ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, August 14, 2011

ఓ మంచి కిక్కు!






అదేదో సినిమాలో బ్రహ్మానందం టపాకాయలు దీపావళికే ఎందుకు కాల్చాలి, హోలికి కాలుస్తాను నేను, రంగులు హోలీనాడే ఎందుకు చల్లుకోవాలి, దీపావళికి చల్లుకుంటే ఏం? అని ప్రవర్తించే పాత్రను చిత్రించారు.

హాస్యానికి ఆలంబనగా జరిగిన ఆ చిత్రణ నేపథ్యంలో జర్మన్ కథ పీటర్ బిక్‌సెల్ రాసిన ‘వింత భాష’ వుందేమోనని మల్లాది వెంకట కృష్ణమూర్తి విదేశీ కథలు (అనువాద కథలు) చదువుతుంటే అనిపించింది.

వింత భాష కథలో ముసలివాడు మంచాన్ని ఫోటో అని, బల్లపేరుని కార్పెట్‌గానూ మార్చి అలా ప్రతిదీ కొత్తకొత్త పేర్లతో మార్చేసి ఆల్బం తొమ్మిదిన్నరకి మోగేదాకా ఫొటో మీద పడుకుని, మోగాక లేచి బీరువామీద నిలబడి, బట్టలని పేపర్ తలుపు తెరిచి తీసుకుని తొడుక్కుని, గోడమీద వేలాడే పుస్తకంలో మోహం చూసుకుని, గడియారం మీద కూర్చుని నవ్వుకునేవాడు.

ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, జపనీస్, ఇద్దిష్, హిబ్రూవంటి అనేక విదేశీ కథలను మల్లాది అనుదించి హాస్యం, విషాదం, క్రైం, సస్పెన్స్, ప్రేమ మొదలైన అంశాల్లోని ఆ రచయితల ఊహా పార్శ్వాలను మనకు అందించారు. అనువాద కథలు మాసపత్రికగా పేరొందిన ‘విపుల’లో వచ్చిన ఈ 31 కథలలో ఎంతో వైవిధ్యాన్ని, విభిన్న మానవ స్వభావాలనూ అవగతం చేసుకుని ఆనందించగలం.

ఇవన్నీ మరీ పెద్ద కథలేమీ కాదు. తెలుగు కథల్లో కనబడని విశేష ఇతివృత్తాలను పరిచయం చేసే కథలను ఎక్కువుగా ఎన్నుకుని సరళమైన తెలుగులో అనువదించి అందించడంవల్ల ఈ కథలు చదువుతున్నంతసేపూ కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో సంచరిస్తున్న థ్రిల్ కలుగుతుంది.

యూద్ మతంలో రేబై (ఫాదర్) పర్యవేక్షణలో చంపబడ్డ జంతుమాంసంతో వండేదే కోషర్‌మీల్. అలా చంపని జంతు మాంసాన్ని తినడం చాలా పాపంగా భావించే యూత్ యువకుడు విమాన ప్రయాణంలో తనకోసం కోషర్‌మీల్‌ను త్యాగంచేసి ఆదుకున్న జూడీస్టోన్ అనే అమ్మాయిని జోనాధన్ బ్రాండే అనే యువకుడు పెళ్లి చేసుకున్న హిబ్రూకధ ప్రేమకు ఒక భోజన పదార్థం ఎలా వారధి అయ్యిందీ చెబుతుంది.

బ్రీఫ్‌కేస్, ఆఖరి టెలిఫోన్, రాబంధుగుడ్డ మొదలైన ఈ సంకలనంలోని కథలు వింతగా ఉంటూనే ఆశ్చర్యానందాలు కలిగించేవిగా చదివిస్తాయి.

విదేశీ కథలు చదవడం ముఖ్యంగా నేటి యువతకు ఒక మంచి థ్రిల్, ఓ మంచి కిక్కు కూడా!

(విదేశీకథలు (అనువాద కథలు),అనువాదకులు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
వెల-రూ.100/- లిపి పబ్లికేషన్స్,గాంధీనగర్, హైదరాబాద్-80)

0 comments: