ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 19, 2013

మంచిదే నడుస్తుంది




‘‘ ‘అంతా మనమంచికే’ అనేది కొందరి ఫిలాసఫీ! జరిగేవన్నీ మంచికని అనుకోవడమే వారి పని ఎందుకయిందంటే- అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ కనుకనే! అసలు అనుకోవడం ఎందుకు? అయ్యేది ఎలాగూ అవుతుందని వదిలేయచ్చు కదా! అంటే కుదరదు మరి. అనుకోకుండా వుండడం కంటే, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే ప్రయత్నం చేస్తూ, అనుకోనిది జరిగినా-అప్పుడు ‘అంతా మన మంచికే’ అనే ఫిలాసఫీని జీర్ణించుకోవడం, మనిషిని క్రుంగిపోకుండా, దిగమింగుకునేలా చేస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి- అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందేఅనుకోఅదిఎలాగూఅనుకున్నమంచికేఆనందసంధానమవుతుంది.’’ అన్నాడు రాంబాబు.


‘‘దీన్నే తిరకాసు భాష అంటారు! విషయాన్ని కణుగూమిణుగూ చెప్పకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా ‘సేఫ్‌జోన్’లో వుండడం అంటే ఇది! ఎఫ్ 14 నిబంధనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని రద్దుచేసారట! 1988నుంచి అటూఇటూ తేలకుండా వున్న ఆ నిబంధనని రద్దుచేయడంతో, హైద్రాబాద్ ఆరవ జోన్‌లోకి రావడమూ, పోలీసు ఉద్యోగాల విషయంలో- స్థానికులే 70 శాతం లాభపడే అవకాశమూ లభించిందిట! ఇది అనుకున్నదే అని కొందరు అనుకోగా, అనుకోనిది అయ్యిందని కొందరనుకున్నారట! నిజంగా ఇది మంచికేనా? అంటే మాత్రం ఎలా ఎవరు నిర్ధారించి చెబుతారు? ఇవాళ ‘హైదరాబాద్’ అన్నది ‘రాష్ట్ర విభజన అంశం’ దగ్గర-కీలకమైన సమస్యగా వుం(టుం)ది. హైదరాబాద్ లేని తెలంగాణ అంటే ‘తల లేని మొండెం’ అని కొందరంటూంటే-, ‘హైదరాబాద్’ నేడు ఒకరి సొత్తుకాదు.అది అందరిదీ. దాని ఈనాటి అభివృద్ధిలో ఎందరి భాగస్వామ్యమో వుంది. అంచేత అప్పనంగా దానిని ఒక ప్రాంతం వారికి కట్టబెడితే చూస్తూ ఊరుకోలేము’’ అనే వారున్నారు. అలాగే హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనచేస్తున్న వారూ వున్నారు. కొన్నాళ్లపాటు హైదరాబాద్‌ని ఫ్రీజోన్‌గా వదిలేసి, సీమాంధ్రులు ఇతరత్రా తమ ప్రాంతాలను అభివృద్ధిచేసుకున్నాక- హైదరాబాద్‌ని తెలంగాణకు ముఖ్య భాగంగా వుంచేయాలని అంటున్నవారూ వున్నారు! భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు అయిన హైదరాబాదు ఇప్పుడు ‘రోడ్డు మ్యాప్’లో- ఎక్కడ వుండబోతుందన్నది కూడా ఉత్కంఠే’’ అన్నాడు ప్రసాదు.

‘‘ ‘సెంటిమెంట్’తో కూడిన వ్యవహారాలు అనుకుంటున్నప్పుడు, ఇంకో కొత్త ‘సెంటిమెంట్’ ‘సెంట్’లా పూస్తారొకరు. ముఖ్యమంత్రే స్వయంగా కోర్ కమిటీ ముందు- రాష్ట్ర విభజనకు ఇందిరాగాంధీ వ్యతిరేకం అనీ, ఇందిరమ్మ బాటలో నడుస్తున్నామని పలుకుతున్న అధిష్ఠానం ఆవిడ ఆశయాలు, అభిప్రాయాలు తుంగలోతొక్కి, కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏమేరకు సబబనీ అన్నారట! 1972 డిసెంబర్ 21న ఇందిరాగాంధీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్నీ, నాడు వెల్లడించిన ఆమె సమైక్యతాభావ శంఖాన్నీ ‘కిరణ్’ తాజాగా పూరించారు. ‘అమ్మమాట జవదాటరాదు కదా!’ అని అమ్మ ‘సెంటిమెంట్’ను ముందుకు తెచ్చారు’’. అన్నాడు శంకరం.


‘‘ఈ ‘అమ్మ’లూ ‘బొమ్మ’లూ జాన్తానై! ‘తెలుగుతల్లే’ మా తల్లి కాదు పొమ్మని, ‘తెలంగాణ తల్లి’ అంటూ అమ్మనూ, కొత్త బొమ్మనూ రూపొందించుకున్నాక- ‘అమ్మ’ సెంటిమెంట్ అడ్డుపడుతుందని ఎలా అనుకుంటాం? అఫ్‌కోర్స్! మూలపుటమ్మ చాల పెద్దమ్మ- ‘రాజకీయపు అమ్మ’యేగానీ- ఆ అమ్మ ‘సోనియమ్మే’కదా! సోనియమ్మ ఇందిరమ్మ బాటలో నడవాలని ఆశించినా, ఆవిడ అంతకన్నా త్యాగమూర్తిగా ప్రధాని పదవినే కాదనుకుని, పార్టీ అధ్యక్షురాలిగానే కొనసాగుతూ, కాంగ్రెస్ పూర్వ వైభవానికీ, దేశప్రతిష్ఠతకూ ఓ కంకణం కట్టేసుకున్నట్లు వ్యవహరిస్తోంది కదా! కోర్ కమిటీలూ, ‘బోర్ కమిటీ’లూ ఎన్ని నడిచినా- చివరి తీర్పు సోనియాగారిదే కదా! అత్తలేని కోడలు సోనియా ఉత్తమురాలుగా- అత్తమీది కోపాన్ని కాక, ఇష్టా
న్నే తెలంగాణ ‘దుత్త’మీద చూపుతుందని భావిస్తున్న వారున్నారు. సి.ఎం.గారు ‘ఇందిరమ్మపై ఆన’ అన్నా- ఆనక ‘అధిష్ఠానం’ ఏ నిర్ణయం తీసుకున్నా, శిరోధార్యమనక తప్పదు! ‘తెలంగాణ విభజన’అన్న విషయంపైనే సమైక్యవాదం వినబడాలి ఇప్పుడు. కుడికి ఒకడూ, ఎడమకు ఒకడూ, ఎగువకు ఒకడూ, దిగువకు ఒకడూ లాగుతూంటే- ‘దిగ్విజయ్’గా ఏకాభిప్రాయ సూత్రతకు కట్టడం ఈజీ కాదు.’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఏ కాలానికయినా అత్యుత్తమమైనది కావాలి. ‘మంచిదే నడుస్తుంది’. మంచికానిది నడచినట్లు కనబడుతున్నా, ఎక్కడో కుంటుపడుతుంది. ‘నడవడం’అంటే- నడవడమే! అది చేతి కర్రతో, స్టాండ్‌తో నడుస్తూంటేనూ, వీల్‌ఛైర్‌లో గమనిస్తూంటేనూ, ఆ గమనాన్ని ‘నడక’అనలేం! ఏదో విధంగా ‘నడక’కాదు. సహజమైన ‘నడక’కావాలి. ‘నడక’ మంచిది. అది పరుగుగా మారనక్కరలేదు. ఎటొచ్చీ ‘తప్ప’టడుగులతోనూ, ‘తప్పు’టడుగులతోనూ కారాదంతే! ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలు నడుస్తున్నాయా అంటే- వాటిని ‘నడక’లుగా విశ్వసించలేని స్థితి వచ్చేసింది! ‘చతికిల’బడే తీరులూ,‘చచ్చుబడే’ తీరులూ కూడా పొడచూపుతున్నాయంటున్నవారున్నారు. ‘నీ అడుగు లోన అడుగువేసి నడువనీ, నన్ను నడువనీ’అన్నట్లుగా- ఈ నడకలోనే భాగస్వామ్యం వహిస్తున్నవీ, వహించాలని తపన పడుతున్నవీ పార్టీలున్నాయి. ‘‘ఇది నడకే కాదు. ఇలా నడిస్తే కాళ్ళిరగ్గొడతాం’ అని బెదిరిస్తున్నవీ వున్నాయి! ‘జరిగేవన్నీ మంచికనే’ ఫిలాసఫీయే ‘మంచిదే నడుస్తుంది’అనే భావి విశ్వాసాన్ని కలిగిస్తుంది. అంచేత- జంకుకొంకు లేక... ‘ఒకడవె పదవోయ్!’..అన్న గీతమే వినిపిస్తూంది.’’ అంటూ లేచాడు రాంబాబు.



1 comments:

Anonymous said...

మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html