ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 15, 2011

అన్నా! హా..జారే

‘‘బిల్లు పెడితే అవినీతి పోతుందా?’’ అన్నాడు ప్రసాద్.
‘‘ప్రశ్న వేయడానికే మంత్రులు లంచం పుచ్చుకున్నారన్న పార్లమెంట్‌లో-బిల్లు పెట్టేందుకు కూడా అవినీతి జరగదన్న గ్యారంటీ ఏమన్నా ఉందా?’’ అని కూడా అన్నాడు. ‘‘అవినీతిలోకి దేశం మొత్తం ఎప్పుడో అన్నా! హా..జారే’’ అన్నాడు.
‘‘నువ్వు అన్నా హజారేని తక్కువచేసి మాట్లాడుతున్నావ్’’ అన్నాడు రాంబాబు కొంచెం కోపంగా.
‘‘లేదన్నా! అన్నా హజారే లాంటివారు అరవై ఏళ్ల స్వతంత్య్ర భారతదేశంలో ‘‘హాజరే!’’ కానీ-లాఖోంమే, కరోడోంమే...అంటే లక్షలు, కోట్లలో అవినీతిపరులున్నారు’’ అన్నాడు ప్రసాద్.
‘‘అందుకేగా!, ఆ అవినీతి క్షాళనం కావాలనే-అన్నా హజారే ఉద్యమించింది’’. నల్ల ఆంగ్లేయులపై జరుగుతున్న రెండవ స్వాతంత్రోద్యమం అన్నాడాయన దీనిని. ‘జనలోక్‌పాల్ బిల్లు’ ప్రవేశపెట్టడం ద్వారా తరతరాల అవినీతి బాగోతాలకు ‘చెక్’ పెట్టి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచవచ్చని, ఆయన చిత్తశుద్ధితో విశ్వసిస్తున్నారు’’ అన్నాడు శంకరం.
‘‘ఆయన చిత్తశుద్ధిని కాదు శంకిస్తున్నది. మన రాజకీయవేత్తల, పార్టీల తీరుతెన్నులను. దొంగవాడే-‘దొంగ! దొంగ!’ అని అరిచినట్లుగా స్కాముల్లో,కుంభకోణాల్లో, అవినీతిలో ఆరితేరిన వారే అన్నాహాజరే అవినీతి నిర్మూలనా ఉద్యమానికి అమాయకుల్లా వత్తాసు పలుకుతూ, హడావుడి చేస్తుంటే-నివ్వెరపోవాల్సి వస్తోంది! కపిల్ సిబాల్ కేవలం బిల్లువల్ల పేదల స్థితిగతులు మెరుగుపడతాయన్న మాట అంగీకరించలేం అని అంటే-నమ్మకం లేనప్పుడు కమిటీనుంచి రాజీనామా చేసి తప్పుకోమన్నాడు హాజరే. కానీ విషయం అది కాదు! బిల్లులు బిల్లుల్లోనే ఉండగా వాటికి చిల్లులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి! నిజంగా ‘జనలోక్‌పాల్ బిల్లు’ పార్లమెంట్ ఆమోదిస్తే-అది రాజకీయవేత్తలకూ, ముఖ్యమంత్రి హోదాల్లోని వారికీ సైతం, వారి ఆర్జనలకు కట్టడి అవుతుంది. అందుకే-అసలు బిల్లు రూపొందించడంలోనే, ఎంత నీరుగార్చాలో అంత ప్రయత్నమూ చేసే ప్రమాదాలున్నాయి’’ అన్నాడు ప్రసాదు.
‘‘చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిదన్నారు. అన్నాహజారే చేసిన పని అదే! ఒక దీపంనుండి వేలదీపాలు వెలిగించవచ్చు. అందుకే ఆయన ఉద్యమానికి అంత మద్దతు లభించింది. గాలిలో దీపం పెట్టి ‘దేవుడా నీదే భారం’ అంటే సరికాదు. తాము స్వయంగా రెండు చేతులూ అడ్డంపెట్టి, వీస్తున్న ప్రతికూల పవనాలనుండి, ఉద్యమ దీపం ఆరిపోకుండా రక్షించవలసిన అవసరం ఉంది! ఒక ‘అన్నా హజారే’ చెబితే తప్ప, ఉద్యమిస్తే తప్ప, అవినీతి విరాడ్రూపంలో ఉందనీ, దేశ భవితనే భ్రష్టు పట్టిస్తోందనీ, మనకు తెలియక కాదు. కానీ పిల్లిమెడలో గంట కట్టడానికైనా-సిద్ధం కావాలిగా ఎవరయినా’’ అన్నాడు శంకరం.
‘‘బిల్లు పెడితే అవినీతి పోతుందా? అంటేపోదు. అసలు బిల్లులతోనే జరుగుతున్న అవినీతి బోలెడు! ఉద్యోగి దొంగ మెడికల్ బిల్లులు పెడతాడు. కాంట్రాక్టర్లూ అసలుకి రెట్టింపు ఖర్చులు సూచిస్తూ, పనులకు బిల్లులు పెడతారు. అలా వారు సంపాదించే డబ్బు-‘బిల్లు సరిగాఉంది, సరిగానే కాగితం సబ్‌మిట్ చేసారని’ డబ్బు శాంక్షన్ చేయించుకోవడం ద్వారా, అవసరమైతే అలా శాంక్షన్ చేయడానికి, చేసేవారికి కొంత డబ్బు ముట్టచెప్పడం ద్వారా, ఖచ్చితంగా అవినీతి అక్రమార్జనే! వీటిపై నిఘాలెక్కడివి? ఎంఎల్‌ఎలకూ, ఎంపీలకూ అంతంత జీతాలా? పైగా పార్లమెంట్ క్యాంటిన్లలో వారికి చౌకధరకే టిఫిన్లు, భోజనాలా? అదికాక -ఎంపీలకు ఏటా-అభివృద్ధి పనులకని లక్షలాది రూపాయల కోటానా? ఆ ‘లాట్స్’ను వారు ఎలా ఎందుకు, ఖర్చుపెడుతున్నారో, అందులో ఎంత నిజాయితీ, ప్రజల బాగోగులకు అసలైన మేలువుందో ఎక్కడయినా విశే్లషణ ఉందా?....బడా నేతలు, వ్యాపారవేత్తలు కూడా అన్నా హజారేకు మద్దతు పలుకుతున్నారు. అవినీతి అంతం కావాల్సిందేనని గర్జిస్తున్నారు. ఆయన దీక్ష చేసిన చోట-నిండా బంగారం నగలు దిగేసుకున్న వారూ సంచరించారట! నిజమే! ప్రజలనుంచి, అందునా సామాన్యులూ, మధ్యతరగతినుంచి, మంచి ప్రతిస్పందనే అన్నా హజారేగారికి లభించింది! కానీ-ఎన్నికల సభకు వచ్చిన జనం, నిజంగా ఓటు వేయడం అనేది ఎలా అనుమానమో, హాజారే ఉద్యమానికి కదలివచ్చిన వారు నిజంగా అవినీతికి బద్ధ విరోధులనీ, తాము చిత్తశుద్ధి, నిజాయితీ సక్రమమార్గానుయాయులనీ విశ్వసించడం కూడా అంతే! ‘‘అన్నా!..హా!..జారే’’ అనే స్థితి అన్నా హజారేకు కలగకుండుగాక!’’ అని కూడా అన్నాడు.
‘‘నువ్వన్నది నిజమే కావచ్చు ప్రసాదూ! కానీ ఎక్కడో ఒక ఉద్యమం రావాలి. ఫ్రతి ఉద్యమంలోను ఆటుపోట్లుంటాయి. ‘అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు...అలుముకున్న ఈ దేశం ఎటుదిగజారు’ అంటూ దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ వెలుగునీడల్లో ఆర్తితో సందేశం సంకరించాడు-‘‘ఎదిరించవోయి ఈ పరిస్థితీ’’ అన్నాడు. ఎదురునిలిచి పోరాటం చేయడమే కర్తవ్యం. ఎద క్రుంగిపోకుండా, ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోకుండా, ఏ క్షణంలోనో ముప్పిరిగొనే నిరాసక్తతతో, నిర్వేదంతో నీరుగారిపోకుండా-అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సాగాలి. ‘‘్ధరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్‌గావునన్’’ అంటాడు సుభాషితకర్త. ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ అన్నట్లు-ఆశించే ఆదర్శ ప్రపంచం, అనుకున్న మరుక్షణం అవతరించదు! మడమ తిప్పని పోరాట పటిమే-్భవి స్వతంత్య్ర భారతానికి నిజమైన పౌరుడు కలిగి ఉండాల్సిన గరిమ’’ అంటూ లేచాడు రాంబాబు.

0 comments: