ఓయ్ ..! నేనూ ఓ.యూ విద్యార్థినే........
ఒకటో తరగతి నుంచి రీసెర్చి వరకూ నా చదువంతా
హైదరాబాద్ లోనే జరిగింది. సుల్తాన్ బజార్ గంటస్తంభం ఎదురుగా వుండే ప్రైమరీ
స్కూల్ లో నాల్గవ తరగతి వరకూ చదివి, ఆ తర్వాత కేశవ్ మెమోరియల్ పాఠశాలలో ప్రవేశపరీక్షరాసి,
డబుల్ ప్రమోషన్ పై ఆరవ తరగతిలో చేరి చదువుకున్నాను.ఇంతలో మా నాన్నగారికి మలకపేట గవర్నమెంట్ క్వార్టర్ M.C.270 అలాట్ కావడంతో మలకపేట ప్రభుత్వ పాఠశాలలో
7 వ తరగతిలోచేరి అక్కడే 1965 లో H.Sc. ప్యాసయ్యాను.
నా పాఠశాల చదువే తెలుగు మీద నాకు అమితాసక్తి
కలిగించింది. మాకు తెలుగు చెప్పిన శ్రీ కృష్ణమూర్తి గారు,
శ్రీ తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు ఎంతో ప్రోత్సహించేవారు,
పాఠశాల గ్రంథాలయ పుస్తకాల క్యాటలాగ్ అంతా తమ ఇంట్లో
అరటిపండ్లు,పాలు ఇచ్చి నా చేతివ్రాత బాగుంటుందని మాతెలుగు మాస్టారు నా చేత
రాయించడం గుర్తుంది. పుస్తకంపేర్లు , వాని రచయిత పేర్లు అలా ఏడవ తరగతిలోనే నాకు కొన్ని
పరిచయం అయ్యాయి. విజ్నాన జ్యోతి పేర లిఖిత పత్రిక
ఆ వయసులోనే సాటి పిల్లల రచనలు కూర్చి నేను
సంపాదకునిగా రూపొందించడం జరిగింది.
నాకు బాగా గుర్తు.నేను 10 వ తరగతిలో వుండగా
24 ఏప్రెల్ '1964 న మా మలకపేట ప్రభుత్వ
పాఠశాల సారస్వత సమితి వార్షికోత్సవం జరిగింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ
అధిపతిగా వున్న ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు
అధ్యక్షులుగాజరిగిన సభలో ఆచార్య దివాకర్ల వేంకటావధాని
గారు వసుచరిత్ర లోని గిరిక బాల్యం గురించి చేసిన
ప్రసంగం అందరితో బాటూ నన్నూ ముగ్ధుడిని చేసింది. ఆర్ట్స్
కళాశాలలో తెలుగు చదవాలన్న కాంక్షకు అప్పుడే బీజావాపనం జరిగిందనాలి..ఆ నాటి కవి సమ్మేళనంలో డా.పల్లా దుర్గయ్య ,అమరేశం రాజేశ్వర శర్మ ప్రభృతులు చేసిన కవితాగానం కూడా ఆకట్టుకుంది. 1965 లో వయసు తక్కువైందని మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి మరీ H.SC పరీక్షరాసి ప్యాసయ్యాను. ఆ తరువాత P.U.C కోర్స్ కై ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల
వివేకవర్థనీ కాలేజ్ లో చేరాను. ఒక్కసారిగా అంతవరకూ
చదివిన తెలుగు మాథ్యమం నుండింకళాశాలలో ఇంగ్లీష్
మాథ్యమం కు మారడం ఇమడడం కష్టమైంది. ఒక్క నిడదవోలు సర్వేశ్వరరావ్ గారి తెలుగు క్లాసే నచ్చేది. తీసుకున్న బై.పి.సి. లో కెమిస్ట్రీ ఓ గడ్డు సబ్జెక్ట్ గా వుండేది. సైన్స్,లెక్కలు లేని
చదువు కావాలని ఇంట్లో పోరుపెట్టి ప్రాచ్య కళాశాల చదువు వైపు మారిపోయాను. నల్లకుంటలోని కళాశాలలో కాక ఆర్ట్స్ కళాశాల లాగానే ఆకర్షించిన ఆంధ్ర సారస్వత పరిషత్
ప్రాచ్య కళాశాలలో డిప్లమో కోర్స్ లో చేరిపోయాను. శ్రీ సరిపల్లి
విశ్వనాథ శాస్త్రి గారు అప్పుడు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ గారు. ఆ తరువాత శ్రీ కె.కె.రంగనాథాచార్యుల గారి నేతృత్వంలో
ఆ కళాశాలలోనే బి.ఓ.యల్ ,ఎం.ఓ.యల్ పూర్తి చేసాను.
1967 లో ప్రారంభించిన యువమిత్ర లిఖిత మాసపత్రిక
అప్పుడే సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా
నిలయం తో ,అక్కడ సమావేశాలు జరిగే యువభారతి సంస్థ
సాంగత్యంతో .నా సాహిత్యాభిరుచి ,రచనావ్యాసంగం పెంపొందాయి. యువమిత్ర లిఖిత పత్రిక
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ లైబ్రెరీలో వుంచినప్పుడు 18.1.1974 న పత్రికలోవుంచిన అభిప్రాయాల పేజీల్లో డా.సి..నారాయణ రెడ్డి గారు స్వహస్తాలతో రాసిన ఈ పంక్తులు
శాశ్వతానంద దాయకాలు మరి.
ఆ రోజుల్లో చుక్కాని పక్షపత్రిక విశ్వరచన మాస పత్రికలు యువకునిగా నా తొలి రచనలు ప్రచురించాయి.
సుధామ పేర ప్రతిభ వారపత్రికలో ' కనీస కోర్కెలు ' అనే తొలి
కవిత అచ్చయ్యింది.
1970 సరిగా ఈ ఏప్రెల్ నెలలోనే 7 వ తేదీ ఉస్మానియా
విశ్వవిద్యాలయ రచయితల సంఘ స్థాపన జరిగింది. అన్ని
అనుబంధ కళాశాలల విద్యార్థి రచయితలూ ,జిల్లా కళాశాలల వారు కూడా అందులో భాగస్వామ్యులే ! ప్రాచ్య కళాశాల బి.ఓ.యల్ విద్యార్థి గా ఆ రచయితల సంఘానికి ఉస్మానియా యూనివ్ర్సిటి ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీ అడపా
రామారావు కార్యదర్శిగా, నేను ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యాం.
ఎమెస్కో బుక్స్ వారు విద్యార్థి సాహితి అని ఓ.యు విద్యార్థి రచయితల కథల సంకలనం కూడా ప్రచురించారు. . ఆ మధురమైన రోజులు ఎంత తలుచుకున్నా తనివి తీరనివి.
జ్యోత్స్న పేరిట ప్రథమ వార్షికోత్సవ సంచికను వెలువరించాం
పైవన్నీ తీపి గుర్తులు. రాయాలంటే ఇంకా బోలెడు సంగతులు
నా చదువుకు మానియా ఐన ఉస్మానియా ఆర్ట్స్ కళా శాలలో
దివాకర్ల వారు తెలుగు శాఖాధిపతిగా వుండగా
ఎం.ఏ తెలుగు లో చేరడంతో నా కల సాకారమైంది. అయితే
ఎం.ఓ.యల్ తోనే నాకు కరీంనగర్ బిషప్ సాల్మన్ జూనియర్ కళాశాలలో తెలుగు
లెక్చరర్ గా ఉద్యోగం రాగా ఆనందంతో చేరిపోయాను
1975 -1977 లెక్చరర్ జీవితం ఒక మధుర ఘట్టం అయితే రీసెర్చి
చేయాలనే బలమైన ఆ కాంక్షతో ఆ ఉద్యోగం వదికేసి
హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఆర్ట్స్ కళాశాలలో డా.బి.రామరాజు గారు తెలుగు శాఖాధిపతిగా వుండగా ఎం.ఫిల్ లో చేరాను. FIP ప్రోగ్రాం పై తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ రీసెర్చిలో చేరిన వారూ సహస్కాలర్లుగా వుండేవారు. సెమిస్టర్ పద్ధతి కనుక విధిగా తరగతులు కు వెళ్ళేవాళ్ళం. అలా డా.సి.నారాయణ రెడ్డి,నాయని కృష్ణకుమారి. జి.వి.సుబ్రహ్మణ్యం ,రవ్వా శ్రీహరి ప్రభృతుల దగ్గర నేరుగా
చదువుకునే అదృష్టం అబ్బింది. '
( నా సహపాఠి శ్రీ గిరిజా మనోహరబాబు (సహృదయ -వరంగల్)
తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావచిత్రాలు
' Imagery in Progressive Telugu Poetry' అనే అంశంపై నా ఎం.ఫిల్ పరిశోధన 1978 లో ఆకాశవాణిలో
ట్రాన్స్ మిషన్ ఎక్సిక్యూటివ్ గా చేరి ఉద్యోగంచేస్తూ 1982 లో M.Phil Osmania University నుంచి పొందాను. అనంతర కాలంలో ఆకాశవాణి
కార్యక్రమ నిర్వహణాధికారిగా
యూనివర్సిటీ లోని పలుశాఖల అధిపతులతో,ప్రొఫెసర్లతో
కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎన్నో లభించాయి.
ఇలాినేటి శతజయంతి ఉత్సవాల ఉస్మానియా యూనివర్సిటితో సుధామ అనే ఈ అల్లంరాజు వెంకటరావు అనుబంధం
చిరస్మరణీయం
2 comments:
అద్భుతం....
ధన్యవాదాలు రవికిరణ్ గారూ!
Post a Comment