ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 22, 2011

పులిట్జర్ నవలామణి

పులిట్జర్ నవలామణి

"నవలా-అంటేనే ‘స్ర్తి’ అని అర్థం! ఒకప్పుడు ఆడవాళ్ళు రాసిన నవలలకే చాలా ఖ్యాతి ఉండేది. తరువాత మగరచయితలు కొందరు పేరు తెచ్చుకున్నా, అసలు పఠానాభిలాషకు పాదులు వేసిన రచయత్రిలకే - పాఠకులలో ఇప్పటికీ గొప్ప గుర్తింపు వుంది’’ అన్నాడు సన్యాసి.

‘‘కథ కన్నా నవల కాన్వాస్ చాలా పెద్దదర్రా! ఏదో ఒక రంగం గురించో, ఒక వాతావరణం గురించో పరిశోధనాత్మకంగా మగరచయితలు రచన చేయగలరు గానీ, మానవ సంవేదనలను బాగా పట్టుకుని, వివిధ పాత్రలతో, బహుముఖీన పరిశీలన, ఆ పరిశీలనను పదగురికీ పంచగల అభివ్యక్తి, అతివలకు అద్భుత విద్య అనిపిస్తుంది నాకు’’ అన్నాడు సుందరయ్య.

‘‘వేగవంతమైన నేటి ప్రపంచంలో అసలు పుస్తక పఠనమే తగ్గుతుండగా, కథలు, కవిత్వం రాజ్యమేలినంతగా, నవలలు రావడం, ఆదరణకు నోచుకోవడం గగనమే అయిపోతోంది! బహుశాః చిన్నాళ్ళ తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ‘సలీం’ హెచ్.ఐ.వి. సబ్జెక్ట్‌మీద రాసిన ‘కాలుతున్న పూలతోట’కు వచ్చింది’’ అన్నాడు శంకరం.

‘‘కానీ, కాల్పనిక సాహిత్యంలో ప్రపంచ ప్రతిష్ఠాత్మక మైన ‘పులిట్జర్’ అవార్డు నువ్వనట్లు సన్యాసీ ! ఈ మాటు ఓ ‘నవలామణికే’ వచ్చింది. జెన్నిఫర్ ఈగానే రాసిన ‘ఎ విజిట్ ఫ్రమ్ ది గూన్ స్క్వాడ్’ పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది. ఆమె వయస్సు 48 సంవత్సరాలే. సృజనాత్మక రచయిత్రిగా పేరుగాంచిన ఆమెకు ఈ ఏడాది మొదట్లోనే నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ ప్రైజ్ కూడా లభించింది’’ అన్నాడు సుందరయ్య.

‘‘ఈ కంప్యూర్ యుగంలోనూ ‘నవల’కు అంతటి ఆదరణ లభించడం విశేషమే మరి’’ అన్నాడు శంకరం. ‘‘నాన్ ఫిక్షన్‌లో క్యాన్సర్ గురించి రాసిన ప్రవాస భారతీయుడు సిద్ధార్థ ముఖర్జీకి, ఫిక్షన్‌లో ఆమె రాసిన నవలకూ వచ్చాయన్నమాట!’’ అన్నాడు.

‘‘1962 సెప్టెంబర్ 6న ఇల్లినాయ్ రాష్ట్రం లోని చికాగోలో పుట్టిన అమెరికన్ నవలా రచయిత్రి - జెన్నిఫర్ ఈగానే! బ్రూక్లిన్‌లో నివసిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగి, పెన్సిల్వీనియా, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో చదివింది. భర్తతో, కుమారులతో హాయిగా కుటుంబ జీవనం గడుపుతూనే ఆవిడ రచయిత్రిగా ఎదిగింది. ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్‌లో రచనలు చేస్తుంటుంది. ఓ కథా సంపుటి, నాలుగు నవలలు రాసిన జెన్నీఫర్ 2001లోనే తాను రాసిన ‘లుక్ ఎట్‌మి’’ నవలకు నేషనల్ బుక్ అవార్డు దాదాపుగా గెలుచుకునే తుదిదశదాకా వెళ్ళింది’’ అన్నాడు సుందరయ్య.

‘‘అది సరేగానీ, ఈ ప్రైజ్ వచ్చిన నవలలోని అసలు విశేషం ఏమిటంటే? నువ్వేమయినా చదివావా సుందరయ్యా!’’ అని అడిగాడు శంకరం.

‘‘గోపాలం మామయ్య చెప్పాడు. తను ఇలాంటి విషయాలు విడమరచడంలో అఖండడు కదా! విశేషం ఏమిటంటే - నవల అంటే ఏదో ఒక జీవితాన్ని సమగ్రంగా చిత్రించేది అన్న భ్రమే మనలో చాలా మందికి. ఆ తరహాను పటాపంచలు చేసిన నవలలు అమెరికన్ సాహిత్యంలో ఈ మధ్య చోటుచేసుకుంటున్నాయి. ‘ఎ విజిట్ ఫ్రం గూన్ స్క్వాడ్’ అనేక పాత్రలతో, భిన్న ప్రవృత్తులతో, ముఖ్యంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, కాలంలో, సంగీత ప్రపంచంలోని సంవేదనలనూ, వాస్తవిక సంఘర్షణలనూ, సంగీత వ్యాపార ధోరణులను ఎంతో పఠనీయంగా రాసిన నవల. సంగీతం గురించి సాహిత్యంలో నవలలు తక్కువే! మ్యాజిక్ ఇండస్ట్రీ పరిణామాన్ని ప్రతిభావంతంగా ఈ నవలలో తను చిత్రించిందిట’’ అన్నాడు సుందరయ్య.

' ‘సంగీత సాహిత్యాల సమలంకృతి’కి సహృదయుల సమాదారణ సదా బావుంటుందర్రా! మన ‘శంకరాభరణం’ చిత్రం తెలుగులో సంప్రదాయ సంగీతానికి కాలానుగుణంగా ఒనగూరుతున్న చేటుని గురించేగా చర్చించింది! తెలుగు చలనచిత్రాలలో ఒక మైలురాయిగా మారిన ఆ సినిమా తరువాత, మళ్లీ, ఎందరో మన కర్ణాటక సంగీతంపట్ల ఆసక్తిని పెంచుకున్న దాఖలాలు కూడా చూసాం కదా’’ అన్నాడు సన్యాసి.

‘‘జెన్నీఫర్ ఈగాన్ నవల కూడా - కాలానుగుణంగా సంగీతం గురించీ, జీవితానికీ సంగీతానికీ గల అవినాభావ సంబంధం గురించీ భిన్నమైన పాత్రలతో సహజసిద్ధంగా రాసిందట. భవిష్యత్తులోకి ఆశగా తొంగిచూస్తూ, వర్తమానాన్ని ఎలా ఎదుర్కొంటాం అనే వైఖరిని పొగడించింది. నవల అనగానే కొన్ని అధ్యాయాలుగా, ఆ అధ్యాయాలలో కథ, పాత్రలు కొనసాగింపుగా ఉండడం అనే పద్ధతికి భిన్నంగా - ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం, భిన్న పాత్రలు, భిన్న సంవేదనలతో ఓ కంప్యూటర్‌లో ‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్’లాగా ఈ నవల సాగడమే దాని విజయానికి కారణంట. తమాషా ఏమిటంటే - ఈ నూతన సాంకేతికతకు తానేమీ విభ్రమం చెందినదాన్ని కాదనీ, ఇప్పటికీ తాను చేతితోనే రాస్తాను అనీ జెన్నిఫర్ ఈగాన్ చెప్పడం గుర్తించదగింది’’ అని వివరించాడు సుందరయ్య.

‘‘ ఔనా!’’ అని ఆశ్చర్యపడ్డారు మిత్రులు.

‘‘కలం పట్టి రాయడానికీ, కంప్యూటర్‌లో నేరుగా రాయడానికీ సృజనాత్మకతలో తేడా వుండి తీరుతుందనడానికి తనే ఒక ఉదాహరణ! అలాగే - బుక్ కల్చర్‌ను పోగొట్టుకుని, లుక్ కల్చర్ పెంచుకుంటున్నవాళ్ళూ, రచనకు కాగితం కలం అనవసరం అని అనుకుంటున్నవాళ్ళూ - పులిట్జర్ బహుమతి తన నవలకు పొందిన, జెన్ని ఫర్ అనుభూతిని పట్టించుకోవడం సబబు!’’ అన్నాడు శంకరం. ‘‘నవీన సాంకేతికావకాశాలు వేళ్ళకు బంగారు ఉంగరాలు సమకూరుస్తున్నాయి అని సంతోషిస్తున్నామేగానీ, మణికట్టు దగ్గర నరాలనే బలహీనం చేసేయగలను అన్న ప్రమాదాన్ని గుర్తించి మసులుకోవడం మేలేమో!’’ అంటూ లేచాడు సన్యాసి.

2 comments:

Vijayagopal said...

చాలా బ్లాగుంది.

Durga said...

సుధామ గారు,
పులిట్జర్ బహుమతి గెలుచుకున్న రచయిత్రి గురించి మీరు రాసినది చదివిన తరవాత వెంటనే ఆ పుస్తకం తెచ్చుకుని చదవాలనిపిస్తుంది. అరవింద్ అడిగ, బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారత రచయిత రాసిన రెండవ నవల ' బిట్విన్‌ ది అసాసినేషన్‌స్,' చదువుతున్నాను. అది కాగానే తెచ్చుకుని చదువుతాను. ఆ రచయిత్రి గురించి, ఆమె రాసిన నవల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు!