ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, October 11, 2014

అలుపెరుగని సాధన.. అద్భుత సృజన..

మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి
మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’

(‘సుపర్ణ’ కావ్యంలో)

సప్తతి పూర్తి చేసుకున్న కవి పండితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సమగ్ర సాహిత్యం ‘సృజన’ పేర రెండు సంపుటాలుగా వెలువడింది. కథలు, నవలలు, నాటకాలు ఎన్నో రాసినా, వౌలికంగా శ్రీకాంతశర్మకు కవిగా, పండితునిగానే పేరు. 1168 పేజీల ఈ ఒకటవ సంపుటిలో 398 పేజీలే ఆయన కవితా మూర్తిమత్వం. మిగతావన్నీ వచన రచనలే. అందులోనూ నాటకాలు, నాటికలే ప్రథమగణ్యం. ఆ తరువాతనే ఆయన నవలలూ, కథలూ. లలిత గీతాలు, యక్షగానాలూ కవిత్వ పార్శ్వాలే. ఒక సృజనకారుడి బహుముఖీనతకు ఈ ప్రక్రియా వైవిధ్యం నిలువుటద్దం. వ్యాసాలు, సమీక్షలు, మున్నుడులు, పరిచయాలు వంటి రచనలన్నీ వారి పాండితీ వైభవ సంకేతాలే కావడంతో శ్రీకాంతశర్మ అనగానే కవి పండితుడు అనీ, పండిత కవి అని భావించేవారే అధికం. ఆయన విమర్శనా రచనలు కూడా పాండిత్యంలో భాగాలే.

నిజానికి శ్రీకాంత శర్మ వృత్తిరీత్యా ప్రధానంగా ఎంచుకున్న మార్గాలు రెండు. ఒకటి పత్రికా మాధ్యమం, రెండవది శ్రవ్య మాధ్యమం అయిన ఆకాశవాణి. ఈ రెండింటి కారణంగానే ఆయన జీవనక్రమం నిరంతర సాహిత్య ప్రస్థానంగా సాగింది. రెండింటా అనివార్యంగా కలం పట్టక తప్పని అవసరం, స్వతహాగా వివిధ సాహిత్య ప్రక్రియా రచనలు చేయాలన్న అభిమతం, ఇన్నాళ్లుగా ఇనే్నళ్లుగా తన చేత రాయిస్తూ, సహస్రాధిక పుటల రెండు సంపుటాల రూపంలో ఇవాళ అభివ్యక్తమవుతోంది. వీటిల్లోకి రాని రచనలు ఇంకా మిగిలే ఉంటాయన్నది వాస్తవం. ఎందుకంటే తానే స్వయంగా ఓ ‘ఎడిటర్’. తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ ఉపసంపాదకునిగా, ఆపై ఆకాశవాణిలో రచయితగా, కార్యనిర్వహణాధికారి అయినా ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసి తిరిగి ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సంపాదకునిగా, తన ఉద్యోగ భూమికను నిర్వర్తించినందువల్లనే- ఆయనకు తను రాస్తున్నది ఏమిటో, తాను చేస్తున్నది ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. మనసు పెట్టి చేసిన రచనలే కానీ, మనసు చంపుకుని రాసినవి ఇందులో లేవు.

శ్రీకాంతశర్మ సుకుమార భావుకుడు, అనుభూతి ఆరాధకుడు. విశ్వసించిన దానిపట్ల ఎప్పుడూ విముఖత చెందని జగమొండి. గాలివాటుగా ఉద్యమాల వెంటబడి ఆ మూసలో కవి అనిపించుకున్నవాడు కాదు. సంప్రదాయాన్నీ, అభ్యుదయాన్నీ మేళవించి, మానవీయ అనుభూతులకు అక్షరాకృతుల నిచ్చినవాడు. చాలామంది రచయితల రచనలు పాఠకులకు మాత్రమే చేరుతాయి. పత్రికలు కేవలం అక్షరాస్యులకే! అయితే వాటిని చదివేవారిలో - ఒక పాఠక హృదయం మాత్రమే వుండదు. సామాజికుడయిన ప్రతి వ్యక్తిలో ఒక పాఠకుడూ, ఒక శ్రోతా, ఒక ప్రేక్షకుడు వున్నారు. ఒక రచయిత సృజన అంతా త్రిముఖంగా సామాజికులకు చేరి సంతృప్తినిచ్చి ఉపయుక్తం కాగలిగినప్పుడే, ఆ రచయిత ప్రతిభావంతునిగానూ, ఆ రచన ప్రయోజనదాయకంగానూ భాసించడం వీలవుతుంది. అదిగో ఆ ప్రజ్ఞామతి అయిన రచయిత శ్రీకాంతశర్మ.

