ఆంధ్ర పురాణ కర్త, ప్రముఖ కవి పండితులు కీ.శే.మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి శత జయంతి సమాపనోత్సవ సభ మార్చి 5న,కాకినాడ దగ్గర పల్లిపాలెము గ్రామంలో జరుగనుంది. ఈ సందర్భంగా వారు సంపాదకునిగా 1939లో వెలువడిన ‘ఆంధ్రి’ సారస్వత పత్రికా విశేషాలతో కూడినవ్యాసం పాఠకులకు ప్రత్యేకం.
*
అక్షరామృత ఛందస్సుందరమైన ‘ఆంధ్ర పురాణ’కర్తగా, మాధుర్యధురీణ కావ్యకవితా నిత్యోత్సవ శ్రీ కళాధాములు నూర్గురి అమృతగాథా జ్యోతులనీనే ‘ఆంధ్ర రచయితలు’ గ్రంథ రచయితగా, ఆంధ్ర సాహితీ సామ్రాజ్య కవిత్వ ‘మధుకోశము’గా కీర్తిగాంచిన మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు విద్వత్సంపాదక ‘ఆంధ్రీ’మయమూర్తి. ఒక కవి, పండితుడు ఒక సారస్వత పత్రిక సంపాదకునిగా రాణ్మహేంద్రవరము రాకముందే గ్రామం పల్లిపాలెంలో ఆయన రాణకెక్కారు.
తెలుగు సాహిత్య చరిత్ర వైభవప్రాభవాలకు కేవలం మహనీయ వ్యక్తులే కాదు, స్థల కాలాదులు కూడా వారి ఉనికి పట్టులుగా సంస్మరణీయాలే, సంస్తవనీయాలే! అలా మధునాపంతులవారు ఆంధ్ర పురాణం రచించిన పల్లిపాలెము- ‘ఆంధ్రి’ సారస్వత మాసపత్రిక ఆవిర్భావ కార్యస్థలిగా కూడా భాసించింది. నిజానికి గ్రామాలలో విద్యావ్యాప్తి కలిగించాలనే సంకల్పంతోనే, తమ గ్రామంలో, చుట్టుపట్లనున్న పల్లెటూళ్ళలో- ఆంధ్ర భాషావ్యాప్తిని పాఠశాల నెలకొల్పి బాలబాలికలకు సంస్కృతాంధ్రాలు బోధించడానికీ, అనుబంధంగా ఒక గ్రంథాలయం స్థాపించి గ్రంథాలనూ, వార్తాపత్రికలను ఉచితంగా పఠించే అవకాశం, ప్రోత్సాహం కల్పించడంకోసమూ బహుధాన్య సంవత్సరంలో 1938లో అప్పటి కాకినాడ తాలూకా పల్లిపాలెము గ్రామంలో మధునాపంతులవారు ‘ఆంధ్ర కుటీరం’ స్థాపించడం ఒక ఉజ్జ్వల వైభవ ఘట్టం.
విద్యాబోధన, గ్రంథాలయం, విద్యార్థులకు గ్రామస్తులకు వివిధ విషయములు బోధపడుటకు సభలు జరిపి, ఉపన్యాసములిప్పించడం, నీతి, మత, సాంఘికాచారాదులను గురించిన కథలు, కావ్యములను ప్రచురించి భాషాజ్ఞానాభివృద్ధికి సహాయపడటం, క్రమంగా ఒక చిన్న పత్రిక నెలకొల్పి తద్వారా కూడా విద్యాప్రచారం చేయాలన్న మహోద్దేశ్యములతో ‘ఆంధ్ర కుటీరం’ స్థాపించబడింది. సంకల్పించిన విధంగానే కొందరు వదాన్యుల సహకారంతో పాఠశాల, గ్రంథాలయం ఏర్పడి అభివృద్ధి చెందసాగాయి. పాఠశాలలో ప్రతిదినం ఉదయం ‘ఆంధ్రీప్రార్థన’తో ప్రారంభించి సాయంకాలం ప్రార్థన మంగళ గీతాదులతో ముగించే సంప్రదాయం, అలాగే పెద్దతరగతి విద్యార్థులు చిన్నతరగతుల వారికి పాఠాలు చెప్పడం అనే పద్ధతి పరికల్పనం చేశారు. వ్యాస రచన, ఉపన్యాస శిక్షణ, పత్రికాపఠనం వంటి అలవాట్లు పిల్లలకు కలిగించారు. నూలు వడకించటం, వృత్తివిద్యలకు పూనుకోవడం అనే గ్రామాభివృద్ధి పనులకు కూడా సంకల్పం చేశారు.
