కొన్ని కొన్ని అంశాలు కొందరు కవులకు ఆనవు. అలాంటి వస్తు స్వీకరణ చేయడం ప్రభుత్వానికి బాకా వూదడం గానో, తమ కవితాభివ్యక్తికి తగనివి గానో భావిస్తూంటారు. కానీ నిజానికి సమాజంలో పట్టించుకోదగిన కుటుంబ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి ఇతివృత్తాలు తీసుకుని ప్రభావోపేతంగా, సందేశాత్మకంగా, ప్రజలలో మానసిక చైతన్యం కలిగించి పురోభివృద్ధికి సహకరించే దిశగా రచన చేయడం అసందర్భమూ కాదు, న్యూనతా కాదు. అయితే ఏది రాసినా అందులో కవిత్వం వుండడం ముఖ్యం.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, హైదరాబాద్ వారు ‘అక్షర వృక్షాలు’ పేరిట పర్యావరణ కవితలను కవులచేత కలం పట్టించి ఒక సంకలనంగా కూర్చారు. మొక్కల గురించి రాస్తున్నా మొక్కుబడిగా రాసే రచనలుగా కాకుండా పర్యావరణం పట్ల నిబద్ధతతో కవులు కలం కదిలించడం కమనీయం.
పాఠశాలల్లో లక్షాయాభై వేలకు మించి మొక్కలను నాటడం ఒక ఉద్యమంగా చేపట్టిన సంస్థ కవుల చేత అక్షర వృక్షాలు పాదుకొల్పే యత్నం చేయడం మెచ్చదగిన విషయం.
జె.బాపురెడ్డి, ఎన్.గోపి, శిఖామణి, సుద్దాల అశోక్‌తేజ, డా.ఎండ్లూరి సుధాకర్, డా.ఎస్వీ సత్యనారాయణ, రసరాజు, ఎలనాగ, డా.వడ్డెపల్లి కృష్ణ, డా.వోలేటి పార్వతీశం మొదలయిన ప్రముఖుల కవితలు ఈ సంపుటిలో వున్నాయి.
కంటి కందమనసు కనిపించి పచ్చగా
కవికి స్ఫూర్తి నిడును కవిత పొంగ
కవిత వ్రాయుటకును కాగితంబగుతానె
ఘనత వ్రాయ, వృక్ష కావ్యమగును
అని ప్రశంసనీయ పద్యంలో ఆచార్య ఫణీంద్ర వృక్ష సమార్చనం చేసారు.
మండేటెండలో నీడలనిచ్చి
మాడే కడుపుకు ఫలాలనొసగి
మనుషుల కాచును చెట్లు
దేవుని దీవెన లైనట్లు
అంటూ చెట్లే ప్రగతికి తొలి మెట్లు అని గేయంలో నినదించారు వడ్డెపల్లి కృష్ణ.
ఆ వికలాంగుడికి
చంక కర్రలు దానం చేసిన
ఆ చెట్టు తల్లి ఎవరో
ఆమెను తలుచుకుంటే
హృదయంలో వసంతం పూస్తుంది
అని పచ్చని కవితలు ప్రస్తావిస్తూ ‘ఉదయాన్నే లేచి వృక్షానికి నమస్కరించాను- ఆ రోజంతా నా తల మీద నీడలే గోడలు’ అంటారు ఎండ్లూరి సుధాకర్.
చెట్టే ఒక పద్యం/దానిపై పద్యాలా
అది ప్రాణ వేణువు/ఇది రేణువు
అని డా.ఎన్.గోపి అద్భుత భావాభివ్యక్తి నానీగా ముందుంచారు.
‘‘పుడమితల్లి కట్టుకున్న పట్టుచీర వృక్షం’’ అను గతానుగతిక భావాన్నే పునర్వివేచన చేసారు డా.ఎస్వీ సత్యనారాయణ.
‘‘విత్తనం మనస్సు పెట్టి విత్తితే- మట్టికి ఆకుపచ్చ (సం)క్రాంతి’’ అంటారు శింగిసెట్టి సంజీవరావు.
వన ఉద్యమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే కృషిలో అక్షర కృషీవలురను తోడుచేసుకుని వెలువరించిన ఈ కవితా సంపుటిలో వేద, పురాణాంతర్గత వృక్ష సంబంధిత సుభాషితాలను చేర్చడం బాగుంది. సతత హరిత కవి హృదయాలు సమాజ పర్యావరణ పరిశుభ్రతకు పుష్పించి, ఫలించడమే కోరుకునేది.
- సుధామ
అక్షర వృక్షాలు
(పర్యావరణ కవితలు)
- కౌన్సిల్ ఫర్ గ్రీన్
రెవెల్యూషన్, హైదరాబాదు- 1448, రోడ్ నెం.12, బంజారా
గ్రీన్ కాలనీ, బంజారాహిల్స్,
హైదరాబాదు-34,
వెల: రూ.100/-
(ఆంధ్రభూమి-దినపత్రిక-'అక్షర ' 29.1.2012)
0 comments:
Post a Comment