ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 3, 2012

మంటల్లో మానవుడు



‘‘ఛుక్ఛుక్రైలు కాల్తోంది
పక్కకు పక్కకు దూకండి
ఆర్పినాక కుక్కండి
జోజో పాపాయి ఏడవకు
ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తా
గబగబ ఎంక్వైరేయిస్తా!


అని ఇప్పుడు రైల్వేమంత్రిత్వశాఖ కొత్త రెయిమ్ చలామణిలోకి తేవాలనుకుంటాను. రైలు ప్రమాదాలు డ్రైవర్స్ అజాగ్రత్తవల్లనో, సిగ్నల్స్ తప్పులవల్లనో, ట్రాక్స్ లోపాలవల్లనో జరగడం ఒక ఎత్తు. ఇలా ‘బర్నింగ్ ట్రైన్స్’అని బోగీల మంటలు చెలరేగుతూ బ్రతుకులు బుగ్గిపాలవడం దారుణం కదూ!’’ అన్నాడు సన్యాసి.


‘‘ఇప్పుడు మునుపటిలా బొగ్గు రైళ్లు కూడా కావుగా సన్యాసీ! విద్యుత్ రైళ్లాయె! అలాంటప్పుడు ప్రమాదాలు కొత్త రూపెత్తి, షార్ట్ సర్క్యూట్‌ల కారణంగా మంటలు చెలరేగడం జరుగుతోంది! మొన్న ఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎస్.11 బోగీ- కేవలం ఏడు నిముషాల్లో మొత్తం బూడిదైపోయింది. నాలుగే నిముషాల్లో ఇరవై ఎనిమిది మంది కాలి మసైపోయారు. పేలుడు పదార్థాలేవో వుండి వుంటాయనీ, బోగీ అడుగు భాగంలో గొయ్యి పడిందనీ, నిపుణులు అంటున్నారట గానీ- ప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూటేననీ, విద్యుత్ సంబంధిత ప్రమాదమేననీ ప్రస్తుతానికి ప్రకటించారు మరి’’ అన్నాడు ప్రసాదు.


‘సర్లేవోయ్! విద్యుత్తు మహాగొప్పగా వుంటూ ఎలక్ట్రిక్ రైళ్లు పరిగెడుతున్నాయని సంబరపడిపోయేలానూ వుండడం లేదుగా పరిస్థితులు! ఉత్తరాదిన మూడు గ్రిడ్లు వైఫల్యం చెంది, ఇరవై రెండు రాష్ట్రాలకు కరెంట్ కోతతో, అరవై కోట్ల మందికి తీవ్ర ఇబ్బంది కలిగింది కదా! మూడువందల రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోవడం, సిగ్నల్స్ బంద్ కావడం, ఢిల్లీలో మెట్రోరైళ్లు బంద్ కావడం జరిగి, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన విద్యుత్ కోతగా ఇది భావింపబడుతోంది. మన విద్యుత్ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా వుందో తెలీడం లేదా? అసలు ప్రభుత్వం ఇంతలా వైఫల్యం చెందుతోందో అర్థంకావడంలేదు’’ అన్నాడు ఆర్తిగా రాంబాబు.


‘‘ప్రభుత్వం ‘బెర్త్’లు మార్చుకునే పనిలో వుందిలే! చిదంబరంగారిని హోంనుంచి ఆర్థికశాఖకు మార్చి, ఒకప్పుడు మన రాష్ట్ర గవర్నర్‌గా చేసిన సుశీల్‌కుమార్ షిండేగారికి హోంశాఖ అప్పగించారు. కొత్త బెర్త్‌లోకి మారుతూ చిదంబరంగారు- తెలంగాణ సమస్యతో హోంశాఖకు సంబంధమే లేదనీ, కేంద్రం నిర్ణయం తీసుకుంటే అమలుచెయ్యడమే హోంశాఖ చేసే పని అంటూ- ఓ ‘తుస్సు’మాట అనిపోయారు. డిసెంబర్ ప్రకటన మరి ఆయన హోంశాఖ అధినేతగా నాడు చేసారా? లేక కేంద్ర నిర్ణయంమేరకు ప్రకటించారా? అన్నది ఇప్పుడు సందేహాస్పదం కావడం లేదా? షిండేగారు రాష్ట్ర గవర్నర్‌గా చేసి వెళ్లినాయెనే! ఆయనకు తెలంగాణ మీద అవగాహన వుండే వుండాలి. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి, హోంశాఖ కాకపోతే మరెవరు అసలుకి సరియైన నివేదికలిస్తారు? పోతూపోతూ బర్త్ మారుతూ చిదంబరం గాలి తుస్సుమాట ‘కస్సు’మనిపించదా మరి’’అన్నాడు శంకరం కొంచెం ఉద్రేకంగా.


