ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 20, 2013

తొంభై ఏళ్ళ కుర్రాడు



‘‘ఎన్.టి.రామారావు కనుముక్కు తీరుతో పోలిస్తే- ‘ఆయన’ అందగాడు కాదు. రాముడు, కృష్ణు డు వంటి పౌరాణిక దేవపాత్రలకు ‘నప్పడు’. కత్తిపట్టి జానపద చిత్రాల్లో వేసినా- రామారావు, కాంతారావుల్లా నిలబడలేదు. కానీ సాంఘిక చిత్రాల హీరోగా, ప్రేమానురాగాల, త్యాగాల పాత్రలకు ప్రతీకగా, ఆయన ఖ్యాతి మరొకరికి లేదు. అంతేకాదు! కవులు, కళాకారుల పాత్రలకూ, భగవద్భక్తుల పాత్రలకూ వన్నెవాసి తెచ్చింది ఆయనే. 1964 మే లోనే సినిమా రంగం నుండి విరమించాలని అనుకున్నా, తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో కాళ్ళూని నిలవడానికీ, విస్తరించడానికీ కూడా మూ లకందమై- తెలుగు సినీ పరిశ్రమలో నటదిగ్గజంగా, నటసామ్రాట్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునూ, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మేటి మనిషి ‘అక్కినేని నాగేశ్వరరావు’గారు. తొంభై సంవత్సరాల ప్రాయంలోకి అడుగిడుతున్న నిత్యయవ్వనుడు ఆయన.’’ అన్నాడు శంకరం.

‘‘అందానికి కొలబద్ద ఇది అని ఏం చెప్పగలం శంకరం? ‘అక్కినేని అందగాడు’ అనిపించుకున్నది ఆయనే. శృంగారాన్ని లలిత లలితంగా పలికించడంలో, ప్రదర్శించడంలో, ఎందరో యువతుల మానసచోరునిగా, ఆదర్శ హీరోగా, కలల రాకుమారుడిగా రాణించింది అక్కినేని వారే! తొలినాళ్ళ సాంఘిక చిత్రాలలో తప్పిస్తే తదనంతర సాంఘిక చిత్రాలలో ఎన్.టి.రామారావు మొరటు, మోటు శృంగారాన్ని అభినయించాడు అనే వారూ వున్నారు. రాముడు, కృష్ణుడు పాత్రలకు జీవం పోసినట్లుగా ఎన్‌టిఆర్- అక్కినేనితో పోలిస్తే సాంఘిక కథానాయకునిగా తన తరువాతేననిపిస్తాడు. కానీ చూశావ్! ఆయనకూ, ఈయనకూ కూడా అభిమానులు కోకొల్లలు. ఆ అభిమానం ఎంతవరకూ వెళ్ళేదంటే- వారి వారి అభిమాన సంఘాల మధ్య శత్రుత్వం రాజుకునేంత వరకూ కూడాను. కానీ ఆ మహానటులిద్దరూ ‘మైత్రి’్భవనను చివరంటా నిలుపుకున్నవారే! కలిసి నటించడం అనే ‘మల్టీస్టారర్ చిత్రాలకు’ తెలుగులో ఆద్యులూ వారే! ఎన్.టి.ఆర్. రాజకీయ పార్టీ పెట్టి, తెలుగుదేశంలోకి అక్కినేనిని ఆహ్వానించినా, తనకు రాజకీయాలు పడవని సున్నితంగా తిరస్కరించింది- తనదైన ధిషణాహం కృతివల్ల మాత్రమేకాదు, ‘స్వీయలోపము లెరుగుట పెద్ద విద్య’అన్న గాలిబ్ కవితా పంక్తులూ తెలిసినందువల్లనే.


‘‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’’


అని దాశరథి తెనిగించిన గాలిబ్ సూక్తి అక్కినేనికి ఎంతో ఇష్టం’’ అన్నాడు ప్రసాదు.


