ఒక బూజుకర్ర కావాలి
అప్పుడు రాజుని దులిపిన అగ్నిధారా సదృశ
కవికంఠ గత అగ్నివీణ మ్రోగాలి
ఈ బూజును పీచు మిఠాయిగా నమ్మిస్తున్న
అవివేకాన్ని దులపడానికైనా
నాకు చైతన్య హస్తం కావాలి
మొండి గోడలే కాదు మొండి చేతులూ చూసి చూసి
ఈ తొండి ఆటకు విసుగెత్తిపోయాను
ఒకరు మీద ఒకరు ఎందరొచ్చినా
గదులు శుభ్రం చేసినవారెవరూ లేరు
ఎవరికివారు తమ కుర్చీ తమ బల్లా చూసుకున్నారేగానీ
గదిని వాసయోగ్యంగా మొత్తంగా మలచనే లేదు
పనిమనిషి రాలేదు ఎవరూ
తట్టెడు అంట్లు అలానేవున్నాయి
గదులూడ్చి ఎన్నాళ్ళయిందో
అద్దం నిండా మరకలే
తమాషా ఏమిటంటే ఇల్లు నాదే కానీ
ఇల్లాలూ మాట వినదు
సొంత ఇల్లే అద్దె కొంపలా మారింది
అతిథులు వస్తున్నారు పోతున్నారు
గేహంలో దేహంతో విశ్రమిస్తున్నారు
సందేహాలు మాత్రం అలానే వున్నాయి
భోంచేసినవాడు వాసాలు లెక్కిస్తున్నాడుగానీ
పట్టిన బూజు దులిపేందుకుకెవడూసమకట్టడంలేదు
ఔనౌను అన్నట్లు
ఇల్లువూడ్చే యంత్రం ఒకటుంది
అది నడిచే యంత్రాంగమూ పేరుకు వుంది
విద్యుత్తు లేనప్పుడూ
నడిపించగల విద్వత్తు లేనప్పుడూ
పరిశుభ్రత ఎలా సాధ్యం
గొట్టాలలోని గాలి వూదేదో
లోలోపలికి దుమ్మును పీల్చేదో
ద్విధాప్రయుక్తమైన దశలో
అసలు యంత్రాన్ని పనిచేయించి
దానికైనా చేతితోనే బూజులు పట్టిన
మూలమూలల్లోకి సారింపజేయాలి కదా!
అసలు బూజు ఎక్కడుంది
అంతా నీ భ్రమ అంటాడొకడు
గది నేల చూడు ఎంత అద్దంలా మెరుస్తోందో అంటాడొకడు
గోడకు వ్రేలాడుతున్న వర్ణచిత్రాలు చూడమంటాడొకడు
అంతా బానే వుంది అంటే
నా గదిలోనే నాకు శ్వాస ఎందుకు ఆడడం లేదు
దుమ్మూ, బూజులూ వల్ల కాకపోతే
నాకీ దమ్మురోగం ఎందుకొచ్చినట్లు
దమ్మున్నవాడిని కాబట్టే
బూజు దులపాలంటున్నాను
యంత్రం వున్నా పవర్ కట్ అయినప్పుడు
వాక్యూం క్లీనర్లు కాదు
చేత చీపురుకట్టే నయం నేలవూడ్ఛేందుకు
పొడుగాటి బూజుకర్రేనయం
గది పైపై మూలలన్నీ కూడా శుభ్రపరిచేందుకు
ఒక్కొక్క వాక్యమూ
ఒక్క ఈనె లాగా
నా నిటారుతనమే ఒక గడకర్రలాగా
ఎవరికోసమో ఎదురుచూడడం కాదు
నా గదిని నేనే శుభ్రపరుచుకుంటా
తప్పదు
అంతరాల తరతరాల బూజు దులపడానికి
నేనే బూజుకర్రనవుతా
నా గదికేకాదు
వ్యవస్థాగతపర్యావరణ పరిశుభ్రతకే
పనిముట్టుగా మారుతా.
**
3 comments:
Wahhh..Chala baagundi.. sudhamagaru.
Krishna sastri gari paata undiga..ENTHA TUDICHINA EGASIPADADAME INTHA TARAGADE EE DHULI ani..Intaki bujukarra dorikinda leda?
baavundi
ఈ "బూజుకర్ర" గేయం నాచేతచాలాసార్లుచదివించారు.పాఠం చదవని మొండి విద్యార్ధిని మేష్టారు బెత్తం లేకుండా చదివిన్చినట్లు.
ఈ గేయంలో ఎవరికి వారు తమలో పేరుకున్న స్వార్ధం బూజును నిజాయితీగా దులుపుకుని "బ్రతుకు! బ్రతికించు" సత్యాన్నిఆచరణ లోకి తెచ్చు కోవాలన్న మేలుకొలుపు కలిగించారు.
"నవయుగ వైతాళికులు" గద!
Post a Comment