ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, August 10, 2013

తడి ఆరదు..సడి ఆగదు..!

అసలు కవిత్వం అంటేనే- ఒక తడి. పొడి పొడి అక్షరాలుగా కనిపించే లిపి తడిసిన తరుణంలోనే రసశ్రువుగా కవిత్వం చినుకుతుంది. రఘుకు కవిత్వపు ఆల్కెమీ తెలుసు. యాకూబ్ అన్నట్లు ‘‘చదువుతున్నప్పుడు చాలా మామూలుగా అన్పించే ఆ అక్షరాలు, తీరా చదవడం ముగించాక పాఠకుడికి ఇంకా తెరుచుకోవాల్సిన రహస్యమేదో మిగిలే వున్న భావన కలిగిస్తుంది.’’ దీనినే విహారి ‘‘బుద్ధిజీవిగా రఘు చేస్తున్న జీవన వ్యాఖ్యానం అనుభవ ప్రధానంగా సాగి వస్తుసాంద్రతకి దోహదం చేస్తోంది’’-అంటూ వస్తువు ఏదైనా దానిని కవిత్వీకరించే రసజ్ఞానం శేషభట్టర్ రఘులో విశేషంగా వుందంటారు.

లిపి తడిసిన తరుణం కవితా సంపుటిలో రఘు సామాజిక, రాజకీయ అంశాల మీద స్పృహనుకూడా సూటిగా అభివ్యక్తీకరించాడు.


మనిషికైనా నేలకైనా
మనం పెట్టుకునే పేర్లు
సౌలభ్యం కోసం చేసుకున్న ఏర్పాట్లు
ఈ స్పృహ తెల్సినవాడు
భూగోళం మనిషిలా వాడి ఇరుకు గుండెలో
ఉండాలనుకోడు
పటాలమీద గీసుకున్న గీతలు
విభజన రేఖలని చెప్పుకోడు


తమ్ముడూ!
భాషను విడిచి అవిటి నేలకోసం
ఆక్రోశాలెందుకు
జ్వర లాలస వంటి ద్వేషాలెందుకు

బాహువుల నుండి ప్రాంతీయ భ్రాంతిని చెరుపుకుందాం
ధూళి నుండి కాదు నాగరికత మేథ నుండి
పుడుతుందని తెల్సుకుందాం
తరాల తీరాలుదాటి కాలం
తరుణాల నుసి రాల్చినప్పుడు
మన కలహాలు ఉత్తకాగితం కత్తులు


(ఒక ఉమ్మడి నేలకోసం)


అని రఘు మానవీయతను, విశ్వజనీనతను విశ్వసించి ప్రవచిస్తాడు.


గుండె అంటే కేవలం ధాతువుల ఉండకాదు
నీలోకి నిన్ను రాట్నంలా ఒడికే ఒక లోలకం!
తొలి చూపునుండి తుది నిద్రవరకూ
నీలో ఒలికే దీపం


అని గుండెని నిర్వచించడం తనకే చెల్లు. లోలకం ఒడకడం ఏమిటి? దీపం ఒలకడం ఏమిటి? అని ప్రాపంచిక దృక్పథంతో ప్రశ్నించేవారికి రఘు ఎలా అందుతాడు? అందడు. కానీ బాహ్యానికీ, ఆంతర్యానికీ కన్పించే దృశ్యాలకి, ఊహాన్విత అదృశ్యాలకీ ఒక పారవశ్యపు అవాక్కుని అద్దడమే అతని అభివ్యక్తి మర్మజ్ఞత.


కవిత్వం ఒక పీఠం కాదు
దానికి ఎవడూ పీఠాధిపతి లేడు
ఐనా కఠోరమైన ఈ నిజం తెలియనట్లు
వాడు ఉలికి ఉలికి పడతాడు
అర్భకుడెవరో తన కాళ్ళకు తనే మొక్కుకుని
సుఖీభవ చెప్పుకున్నట్లు
పుంఖాను పుంఖాలుగా తన పుస్తకాలకు
పీఠిక రాసుకుంటాడు
పేలవమైన ప్రతి మాటకు పదే పదే
చప్పట్లు కొట్టాలంటాడు
ప్రయోజనాల రంపంతోనే
మనుషుల్ని తూకంవేసి
లేని మధురిమల్ని పుస్తకాల గుట్టల్లో
వెతకమంటాడు


అని ‘కవి గబ్బిలం’గాళ్లను తరుముతాడు రఘు. రంపంతో తూకం వేయడమంటే ఏమిటో తెలుసు కనుకనే- ‘‘కవనం కాదు దాని రూపం మీద పంతాలుపోయే తాపసి నేను’’ అని ప్రకటించుకుంటాడు.


 ‘లోకం పేరు మనిషి’అనీ ‘నడుస్తున్న పూలకు కవులని పేరు’అనీ ధీమాగా చెబుతాడు. ‘‘కలవరం లేనిచోటే- రెపరెపలాడే కంటి తెరలు- ఇంకు దొంతర్లను హత్తుకుంటాయ్’’అని తనే అన్నట్లు ఇప్పుడు కావలసింది పోలిక ఉంటాయ్ కాబోలు ఎత్తుగడ వెతుకులాట. పోయిందేమీలేదు. ప్రకంపన శ్రుతి కలిసేది కాదు. మనిషి పోకచెక్క కాదు నమ్మండి.

కాలం జ్ఞాపకాలు మోసే పడవ
మనిషి అనుభవాలు రాల్చే చెట్టు


అని అద్భుతంగా పలికాడు రఘు.


‘మాటల తోలు వలచి మళ్ళీ
రూపకాల పసుపు అద్దలేను’ అనే రఘూ!-
పెదవుల గుంపుల మీద నీ విజయం
ఒక వచనంగా ఒలకాలి
కాదు! కాదు!... పాఠక హృదయాధరాల గుంపుల మీద నీ లిపి కవిత్వమై తడవాలి. కవికి అభినందనలు.

  • -సుధామ


లిపి తడిసిన తరుణం
(కవిత్వం)
- రఘు-
పాలపిట్ట బుక్స్ 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీం నగర్, మలక్‌పేట,
హైదరాబాద్-36.
వెల: రూ.60/-0 comments: