచివాలయం, శాసనసభ, గవర్నర్ ఆఫీసు ఇప్పుడున్నవి ఎవరు వాడుకుంటారు ఆ పదేళ్లూ అన్నదే కాదు, రవీంద్రభారతిలో ఓ ఉగాది కార్యక్రమం చేసుకోవాలంటూనో, ఆగస్టు 15కు పెరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఎగరేసుకోవాలంటూనో, అది తమకే చెందుతుందని విడిపోయిన తెలుగు రాష్ట్రం వారిద్దరూ పట్టుబడితే ఎవరికి ఎవరు కేటాయిస్తారు? ఇరువురిమధ్యా కేంద్రం సయోధ్య కుదిర్చి నిర్ణయించి ఒప్పిస్తుందా? ఇవన్నీ సమాధానం తేలవలసిన ప్రశ్నలే’’ అన్నాడు ప్రసాద్.


‘‘విభజన ఒక రాజకీయ స్వార్థంట. రాష్ట్ర విభజన తట్టుకోలేక కడప జిల్లాలో ఓ రైతు గుండె ఆగిపోయింది. టీవీలో రాష్ట్ర విభజన వార్త చూసి గుంటూర్‌లో ఓ యువకుడు బసచేస్తున్న హోటల్ నాల్గవ అంతస్తు కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నన్నపనేని రాజకుమారి వంటి పరిణిత రాజకీయ నాయకురాలు టీవీ ప్రత్యక్ష ప్రసారంలో ఆపుకోలేక కళ్లమ్మట నీళ్ళెట్టుకుని విలపించారు. విభజన పట్ల సంబరాలు, సంతోషాలు ఒక ప్రక్కన వుండగా విషాదాలు, నిరసనలు మరోవైపు వున్నాయి. ఇది సహజం! కోర్టులో తీర్పు వెలువడినప్పుడు ఇరుపక్షాలూ సంతోషించవు. ఓడిపోయిన వారు బాధపడతారు. గెలిచినవారు సంతోషిస్తారు. కోర్టు తీర్పు కనుక న్యాయమూ, ధర్మమే గెలిచాయని భావించమంటుంది వ్యవస్థ. ‘ఎక్కువమంది చేతులెత్తినంత మాత్రాన న్యాయం కాజాలదు’అన్న మాటా వుంది. కానీ జరిగే పరిణామాలు జరుగుతూనే వుంటాయి. బ్రతుకే ఒక రంగులరాట్నం. ఎస్.వి.్భజంగరాయ శర్మగారు రాసిన సినిమా పాటలో లాగా- ‘‘ఇరుగింటిలోన భేదం. పొరుగింటిలో ప్రమోదం... ఒకరి కనులలో చీకటి రేయి... ఇరువురి మనసుల వెనె్నల హాయి’’అన్నట్లే వుంటుంది. ‘‘నడిచేదారుల గమ్యమొక్కటే! నడిపే వాడికి అందరొక్కటే’’ అనుకోక తప్పని స్థితి. ‘మాకు ఎవరి పెత్తందారితనమూ, మార్గదర్శకత్వమూ అక్కర్లేదు’అని స్వాభిమానాన్ని ప్రకటించుకునడం మంచిదే. ఎటొచ్చీ- ‘‘సాధించిన దానితో సంతృప్తిని పొంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి’’అన్న హెచ్చరికను గుర్తించాలి. కాళోజి అన్నట్లు ‘‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ. ఉదయించి అలానే ఉంటుందనుకోవడం దురాశ’’అన్న మాటల్లోని లోతుని గ్రహించి, పరిణామాలలోంచి పరిణతిని పొందడం విధాయకం. ‘వేరుకాపురం’ మాత్రమే కాదు. వేరుగా‘పురం’ అంటే తమదైన పట్టణంగా, పట్టం కట్టుకోవడంపైనా పట్టు సాధించాలి’’అంటూ లేచాడు రాంబాబు.







3 comments:

Unknown said...

ఉమ్మడికుటుంబం విడిపోతే అది ఒక సహజ పరిణామంగానే భావించాలి!స్వాతంత్ర్యానంతరం ఎన్ని రాష్ట్రాలు విడిపోలేదు!ఎన్ని కొత్త రాజధానులు నిర్మించలేదు!ఇదీ అంతే!

సుధామ said...

అవును సూర్యప్రకాశ్ గారూ!నిజం.

సుధామ said...

అవును సూర్యప్రకాశ్ గారూ!నిజం.