‘‘మనం సమాజానికి ఉన్నతమైన పౌరుల్ని ఇవ్వాలి తప్ప ఒకర్నిమాత్రం కని దేశసేవ చేస్తున్నాం అనుకూడదు. ‘ఒన్ ఆర్ నన్’ అనే మాటకు అర్థం లేదు. జననం అనేది ఇండియాకో, చైనాకో చెందింది కాదు. అతి పెద్ద దేశాలు కాబట్టి గతంలోలా ఒకే కుటుంబంలో అయిదారుగుర్ని కనకపోవటం మంచిది. చాలా దేశాల్లో కొత్త జనరేషన్ తక్కువయిపోతోంది. అందరూ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే ఒక దేశం ఏమై పోవాలి’’.
‘‘ఇతరులతో భావాలు పంచుకోవటం వేరు. స్వంత మనుషుల దగ్గర ఎమోషన్స్ వేరే ఉంటాయి. బయటివారితో స్నేహం మాత్రమే! ఇక్కడ ప్రతిక్షణం కోపతాపాలు భరించాలి. ప్రేమను పంచుకోవాలి. కుటుంబం ఎదుర్కొనే కల్లోలాల్లో బాధ్యత తీసుకోవాలి. స్వార్థమా? త్యాగమా? ఇవి నిర్ణయించబడేది బాల్యంలోనే’’.
చంద్రశేఖర్ అజాద్'ఫ్యామిలీ ఫొటో’నవల ఇలాంటి భావజాలాన్ని ప్రోది చేస్తూ కుటుంబ బాంధవ్యాల గొప్పతనం చాటి చెబుతోంది. ‘‘పర్ హాప్స్ ది గ్రేటెస్ట్ సోషల్ సర్వీస్ దట్ కెన్ బి రెండర్డ్ బై ఎనీబడీ టు ది కంట్రీ అండ్ మ్యాన్‌కైండ్ ఈజ్ టు బ్రింగ్ అప్ ఎ ఫ్యామిలీ’’ అన్న జార్జి బెర్నార్డ్‌షా మాటలు స్ఫూర్తిగా రూపొందిన ఈ నవల సి.పి. బ్రౌన్ ఎకాడమీ, నవ్య వార పత్రిక పోటీల్లో మూడో బహుమతి పొందిన రచన.
‘‘జీవితమంటే అంతిమంగా కనె్ఫషన్’’ కావచ్చు అంటూ అజాద్ ‘‘త్యాగాలు చేసినవారు సెంటిమెంటల్ ఫూల్స్ కాదు. ఏ త్యాగం చేయనివారు ఎన్ని కబుర్లు చెప్పినా వారు కుటుంబానికి అవతల ఉన్నట్లే!’’ అనిపింప చేస్తూ మృగ్యమవుతున్న కుటుంబ సంబంధాలను ప్రోది చేసి ప్రోత్సహించేలా ఈ రచనను మలిచారు.
అజాద్‌లో మంచి అధ్యయనం వుంది. పుస్తకాల నుంచే కాదు మనుషుల నుంచి కూడా. అందువల్లే అత్యంత సహజంగా పరిసరాలను, పాత్రలను కనుల ముందుంచగలుగుతారు. కుటుంబ రావు సర్వసాక్షి కథనాలుగా నడుమనడుమ సాగుతూ సాన్వి, కావేరి పిల్లల నేపథ్యపు రెండు కుటుంబాల గాధగా సాగే రచన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
సింగిల్ పేరెంట్ హుడ్ గురించీ, ఒన్ చైల్డ్ నార్మ్ గురించీ కూడా వివరణాత్మకంగా విశ్లేషిస్తూ ఆలోచనాత్మకంగా సాగే సన్నివేశాలతో, సంభాషణలతో నవల పఠితలను ఆకట్టుకుంటుంది. భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని మానవ సంబంధాల గొప్పతనాన్ని దర్శింపచేసే రచన ఇది.
-సుధామ
ఫ్యామిలీ ఫొటో (నవల) రచన: పి. చంద్రశేఖర్అజాద్ వెల:రూ. 50/- ప్రచురణ: ఎ.ఆర్. బుక్స్ 14-161/2, స్టేషన్ రోడ్ ,గుడివాడ-521301.
0 comments:
Post a Comment