ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 5, 2011

తపించే హృదయం


సరిహద్దుల మీద పెద్దగా
నమ్మకం లేదు నాకు
కాశ్మీర్ అయితేనేం కాందహార్ అయితేనేం
సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి
పక్షులంటే ఇష్టం నాకు
పక్షిపైకి ఎదిగినకొద్దీ
దానిముందు సరిహద్దులన్నీ వెలతెలబోతాయి


అంటాడు ఆకెళ్ళ రవిప్రకాష్.

‘పెద్దగా’ నమ్మకం లేదంటే కొంత నమ్మకం వుందనుకోవాలేమో! కవి సరిహద్దులను అతిక్రమించే విశ్వమానవుడు అని నిర్ధారణగా చెప్పడం కూడా చేటు వాటిల్లుతున్న ఉద్విగ్న కాలం కదా! ఎప్పుడో శతాబ్దాల క్రితం కవులకు కూడా ఇవాళ ప్రాంతీయతలను అంటగట్టి నిగ్రహాలు కోల్పోయి విగ్రహాలను కూల్చుకుంటున్న సంకుచిత సందర్భం కదా! ఇవాళ ప్రేమప్రతిపాదన యాసిడ్ బాటిల్స్‌తోనూ, చురకత్తులతోనూ, హింసోన్ముఖంగా చెలరేగుతున్న కాలం కదా! ఎక్కడి పక్షులు అక్కడే కూయాలని, వాటికి పంజరాలు నిర్మించి, స్థానిక వృక్షాలకు వాటిని వ్రేలాడదీస్తున్న కాలం కదా!


ఎవరయినా చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిష్కర్షగా ప్రేమనయినా ప్రతిపాదించలేని వర్తమాన రణక్షేత్రాన రవిప్రకాష్ కవిత్వంలోని సున్నితత్వాన్ని అంత అనుభూతి రమ్యంగానూ అందిపుచ్చుకోగలరన్న ఆశ్వాసన ఎక్కడుంది.


ఇక నే కవిత్వం రాయలేనని తీర్మానించుకుంటాను
వెలతెలబోతున్న నా కవిత్వపాదాలు
తెల్లటి ఖాళీతనంలోకి
శూన్యంలోకి
శిథిలమవుతున్న ఆలోచనలు


-అంటూ ‘అక్షరం’ గాయపడిన వేదన ఒకటి అతని అంతరంగాన్ని దొలుస్తూనే వుంది. సందర్భం, సంఘటన ఇప్పటివి కాకపోవచ్చు. అయితేనేం...

రాయలేనితనం
అన్నిబాధలకన్నా వ్యధలకన్నా
ఎక్కువగా బాధిస్తుంది
రాయలేనితనం
నా ఆత్మమూలల్లోకి చొరబడి నన్ను జ్వలిస్తుంది

అయితే తనలోని కవిమరణాన్ని ప్రకటించుకునే దశలోనే సర్వదుఃఖాలనూ, ఘర్షణలనూ, వైక్లబ్యాలనూ అంతర్నివహం చేసుకుని మళ్లీ కవిత్వంలోనే ప్రతిష్ఠించి ప్రాణమంతుడవుతాడు. ఆత్మహననం నుంచే ఆత్మ సంక్షోభం నుంచే ఫినిక్స్ పక్షిలా కవిత్వం పునర్జననమవుతుందని ఆకెళ్ళ కవిత్వం కళ్ళకు తెలుసు.

అందుకే అతని ప్రేమ ప్రతిపాదన ఎప్పటికీ వెనుదిరగదు. లోలోనే చచ్చిపోదు. ఎంత కఠినత వుండనీ, అవతల ఎంత కల్లోలం చెలరేగనీ, విషాదచ్ఛాయలు రక్తవర్ణాలతో అలుముకోనీ, తన మృదుత్వాన్నీ, లాలిత్యాన్నీ, రామశీయకతనూ పణం పెట్టడు.


చూడటానికి పెద్ద అందంగా ఉండక్కరలా
ఆడయినా మగయినా
లోలోపల కాస్త కరుణ నిండివుంటే చాలు
ఒక కరుణార్ద్ర నయనం చాలు
ఉదయాన్ని పండించటానికి

పలువురి రక్తాన్ని ఏరులై పారించిన
చరిత్రలన్నింటినీ తగలేసి
మానవాళి కథని మళ్లీ ఎవరయినా రచిస్తే బాగుణ్ణు

అని తపించే హృదయం అతనిది. శరీరం నగరమనీ, నగరంలో ఒక ధ్వంసరచన సాగుతోందనీ తనకు తెలుసు. యుద్దం ఇప్పుడు మన ఊపిరి పొలిమేరల్లో పొంచి వుంది అనీ తెలుసు. క్లిష్టమవుతున్న మానవ సంబంధాలూ, యాంత్రికత తాలూకు వత్తిళ్లు, ఒక హిపోక్రసీ, విలువలు కోల్పోతున్న దుఃఖం ఇవన్నీ తెలుసు కనుకనే నిజమైన కవితా హృదయంతో ప్రేమ ప్రతిపాదన చేస్తున్నాడు.

సామాజికం కాని వైయక్తిక అనుభవం ఎలా సాధ్యం కాదో, వైయక్తికం కాని సామాజిక అనుభవమూ లేదన్నది తన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ సంక్షుభిత పరిస్థితుల్లో ధైర్యంగా ‘ప్రేమ ప్రతిపాదన’ చేస్తున్నాడు. కవి భౌతికంగా మరణించినా నా లోపలి ప్రేమలోకి జన్మనెత్తుతాడని అతని విశ్వాసం అనంతం.


కలల్ని పండనీ
కనురెప్పల్నీ అనంతంలోకి నిండనీ

అంటాడు.

దొరలు కట్టిన రాజమార్గాల పొడుగునా పరుచుకున్న
వలసకాలపు కట్టడాలలో
యథేచ్ఛగా కదం తొక్కుతున్న
స్వదేశీ దోపిడీ సిద్ధాంతం నిరాశలో
మునిగితేలుతున్న యువకుల కిక్కడ తోవలేదు
నీరసించిన వృద్ధాప్యానికి నీడలేదు.
దారిపొడువుగా ఓపిగ్గా నిలబడ్డ విగ్రహాలకి మటుకు కొదవలేదు.

అని రాజధాని రాంఢోళ్లను నినదిస్తూనే


ఎవరినయినా వదిలిపెట్టి వెళ్లడం ఎంత కష్టం
ఎవరయినా మనల్ని వదిలివెడితే ఎంత దుఃఖం
అసలు ఎందుకు ఎవరయినా వెళ్లాలి
అసలు ఎందుకు మరణించాలి


అని నిరంతరం తపిస్తూ ‘ప్రేమ ప్రతిపాదన’తో కన్నీళ్లు, రక్తం ఓడుతూనయినా నిలబడే వుంటాడు. ప్రతిపాదనలు ఏమయినా ప్రేమ మరణించకూడదనేదే ప్రేమ వెళ్లి పోకూడదనేదే కవి ఆశయం. విశ్వజనీన సందేశం.

-సుధామ
( ప్రేమప్రతిపాదన (కవిత్వం) వెల: రూ. 200/- ప్రతులకు: ఆకెళ్ళ ఠవిప్రకాష్ ప్లాట్ నెం. 37, 38, శ్రీకృష్ణ స్ట్రీట్ శాంతినగర్ ఎక్స్‌టెన్షన్, లాస్‌పేట్ పాండిచ్చేరి - 605 008)

0 comments: