ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 12, 2013

తేటపడని తెలివి






‘మనిషి అంటే ఇప్పటి మనిషి మనిషోయ్! ఆధునిక మానవుడు ఎంతగా పురోగమించాడు! ఈ సెల్‌ఫోన్లూ, ఈ కంప్యూటర్లూ ఒకప్పుడు ఊహించనైనా ఊహించారా? ప్రకృతి శక్తులను జయించిన నరుడు ఇవాళ ప్రాణ రహస్యం కనుక్కునే దిశగానూ ఎదుగుతున్నాడు. దీనినిబట్టీ ‘మానవుడే మహనీయుడు’ అన్న మాట యథార్ధం అనిపించడం లేదూ?’’ అన్నాడు శంకరం.

రాంబాబు చిరునవ్వు నవ్వాడు.


‘‘అలా నవ్వుతావేమిటి?’’ అడిగాడు శంకరం.

రాంబాబు ఏమీ మాట్లాడలేదు.


‘‘అది కాదోయ్! నేనన్నది నిజం కాదా? ఈనాటి ‘మానవ మేధోవికసనం’ ఏనాడయినా ఊహించినదా చెప్పు?’’ రెట్టించాడు శంకరం.


‘‘ఎప్పటికప్పుడు తానే గొప్ప అనుకుంటున్నందువల్లనే మనిషి ఆశగా, ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నాడేమోలే!- కానీ చూసావ్! మనిషి అహంకారానికి ఎప్పటికప్పుడు విఘాతం కలుగుతూనే వుంది. ఎదిగినకొద్దీ ఒదిగి వుండడం చేతకాకపోతే, మనిషి పతనంవైపే పయనిస్తాడు. ఒక విధంగా ఇప్పటి ఈ పురోగమనం, సాంకేతికాభివృద్ధి మనిషిని మానవీయ విలువలనుండీ, ఉదాత్త నైజాలనుండీ చ్యుతమయ్యేలాగా చేస్తోందేమోనని నా అనుమానం! ఇప్పుడు నువ్వు గొప్పగా అనుకుంటున్నవి ఒకప్పుడు లేవని నిర్ధారించేస్తున్నావుగానీ, ఏదో రూపంలో ఇంతకన్నా ఎక్కువ మేథస్సునే ఒకప్పటి మనిషీ కలిగి వున్నాడేమోననిపిస్తుంది.’’ అన్నాడు రాంబాబు.


‘‘ ‘అన్నీ వేదాల్లోనే వున్నాయిష!’అనే బాపతు చాదస్తమే నీదిలా వుంది! అన్నీ అప్పుడే వుంటే, ఈనాటి మానవుడు తన మేథస్సును ఇంతలా పదునుపెట్టడం దేనికి?’’ అన్నాడు శంకరం.


‘‘చూడు శంకరం! గతమంతా నీకు తెలియదు. చారిత్రకంగానూ, గతం మిగిల్చిన అవశేషాల మీదుగానూ మాత్రమే అందే సమాచారంతో- అంచనా వేస్తూంటావు. అది సహజమే! కానీ పుష్పక విమానాలు, సత్యపీఠాలు, కాలయంత్రాలు గతంలో వారి కల్పనలూ, ఊహలూ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఒక విధంగా నాటి మానవుడి మేథస్సు ఇప్పటివారికంటే పదునుగా వుండేదేమో! అంతెందుకు? మన అమ్మమ్మలూ, తాతయ్యలకూ వున్న శారీరక దారుఢ్యం, ఆయుఃపరిమాణం మనకున్నాయా? ఒకప్పటి మనిషి ఆరోగ్య జీవనానికీ, నేటి మనిషి జీవనానికీ బోలెడు తేడావుంది. ప్రకృతితో మమేకమై జీవిస్తూ, నాటి మనిషి వున్నంత హాయిగా, ఆరోగ్యంగా నేటి మనిషి వుంటున్నాడా? ఈ పరిసరాల కాలుష్యం, పెరుగుతున్న రోగాలు, అంతరిస్తున్న మానవ సంబంధాలూ ఇవన్నీ పురోగతి కిందకు వస్తాయా?’’ అన్నాడు ప్రసాదు.


‘‘నువ్వన్నది నిజం ప్రసాదూ! ప్రకృతిని మనిషి జయించాననుకుంటున్నాడేమో గానీ, ఎప్పటికప్పడు దానిముందు తల వంచుకోవాల్సే వస్తోంది. అంతెందుకు శంకరం? మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో ఎన్నివేల మంది మరణించారో చూసాంగా! ఆ వరదలను నేటి మనిషి అరికట్టగలిగాడా? పైగా మానవ తప్పిదాల మూలకంగానే అక్కడ ప్రకృతి దెబ్బతిని, ఆ వైపరిత్యాలు సంభవించాయని శాస్తజ్ఞ్రులే అన్నారు. అంతెందుకు? అంతలా వరదలు ముంచెత్తినా- కేదార్‌నాథ్ ప్రధాన ఆలయం చెక్కుచెదరలేదు. ఎప్పుడో క్రీ.శ 813లో కట్టిన ఆ నిర్మాణం పటిష్టంగానే వుంది. మొన్న బుద్ధగయలో ఉగ్రవాదులు బాంబులు పేల్చినా, ప్రధాన బౌద్ధ నిర్మాణానికి ఏ ముప్పూ జరగలేదుట. కానీ కేవలం 60 ఏళ్ల క్రితం నిర్మించిందంటున్న సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ భవనం గట్టి వానయినా పడకముందే- కుప్పకూలింది! మరి భవన నిర్మాణ రంగంలో మనిషి మేథస్సుని- ఇవాళ, గతంలోని మనిషికన్నా అధిక వికాసవంతమైందని అనగలమా? కట్టడాల విషయంలోనే మనిషి మేథస్సులోని ‘కట్టడి’లో ఇంతటి వ్యత్యాసం కనబడుతోందిగా! ఇవాళ సాంకేతికంగా అభివృద్ధిని సాధించామని చంకలుగుద్దుకుంటున్న మనం, గతంతోపోలిస్తే ఇంకా ఎన్నింటిలో వెనకబడి వున్నామో అర్థమవుతుంది.’’ అన్నాడు రాంబాబు.


‘‘అంతదాకా ఎందుకు? నిప్పుని, చక్రాన్ని కనుగొన్నది ఇప్పటి మనిషి కాదుకదా! ‘నిప్పు’కనుక్కోవడాన్ని మిం చిన, ‘చక్రం’కనుక్కోవడం మించిన తెలివి ఏముంది? వాటి ప్రాతిపదికల మీదనే కదా ఇంత నాగరికత ఇవాళ నెలకొన్నది. అంతెందుకు? సాహిత్య సృష్టి విషయం తీసుకున్నా- ఇవాళ్టికీ భారత, భాగవత, రామాయణాలు నిలచి వున్నాయి. ఎంతగానో ఉపకరిస్తున్నాయి. కానీ ఇవాళ్టి సాహిత్య సృజన ఎంతమేరకు మానవుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడగలుగుతోంది. కాలం మారుతుంది. కాలంతోబాటు విలువలూ మారుతూంటాయి. కాదనం. కానీ మార్పు ఏదయినా మానవ జీవన వికాస హేతువుకావడం అవసరం. తాత్కాలిక ప్రయోజనాలు, సుఖాలు, లాభా
లు, ఆనందాలూ ప్రధానమై, సమష్టి భావనలు, సంఘటిత జీవనానందమూ మృగ్యమైపోతున్నప్పుడు మరి మానవ విలువలు దిగజారడంలో వింత ఏముంది? ‘సిరి అబ్బడం కష్టంకానీ చీడ అబ్బడం సులభం’అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. ఇవాళ మనిషి తెలివి తేటలకు తెగుళ్లు సోకుతున్నాయన్నదే బాధాకరమైన విషయం. మనిషి గొప్పవాడే! అయితే మనీ+షి గురించి వెంపర్లాడకుండా ‘మనీషి’గా ఎదిగే ప్రయత్నం తన మేథస్సుతో చేయడం ముఖ్యం’’అంటూ లేచాడు ప్రసాదు.