ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, August 20, 2011

పదాల పదనిసలు











బస్సులోనో, రైల్లోనో ప్రయాణం చేస్తుంటారు. చదివే అలవాటున్న వాళ్లు ఏ దినపత్రికో, వార పత్రికో చదువుతుంటారు. చదవడం కంటే కాలక్షేపానికీ, సరదాకీ, కాస్త మెదడు ఆలోచనకీ పనికొచ్చేదేమైనా వుందేమో అని ఆ పత్రికలోకి తొంగిచూస్తే సాధారణంగా చప్పున కనిపించేది మాటలకోట లాంటి గళ్ల నుడికట్టే. లేదా ఇప్పుడిప్పుడు కొంతకాలంగా చోటుచేసుకుంటున్న అంకెల క్రీడ సుడోకు. గళ్ల నుడికట్టు వైపు ఎక్కువమంది పాఠకులు ఆకర్షితులు కావడానికి కారణం! ఇచ్చిన ఆధారాలతో ఆ పదాలను కనుక్కుంటూ అడ్డగళ్లు, నిలువు గళ్లూ అక్షరాలతో నింపుతూ తద్వారా తన భాషా పరిజ్ఞానాన్ని, పద సంపదనూ, ఒక పదానికి అది కనుక్కునేందుకు పజిల్‌ నిర్మాత రకరకాలుగా ఇచ్చే ఆధారాల నుండి ఒక ఆలోచననూ, ఆనందాన్ని పొందడానికి దోహదపడడమే.

శ్రీశ్రీ ప్రస్థాన త్రయం ఆవిష్కరణ సభ జూబ్లీ హాల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సభా ప్రారంభానికి ఇంకా సమయముంది. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారిని పలకరించితే ''సుధామ.. మీరు నాకు బాగా గుర్తే! మీ పజిల్స్‌ నింపుతుంటాను. ఈ ముదిమి వయసులో మెదడును చురుగ్గా ఉంచడానికి అవెంతో పనికొస్తాయి'' అన్నారు.

అలాగే ఓ సభలో కొన్నాళ్ల క్రితం చేకూరి రామారావుగారు ప్రముఖ సాహిత్య విమర్శకులు పలకరిస్తూ ''గళ్లు ఇచ్చేటప్పుడు నిలువు గళ్లలో పదాలు నింపేందుకు విధిగా ఒక అడ్డం గడిలో అక్షరం కూడా ఉండేలా నిర్మాణంచేస్తూ ఆధారాలు ఇవ్వండి. కేవలం అడ్డానికో, నిలువుకో మాత్రమే వుండేవి సరికాదేమో!'' అని సూచించారు. ఇలా గళ్ల నుడికట్టులు నింపేవారిలో ఆసక్తి, శ్రద్ధ కనబరిచే సాహితీ దిగ్దంతుల నుండి సామాన్య పాఠకుల వరకు ఉండడమే ఈపజిల్స్‌ ప్రాచుర్యానికి నిదర్శనం.

పదవినోదం, పదరంగం, పదచదరంగం, పదరసం, పదశోధన, పదబంధం, పదనిసలు, సండే పజిల్‌, మాటలకొలువు, పద్మవ్యూహం, పజిలింగ్‌ పజిల్‌, పదక్రీడ, పదవిన్యాసం, పదప్రజ్ఞ, పదగారడి, పదకేళి ఇలా పేరు ఏదయితేనేం వివిధ దిన, వార, మాస పత్రికల్లో ఇంగ్లీషులో క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ అని పిలుచుకునే ఈ గళ్లనుడికట్టులు నేటికీ దర్శనమిస్తున్నాయి.

సరదాగా నింపి సమాధానాలు సరి చూసుకునేలాంటివి కొన్నయితే, నింపి పంపితే సరియైన సమాధానాలు రాసిన వారి పేర్లు ప్రచురించేవి కొన్ని, నింపి పంపినందుకు పుస్తకాలు, విలువైన నగదు బహుమతులను ఇచ్చేవి మరికొన్ని. ఇలా వివిధ పత్రికలు ఈ గళ్లనుడికట్టులను నిర్వహిస్తున్నాయి.

మన తెలుగులో ఆరుద్రగారే తొలుత గళ్లనుడికట్టు నిర్మించారనీ, అయితే శ్రీశ్రీ 'పదబంధ ప్రహేళిక' పేరున దానిని ప్రాచుర్యం లోకి తెచ్చారని అంటారు. ప్రాచీన ప్రబంధాల్లో బంధ కవిత్వం, చిత్ర కవిత్వం పేర ఇలా ఒక ఆకృతిలో అర్థవంతమైన అక్షర సముదాయాన్ని కూర్చడం వుంది. అయితే ఈ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తరహా మాత్రం ఇలా ఒక నిర్దుష్ట చదరపు ఆకారపు గళ్లతో నిర్మితమై వచ్చింది మాత్రం ఆంగ్లం నుండే.

కాస్‌వర్డ్‌ పజిల్‌ పుట్టిందిలా...


ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పద క్రీడ ఈ క్రాస్‌వర్డ్‌ పజిల్‌. మొట్టమొదట 19వ శతాబ్దిలో ఇంగ్లాండులో తొలిసారిగా రూపుదాల్చింది. అడ్డంగానూ, నిలువుగానూ గళ్లలో అక్షరాలు నింపుతూ పదాలను నింపడం ఈ క్రీడలో ప్రధానం. ఆ పదాలు కనుక్కోడానికి ఆధారాలు ఇవ్వబడతాయి.

యు.ఎస్‌లో ఇది పెద్దల కాలక్షేపానికి ప్రధానమైందిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. లివర్‌పుల్‌ వాసి అయిన ఒక జర్నలిస్టు ఆర్థర్‌ వ్యిన్నె దీనికి ఆద్యునిగా గుర్తింపబడ్డారు. 21 డిసెంబర్‌ 1913లో 'న్యూయార్క్‌ వరల్డ్‌' దినపత్రిక ఆదివారం సంచికలో తొలిసారి క్రాస్‌వర్డ్‌ పజిల్‌ వచ్చింది. అప్పుడు ఇప్పటి నలుచదరపు ఆకారంలో లేదు. డైమండ్‌ ఆకారంలో మొదటి క్రాస్‌వర్డ్‌ పజిల్‌ వచ్చింది. అంతేకాదు లోపల ఎక్కడా నల్లగళ్లు లేవు అందులో. వారాంతపు పజిల్‌గా కామిక్‌ సెక్షన్‌లో వ్యిన్నె దానిని ప్రకటించడంతో విపరీతమైన స్పందన వచ్చింది. 1914లో పాఠకులు కూడా అలా పజిల్‌ నిర్మించి పంపడం మొదలు పెట్టారు. వ్యిన్నె వాటిని కూడా వినియోగించేవాడట. అయితే కూర్పులో అచ్చుతప్పులు (గళ్లల్లోనూ, ఆధారాల్లోనూ ఇప్పుడూ తారట్లాడుతూనే వుంటాయి) వివరీతమవడంతో క్రాస్‌వర్డ్‌పజిల్‌ ఆపేస్తే ,పాఠకులు నానా గోల చేసి తిరిగి ప్రారంభమయ్యేలా చూశారట.

1920లో ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న చదరపు పద్ధతి నిర్మాణం మొదలై దాదాపు అమెరికన్‌ న్యూస్‌ పేపర్లన్నీ క్రాస్‌వర్డ్‌ పజిల్‌ ప్రచురిస్తూ సాగాయి. ఆ తరువాత పదేళ్లకు అట్లాంటిక్‌, యూరప్‌ దేశాలకు ఈ అక్షర క్రీడ వ్యాపించింది. బ్రిటీష్‌ పత్రికల్లో తొలిసారి పియర్సన్స్‌ మ్యాగజైన్‌లో 1922 ఫిబ్రవరిలో, 1930 ఫిబ్రవరి 1న టైమ్స్‌ మ్యాగజైన్‌లో క్రాస్‌వర్డ్‌ పజిల్‌ సాక్షాత్కరించింది. అమెరికన్‌ పజిల్స్‌ కన్నా బ్రిటీష్‌ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తమదైన ముద్రతో మెదడుకి నిజంగా ఒక మేతగా వుండసాగాయి. మార్మికమైన, గూఢార్ధభరితమైన గళ్లనుడికట్టులను ఎ.ఎఫ్‌.రిట్చి, డి.ఎస్‌.మాక్‌నట్ట్‌ ఆధారాలు ఇవ్వడంలో ఒక గజిబిజి తనాన్ని, చమత్కారాన్ని పాటిస్తూ ఒక స్థాయి కల్పించారు.

ఎలా చేస్తారు?

చదరం, ధీర్ఘచతురస్రాకారంలో తెల్లని మరియు నల్లని గడులతో వుండే దీంట్లో గళ్లను అక్షరాలతో నింపుతూ, పదాలను లేదా వాక్యాన్ని కనుక్కోవాలి. ఆధారాలను బట్టి సమాధానాలు సాధించాలి. అడ్డంగానూ, నిలువుగానూ ఈ అక్షరాలు గళ్లలో నింపడం వుంటుంది. ఒక్కసారి కుడినుండి ఎడమకు, కిందినుండి పైకి చదువుకునేలాగానూ నింపడానికి ఆధారాలు ఇస్తుంటారు. పదం ప్రారంభమయ్యే గడిలో సంఖ్యను చూపించడం జరుగుతుంది. నాలుగు అడ్డం, పద్దెనిమిది నిలువు అన్నట్లుగా సంఖ్యతో మొదలయ్యే పదాలు కనుగొనే ఆధారాలు ఇస్తారు.

అసలు మజా అంతా ఆధారాలలోనే వుంటుంది. ఆ ఆధారాలను మెదడుకు మేత పెడుతూ సరిగ్గా అర్థం చేసుకుని పట్టుకోగలిగితే నింపడం అలవోకగానే అనిపిస్తుంది. ఒక పదానికి గల నానార్ధాలు, పర్యాయపదాలు, సామెతలు, జాతీయాలు, నుడులు, సాహిత్య పరిజ్ఞానం, వర్తమాన అంశాల అవగాహన ఇలా అన్నీ అవసరం పడుతుంటాయి.


ఆయా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ రూపొందిన విధానం బట్టి, ఆధారం చివర మొత్తం పదంలోని అక్షరాల సంఖ్యను బ్రాకెట్లలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ సంఖ్య సూచించని పదబంధ ప్రహేళికలూ వుంటాయి. ఒకవేళ వాక్యం కనుక్కోవాల్సి వస్తే ఆ వాక్యంలో ఎన్ని పదాలు వుంటాయినే సూచన కూడా ఇస్తారు. ఈ గళ్లనుడికట్టులలో తేలికవీ, కొంచెం కష్టమైనవీ, అతిగా బుర్రకు శ్రమ కలిగించాల్సినవీ కూడా వుంటాయి. 7×7, 9×9 గళ్లవి ఎక్కువగా తెలుగు పత్రికల్లో ముఖ్యంగా దిన, వార పత్రికల్లో చూస్తాం. 8 గళ్లవీ, 10 గళ్లవీ, 12 గళ్లవీ వుంటాయి. అలాగే ఆంగ్లపత్రికల్లో 15×15, 21×21, 23×23, 25×25 గళ్లతో వుండేవీ వస్తుంటాయి. మాసపత్రికల్లో పన్నెండు గళ్లు అడ్డం ప్లస్‌ నిలువుగా వుడేవి, అడ్డం 17 నిలువు 9 గా పజిల్‌ 'రచన'గా వుండేవి వున్నాయి. అలాగే పిల్లల కోసం కొన్ని పత్రికల్లో అయిదు గళ్ల పజిల్స్‌ రూపొందించబడ్డాయి.

ఎన్ని రకాలో...












ఇక ఈ క్రాస్‌వర్డ్‌ పజిళ్లలో ప్రత్యేకం భాషా సంబంధంగానూ, భక్తి, సంస్కృతి సంబంధంగానూ ఇలా ప్రత్యేకించి రూపొందించబడి ఇచ్చే పదబంధాలూ వుంటుంటాయి. సినిమా మాధ్యమం ఇవాళ చాలా ప్రభావోపేతమైనది కాబట్టి సినీపదరంగం అంటూ ప్రత్యేకించి పత్రికలు సినిమా గళ్లనుడికట్టులు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. 'సితార, సంతోషం' వంటి సినిమా పత్రికలు గతంలో ఇలాంటి సినిమా పజిల్స్‌ ఇచ్చినవే.


విదేశాల్లోనూ వాషింగ్‌టన్‌ పోస్ట్‌, ది యు.ఎస్‌.ఎ టుడే, న్యూయార్క్‌ టైమ్స్‌, ది హెరిటేజ్‌ న్యూస్‌ పేపర్‌ వంటి అమెరికన్‌ పత్రికలే కాదు హిందూ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి పత్రికలూ క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ ఇస్తున్నాయి.

తెలుగు దిన పత్రికల్లో రోజువారీగా ప్రస్తుతం ఆంధ్రప్రభ దినపత్రికలో సుధామ, ఆంధ్రభూమి దిన పత్రికలో పెద్దిభాట్ల సుబ్బరామయ్య పదనిసలు, పదకేళి నివ్వహిస్తూనే వున్నారు. ఎడ్యుకేషనల్‌ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ విదేశాల్లో ప్రాముఖ్యంగా వున్నాయి. భాష, కెమిస్ట్రీ, బైబిల్‌ ఆధారంగా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ ఇప్పటికీ అక్కడ సాగుతున్నాయి. తేలికగా, సులభంగా, కష్టంగా, కష్టతరంగా, ఎలా వున్నా -వీటిని నింపే వ్యసనానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో లోనయ్యారు. వీటిని నింపడంలో ఆనందాన్ని, పూర్తి చేయగానే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ధీమానీ పొందుతుంటారు.


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో ది డైలీ టెలిగ్రాఫ్‌లో వస్తున్న క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ మిలిటరీ ఆపరేషన్స్‌కు చెందిన రహస్యాలను బహిర్గతం చేస్తున్నాయని రక్షణ అధికారులకు అనుమానం కలిగింది. 1944 మే 2 వ తేదీ ఉటా అనే లాండింగ్‌ స్థావరం పేరు, అలాగే కృత్రిమ ఓడ రేవుల పేర్లు, జూన్‌ 2 న నెఫ్ట్యూన్‌ అనే 'నేవల్‌ ఆపరేషనల్‌ ప్లాన్‌' పేరు వచ్చింది. ఆ క్రాస్‌వర్డ్‌ పజిల్‌ను ఇచ్చింది 'లియొనార్డ్‌ డావె' అనే స్కూల్‌ టీచర్‌. అతన్ని అనుమానించి అరెస్టు చేశారు. 1984లో 'ది డైలీ టెలిగ్రాఫ్‌' పత్రిక క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ ఎడిటర్‌ ఆర్మీ క్యాంపుల్లోని కబుర్ల నుండి ఆ టీచర్‌ ఒక స్టూడెంట్‌ చెప్పిన పదాలను వినియోగించడం వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని తెలిసింది.


క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ నింపే వ్యసనంలో పడి పనులు కూడా మందగిస్తున్నాయని బ్రిటన్‌లో ఒక సందర్భంలో వీటిమీద నిషేధం చూడా విధించారట. ఆ తరువాతనే పనివేళల్లో విశ్రాంతి సమయాన్ని విభజించి అనుమతించారట.

గిన్నిస్‌ బుక్‌ రికార్డుల ప్రకారం రోగర్‌ స్క్వెయిర్స్‌ అత్యధిక క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తయారు చేసిన వ్యక్తిగా 15 మే 2007న నమోదయ్యాడు.ది టైమ్స్‌, ది డైలీ టెలిగ్రాఫ్‌, ది గార్డియన్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ది ఇండిపెండెంట్‌ మొదలైన పత్రికల్లో గళ్లనుడికట్టులు ఇచ్చిన అతను 14 మే 2007 నాటికి మొత్తం ఆరవైఆరు వేల ఆరువందల అరవై ఆరు పజిల్స్‌ రెండు మిలియన్ల ఆధారాలతో ఇచ్చాడట. గళ్లనుడికట్టులో యాభై ఎనిమిది అక్షరాల పదం ఇచ్చిన పజిల్‌ నిర్మాత కూడా తానే!


ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, పోలెండ్‌, హిబ్రూ మొదలైన అనేక భాషల్లో క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ దూసుకువెడుతున్నాయి.

మన రాష్ట్రాల్లో...

ఇక మన దేశంలోనూ వివిధ భాషా పత్రికల్లో ఈ పదబంధ ప్రహేళికలు వస్తున్నాయి. మన దేశానికి చెంది ఎ.ఎన్‌.ప్రహ్లాదరావ్‌ అనే బెంగుళూరు వాసి కన్నడ భాషలో ఇప్పటికీ ఇరవైమూడువేల గళ్లనుడికట్టులు చేశాడట. వాటిల్లో ఆరువేలు సినిమాలకు సంబంధించి రూపొందించినవి. ప్రహ్లాదరావు మూడు దినపత్రికలకూ, ఇరవైనాలుగు వివిధ మ్యాగజైన్లకూ తయారు చేసిన ఈ ప్రహేళికలకై ఆరులక్షల ఇరవైవేల ఆధారాలు ఇచ్చినవాడయ్యాడు. ఇక బెంగాలీలో కూడా బ్రిటీష్‌ నుడికట్టు పద్ధతిలో పదచదరంగాలు రూపొంచింది ప్రకటిస్తున్నారు. అయితే బెంగాలీ గళ్లనుడికట్టులో రెండక్షరాల పదాలను ఇప్పుడు పరిహరించారట! నిజంగా అదో విశేషమే!

అంకెల పజిల్‌

గణితంలో లాటిన్‌ స్క్వెర్‌ మూలంగా లియాన్‌ హార్డ్‌ ఈలర్‌ అనే గణితశాస్త్రవేత్త 1780లో అంకెలను వరుసగళ్లతో ఒకసారి వచ్చిన అంకె మరొకసారి రాకుండా ఒకటినుండి తొమ్మిది వరకు వచ్చే పద్ధతి పజిల్‌ కనుక్కున్నాడు. డెల్‌ పత్రికలు వీటిని అందిపుచ్చుకున్నాయి. అమెరికాలో కనుక్కున్నా జపాన్‌లో వేనీగౌల్డ్‌ అనే హాంగ్‌కాంగ్‌ రిటైర్డ్‌ జడ్జి టోకియో బుక్‌ స్టోర్‌లో 1997లో వీటిని ప్రవేశపెట్టాడు.

అంకెలు ఒంటరిగా జత కట్టకుండా ఉండడం అనే అర్థంలో జపనీస్‌ పదం కుదింపబడి 'సుడోకు'గా ఇవాళ ప్రపంచ వ్యాప్తమైన అంకెల క్రీడగా ప్రాచుర్యం చెందింది. బ్రిటీష్‌ న్యూస్‌పేపర్‌ ది టైమ్స్‌ 12 నవంబర్‌ 2004లో తొలిసారి 'సుడోకు' ప్రచురించింది. యు.ఎస్‌ కు ఆ తర్వాత పరివ్యాప్తమై ఇవాళ ప్రపంచ ప్రసిద్ధమైంది.9×9 గళ్లల్లో, తొమ్మిది 3×3 అనుబంధిత గళ్లలో ఒకటి నుండి తొమ్మిది వరకు వేసిన అంకె వేయకుండా గళ్లలో ముందే ఇచ్చిన అంకెను మార్చకుండా నింపే ఆ పద్ధతి ఇవాళ ఓ పెద్ద క్రేజ్‌! వాటికి పోటీలు, బహుమతులు కూడాను. ఏ గడికి ఆ గడి ఖచ్చితమైన నియమిత అంకెతోనే సుడోకు రూపొందుతుంది.


9×9 గళ్లలో పూర్తి చేయదగిన సుడోకు కాంబినేషన్స్‌ ఎన్ని వుండడానికి అవకాశం వుందంటే 6,670, 91, 752,021,072, 936, 960 రకాలుగా ఇవ్వవచ్చు నన్నమాట.అయితే భారతదేశం ప్రపంచానికి కానుక ఇచ్చిన సున్న '0' సుడోకులో లేదు. ఈ అంకెల క్రీడ కన్నా భాషా, సాహిత్యాలు, ప్రపంచ పరిజ్ఞానం, కాలక్షేపానికి కాలక్షేపం, మెదడుకి చురుకు, హృదయానికి ఆనందం కలిగించే గళ్ల నుడికట్టుల వల్లనే ఎక్కువ లాభం వుందంటున్నారు.

ఈ తరం పిల్లలకు మన భాషా, సాహిత్య సంస్కృతుల పట్ల ఆభిరుచి పెరగడానికి పదబంధ ప్రహేళికలే ఎక్కువ ఉపకరిస్తాయని, అందువల్ల 'సుడోకు' కు బదులు అన్ని పత్రికలు క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ను ప్రోత్సహించడమే సబబనీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ఇంటర్నెట్‌లో కూడా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ చోటు చేసుకుంటున్నాయి. థింక్స్‌ డాట్‌ కామ్‌, క్రాస్‌వర్డ్‌ సైట్‌, పజిల్‌ ఎక్స్‌ప్రెస్‌, డైలీ కోడెడ్‌ క్రాస్‌ వర్డ్‌ వంటి సైట్లు వున్నాయి. 1997లో క్రాస్‌వర్డ్‌ వీవర్‌ పేర కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం అభివృద్ధి పరిచారు. తొలుత 'వర్డ్‌క్రాస్‌' పేరిట మొదలైన ఈ గళ్ల నుడికట్టును 1924లో సైమన్‌, స్కూస్టర్‌ వారు పుస్తక రూపంలోప్రచురించారు.గళ్లనుడికట్టుపుస్తకాలుఇప్పుడిప్పుడు మన దగ్గరా విస్తృతంగా రావడం మొదలైంది.

మన పెద్దలు... పదబంధాలు


తెలుగులో ఆరుద్ర, శ్రీశ్రీ పదబంధప్రహేళికల పట్ల పాఠకులకు ఆసక్తిని పెంచారు. ఆధారాలు ఇవ్వడంలో శ్రీశ్రీ ఆరుద్రలు చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. భాషాచమత్కారాలతో, రెండర్థాలతో, పదంలోనే సమాధానం దాగి వుండే రీతిలో, నానార్ధాలు , సామెతలు, ప్రాచీన ప్రబంధ, సాహిత్యాది అంశాల పరిచితి వల్ల సాధించగలిగే రీతిలో వారు పజిల్స్‌ నిర్మించేవారు.

'పిల్లి లేని పినతల్లి వికారంతో కూడితే గరుత్మంతుడి తల్లి'' అని వినత అనే పదానికి, 'కత్తిలో తోక' అంటే 'కరవాలము'లో వాలము అని రాయడం. ఇలా వారు ఆరంభించిన చమత్కార వైఖరులను ఆపై ఎందరో అంది పుచ్చుకుని అభివృద్ధిపరిచారు.

తెలుగులో ఇప్పటికీ అత్యధిక పదబంధ ప్రహేళికలను కూర్చింది ఎవరంటే ఇతమిద్థంగా చెప్పడం కష్టం! కానీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సుధామ, నిశాపతి, అదృష్టదీపక్‌, ఎన్‌.సురేంద్ర, ఘంటసాల నిర్మల, వాడ్రేవు ఉమాశంకర్‌, బాలు, వాణిశ్రీ, కావూరి వెంకట సుబ్బారావు, హుమయూన్‌ సంఘీర్‌, జి.శుభాకరరావు, కె.బి.గోపాలం, ప్రదీప్‌, గొరుసు, వెలివల సాంబశివరావు ఇలా ఎందరెందరో (కొన్ని పత్రికల్లో తమపేరు పేర్కొనకుండా కూడా మరెందరో) ఈ గళ్లనుడికట్టులను నిర్మిస్తున్నారు.

ఆంద్రభూమి దినపత్రికలో పెద్దిబొట్ల సుబ్బరామయ్య, ఆంధ్రప్రభ దినపత్రిక, వార్త (ఆదివారం),నవ్య వార పత్రిక, ఆంధ్రభూమి, రచన మానపత్రికల్లో సుధామ ,ఆ తర్వాత నిశాపతి అంతకుముందు యామినీ సరస్వతి గారు అత్యధిక సంఖ్యలో, అంటే వేలాదిగా పదబంధ ప్రహేళికలను రూపొందించిన వారుగా చెప్పుకోవచ్చు. పెన్నా శివరామకృష్ణ వంటి కవులు, మణికుమారి, నిర్మల, నీరజ కూడా పదబంధాలు తయారు చేసారు. గతంలో గళ్ల నుడికట్టులు నిర్మించినవారు ఈ వ్యాసకర్త దృష్టిలోకి రాని వారెందరో వుండి వుంటారు. అలాగే పత్రికల్లో కాక వినోదాలు, వేడుకల కోసం, గేమ్‌షోల కోసం ఈ గళ్లనుడికట్టు పదక్రీడలు రూపొందించి అలరించేవారూ ఎందరో!

ప్రయోజనాలెన్నో


ఏమయినా ఈ గళ్లనుడికట్టు పదబంధ క్రీడలు మన భాషను, పదసంపదను పరిరక్షించుకోవడానికీ, పాఠకులలో పరివ్యాప్తం చేయడానికీ అలాగే మన సంస్కృతీ సంప్రదాయాలలోని, ఆచార్య వ్యవహారాలలోని, జానపద మధురిమల్లోని విషయ గత పదబంధాలను నిక్షిప్తపరుచుకోవడానికీ, వర్తమాన సామాజిక, రాజకీయ, చలనచిత్రాది అంశాలతో నిరంతరం సంబంధం కలిగివుండేందుకూ ఎంతగానో ఉపకరిస్తాయి.

మెదడుకు మేతగా అన్ని వయస్సులవారికీ ఉపయోగపడే శీర్షికగా పదబంధప్రహేళికలు అన్ని పత్రికల్లోనూ రాణిస్తాయి. ఎన్ని రకాల కొత్త కొత్త పజిల్స్‌ వచ్చినా నిర్మాణపరంగా పజిల్స్‌ అన్నింటిలోనూ మకుటాయమానమైనది క్రాస్‌వర్డ్‌ పజిల్‌ అనే పదబంధ్ర ప్రహేళికే. గళ్లనుడికట్టుపై పట్టు సాధించిన పాఠకుడికి కలిగే ఆనందం, విజయానుభవం వర్ణనాతీతాలు. ఈ సందర్భంగా వీటిని రూపొందించే స్రష్టలకు, సమాధానాలిస్తున్న పాఠకశ్రేష్టులకూ ప్రజాశక్తి స్నేహాభినందనలు.

సుధామ

7 comments:

Dr.Suryanarayana Vulimiri said...

సుధామ గారు, మీ వ్యాసం చాల ఆసక్తికరంగా ఉంది. నాకు పజిల్స్ అంటే చాల యిష్తం. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఒకప్పుడు శ్రీశ్రీ పదబంధ ప్రహేళికలు బాగా సాల్వ్ చేసేవాడ్ని. నాకు ముఖ్యంగా ఆధారంలో దాగుని వున్నా క్రిప్టిక్ క్లూలు అంటే చాల సరదా. చాల ఓపికగా పజిల్సు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిపారు. ధన్యవాదాలు.

చదువరి said...

వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగులో గళ్ళనుడికట్టు చరిత్ర గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తే నావంటివారికి ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రస్తుతం అంతర్జాలంలో కూడా గళ్లనుడికట్లు వస్తూన్నాయి, మీరు చూసే ఉంటారు. పొద్దు పత్రికలో, కొడహళ్ళి మురళీమోహన్ గారి బ్లాగులో, కందిశంకరయ్య గారి బ్లాగులోను వస్తున్నాయి. పొద్దులో భైరవభట్ల కామేశ్వరరావు గారు, కొవ్వలి సత్యసాయి గారు, పప్పు నాగరాజు గారు, త్రివిక్రమ్ గారు, యర్రపురెడ్డి రామనాధరెడ్డి గారు కూర్చుతూంటారు.

mmkodihalli said...

వ్యాసం బాగుంది. ఇంకొక విషయం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద గళ్ళనుడికట్టు కూర్చింది మన భారతీయుడే! రాజు ఉమామహేశ్వర్ అనే అతను 91,000 గళ్ళు కలిగి 28000కు పైగా ఆధారాలున్న 7అడుగులు బై 7అడుగులు గల పజిల్‌ను నిర్మించాడు.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

చాలా విశేషాలతో కూర్చారు మీ వ్యాసాన్ని. అభినందనలు.

vijaykumar said...

sudhama dhuram... baagundandi mee blog. naaku telugulo meeku abhinandanalu telapaalani vundi... kaani elago artham kaavadam ledu....dr.vishnu

KrishnaRaoBhagavatula said...

బావుంది. తెలియనివి తెలిపినందుకు.

Unknown said...

చాలా విషయాలు తెలుసుకున్నాను.నాకూ పజిల్స్ చేయడం ఇష్టము.