‘ఆంధ్ర కుటీరం’ ద్వారా మధునాపంతులవారి ఈ ఆశయ తత్పరత, సేవాసరణి నాటి పిఠాపురం సంస్థానంలో విద్వత్కవిగా వుండిన శతావధాని ఓలేటి వేంకటరామశాస్ర్తీగారిని ఎంతగానో ఆకట్టుకుంది. వారి జన్మస్థలం ‘పల్లిపాలెము’ కావడంవలన తమ గ్రామం పట్ల అభిమానంతోనూ, మధునాపంతుల వారిపట్ల వాత్సల్యంతోనూ ‘ఆంధ్ర కుటీరం’కు అండగా నిలవడమేకాక ‘ఆంధ్రి’పత్రికా ప్రచురణకు ప్రోత్సహించి ఆలంబనమై నిలిచారు.
1939 జనవరి ‘ఆంధ్రి’ ప్రథమ సంచిక మచ్చునకై ప్రకటింపబడింది. ఆపై 1939 ఏప్రిల్ ప్రమాథి నామ సంవత్సరం వైశాఖంనుండి, ‘ఆంధ్రి’ మాస పత్రికగా మూడు సంవత్సరాలపాటు పత్రికాప్రపంచంలో తనదైన ముద్రతో తెలుగు సారస్వత సేవలో మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారి సంపాదకత్వంలో చిరస్మరణీయ చరిత్ర సృష్టించుకుంది. పంతొమ్మిదేళ్ళ వయస్సులో సంపాదకునిగా రాణించిన ఘనత మధునాపంతుల వారిదే. 1938నాటికే ఆయన ‘తోరణం’ కావ్య సంపుటి వెలువడింది. ‘ఆంధ్రి’ పత్రికా సంపాదకత్వం వహించిన మూడు సంవత్సరాలూ వెలువడిన ముప్ఫైఆరు సంచికల కాలంలోనూ ఆయన దానికే అంకితమైపోయిన ‘ఆంధ్రీ’మయమూర్తి. ‘ఆంధ్రి’ నిజముగా అప్పుడు తెలుగునేలకు చేసిన సేవ అమూల్యమైనది. ‘ఆంధ్రి’ వెలువడిన నాటికి తెలుగువారికి తమదైన రాష్ట్రం లేదు. ఏర్పడగలదన్న ఆశ కూడా పొడచూపక గ్రాంథిక, వ్యావహారిక భాషావాదాల నడుమ పెద్ద గుంజాటనలు సాగుతున్న రోజులు అవి. గ్రాంథిక ఆంధ్రము తెలిసి, విశిష్ట ప్రయోజనమునకై వ్యావహారికమును ఆదరించేవారూ, గ్రాంథికం మొగమెరుగక వ్యావహారికం పట్టుకుని ఊగులాడేవారు కవి పండితులలో నాటికే వున్నారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీ, వేలూరి శివరామశాస్ర్తీ, గిడుగు, శ్రీపాద, విశ్వనాథ గ్రాంథికంలో మహోన్నత విశారదులై వ్యావహారికాన్ని ఆదరించినవారే! అలాంటి శక్తిసామర్థ్యలు లేని వ్యావహారిక రచయితలూ వుండేవారు.
పూర్వాంధ్ర మహాకవుల కావ్యాలతోటీ, భాషతోనూ వున్న సంబంధం తెగిపోకూడదనీ, భాషావైశిష్ట్యం నిలచి వుండాలనీ ‘ఆంధ్రి’ మహత్త్వ పటుత్వ సంపదను నిలబెట్టాలనే పట్టుదలతోనే మధునాపంతులవారు పత్రికా నిర్వహణం చేశారు. వారి విద్వత్సంపాదక మూర్తిమత్వాన్ని పునశ్చరణ చేసుకోవడం ఈ శత జయంతి సమాపన సందర్భంలో ఔచితీమంతం.ఒక సాహిత్య పత్రిక నిర్వహించడం నాటికీ నేటికీ కత్తిమీద సాములాంటిదే! అందునా ఒక స్థిరమైన ఆశయంతో సంకల్పంతో నిర్వహించడం, పత్రికా సంపాదకుడు స్వయంగా కవీ, రచయితా అయివుండి సాటి రచయితలనూ, కవులనూ నిష్పాక్షికంగా, నిజాయితీగా సమాదరించటం, ప్రసిద్ధులను గౌరవించడం కొత్తవారిని ప్రోత్సహించడం అలవోక విషయమేమీకాదు. సంపాదకునిగా మధునాపంతులవారు అనుసరించిన బాట ఒక ఒజ్జబంతి వంటిదే! ‘ఆంధ్రి’ పత్రికా విశేషాలు, విశిష్ఠతలు కొన్నింటిని ఈతరం పాఠకులు అందుకోవాలనే ఈ రచనోద్దేశ్యం.
మధునాపంతులవారు ‘ఆంధ్రి’ పత్రికలో పల్లిపాలెము గ్రామ చరిత్రను ఓలేటి వేంకటరామశాస్ర్తీగారి ద్వారా వెలయించారు. వేంకట రామకృష్ణ కవులుగా పేరొందిన మేనత్త మేనమామల పిల్లల్లో కృష్ణకవిగారు ముందే దివంగతులయ్యారు. ఓలేటి వెంకట రామశాస్ర్తీగారు కూడా పిఠాపురం ఆస్థాన కవులుగానే ప్రసిద్ధికెక్కినవారు. వారే ‘ఆంధ్రి’కి సర్వాధ్యక్షులు. పిఠాపురం మహారాజావారి ఆదరణపొందిన వీరు శ్రీ చర్ల నారాయణశాస్ర్తీ గురువుగా చెప్పుకున్నారు. చెళ్ళపిళ్ళవారు తనను శిష్యుడనడం కూడా నచ్చక ఆ విషయంలో నాడు వాదులాడుకున్న సందర్భాలు కూడా వున్నాయని శ్రీపాద కృష్ణమూర్తిగారు పేర్కొన్నారు.
మధునాపంతుల వారి పట్ల అపార ప్రేమాభిమానాలుకల ఓలేటి వెంకట రామశాస్ర్తీగారి పిఠాపురంలోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షరశాలలోనే ‘ఆంధ్రి’ పత్రిక ప్రచురణ జరిగేది. ‘ఆంధ్రి’కి అభిరక్షక ప్రభువులుగా శ్రీ పిఠాపురం మహారాజావారు, జయపురం మహారాజావారు, పిఠాపురం యువరాజావారు, వేంకటాద్రి అప్పారావుగారు, మంత్రిప్రగడ భుజంగరావుగారు, చెలికాని సీతారామచంద్ర మధునందన రావుగారు పేర్కొనబడేవారు. సహాయ సంపాదకులుగా కొన్ని సంచికలలో విద్వాన్ పాలెపు వేంకటరత్నముగారిని పేర్కొన్నారు.
‘ఆంధ్రి’ని తమ రచనలతో అలంకరించిన ప్రముఖులలో జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మగారితో సహా నాటి ప్రముఖ కవి పండితులుగా పేరొందిన కుప్పా ఆంజనేయశాస్ర్తీ, కందుకూరి ఈశ్వరదత్తు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ, బెల్లంకొండ చంద్రవౌళి శాస్ర్తీ, చెఱుకుపల్లి జమదగ్నిశర్మ, జాషువా, కూచి నరసింహం పంతులు, చిలుకూరి పాపయ్యశాస్ర్తీ, జంధ్యాల పాపయ్యశాస్ర్తీ, జయంతి రామయ్య, గోనుగుంట పున్నయ్య, నండూరి బంగారయ్య, జమ్మలమడక మాధవరామశర్మ, ఆకొండి రామమూర్తి, కొండురి కొండురి వీరరాఘవాచార్యులు, దివాకర్ల వేంకటావధాని, ఓలేటి వెంకటరామశాస్ర్తీ, ఈయుణ్ణి వీరరాఘవాచార్యులు, పాలెపు వెంకటరత్నం, పన్యాల వేంకట రంగనాథరావు, ద్విభాష్యం వేంకట రమణయ్య, వసంతరావు వెంకటరావు, నిడదవోలు వేంకటరావు, పులివర్తి శరభాచార్యులు, వేలూరి శివరామశాస్ర్తీ, తుమ్మల సీతారామమూర్తిచౌదరి, కాశీభట్ల సుబ్బయ్యశాస్ర్తీ, ద్విభాష్యం వేంకటరావు, అల్లమరాజు సోమకవి, అల్లంరాజు రంగనాయకులు వంటి వారు ఎందరోవున్నారు. సంపాదకులు అయివుండీ మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు ‘తెలుగుబిడ్డడు’ అనే కలం పేరుతో ఆంధ్రాభిమానోద్దీపక కవితలను అద్భుత ఛందస్సుందర పద్యాలుగా రాసేవారు. ‘ఆంధ్రాభ్యర్చనము’ పేరున తెలుగు మహనీయులపై ప్రత్యేక పద్యాలను ‘ఆంధ్రి’లో రాశారు.అంతేకాదు! ‘ఆంధ్ర రచయితలు’ గురించిన వ్యాసాలు ‘ఆంధ్రి’లోనే రాయడం ప్రారంభించారు. ఈ వ్యాసపరంపరే ఆ తరువాత ‘ఆంధ్ర రచయితలు’ సంపుటాలుగా విస్తరించి అనేక ముద్రణలు పొందాయి. ‘‘ఆంధ్రదేశమున సుప్రసిద్ధులైన యధునాతన రచయితల సంక్షిప్త చరిత్రాంశములకు ‘ఆంధ్రి’ మాసమాసము నవకాశము కల్పింపనున్నది’’ అని పేర్కొంటూ మొదటగా జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారి గురించి ఏప్రిల్ 1939 సంచికలో ఈ వ్యాసపరంపర మొదలయింది. ఆ పరంపరలో వరుసగా విశ్వనాథ, చిలుకూరి నారాయణరావు, పానుగంటి, చిలకమర్తి, వేలూరి శివరామశాస్ర్తీ, వేదం వెంకటరాయశాస్ర్తీ, జయంతి రామయ్య పంతులు, వేంకట రామకృష్ణ కవులు, శ్రీపాదకృష్ణమూర్తిశాస్ర్తీ, చిలుకూరి వీరభద్రరావు, వడ్డాది సుబ్బారాయుడు, తిరుపతి వెంకట కవులు గురించి ‘ఆంధ్రి’లోనే రాశారు. మరొక విశేషం ఏమిటంటే ఈ ఆంధ్ర రచయితలు శీర్షికనే ‘ప్రభుప్రకరణము’ అంటూ ప్రత్యేకంగా నాటి సంస్థానాధిపతులుగా వుండి సాహిత్య రచనలుచేసిన ఏలూరు జమీందారు ‘మంజువాణి’ అనే పత్రికను సైతం నిర్వహించిన శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగారావుగారి గురించి, జయపురం సంస్థానాధీశులైన మహారాజా శ్రీ విక్రమదేవవర్మ బహద్దురువారు గురించి, పిఠాపురం మహారాజా శ్రీ రావు వేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దరువారు గురించి, ఉయ్యూరు మహారాజా వేంకటాద్రి అప్పారావు బహద్దూరువారి గురించి పిఠాపురం యువరాజా అయిన రావువేంకటకుమార మహీపతి గంగాధర రామారావు బహద్దరు వారి గురించి ఇలా వరుసగా వ్యాసపరంపరలు రాసారు. అభిరక్షక ప్రభువులుగా ‘ఆంధ్రి’కి పేర్కొనబడినవారే వీరంతా. అలాగే కపిలేశ్వరపురం మహారాజా శ్రీ బలుసు బుచ్చి సర్వారాయడు జమీందారువారు కూడా ‘ఆంధ్రి’ని సమాదరించారు.
