'రికార్డ్ బ్రేక్-' అన్నాడు వస్తూనే సన్యాసి.
‘‘ఎవరు? ఎక్కడ? ఇంగ్లాండ్‌తో క్రికెట్లో మనవాళ్లు పరాజయం పాలయ్యారు కదా’’ అన్నాడు శంకరం.
‘‘రికార్డ్ బ్రేక్ అంటే క్రీడారంగం తప్ప మరేమీ లేదా ఏమిటీ? స్వాతంత్య్రానంతరం అవినీతిపై ఇంతలా ధ్వజం ఎత్తి,‘రెండో స్వాతంత్య్రపు పోరాటం’ అన్నంత స్ఫూర్తి తెచ్చినఅన్నా హజారే కూడా ‘రికార్డ్ బ్రేక్’ చేసినట్లే కదా!’’ అన్నాడు రాంబాబు.
‘‘రాష్ట్రంలో జగన్-అవినీతిలో కూడా ‘రికార్డ్ బ్రేక్’చేసినట్లే అంటున్నారు కదా’’ అన్నాడు ప్రసాద్.
‘‘ఎహే! ఎప్పుడూ ఆ క్రీడలూ, రాజకీయాలు అనే రొడ్డకొట్టుడేనా? విశ్వవిద్యాలయాల్లో-తక్కువ కాలంలో ఎక్కువ డాక్టరేట్లు పంచిపెట్టి,కుప్పం యూనివర్సిటీ రికార్డు బ్రేక్ చేసిందని మీకు తెలీదా! అంతకన్నా విశేషం-మూడేళ్ల పదవీ కాలం ముగించుకున్న అక్కడి వి.సి గారికి ఘనసన్మానం చేసి, హిజ్రాలతో రికార్డింగ్ డ్యాన్స్చేయించిన ఘనత, ఆ విశ్వవిద్యాలయానికే దక్కింది’’ అన్నాడు సన్యాసి.
‘‘ఏమిటేమిటి? యూనివర్సిటీ సభలో రికార్డింగ్ డ్యాన్సా? మతుండే మాటాడుతున్నావా’’ అన్నాడు శంకరం.
‘‘మతి ఉండడం కాదు. మతిపోయేలాంటి చర్యే! అత్యున్నత విద్యావిలువలు పాటించవలసిన.., అందునా సంస్కృతికీ, సాహిత్యానికీ అద్దంపట్టి, ద్రవిడ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే-కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంత అనాగరికమా?’’ అన్నాడు ప్రసాదు.
‘‘బావుందయ్యా! హిజ్రాలు నృత్యం చేస్తే తప్పేమిటి? అదీ సంస్కృతే కదా! అనే సమర్ధనీయులూ ఉండచ్చు. ‘రింగ రింగా రింగ రింగా’ అంటూ సినిమా పాటకు హిజ్రాలు మాత్రమే కాదు, వారికి తోడుగా పదవీ విరమణ చేస్తున్న వైస్ ఛాన్సలర్ కూడా ‘రమణీయంగా’ నృత్యం చేయడం విశేషం! వైస్ ఛాన్సలర్‌గారు ‘వయసు’-‘ఛాన్స్’ - అన్నట్లుగా రోడ్డెక్కి నృత్యం చేయడం, సభావేదికపై అర్ధనగ్న ప్రదర్శనల నృత్యంతో తన సన్మాన సభను రక్తికట్టించుకోవడం -చూస్తుంటే, అసలు విద్యా ప్రమాణాలు, విలువలు గురించి మాత్రమే కాదు, హుందాగా, మార్గదర్శకంగా ఉండవలసిన ఉన్నత హోదా వ్యక్తి-ఇలా విలువల పతన ప్రతీక కావడం విషాదం కాక మరేమిటి’’ అన్నాడు సన్యాసి.
‘‘అన్నీ అంత సీరియస్‌గా తీసుకోవడం ఎందుకు చెప్పండి? ఇవాల్టి కుర్రాళ్ల ఫిలాసఫీయే ‘‘లైట్ తీసుకో!’’ అని. ఏదో సరదాగా ఆడిపాడి-వైస్ ఛాన్సలర్‌గారు ‘యువజన మమేకం’ అయితే- అంత గొప్ప వ్యక్తి-ఎంత సాదాసీదాగా, నిరాడంబరంగా ఉన్నాడో చూడండి! పదవీకాలం ముగిసిందన్న చింత లేకుండా, ఎంత ఆనందంగా చిందులు వేసాడోచూడండి!. ‘లైఫ్‌ను అలా లైట్ తీసుకోవాలి’ అనడానికి ఆదర్శ ప్రాయంగా రికార్డు బ్రేక్ చేసాడనుకోవచ్చు కదా!’’ అన్నాడు సుందరయ్య గుంభనంగా నవ్వుతూ.
