భావితరాలకు ఆదర్శనీయ సందేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifRIBlkHX8SYI2NF_CrEd-jb9cRkkY7e7HwjkE02gDuDtUPcRT5b82gA9DAqgM3whGJVvM6kIGELiIplPsM4GEKBdG1Nvxm44nzVpyVkTSnz7qVVIG7WpV5RtRFQOe93J8pYVGPq4j9g/s320/12k5.jpg)
**
వేద విద్యా వైశిష్ట్యాన్ని, భారతీయ ఆర్ష సంస్కృతిలోని ఆచరణయోగ్య విషయాలను అవధూత దత్తపీఠ విద్యాధికారి కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు ముఖ్యంగా విద్యార్థులకు ప్రదర్శన యోగ్యంగా వుండేటట్లు హాస్యరస స్ఫోరకంగానూ, సందేశాత్మకంగానూ మలచి రాసిన ఏడు నాటికల సంపుటి నాటికా సప్తకము. నాటక లక్షణాలను ప్రతిపాదిస్తూ తదనుగుణంగా రాయడం రచయిత లక్ష్యం కాదు. మనోరంజనాన్ని, సామాజిక బాధ్యతను రెండింటినీ దృష్టిలో ఉంచుకుని భావితరాలకు ఆదర్శనీయమైన విలువల సందేశాన్ని అందించడమే కృష్ణమూర్తి గారి ప్రధాన లక్ష్యంగా ద్యోతకమవుతోంది.
ఇందులోని ఏడు నాటికల్లో ఆరు దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాసినవే అయినా వాటిల్లోని సందేశ గుణం సార్వకాలికమైనదే. అలాగే ‘ప్రాచీన లోహ శాస్తమ్రు’ అనే అధునాతన రచనను జతచేసి ఈ నాటికా సప్తకము వెలువరించారు. ‘పాట రాయడంతో కాదు పాడటంతో పూర్తి అవుతుంది. అలాగే నాటకం రాయడంతో కాక ప్రదర్శనతో పూర్తి అవుతుంది’ అని ప్రముఖ సినీ నటులు, సాహితీ అభినివేశం గల తనికెళ్ల భరణి అన్నట్లుగా పిల్లల బుద్ధి వికాసానికి, పెద్దల ఆలోచనా సరళి విన్నాణానికి ఉపయుక్తమయ్యే ఈ నాటికలను పాఠశాలల వార్షికోత్సవ వేళల్లో తెలుగు మాధ్యమం విద్యార్థులు ప్రదర్శిస్తే ఎక్కువ ప్రయోజన దాయకంగా ఉంటుంది. ఈ నాటికల్లో ఎడనెడ కుప్పావారు మంచి గేయాలను కూడా రాసి పాత్రగత ఘటనలకు జోడించారు. అలాగే సంభాషణలు ఏ మాత్రం సమాసభూయిష్టంగా లేక అలతి అలతి వాక్యాలలో పిల్లలు ధారణ చేసి ప్రదర్శన సులువుగా చేసుకునేలా ఉన్నాయి. దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వయంగా ఆశీస్సందేశం ఇస్తూ లోక సంక్షేమకర కార్యంగా అభివర్ణించి అభినందించారు. అలాగే వేద పాఠశాల విద్యార్థిగా ఇందులోని ‘శ్రీగురుసేవ’ నాటికలో ఆనాడు స్వయంగా పాల్గొని నేడు పీఠానికి ఉత్తరాధికారిగా ఉన్న దత్త విజయానంద తీర్థ స్వామీజీ ‘వారేవా! నా బ్రతుకుపంట’ అనే నాటికలోని ఆ పాటను స్మరణీయం కావించడం రచయిత ప్రభావోపేతమైన రచనా వైదగ్ధ్యానికి నిదర్శనం.
సౌందర్యోపాసన, పదవీమదము, నిండుకుండ, ప్రాచీన లోహ శాస్తమ్రు, శ్రీ గురుసేవ, దానవీరుడు, గురుకులము అనే ఈ ఏడు నాటికలూ విభిన్న ఇతివృత్తాలతో అలరించేవే! ముఖ్యంగా ప్రాచీన లోహ శాస్తమ్రు భారతీయ వైజ్ఞానికుల అపార మేధో వైభవాన్ని వివరించే విషయాలతో ఆసక్తిదాయకమైన మంచి నాటిక. ‘వజ్రలేపనము’ ‘వజ్రతలం’ ‘వజ్రసంఘాతము’ అనే లేపనాల గురించి వాటి తయారీ గురించి ఈ నాటిక ఆసక్తిదాయకంగా మంచి వివరాలు అందించేదిగా ఉంది. కుతుబ్‌మినార్ వద్దగల ఇనుప స్తంభానికి ‘మిసావైట్’ అనే లోహపు పూత వుందనీ, అందువల్లనే రెండువేల మూడు వందల ఏళ్లు పైబడినా ఆ స్తంభానికి తుప్పు పట్టకుండా వుందనీ, ఆనాడు ఈ మిసావైట్‌ను ఏమనేవారో, అది ఎలా తయారయిందో ఇంకా పరిశోధనలు జరగవలసి ఉందనీ ఈ నాటిక తెలియజేస్తోంది. నహుషుడి గర్వభంగ కథ ‘పదవీ మదము’ అనే నాటిక. గురుభక్తి సంప్రదాయ ప్రవర్తక ప్రబోధం అయిన నాటిక ‘శ్రీ గురుసేవ’. తపతీసంవరణోపాఖ్యానం ఆధారిత నాటిక ‘సౌందర్యోపాసన’. కొద్ది పాత్రలే వుండేటట్లుగా, ప్రదర్శనానుకూలంగా ఈ నాటికలను సంతరించిన కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు బహుదా అభినందనీయులు. సమీక్షార్థం ప్రతులు పంపేటప్పుడు రచయితలు, ప్రచురణకర్తలు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అందుకున్న ప్రతిలో 20, 21, 24, 25, 28, 29, 32, 33 పేజీలు అచ్చుకాని తెల్ల కాగితాలు కావడంవల్ల నాటికారసాస్వాదనకు భంగం కలగడం శోచనీయమైంది.
నాటికాసప్తకము
-కుప్పా వేంకటకృష్ణమూర్త
వెల: రూ.50
అవధూత దత్తపీఠం
ఊటీ రోడ్డు, మైసూర్-25.
2 comments:
విభిన్నమైన రచనను గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు లక్ష్మీ దేశాయ్ గారూ!
Post a Comment