
‘‘సహజ ప్రకృతి అంటూ ఒహటుంటుంది. దానికి విరుద్ధంగా సాగే వ్యవహారాలూ వుంటాయి. ప్రకృతి విరుద్ధమైన వాటిని సమర్ధించే తత్త్వం కొందరిది. అలా సమర్ధించడమే గొప్ప అభ్యుదయంగా, విప్లవాత్మకంగా భావించేవారు కొందరయితే- సమాజంలో సంచలనాల కోసమో, నెగిటివ్ ధోరణులే అయినా -గుర్తింపు గురించిన ఆరాటంవల్లో, అలా అసహజమని అధిక సంఖ్యాకులు భావించే వాటిని సమర్ధిస్తూ, ఆ వైఖరులు అవలంబిస్తూ, అది ‘సహజమే’ననీ, తమ ఆ వైఖరులను సమాజం సమర్ధించాలనీ, వాదించేవారుంటారు. సమాజంతో పనిలేదనీ,అసహజమనుకుంటున్నాఅలా జీవించడం తమకు సహజమేననీ ప్రకృతి విరుద్ధమనుకునే విధానాలను జీవనసరళి చేసుకునే వారూ వుంటారు. ఏది సహజం? ఏది అసహజం? అన్న విచికిత్స మానవ మనఃప్రవృత్తులననుసరించి నిరంతరాయంగా సాగుతూనే వుంటుంది’’అన్నాడు ప్రసాదు దినపత్రిక మడచి టీపాయ్ మీద పెడుతూ.
‘‘చట్టాలు వున్నదెందుకు మరి? సహజాతాలను పరిరక్షించి, అసహజాలకు అడ్డుకట్టవేయడానికే కదా! ‘సంఘనీతి’అనేది ఒకటి పరంపరాగతంగా మనం ఏర్పరుచుకున్నదేకదా! భూమినుంచి ఇనుమును తవ్వి తీసేది మనమే! ఆ ఇనుముతో సంకెల తయారుచేసేదీ మనమే! అధర్మ వర్తనానికీ, నేరం చేసినందుకూ- చట్టప్రకారం ఆ సంకెలకు కట్టుబడేదీ, కట్టుబడాల్సిందీ మనమే! అంటే ఏమిటన్నమాట? శాసనాలూ, చట్టాలూ- ఋజువర్తన నుంచి పక్కకు మళ్ళకుండానూ, మళ్ళిన వారిని శిక్షించి సన్మార్గంలో పెట్టడానికే కదా! కానీ ఆ శాసనాలనూ చట్టాలనూ ఉల్లంఘించడమే కొందరి వైఖరి. అది కూడా అసహజ ప్రకృతియే మరి’’ అన్నాడు శంకరం.
‘‘చిత్రం ఏమిటంటే శంకరం! మేధావులూ, సమాజంలో మానసిక పరివర్తన తెచ్చి సువ్యవస్థకు తోడ్పడగల కవులూ, రచయితలు వంటివారు కూడా- బాధ్యతారాహిత్యంగా అసహజ ప్రకృతులను ప్రోత్సహించడం ఎలా అర్థంచేసుకోవాలి? అది వారి గుర్తింపులకూ, సంచలనాల కొరకూ అయిన ఆరాటం అనుకోవాలా? కానీ చూశావ్! అలాంటి వారివల్లే- వారిని ఆదర్శంగా భావించే యువత తప్పుమార్గం పట్టి చెడిపోయే ప్రమాదం వుంది. పైగా అదే ‘రైట్’అని, బరితెగించి జీవించే వీలూ వుంది’’ అన్నాడు ప్రసాదు.
‘లోకనీతి’ కూడా వైరుధ్యాలతో కూడినదిగా కనబడుతుంటుందోయ్! మానవ సమాజంలోనే కుల, మత, ప్రాంత ప్రాతిపదికలపై -వైరుధ్యాలు గోచరిస్తూంటాయి. కొందరికి సహజాలనుకునేవి, ఇంకొందరికి అసహజాలు! ముస్లింలలో చిన్నాన్న పిల్లలను పెళ్ళిచేసుకోవడం సహజం. కానీ హిందూ కుటుంబాలలో తండ్రి తాలూకు అక్కచెల్లెళ్ళ పిల్లలను చేసుకోవచ్చుగానీ, తండ్రి తాలూకు అన్నదమ్ముల పిల్లలను పెళ్ళాడడం అసహజంగా భావిస్తారు. సగోత్రీకులను వివాహమాడినా అది అన్నాచెల్లెళ్ళు పెళ్లాడినట్లుగా అత్యంత అసహజంగా భావించుతాం! కానీ అసలు మగ, ఆడ శారీరక కలయికలకు- వావివరుసలు లేకుండా, ఎవరు ఎవరినైనా కలిసి పిల్లల్నికనేయచ్చు! కానీ అది ధర్మవిరుద్ధంగానే భావిస్తున్నాం! ‘మేనరికాలు’ ఒకప్పుడు చాలా మామూలైన అంశం. కానీ శాస్ర్తియ విజ్ఞానం పెరిగి, మేనరికపు వివాహాలవల్ల కలిగే అరిష్టాలను సైన్స్ ఉద్ఘోషించడం వల్ల- అవి కొంత నేడు తగ్గుముఖం పట్టాయని ఒప్పుకోవాలి! కానీ చూసావ్! ‘చలం’వంటి రచయితల పేరు చెప్పుకుని, అసహజ వైవాహిక సంబంధాలను తమ అభీష్టంతో ఏర్పరుచుకున్నవారున్నారు. అది సహజ పరిణామంగానే వారు సమర్ధించుకుంటారు. సమాజం దృష్టిలో అసహజమే అయినా, ఆ వైఖరులను అవలంబించి బ్రతుకుతున్నవారు అది సహజం అనుకునే జీవిస్తున్నారు మరి!’’ అన్నాడు శంకరం.
‘‘స్వలింగ సంపర్కం విషయమో అంతే కదర్రా! ‘గేసెక్స్’ అసహజం, ప్రకృతి విరుద్ధం అనుకుంటూ, అంటున్నంతమాత్రాన- అలాంటి వ్యక్తులు లేకుండాపోయారా? అది నేరంకాదని ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పు ఇస్తే, సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ ’11న దానిని కొట్టేస్తూ స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమనీ, తదనుగుణంగా చట్టాన్ని సవరించవలసిందేననీ, పార్లమెంట్‌కాబాధ్యత వుందనీ పేర్కొంది! గేసెక్స్‌ను శిక్షార్హ నేరంగా పరిగణించడం- స్వలింగ సంపర్కుల హక్కులకు భంగం కలిగించడమేనని నాజ్ ఫౌండేషన్ వంటి సంస్థలే కాదు, మేధావులనుకునేవారూ అన్నారు. సోనియగాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిందన్న వార్తలు వచ్చాయి. ఆవిడ ఒక ‘ఇటాలియన్’ వనిత కనుక, అలానే ఆలోచించడం సహజంకావచ్చు, కానీ భారతీయ వ్యవస్థ ఇలాంటి వాటిని అంగీకరించదు. సనాతన ధర్మానికి అటువంటివి అసహజ చర్యలు! యుక్తవయస్కుల పరస్పర అంగీకారంతో అసహజమనుకునే సెక్స్ చర్యలు జరుగుతున్నమాట వాస్తవం! అలాగని వాటికి చట్టబద్ధత కల్పించి ప్రోత్సహించడం వివేకం అనిపించుకుంటుందా? సహజ అసహజాలు సమాజంలో వుంటాయి. కానీ వాటిని పరిహరించి, ఆరోగ్యకరమైన సంవిధానం వైపుకు భావితరాన్ని నడిపించాలి గానీ, జరుగుతున్నాయి కదా అని అధర్మాలకు, అన్యాయాలకు, అవినీతికి చట్టబద్ధత కల్పిస్తే- అది దారుణమైన సంగతేకదా! చట్టాలు, శాసనాలు కఠినంగానే వుండాలి. అలాగే మేధావులు, కవులు, రచయితలూ సమాజహిత చింతనతో, ‘విశ్వశ్రేయఃకాంక్ష’తో రచనలు చేయాలి! అది బాధ్యతాయుతమైన వైఖరి అవుతుంది. అంతేగానీ- అసహజాలు సహజాలుగా స్థిరీకరింపబడే అనైతికతలకు- సంచలనంకోసమో, తమకంటూ ప్రత్యేక గుర్తింపులకోసమో సమర్ధతనిస్తూ, పెడదారులు పట్టించడం బాధాకరమే! ‘ధర్మం’ అనేది కాలావధులను దాటి వుంటుంది. జాతిధర్మం, దేశధర్మం, కుల ధర్మం, గణధర్మం, ఆపద్ధర్మం ఏదిఏదయినా ‘‘ధర్మోరక్షతి రక్షితః’’అన్నది గ్రహించాల్సిన విషయం’’ అంటూ రాంబాబు దృఢంగా ప్రకటించాడు.
0 comments:
Post a Comment