యుద్ధదినాలలో కూడా ‘ఆంధ్రి’ పత్రికను నడిపిన ఘనత మధునాపంతుల వారిది.
‘ఆంధ్రి’ పత్రికలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే- పత్రికలో ప్రచురితమైన రచయితల ప్రతి రచనపైనా ఎక్కడికక్కడే సంపాదకుడి వ్యాఖ్య సంతరించబడటం. నిజంగా ఇదొక సాహసమే! కానీ మధునాపంతులవారు చేసి చూపారు. ప్రశంసిస్తే రచయితలు పరవశిస్తారు నిజమే కానీ ఏమాత్రం లొసుగులు, నెరసులు ఎత్తిచూపినా రచయితలు సహించడం కష్టం. కానీ రచనలోని బాగోగులు తెలిసేదెలా? మధునాపంతులవారు పంతొమ్మిదేళ్ళ ప్రాయపు సంపాదకుడై వుండీ తనకంటె పెద్దలయినా, చిన్నలయినా రచయితల రచనలమీద చేసిన వ్యాఖ్యలు నిజాయితీతోనూ, మృదువుగానూ వుండేవి. ఈ వ్యాఖ్యా పద్ధతిని ‘్భరతి’ వంటి పత్రిక కూడా ఒకప్పుడు చేబూని సమర్థవంతంగా చేయలేక రచయితలు కొందరి తిరుగుబాటుతో సంపాదకులైనవారి పదవికే ముప్పుతెచ్చుకొందిట! మధునాపంతులవారికి విజయవంతంగా రచయితల సహకారం లభించడం విశేషం. అయితే తరువాతి చివరి సంచికలలో రచన క్రిందకాక ఆ సంచికలోని రచనల గురించి ఓ సంపాదకీయ వ్యాఖ్యలతోకూడిన రచనగా శాస్ర్తీగారు సంతరించారు.
మహారాజా విక్రమదేవవర్మగారి రచన అయినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీగారి రచన అయినా మధునాపంతులవారు సంపాదకునిగా తన వ్యాఖ్యను వెలువరించడం అదే నిష్ఠతోచేశారు. ఎక్కడా మోమాటపడలేదు. తాము రాసిన దానికి భిన్నంగా సముచితములైన సమాధానాలు పంపినా ప్రచురిస్తామనీ ఈ విశిష్ట పద్ధతి అభిజనాంగీకృతంకాకపోతే విరమిస్తామనీ నాల్గవ సంచిక నివేదనములో పేర్కొన్నారు కూడాను.
‘ఆంధ్రి’ ఆగస్టు 1939 సంచికలో ‘పయనపు జెలికాఁడు’ అనే శ్రీ విక్రమదేవవర్మగారి రచనపై మధునాపంతులవారి వ్యాఖ్య ఇలా సాగుతుంది.