‘‘లైట్ తీసుకో, లైట్ తీసుకో అని ‘లైట్’ తీసేస్తే-మిగిలేది చీకటే! డబ్బు, అధికారం చీకట్లోకి నెడుతూండడం వల్లనే-ఇవాళ సమాజం ఇంత ‘అవినీతిమయం’ అయిపోయింది! హింసా,నేరాల ‘మరణ’ మృదంగాలు మోగుతున్నాయి. మీకో సంగతి తెలుసా! ఆయన వి.సిగా వెళ్లకముందే-అసలు ఆయన డాక్టరేట్ ఓ ఫార్స్ అనీ, ఆయన సిద్ధాంత గ్రంథం ఒట్టి ‘ఎత్తిపోతల’ పథకం తప్ప మరేమీ కాదనీ, కాపీకొట్టి ‘స్వయం ఉపజ్ఞ‘ లేకుండా సాధించిందనీ, విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఏం లాభం? రాజకీయపు అండదండలు-తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేయగలవు కనుకనే, అలాంటి మహనీయునికే-‘మనీ’ హయం పరుగుల పుణ్యమా అని-ఒక విశ్వవిద్యాలయ ‘ఉపకులపతి’త్వం వచ్చింది. ‘ఉలకు పలకు’ లేకుండా-ఉతికి ఆరేసుకున్నాడు హోదాని! ‘డాక్టరేట్’ పట్టాల ‘పంపిణీ’ పందేరం సాగిందట! ఇంత రొఖ్ఖానికి ఎంఫిల్, ఇంత సొమ్ముకు పిహెచ్డి అని రేట్లుకట్టి-వ్యాపారం చేసి, కుప్పంలో ‘కుప్ప‘పోసి, టోకున విద్యావ్యాపారం చిల్లర మనుషులతో ‘ఎల్లర మనముల రంజకం’గా సాగిందట.గవర్నర్‌గారే విషయాలు తెలిసి విస్తుపోయారట. అలాంటి వి.సి పదవీ కాలం ముగిసినందుకు నిజంగా సంబరాలు చేసుకోవాలేమో తెలీదుగానీ, ఆయన సన్మానం పేరిట జరిగిన హడావుడి మాత్రం సభ్య సమాజానికి మింగుడుపడేదిగా లేదు. హిజ్రాలతో వి.సి ఆడిపాడి ఆనందించడం ఎంత సరిపెట్టుకుందామన్నా, ఎందుకో ‘లైట్ తీసుకో’లేకపోతున్నాను’’ అన్నాడు సన్యాసి.
‘‘ఒకప్పుడు ‘రికార్డింగ్ డ్యాన్స్’లపై బ్యాన్ ఉండేది! పాపం పొట్టకూటి కోసం ఏ చవితి పందిళ్లలోనో ఇలాంటి డాన్స్‌లు పల్లెల్లో జరిగితే, పోలీసులు పట్టుకు జుల్మానాలు వేసేవారు. ఇప్పుడు టీవీ ఛానల్స్‌లో ‘గేమ్‌షో‘లలో-ఇంటి ఇల్లాళ్ల చేత కూడా, పచ్చిపాటలకు కూడా స్టెప్పులేయించి, వినోదం పేర బహుమతుల ఎరతో, విజృంభింపచేస్తున్నారు! విశ్వవిద్యాలయం స్థాయిలోనూ జరిగిన సభలో-అదే కల్చర్, బ్రేక్ డాన్స్‌ల కన్నా ఎక్కువగా జరగడం, హిజ్రాలకు పెద్దపీట వేయడం చూస్తుంటే-నిజంగానే ఈ జాతి ‘అనర్ధం’వైపు నెట్టబడుతోందని ఋజువుతోంది! నిన్నా, మొన్నల విలువలు పోయి, ‘రేప్’ల విలువలే పెరుగుతున్నప్పడు, అన్నా హజారేలు ఎన్ని రంగాలలో ఎందరు దీక్షాదక్షులు కావాలో, భవిష్యత్ ఏమైపోతుందో వీక్షించాల్సిందే’’ అన్నాడు సుందరయ్య లేస్తూ.
3 comments:
బాగా చెప్పారండీ సుధామగారూ! ఈ డాన్సుల గోలతో తల వాచిపోతోంది.
హిజ్రాలతో డాన్స్ చేయించి ఆయనకూడా వాళ్లలోవాడే అని నిరూపించాలని కార్యక్రమ నిర్వాహకులు అనుకుని ఉంటారు.
"ఇప్పుడు టీవీ ఛానల్స్‌లో ‘గేమ్‌షో‘లలో-ఇంటి ఇల్లాళ్ల చేత కూడా, పచ్చిపాటలకు కూడా స్టెప్పులేయించి, వినోదం పేర బహుమతుల ఎరతో, విజృంభింపచేస్తున్నారు!"
మొన్న ఒక ఛానెల్లో ప్రసారమైన గేంషో చూసి నాకు కుడా ఇదే ఫీలింగ్ కలిగిందండి సుధామ గారు.
Post a Comment