‘ఎంత వారలయినా కాంత దాసులే’ అన్నారు గానీ, ఇవాళ దాన్ని ‘కాంగ్రెస్ దాసులు’గా మార్చేయడం సబబేమో! రాజకీయంలో నిజంగానే కాంగ్రెస్‌ది నూట పాతికేళ్ల పైబడిన అనుభవమాయె! ఎంతవారినయినా బురిడీలు కొట్టించడంలో ఆ పార్టీ ‘ఘనాపాఠీ’ అని ఒప్పుకు తీరాలి. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ‘కాంతా’ సమ్మితంగానే సోనియాగాంధీ కనుసన్నల్లోనే కదలాడుతోంది. ‘రాష్టప్రతి’ రబ్బర్‌స్టాంప్ పోస్ట్ అని మునుపు అనేవారు గానీ ఇప్పుడు ‘ప్రధాని’కే ప్రధానం పోయింది. పనిలేని జాబే ఇప్పుడు పంజాబీ పెద్దాయనది అని విదేశీ పత్రికలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ అడుగులకు మడుగులు ఒత్తడానికి పైకి గొడవలు గొడవలు కనబరుస్తున్నా, తీరా వేళకి తైరు కొడుతూనే ఉన్నారంతా’’ అన్నాడు శంకరం.
‘మేము పదవిలో లేనంత కాలం లేదు మీ పార్టీల మనికి చరిత్ర’ అన్నట్లుగా కాంగ్రెస్ తన చరిత్రతో చరిత్ర గతిని ఎలా గయినా మరల్చగలనని భావిస్తున్నట్లుంది. అందుకోసం చారిత్రక తప్పిదాలకూ ఒడిగడుతోంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే చూడు. తెలంగాణా ఏర్పాటు ఖాయమనె్చప్పి టిఆర్‌ఎస్‌చేత రాష్ట్రాన్ని ప్రకటించిన దేవతగా స్తుతులు అందుకుంటోంది. ఇప్పుడు జగన్‌ను బెయిల్‌మీద విడుదల చేయడం కూడ ఎన్నికల సమయానికి తన మనికిని అభినందింప చేసుకోవడానికే. ఎంత కాదన్నా నీ మతం నా మతం ఒకటే, ‘తన మతమేదో తనదీ మనమతమసలే పడదోయ్’ అన్న భావనేమీ లేదు అంచేత తన మంచితనం, గొప్పతనం చూపుకునే ‘అభిమతం’ నెరవేర్చుకోవడానికి ఒక్కసారిగా ప్లేట్లు తిరగబడిపోయాయి చూసారా!’’ అన్నాడు ప్రసాదు.
‘‘అదే దర్యాప్తు రాజకీయమర్రా! ఇన్నాళ్లూ సిబిఐ గురించి గొప్పగా, లక్ష్మీనారాయణ వంటి దాని ఆఫీసర్ల గురించి నిజాయితీగా ప్రజలెంతో అభినందించారు. కానీ సిబిఐ జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో హటాత్తుగా మెతకబడింది. కాంగ్రెస్ కాంతామణి కనుసన్నల్లోనే, అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పరిణామం చెందిందని అంతా అనుకుంటున్నారు. జగన్‌కు బెయిల్ రావడంతో ఇది రూఢి అయ్యిందంటున్నారు. ముద్దాయిగా అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పొందడం నియమిత కాలపరిమితిలో, ఆ కేసు తీరుతెన్నులనుబట్టి తప్పుకాదు. రాజ్యాంగ విరుద్ధమూ కాదు. కానీ అక్రమాస్తుల కేసులో గత ఏడాది మే 27నుంచి (అది నెహ్రూగారి వర్ధంతి రోజుకూడాను) జెయిల్లో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న జగన్‌కు ఇప్పుడు అతనిపై వున్న కేసులన్నీ నీరుగారే తీరు రావడం కాంగ్రెస్ పార్టీతో కుదిరిన ఏదో క్విడ్‌ప్రోకోయే కారణమనిపించడంలో వింతేమీ లేదు. రాష్ట్ర విభజన విషయం హాట్‌హాట్‌గా వున్న సమయంలో సమైక్యవాది జగన్‌ను విడుదల చేసి సీమాంధ్రలో అతనికి పట్టునిచ్చి తిరిగి తమలో కలుపుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడగా భావింపబడుతోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ అక్కడ జగన్ వైఎస్సార్ పార్టీ తమలో విలీనం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంగా, అందుకు పావులు కదిపి ఎత్తుగడలతో వారిని చిత్తుచేసి మొత్తానికి తన చిత్తం వచ్చిన రీతికి గమ్మత్తుగా మలచుకోవడమే ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర అంటున్నారు విజ్ఞులెందరో’’ అన్నాడు రాంబాబు.
‘‘పొడి రాష్ట్రాలన్నిటినీ
తడి చేస్తామంటున్న కాంగ్రెస్ వారు
తడి రాష్ట్రాలన్నిటినీ
పొడి చేస్తున్నారు’’
అని మూడు నాలుగు దశాబ్దాల క్రితం శ్రీశ్రీ రాసిన మాటే అక్షరసత్యంగా కనపడుతోందివాళ. కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి డూడూ బసవన్నగా సిబిఐ సంస్థ తయారవుతోందనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లోని పలు కేసుల వ్యవహారాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తన స్వతంత్య్ర ప్రతిపత్తి అంటూ ఏదీ లేక అధికార కాంగ్రెస్ ప్రయోజనాల రక్షణకు అనుకూలంగా వ్యవహరించడం క్రమేపీ తేటతెల్లమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్, మాయావతిలపై నడిచిన కేసుల్లో కానీండి, జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా పైని కేసుల విచారణ విషయంలో కానీండి సిబిఐ తన పరువు ఈసరికే పోగొట్టుకుంది. మన రాష్ట్రంలో సత్యం రామలింగరాజు కేసు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి పేరు తెచ్చుకుని అలాగే జగన్ అక్రమాస్తుల కేసు విషయంలోనూ మొదట్లో అంత ఖండితంగానూ కనబడుతూ వచ్చి హఠాత్తుగా జగతి పబ్లికేషన్స్, కార్నెల్ ఏసియా సంస్థల్లోకి కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి క్విడ్ ప్రోకో ఆధారాలు ఏవీ లేవని తేల్చేయడం అలాగే జగన్ అక్రమార్జనల కేసులతో ముడివడిన ముంబయ్, కలకత్తాల కంపెనీలపై దర్యాప్తును ఈడీ, కంపెనీస్ రిజిస్ట్రార్ వంటి వాటికి బదలాయించేయడమూ చూస్తుంటే ఎవరికయినా సంస్థ విశ్వసనీయతమై సందేహాలు కలగడం సహేతుకమేననిపిస్తుంది మరి. అసలు ఇలాంటి అవినీతి అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తులు జరగాలంటే సిబిఐని కేంద్ర ప్రభుత్వ పరిధినుంచి తప్పించాలని అన్నాహజారేలు, కజ్రేవాలాలు ఏనాడో అన్నారు. కానీ వినేవారెవరు?’’ అన్నాడు శంకరం.
‘‘అసలు స్వాతంత్య్రానంతరం గాంధీగారు కాంగ్రెస్ పార్టీయే వద్దన్నారు లేవయ్యా? ఆ మాట మాత్రం ఎవరు విన్నారు? ‘గాంధి పుట్టిన దేశమా ఇది టార్చిలైట్లు పట్రండి వెతుకుదాం’ అని ఆరుద్ర గారన్నట్లు ఇవాళ గాంధేయం ఎంతో మారిపోయింది. ‘గాంధీగిరి’ అర్ధమూ వేరైపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ గాంధీ భక్తులం అంటూందంటే అది మహాత్మాగాంధీయా, ఇందిరాగాంధీయా, సోనియా గాంధీయా లేక రాహుల్ గాంధీయా అని ఇవాళ అడగాలి మరి! గాంధీ, నెహ్రూల పేరు చెప్పుకుని ఇంకా కాంగ్రెస్ బతికేస్తూనే ఉందంటే ఆ సంస్కృతిని పెంచి పోషిస్తున్న మేట వేసిన రొచ్చు రాజకీయాలూ వాటిని ఓటేసి బ్రతికిస్తున్న ప్రజలే కారణం మరి! మారాల్సిందీ, మార్చాల్సిందీ ప్రజలే’’ అన్నాడు లేస్తూ రాంబాబు.
0 comments:
Post a Comment