‘‘శ్రీశ్రీశ్రీ జయపురాధీశ్వరులు శ్రీ విక్రమదేవవర్మ మహారాజుగారు ఆంధ్రి యెడల దమకుఁగలిగిన యకారణ కారుణికత్వాభి మానాతిశయములచే నీ వ్యాసము నిందుఁ బ్రకటింప ఁబంపినందులకు మా ‘ఆంధ్రి’వారికనేక ధన్యవాదములు సమర్పించుచున్నది. పురాతనాధునాతన పద్ధతులను మేళవించి సలక్షణమైన గ్రాంథిక భాషలో సరస భావభరితముగ సహృదయ హృదయాను రంజకముగా వ్రాయబడిన ఈ వ్యాసరాజమన్నివిధముల నాంధ్రినుజ్జీవింపఁజేయుచున్నదని చాటుటకు సంశయములేదు. శ్రీ మహారాజుగారి గ్రాంథిక వచనరచనా కౌశలమును సహజ భాషాభిమానము నీ వ్యాసము వేయివిధముల వెల్లడించుచున్నది. ఇట్టి విద్వత్ప్రభువుల యాదరాభిమానములు బడయఁగలిగినప్పుడే కదా సలక్షణాంధ్రికి మరల సంపూర్ణవికాసము సమకూరుట?
శ్రీవారి యాజ్ఞానుసార మీవ్యాసము సాధ్యమైనంతవఱకు యధామాతృకనుగనే- అర్థానుస్వారములు శకట రేఫములు మఱికొన్ని భాషాచిహ్నములు మున్నగువానితో- ముద్రించితి పో-కాని; - ఏగు, చక్కగా, చెలరేగు, పులుగు, ఇద్దరము, గుండా-కౌఁగలి, శవసత్కారము, పాషాండా, తిరుగా మున్నగు పదములయందు లేఖన ప్రమాదవశమునఁ విడువఁబడిన యర్థానుస్వార వకటరేఫాదులను సవరించుటకుఁగూడ సాహసించలేనందులకు క్షంతవ్యులము- ఆం॥
దీనినిబట్టి ఒక రచయిత పంపిన రచనను యథాతథంగానే ప్రచురించి దానిలోని గుణదోషాలను సంపాదకునిగా మధునాపంతులవారు వ్యాఖ్యానించేవారని గ్రహించవచ్చు. అలాగే తిరుపతి వేంకటకవులలోని సుప్రసిద్ధ విద్వత్కవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీగారి ‘కాలదుస్థితి’ అనే రచనను అక్టోబర్ 1939 సంచికలో ప్రచురించి మధునాపంతుల సంపాదకునిగా ఇలా వ్యాఖ్యానించారు-
‘‘చేయి వణఁకుచున్న యత్యంత వార్థక స్థితియందుండియు ‘‘ఆంధ్రి’’ యందలి అవ్యాజానురాగాతిశయమున నీ పద్యవ్యాసమును వ్రాసి పంపిన శ్రీ శాస్త్రులగారికి ‘‘ఆంధ్రి’’యభివాదములొనర్చుచున్నది. శ్రీ శాస్త్రులుగారు జగమెఱిఁగిన బ్రాహ్మణులు. ‘ఆంధ్రి’ వారి కవిత్వమును గుఱించి యేమి వ్రాయఁగలదు?
ఈ పద్యములయందచటనచటఁ బద్య కవిత్వమున ‘పాదావసానముల యుదేకాక పాదమధ్యముననున్న వాక్యావసానాదుల యందు ఁగూడ సంధి చేయకున్నను దోషంబులే’దని సూచించుటకుఁగాఁబోలు సంధి నియమములు పాటింపఁబడలేదు. ఇది శాస్త్రులవారి భాషాసంస్కార పరాయణత్వమును సూచించుచున్నది. ఇంతియేకాక, ఇటీవల వీరు ప్రకటించు పత్రికా వ్యాసాదులనుబట్టి చూచినను శ్రీ శాస్త్రులవారు కొంతవఱకు భాషాసంస్కార విషయమున నొకయడుగు ముందునకు వైచంచున్నట్లు తోఁచుచున్నది. కాని, రుూ వ్యాసమునందు హరిజన దేవాలయ ప్రవేశాది సంఘసంస్కారముల విషయమై మాత్రము పూర్తిగా వెనుకంజ వైచినట్లే కనుపట్టుచున్నది. ఇది సంఘసంస్కార పరాయణులైన దేశీయ మహాజనులకెట్లుండునో? శ్రీ శాస్త్రులుగారు ‘శాస్త్రంబన్న జంకన్వలెన్’అనుచున్నారు. శబ్దశాస్త్రం బన్ననో?-- ఆం॥సం
ఈ వ్యాఖ్య నిజానికి కొండతో ఢీకొన్న చందమే అయినా, మధునాపంతులవారి సంపాదక ప్రతిభకు, తిరుగులేని భాషావిషయిక నిశ్చయ భావ శబలతకు తార్కాణం అనక తప్పదు. చెళ్ళపిళ్ళవారి పైనే చెణుకువేయడం విశేషమే మరి!
‘ఆంధ్రి’ పత్రికలో జైనుల్ అబ్ ఉద్దీన్, అహ్మద్ షరీఫ్, ఉమర్ అలీషా వంటి కవుల రచనలు కూడా ప్రచురించారు మధునాపంతులవారు. అక్టోబర్, 1939 సంచికలో మహమ్మద్ జైనుల్ ఆబెదీన్ ‘దేవా’అనే పద్యకవితను ప్రచురించారు ‘‘పద్యములన్నియు సర్వమత సమ్మతములై భగవద్భక్తి బంధురములై భావభరితములై యొప్పచున్నవి. వ్యాసకర్త మహమ్మదీయ మతస్థుఁడై యుండియు నాంధ్ర కవిత్వమున నిట్టి పరిశ్రమచేయుట ‘ఆంధ్రి’కెంతయు నభినందనీయముగాదా? -ఆం॥ అని సంపాదక వ్యాఖ్యతో ప్రశంసించారు.
‘ఆంధ్రి’లో వైవిధ్యభరితమైన రచనలు ప్రచురితమయ్యాయి. ‘‘్భరతీయ శాస్తమ్రులు-శాస్తజ్ఞ్రులు’’ అనే కామఋషి సత్యనారాయణరావుగారి సైన్స్ రచన (జూలై ’39), ‘వాఙ్మయము-దేశాభ్యుదయము’’అనే శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారి రచన (మే ’1941), అలాగే ‘ఏగు’ ధాతువు గురించి శ్రీ విక్రమదేవవర్మగారి వ్యాకరణాంశ రచన (్ఫబ్రవరి ’1940) ‘కళలు- కావ్యకళ’ గూర్చి శ్రీ చిలుకూరి పాపయ్యశాస్ర్తీగారి రచన (మార్చి ’1940) ఇలా పలు విశేష రచనలు కానవస్తాయి.
‘ఆంధ్రి’కి సర్వాధ్యక్షులుగా పేర్కొనబడిన పిఠాపురం సంస్థాన కవీశ్వరులు శ్రీ ఓలేటి వేంకటరామశాస్ర్తీగారు 1939, డిసెంబర్ మూడవ తేదీ పరమపదించారు. జనవరి, 1940 ‘ఆంధ్రి’వారి సంస్మరణ ప్రత్యేక సంచికగా మధునాపంతులవారు వెలయించి ప్రముఖుల నివాళి రచనలను అందించారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారి నివాళి రచనకూడా ‘ఆంధ్రి’లో కానవస్తుంది. ఆంధ్ర భాషాభివర్థినీ సంఘం మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తాపీ ధర్మారావుగారి అధ్యక్షతన నిర్వహించిన ఓ సభలో 1938, ఆగస్టు 19న ఓలేటి వేంకట రామశాస్ర్తీగారు చేసిన ‘మాతృభాషాసేవ’ అనే ఉపన్యాసాన్ని ‘ఆంధ్రి’ ఆ తరువాత సంచికల్లో ధారావాహికగా ప్రచురించింది. వేంకటరామశాస్ర్తీగారు కుమారులు ఓలేటి వెంకట చలపతిరావుగారు ‘ఆంధ్రి’ప్రచురణను తమ వి.ఎమ్.ఆర్. ప్రెస్‌లోనే కొనసాగించారు.
‘ఆంధ్రి’లో కనబడే ఏకైక కవయిత్రి శ్రీమతి ఉభయ భారతి. ఫిబ్రవరి ’1941 సంచికలో ‘బొమ్మరిల్లు’అనే కవితాఖండిక ప్రచురితమైంది. అది పెట్టుడు పేరేమో అని వేరొక సందర్భంలో సంపాదకులే వ్యాఖ్యానించడమూ కానవస్తుంది. ‘ఆంధ్రి’లో కాకినాడ పి.ఆర్. కళాశాలలో జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాల గురించిన నివేదికా, అలాగే సంపాదకులు మధునాపంతులవారే స్వయంగా చేసిన కొన్ని పుస్తక సమీక్షలూ పేర్కొనదగినవి. సూర్యారాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో ‘ఆంధ్రీ’మయమూర్తి పాత్ర కూడా వుంది. 1940 జనవరి 1న పానుగంటి లక్ష్మీనరసింహారావు, 9 ఫిబ్రవరి 1941న జయంతి రామయ్య పంతులుగారు కాలధర్మం చెందినపుడు ‘ఆంధ్రి’లో మధునాపంతులవారు సంపాదకులుగా నివాళి ఘటించారు.
‘ఆంధ్రి’కి నాటి మహామహులైన ఎందరెందరో సాహితీ దిగ్దంతులు ప్రశంసలందించారు. అభిమానించారు. తమ రచనలతో పరిపుష్టంచేశారు. నవ్యభావ ప్రభావంతో వెలయు గ్రామ వాతావరణంలో ‘ఆంధ్రి’ ఉదయించింది. విశ్వనాథవారు మధునాపంతులవారికి లేఖరాస్తూ ‘‘మీరు స్థాపించిన ఆంధ్రీకుటీరము వంటివి ప్రతి పల్లెటూరున వెలసిననాఁడు భాషకు విముక్తి. రసజ్ఞత మీ యూరిలో వెదచల్లుట మీ బాధ్యత. మీరు తలపెట్టిన పనికి నా అభినందనములు, నా సానుభూతియు’’అని కొనియాడారు. పల్లిపాలెము కేంద్రంగావున్న ‘ఆంధ్రీ’కార్యాలయ చిరునామా 1941లో పిఠాపురంకు మారింది. ముప్ఫై ఆరు సంచికలతోనే ‘ఆంధ్రి’ పత్రిక ముద్రణ ముగిసిపోయింది. తదనంతర కాలంలో మధునాపంతులవారు రాజమండ్రికి తరలిపోయారు.
కవిగా, రచయితగా తనదైన రచనలతో ‘ఆంధ్ర కల్హణ’గా ‘సాహితీ సమ్రాట్ట్’గా ఖ్యాతిపొందారు. 1968లో ‘ఆంధ్ర పురాణము’కు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో గౌరవించింది. రత్నపాంచాలిక (1943), షడ్డ్శరనసంగ్రహం (1942), సూర్యసప్తతి (1943), ధన్వంతరి చరిత్ర (1945), రత్నావళి (1947), ఆంధ్ర రచయితలు (1950) బోథివృక్షం (1951), ఆంధ్ర పురాణం (1954) చరిత్ర ధన్యులు (1955) కళ్యాణతార (1956), స్వప్నవాసవదత్త (1956), శ్రీఖడ్గం (1968), తెలుగులో రామాయణాలు (1975) చైత్రరథం (1976), సదాశివ పంచశత (1977), కేళాకూళి, జీవనలేఖలు- సాహితీ రేఖలు, మధుజీవనము, మధుకోశము, మధునాపంతుల సాహిత్య వ్యాసాలు, ప్రసంగాతరంగిణి వంటి అమూల్య గ్రంథాలను తెలుగుజాతికి అందించిన మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు అమలాపురం తాలూకా ఐలెండ్‌పోలవరంలో 1920 మార్చి 5న ప్రభవించి 1992, నవంబర్ 7న రాజమండ్రిలో కాలధర్మం చెందారు. ఆ శత జయంతి సాహితీమూర్తికి వినమ్ర నివాళులు.
*