‘‘కేంద్రం ఇంజన్ అయితే రాష్ట్రాలు బోగీలు. ఏ బోగీకి ఆ బోగీ స్వతంత్య్రమైనది, తనదైన ప్రయాణీకులను కలిగిందే అయినా- మొత్తం దేశమనే రైలుబండిని మాత్రం- అభివృద్ధి పట్టాలమీద నడిపించవలసిన బాధ్యత కేంద్రకమైన ఇంజన్‌దే! రైలుకు ఊరికే బోగీలు పెంచుకుంటూ పోరుకదా! ప్రజల సౌకర్యాలు, పరిస్థితులు, రద్దీ.. అవన్నీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయించాల్సి వుంటుంది. కొన్ని రాష్ట్రాలు ఫస్ట్‌క్లాస్ బోగీల్లా వుంటే, కొన్ని జనరల్ కంపార్ట్‌మెంట్స్‌లా వుంటాయి. వాటికి ఆయా రాష్ట్ర బోగీల ‘వనరుల భోగాలే’కారణం కావచ్చు. కానీ అన్ని బోగీల్లోని ప్రయాణీకులకూ ఇబ్బంది కలగని సౌకర్యాలు సమకూర్చవలసిందే! బోగీలకు బోగీలకు మధ్య ‘దారులు’కూడా వుంటాయి. అవి తెరుచుకునే సందర్భాలూ, మూసుకుపోయే వేళలూ కూడా వుంటాయి. ఒక బోగీకి ప్రమాదం సంభవిస్తే, దాని ప్రకంపనలు పక్క బోగీలకు వుండకుండా వుండవు. ఒక బోగీలో మంటలు చెలరేగితే- అవి పక్క బోగీలకు అంటుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందే! మంటలు చెలరేగిన బోగీలో వాటిని ఆర్పి, జన నష్టం, ప్రాణనష్టం కలగకుండా కాపాడవలసిందీ, సత్వర చర్యలు తీసుకోవాల్సిందీ అధికారుల బాధ్యతే! దానికి పటిష్టమైన యంత్రాంగం వుండాలి. ముందుజాగ్రత్తచర్యలూ వుండాలి. బోగీ కాలాక ‘యాగీ’చేస్తూ, ఏ ఎక్స్‌గ్రేషియాలతోనో చేతులు దులిపేసుకోగల మనుకోవడం దోషం’’ అన్నాడు సన్యాసి.


‘‘ఎండా కాలంలోనే వేడిమి, మంటలు అనుకునే రోజులు పోయాయర్రా! ఇప్పుడు ‘మంటలు’అనేకచోట్ల, అనేక రకాలుగా చెలరేగుతున్నాయి. తమ ప్రమేయం లేకుండానే, తాము మంటలకు ఆహుతి అవుతున్నవారున్నారు. అవినీతి మంటలు, వంచనల జ్వాలలు మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఎగస్తున్నాయి! తుంటరితనంతో మంటలు రేపే నెలరాజులూ- మధ్యందిన మార్తాండులవుతున్నారు ఒక్కోసారి. ‘పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లు’, ‘ఉరుమురిమి మంగలంమీద పడినట్లు’ సమస్యల సెగలు సోకుతున్నాయి. ‘వాక్కుకు వయస్సు లేదు’ అంటున్న సినారె- ఏనాడో వెలువరించిన ‘మంటల్లో మానవుడు’ అన్నదే నేటి స్వతంత్య్ర భారత వ్యవస్థకి ప్రతీకగా నిలుస్తోంది. మంటలార్పి బ్రతుకు పంట పండించగల అగ్నిమాపక దళ నేతలిక సంభవించేదెప్పటికో మరి! అంతదాకా నీళ్లల్లో కళ్ళు, మంటల్లో గుండెతోనే మనకి.’’ అని లేచాడు బాధగా సుందరయ్య.

6 comments:

Unknown said...

సుధామ గారికి నమస్కారం . మీ బ్లాగులు బాగు బాగు! సునిశిత హాస్యం, అద్భుత శైలి, చక్కని ముగింపు మీ సొంతం . "చుక్ చుక్ రైలు కాల్తోంది"....... నాకు బాగా నచ్చింది.

సుధామ said...

చంటిబాబు గారి స్పందనకు
ఆనందం మింటి కెగసింది.ధన్యవాదాలు

Anonymous said...

హా హా హా.. బాగుంది.

ఆ మిక్కీ మౌస్ వెల్కం చేస్తున్న బొమ్మ ఇరిటేటింగ్ గా వుంది. ఎవరైనా మెచ్చుకున్న దాఖలాలు వున్నాయా? :)

సుధామ said...

మీరు ఇరిటేటింగ్ గా వుందన్నది ఇంట్రెస్టింగ్ గా వుందని అన్నవారున్నారు.కొద్దిరోజులుంచి తీసేద్దామనే నేనూ అనుకున్నాను ఎస్.ఎన్.కె.ఆర్ గారూ!

Anonymous said...

అది అలా కదులుతూ వుండటం ఇంటరెస్టింగ్‌గా వుందన్నారా!! :)))) :)))) కొబ్బరికాయ కొట్టి,పాదాల మీద పడి, బేషరతుగా క్షమాపణలు అడగాలని పిస్తోందటేమిటో! ఎవరండి వాళ్ళు? ప్లీజ్ చెప్పి పుణ్యం కట్టుకోండి.
ఇలాంటిదే ఓ బ్లాగిణి గారు తాయత్తులు, పింక్ కలర్ లోలాకులు వేలాడగట్టారు, కిచ కిచ మంటూ. ఆ బ్లాగులోకి వెళ్ళాలంటే యాక్... :))

సుధామ said...

మీరెందుకు కొబ్బరికాయలు వేస్ట్ చేసుకోవడం.మీకు నచ్చలేదు అంతే!