‘‘అవును అక్కినేనికి సాహిత్య సుగంధం బాగా అబ్బింది. మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి కవుల పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆయనే! అతి సామాన్య రైతు కుటుంబంలో ఇహ ఆడపిల్ల పుట్టాలని అందరూ అనుకుంటున్నప్పుడు మగపిల్లాడిగా పుట్టాడాయన. వాళ్ళమ్మ తనను ఆడపిల్లగానే జడవేసి పూలుపెట్టి ముస్తాబు చేస్తూ పెంచింది. నాటకాల్లో వేషాలువేయడానికి వెళ్తే అక్కడా ఆడపిల్ల వేషమే మొదట ఎదురైంది. చదువుకోవాలని ఎంతో ఇష్టంవున్నా కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువుకోలేదు. అయితేనేం జీవితంలో ఎన్నో అపజయాలు, విజయాలు కూడా జతబడి బోలెడు బతుకు పాఠాలు నేర్పి నిగ్గుదేలిన వ్యక్తి. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వెంకట్రాఘవపురంలో పుట్టిన అక్కినేని నాటకాల్లోంచి ఎదిగి, 1944 మే ’8వ తేదీన సినిమా జీవితంలోకి మద్రాసులో అడుగిడి జన్మించారు. తనకుతానే గురువుగా తననుతాను దిద్దుకుంటూ ఆ కొత్త జీవితంలో అనుభవాలే మార్గదర్శిగా హీరోగా అందరిచేతా ఔననిపించుకుని అజేయంగా నిలిచారు. 1969లో ‘నేనూ-నా జీవితం’ అని తన ఆత్మకథను గ్రంథంగా వెలువరించారు అక్కినేని. అందులో నలభై అయిదేళ్ళ జీవితమే అక్షరీకరించారు. ఈనాడు సరిగ్గా అంతకురెట్టింపు జీవితం. ఆయన ‘మనసులో మాట’ నేడు వెలువడుతోంది. నిత్యం అనేక సాహిత్య సంగీత సభలతో ఈనాటికీ జనాదరణగల గొప్ప సెలబ్రిటీగా అక్కినేని తొంభై ఏళ్ళ వయసులోనూ రాణిస్తున్నారంటే అది నిజంగా అసాధారణమైన విషయమే’’ అన్నాడు సన్యాసి.


‘‘'అ. ఆ'లు అంటూ అక్కినేని ఆలోచనలు 1969లో వెలువడిన' నేను- నా జీవితం' గ్రంథం చివరలో కనబడతాయి. ‘‘ఈ నా ఆలోచనలు అందరికీ రావు- వచ్చినా కొంతమంది వీటిని ఖాతరుచెయ్యరు. మరి నా మెదడుకు ఎందుకు వస్తాయో నాకే తెలియదు. నెమరువేసుకుంటుంటే నాకైనా పనికిరా
వా అని నే అనుకుంటా.. అందుకే వ్రాసి దాచి ఉంచుతా- ఈ భావానికి విముక్తి ఎప్పు డు?’’అంటూ అక్కినేని అభివ్యక్తీకరించిన ఆ ఆలోచనలు నిజంగా కవితాత్మకాలు. ఇవాళ లఘు కవితలతో కవులమని చెలరేగుతున్న కొందరితో పోలిస్తే నిజంగా అక్కినేని కదా ‘కవి’ అనిపిస్తుంది.

* త్యాగబుద్ధితో దేశానికి సేవచేసే వాడొకప్పుడు మానవుడు 

  బుద్ధినే త్యాగంచేసి దేశాన్ని దోచుకుతింటున్నాడు ఇప్పుడు.

* స్వాతంత్య్ర సముపార్జనకోసం సత్యాగ్రహం చేసే వాడొకప్పుడు మానవుడు     సత్యాగ్రహంచేసి స్వార్థప్రయోజనాలను సాధింపచూస్తున్నాడిప్పుడు.


* జీవితంలో నటన వృత్తిగా తీసుకునే వాడొకప్పుడు మానవుడు 

   నటనే జీవితంగా జీవిస్తున్నాడు యిప్పుడు.

ఇలా ఆనాడే అంటే నలభై అయిదేళ్ళ క్రితమే తన ఆలోచనల్లోని సజీవత్వాన్ని అభివ్యక్తం చేశాడాయన. ‘‘మంచిచెడ్డల ప్రదర్శనే నిత్యజీవితం- జీవిత ప్రతిబింబమే సజీవకళ’’అన్న ఆ మహనీయుడికి మనసా జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ లేచాడు శంకరం.




ఆంధ్రభూమి (దినపత్రిక)    20.9.2013



0 comments: