శాస్త్ర సాంకేతికత ఎంతలా పెరుగుతోందో అంతకంతగా మూఢత్వమూ పెరుగుతోందనిపిస్తోంది. హేతువునీ, తర్కాన్నీ-'మౌఢ్యం'మింగేయడం చిత్రంగానే ఉంటుంది’’ అన్నాడు ప్రసాదు.
‘‘దేనికి నాయనా ఈ ఉపోద్ఘాతం’’ అడిగాడు నవ్వుతూ రాంబాబు.
‘‘అమర్‌నాథ్‌లోని మంచు శివలింగం తమ ఫ్రిజ్‌లో కనబడుతోందని ఒకాయన, ఫ్రిజ్‌లోనే పూలు, కొబ్బరికాయలు పెట్టి పూజిస్తున్నాడని పేపర్లో చదివాను! ఫ్రిజ్‌లో నీరు గడ్డకట్టడం మామూలే! మంచుముక్కలు వివిధ ఆకృతుల్లో తయారవుతాయి. ఫ్రిజ్‌లోని ఐస్ కూలింగ్ బాగా పనిచేస్తున్నప్పుడు, అలా శివలింగ ఆకారంలోనూ ఓ మంచుముక్క తయారైనంత మాత్రాన, దాన్ని అమర్‌నాథ్ శివలింగం అనుకోవడం, శివయ్య తన ఫ్రిజ్‌లో వెలిసాడనుకోవడం అవివేకం కాదా’ అన్నాడు ప్రసాదు.
‘‘ప్రతిదాంట్లోనూ పరమాత్మని దర్శించి ఆధ్యాత్మికతానుభూతులకు లోను కావడం గొప్పే కదా! ఈ మానవ శరీరమనే ఉపాధిలో ఉండి, సదా ఆ పరాత్పర ధ్యాన మగ్నం కావడం మంచిదే కదా’’ అన్నాడు శంకరం.
‘‘గాడిద గుడ్డేమీ కాదూ!...దేనికయినా ఒక హద్దుంటుంది. విశ్వాసం మంచిదే! కానీ అది‘మౌఢ్యం’గా మారితే ఎలా? ఫ్రిజ్ ఏమీ-పూజా మండపం కాదు కదా! శివలింగాకృతి కన్పించినంత మాత్రాన, ఓ ఐసుగడ్డను పట్టుకుని, దేవుడని పూజించడాన్ని మించిన ‘స్టుపిడిటీ‘ ఉంటుందా?’’ అన్నాడు ప్రసాదు చిరాకుగా.
‘‘తనయందు,సర్వభూతములయందు దైవ భావన చేసి తరించడం అందరివల్లాసాధ్యమయ్యే పనికాదుకదా! నీకు పిచ్చిగా తోచినంత మాత్రాన, వారి భావనను తప్పుపట్టడం ఏమిటి’’ అడిగాడు శంకరం.
‘‘ఇప్పటికే కుహనా స్వాములూ, భక్తులతో దేశం కిటకిట లాడుతోంది. ఏ ముహుర్తాన గజ్జెల మల్లారెడ్డి రాసారోగాని ‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది-డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్‌గా మారుతోంది’’ అన్నది యదార్థం అనిపిస్తోంది! నిశ్చల భక్తి వేరు. భక్తిపేరిట చేసే చే ష్టలు వేరు. ‘నోవాపాన్’లాంటి ఏ చెక్కనో వెనకపెట్టి, ఓ దేవుడి ఫోటో ఫ్రేమ్ కట్టిస్తే కొద్దిరోజులకు ఆ చెక్కవల్ల-ఫోటోనుండి ‘పొడి’ రాలుతుంది. అది బూడిద అనీ, ఆ ఫోటోలోని దైవం కరుణించి ప్రసాదిస్తున్నాడనీ అనుకునే భావన కొందరిది!’’ అన్నాడు ప్రసాదు.
‘‘వారి విశ్వాసాలు వారివయ్యా! అందువల్ల నీకొచ్చే నష్టం ఏమిటి చెప్పు? నువ్వు నమ్మకు. నీ హేతువూ, నీ తర్కమూ, నీ సైన్సూ నీకు ఎలాగూ ఉన్నాయి కదా! అది ‘మూఢ విశ్వాసం’ అయితే, అది వారికుంది అనే అనుకో! అందువల్ల వారికి శాంతీ, ఆనందమూ లభిస్తుంటే ఎదుటివారి ఆ సంతృప్తిని పోగొట్టే అమానవీయత నీకు మాత్రం ఎందుకు? ‘చేపమందు’ మందు కాదని పెద్దఎత్తున చైతన్య ప్రబోధాలు చేశారు. అందువల్ల వచ్చే జనం తక్కువై ఉండవచ్చు.కానీ ఇప్పటికీ దానివల్ల తమకు ఉపశమనం కలిగిందని, ఆ చేప ప్రసాదం సేవించడానికి ఏటా తరలివచ్చేవారు ఉండనే ఉన్నారుకదా!’’ అన్నాడు శంకరం.
‘‘శంకరం! చూస్తూ చూస్తూ మౌఢ్యం ఎలా పెంచి పోషిస్తామయ్యా! తెలియక ఒకడు తప్పుదారిన పోతుంటే-‘‘వాడి ఖర్మ! వాడే తెలుసుకుంటాడులే’’ అని వాడి మానాన వాడిని వదిలేయడం కూడ తప్పే కదా! చెప్పి చూడడం మన ధర్మం కాదా! శ్రీకృష్ణుడంతటి వాడే ''చెప్పడమేనా ధర్మం! వినకపోతే నీ ఖర్మం'' అన్నాడు. అంచేత ‘ధర్మచ్యుతి’ జరుగుతున్నప్పుడు, ‘’ మౌఢ్యం పెరుగుతున్నప్పుడు, మౌనం వహించడం కూడా చేటే! మేధావులూ, జ్ఞానవంతులూ నోరు విప్పక, క్రియా శూన్యమవడంవల్లనే దేశం ఇంత పతన స్థితికి చేరుకుంటోంది. ‘అవినీతిని’ పెంచి పోషించింది మనం కాదా! ఇవాళ అది ‘మేటలు’ వేసిందని గగ్గోలు పెడుతున్నాం! నీ పని కానిచ్చుకునేందుకు నువ్వే ‘లంచం’ ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. ఏమాత్రం నియమానికి కొంత సడలింపు అవసరమైన విషయమైనా పనిని సానుకూలం చేయించేందుకు ‘లంచం‘ ఎరవేయడం, మరో సర్వసాధారణం అయిపోయింది.దీనిని అరికట్టడానికి ముందుకు వచ్చే వాడిని వింతగానూ, విడ్డూరంగానూ చూడడమూ జరుగుతోంది’’ అన్నాడు రాంబాబు.
‘‘మనం ఎంత ఆక్రోశించినా, సమాజ గతిని మార్చడం అంత సులభం కాదర్రా! నిజం చెప్పాలంటే-‘విశ్వాసం’ అనేదే శాసిస్తోంది. ‘డబ్బుతోనే ఏ పనులైనా అవుతాయి. కొండమీద కోతయినా డబ్బు వల్లే దిగి వస్తుంది’ అన్న ‘విశ్వాసం’ నేడు ప్రబలింది. ఆనందంకన్నా, సుఖంకోసం వెంపర్లాటలు పెరిగాయి. ‘తృప్తి’ పడిన వాడు చేతకానివాడుగా, ఎదుగుదల లేనివాడుగా భావింపబడుతున్నాడు. ‘అసమర్ధునిగా’ తలంపబడుతున్నాడు! అందువల్ల ఇలాంటి ధోరణులు ప్రబలుతున్నాయి. పాపం పెరిగితే, ‘పాపభీతి’ కూడ పెరుగుతుంది. అన్యాయాలు, అక్రమాలు ఎంతగా పెరిగితే, సమాంతరంగా ఆధ్యాత్మికత, భక్తి కూడ పెరుగుతుంది. అది నైర్మల్యంతోనూ, చిత్తశుద్ధి తోనే జరుగుతుంది అనుకోలేం! ఒక ‘విధి’గా, తనకు తాను ‘సర్ద్ది’ చెప్పుకునే వైఖరిగాను విస్తరించవచ్చు. దేవుళ్లు కూడా-నేలమాళిగల్లో అనంత సంపదతో బయటపడుతుంటే, సామాన్యుడు నేలబారుగా జీవించాలని ఎలా అనుకోగలుగుతాడు! బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకాలనే కాంక్షే ఉంటుంది! పునర్జన్మ ఉందో లేదో. ఈ మనుషులూ, మనసులూ అప్పడేమవుతాయో ఎలాగూ, ఏమీ తెలియనప్పుడు, సంఘరీతికీ, లోకరీతికీ విరుద్ధంగా-‘నన్ను ముట్టుకోకు’ అన్నట్లు...ఎవరయినా ఎలా ఉండగలుగుతారు? ఇవాళ జన్మదినమైన దాశరథి గాలిబ్ గీతానువాదంలో అన్నట్లు-
‘‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము
నరుడు నరుడౌట ఎంతొ దుష్కరము సుమ్ము’’
అన్నదే నిజం! మనిషి-ముందు ‘మనిషి’ అయితే, మానవాతీతమైన ‘దైవికం’ సంగతి తరువాత!’’ అంటూ లేచాడు శంకరం. *
0 comments:
Post a Comment