ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, August 21, 2011

యోగి ఆత్మకథ!





టిబెట్‌వారు అపర బుద్ధునిగా భావించే ధర్మ భిక్షువు ‘మిలారేపా’.



12వ శతాబ్దానికి చెందిన ఈ యోగి కథను శ్రీ శార్వరీ మంచి ఆధ్యాత్మికానుభూతినివ్వగల గ్రంథంగా మలిచారు.


ఉద్రేకం ఉరకలువేసే యవ్వనంలో తన మంత్రశక్తితో వడగళ్లవాన కురిపించి, చేలను నాశనం చేసి, గ్రామస్థుల్ని భయభ్రాంతులను చేసిన వ్యక్తే. 83 ఏళ్ల వయసులో - ఆ గ్రామస్తులకే ‘ఆరాధ్య దైవ’మన్నంతగా మారిన సద్గురువు - ‘మిలారేపా’.


సాధకులకు ఈ యోగి ఆత్మకథ ఆవశ్య పఠనీయం! బుద్దుని బోధనలు, ధ్యాన సూత్రాలు ‘మహాముద్ర’గా టిబెట్‌లో అందిపుచ్చుకున్న వారిలో ‘మార్వా’ ఈ ‘మిలారేపా’కు గురువు.


దక్షిణ టిబెట్‌లో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ‘మిలారేపా’ తండ్రి మరణంతో, సాటి బంధువుల ఈసడింపులకు గురియై, తల్లి మాట మీద, ప్రతీకారం తీర్చుకోవడానికై క్షుద్ర విద్యలు అభ్యసిస్తాడు. అయితే తదనంతరం, తన దృష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూసి, ఆత్మ విచారణ చేసి, చైతన్యంపొంది, సన్మార్గంలోకి వస్తాడు.


భౌతిక దశలో గురువు సహాయ సహకారాలు అవసరంగానీ, సాధన తీవ)తరమై, అంతర్ చైతన్యం ఆవిష్కృతమైన దశలో, గురు చైతన్యంలో తన చైతన్యం కలిసిపోయి, ఒక మహా చైతన్యంగా పరిణమిస్తుందని ‘మిలారేపా’ కథ మనకు చెబుతుంది.


ఒకసత్యాన్వేషి సాధనాక్రమాన్నిమనకళ్లముందుంచుతుంది. శిష్యుల మానసిక స్థితిగతులను బట్టిసద్గురువు నిర్దేశించే పద్ధతులుంటాయనికూడా ఈ రచన చెబుతుంది.


ఆత్మజ్ఞానం ఎవరికివారు పొందవలసిందే. ఈ ఒక్క మానవ జన్మలోనే జన్మ జన్మల కర్మశేషాలు విదుల్చుకుని జన్మరహితులo కావచ్చని మిలారేపా కథ ప్రబోధిస్తుంది.


మిలారేపా కథ, రచన: శ్రీ శార్వరి
వెల. రూ.100/-
ప్రతులకు: మాస్టర్ యోగాశ్రమం
89, కృష్ణా ఎన్‌క్లేవ్, మిలటరీ డైరీ ఫారం రోడ్
తిరుమలగిరి, సికిందరాబాద్ - 15

0 comments: