‘‘‘తాంబూలాలిచ్చేశాం తన్నుకుచావండి’ అంటే ఎవరికయినా వేడి పుడుతుందా? వేడుక పుడుతుందా? ఎంత అగ్నిహోత్రావధానులు చేసిన పనయినా ‘అలాగైతే నేను ఏ బావిలోనో దూకి చస్తాను’ అని వాళ్ళావిడనుంచే ఆర్తితో కూడిన అల్టిమేటం రావచ్చు. తాంబూలం వేడుక సంగతేమోగానీ ‘వేడి’ అన్నది మాత్రం ఖాయం.
కూపోదకం తరుచ్ఛాయా
తాంబూలం తరుణీకుచం
శీతకాలేచ ఉష్ణః
ఉష్ణకాలేన శీతలః
అంటూ బావినీరు, చెట్టునీడ, తాంబూలం, తరుణీకుచము శీతాకాలంలో వెచ్చగానూ వేసవికాలంలో చల్లగానూ వుంటాయన్నాడు సంస్కృత శాస్తక్రారుడు. అంచేత కాకపుట్టించే కబురు తాంబూలంతో ముడిపడిందే’’ అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టేబుల్ మీద పెడుతూ.
‘‘రాంబాబూ! ఈ పేపర్లూ, మీడియానే తీరికూచుని వేడి పెంచుతున్నాయోయ్! ‘అప్పుడు మద్రాసు వదిలేసుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్ వదిలేసుకోండి’ అని ఒకరంటే- ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారే కదా అప్పుడు మద్రాసు వదిలేసుకోవలసి వచ్చింది. ఇప్పుడూ అలాగే విభజన కోరుకుంటున్నవారే హైదరాబాద్ వదిలేసుకుని వేరే రాజధానిని వారినే చూసుకోమనండి’ అని ఇంకొకరంటున్నారు. ఛానెళ్ళ వేడి వేడి చర్చల్లో ‘ఇంకొకరు అసలు అంబేద్కర్‌గారు హైద్రాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలన్నారు. అంచేత హైదరాబాద్‌ను దేశం మొత్తానికి వదిలేసి విడిపోదలచుకుంటే సీమాంధ్రులు, తెలంగాణవారు ఎవరి రాజధాని వారు వేరేగా ఏర్పరచుకుని అభివృద్ధి చేసుకోమనండి’ అని వాక్క్రుచ్చుతున్నారు. 1938 నాటి దేశ పటం చూస్తే అందులో హైదరాబాద్ లేదు సరికదా తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ తెలంగాణ అనే చూపబడ్డాయి. అసలు తెలంగాణ అన్నది ప్రాంత సూచకం, ఆంధ్ర అన్నది భాషాసూచకం. ‘‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’’ అని తెలుగువారికి భాషపట్ల గల అశ్రద్ధనే ‘ఎద్దేవా’ చేశారు కాళోజీగారు. ‘త్రిలింగదేశం మనదేనోయ్ తెలుంగులంటే మమేనోయ్’ అన్న కవి గీతం తెలంగాణం అనేది తెలుగువారందరి ప్రాంతం అని చెప్పేదే! అసలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడినప్పుడే ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అని కాక తెలుగునాడు అని పేరు పెట్టి వుంటే గొడవ వుండేది కాదు. హైదరాబాద్ నిజాం రాష్ట్రం. భారతదేశంలోనిదే కాదు. హైదరాబాద్ విమోచనోద్యమంతో అది భారతదేశంలో విలీనమైంది. ఉర్దూ ఆధిపత్యంతో ఇక్కడి తెలుగువారు తెలుగు మాట్లాడే అవకాశమే లేక ఒక వంకా, రజాకార్ల దాడులతో మరో వంక సతమతమయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాంతాలకతీతంగా తెలుగువారందరూ పాల్గొన్నారు. భాష గురించి ఆరాటంతోనే హైదరాబాద్‌లోనూ, తెలంగాణమనే ఇక్కడి ప్రాంతాలలోనూ ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, ఆంధ్రసారస్వత పరిషత్తు అని నెలకొల్పబడిన సంస్థలు ఇక్కడ హైదరాబాద్‌లోనే కాదు, ఆంధ్ర అనేది భాషా సూచకంగా వరంగల్ వంటి ప్రాంతాల్లోనూ సంస్థలున్నాయి. అంచేత తెలుగు ప్రాంతమంతా తెలంగాణయే. తెలుగు భాష అంతా ఆంధ్రమే అన్న భావన సరియైనదనిపిస్తుంది’’ అన్నాడు శంకరం.
‘‘ఇప్పుడు - మీ భాష వేరు మా భాష వేరు. మీ తల్లి వేరు మా తల్లి వేరు. మీ ప్రాంతంవేరు మా ప్రాంతం వేరు అని రాజకీయంగా వేడి పుట్టించి, ‘విభజన అనివార్యం’ అని తాంబూలాలిచ్చేశాక నీవలా మాట్లాడ్డమూ వెర్రితనమవుతుందోయ్ శంకరం! ‘అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే’ అనే భావన చచ్చాక, ‘విడిపోయి కలిసుందాం’ అన్నా- విశ్వాసం చిక్కదు. ‘కలిసుండేకాడికి విడిపోవడం ఎందుకు? విడిపోయే కాడికి కలిసుండటం దేనికి’ అని ఎవరయినా ప్రశ్నించవచ్చు. హిందీ మాట్లాడే వాళ్ళు నాలుగు రాష్ట్రాలుగా వుండగాలేనిది తెలుగు మాట్లాడేవాళ్ళు రెండుగానో మూడుగానో వుంటే నష్టమేమిటి? అని అడగడం అనౌచిత్యం కాదు. కానీ ‘్భషాప్రయుక్త రాష్ట్రాలు’ అన్న కానె్సప్ట్ సరికానప్పుడు రెండోఎస్సార్సీతో అసలు రాష్ట్రాల పునర్విభజన గురించి ఆలోచించడం సబబే! ఇప్పటికిప్పుడే ప్రత్యేక రాష్టవ్రాదాలు దేశంలో మిగతా చోట్లా చెలరేగుతున్నాయి. జనాభా పెరుగుతూ, భాషలోనూ విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పుడు ఇంకా ‘ఒకే భాష - ఒకే ప్రాంతం’ అన్న కానె్సప్ట్ ఎలా కుదురుతుంది. ఇదంతా పెద్ద చిక్కుముడి. చిక్కు విప్పుతానంటూ దారాన్నీ, ఏకత్రిత భావధారనీ మరింత చిక్కుముడుల పాలు చేసేసింది రాజకీయం. రాజకీయం లేకుండా ఇవాళ ఏ రంగమూ లేదు. అన్నింటా ఆఖరికి మనిషి మనసులో, మానవీయ విలువల్లో అంతటా రాజకీయమే చొరబడింది. మతాతీయ రాజకీయాలు కాదు మనిషికతీత రాజకీయాలూ కావాలన్నా ఇవాళ కుదిరేపనికాదు. తాంబూలాలివ్వడం అనేది ‘వియ్యపు’ బంధం కోసం కాక ఆ ‘విడియం’ విడదీసుకునే విడాకుల వ్యవహారానికయినప్పుడు, ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి’ అని మొదలైం ది, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అనే ముగుస్తుందేమో మరి!’’ అంటూ లేచాడు సుందరయ్య.
0 comments:
Post a Comment