శ్రీకాంత శర్మ రచనలు పాఠకులనూ, శ్రోతలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో సామాజికునిలో వున్న ఆ మూడు పార్శ్వాలనూ తట్టగలిగేవిగా ఉం టాయి. అందుకే అంతటి కవి పండితుడూ సామాన్యమైన సా మాజికులనూ తన రచనలతో మెప్పించగలిగాడు.

పత్రికలకు కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు, కాలమ్స్ రాసిన వాడే - రేడియోకి పాటలు, నాటకాలు, నాటికలు, రూపకాలు ఎన్నో రాశాడు. ప్రసంగాలు చేశాడు. అలాగే రంగస్థలానికి కావలసిన నాటకాలు, నృత్య రూపకాలు రాశాడు. కొన్ని సినిమాలకు పాటలూ రాశాడు. అచ్చు అక్షరాల్లోనే కాక, ఇలా శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో అక్షరాలుగా వినబడ్డాడు. కనబడ్డాడు. కనుకనే ఆయన జీవన క్రమం వైవిధ్యభరితమైంది. మూస ధోరణులకు భిన్నంగా ఎప్పటికప్పుడు వికాసవంతమైంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వైభవ ప్రాభవాలకు శ్రీకాంత శర్మ రచనా (ప్ర)వృత్తి ఎంతగానో దోహదపడింది. తనకు సంతృప్తినీ, సంస్థకు దీప్తినీ కలిగించింది. ఈ సంపుటంలో లలిత గీతాలు, యక్షగానాలు, నాటకాలు, ఇరుగుపొరుగు నాటికలు విభాగంలోని రచనలు - రేడియో రచనలను కలిగి వున్నాయి. 1982- 2003 వరకు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలలో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు, అయిదు యోగ్యతా పత్రాలు సాధించిన ఘనత శ్రీకాంత శర్మ రచనలదే! అవన్నీ సృజనాత్మకం, సంగీత రూపకం, డాక్యుమెంటరీ, నాటకీకరణ విభాగాలవే. ఆ రచనలకు రూపకల్పన చేసింది సి.రామమోహనరావు, ఎస్.బి.శ్రీరామమూర్తి, కలగా కృష్ణమోహన్, పాండురంగారావు ప్రభృతులే కావచ్చుగాక, కానీ రికార్డు స్థాయిలో అన్ని బహుమతులకు శ్రీకాంతశర్మ రచనలే మూలకందం. ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’ అనే బాలల గీతం నుండి, ఈ మాసపు పాటలు, సంగీత రూపకాలు ఎన్నో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన శ్రీకాంత శర్మను రేడియోవాడిగా శ్రోతల హృదయాల్లో సుప్రతిష్ఠితం చేశాయి.
రెండేళ్ల క్రితం 2012లో వెలువడిన శ్రీకాంతశర్మ ‘ఏకాంత కోకిల’ ఒక రకంగా ఆయన జీవన రేఖలు కొన్నింటి కవితాత్మక ప్రదర్శనమే. 
అందులోని నివేదనములో తన ఆకాశవాణి సహోద్యోగి గూర్చి-

ప్రహరాజు పాండురంగడు
అహరహమును నాకు తోడనంగా, వృత్తిన్
సహచరుడై ఏ చరించెను
విహరించితి నతడి వెంట వివిధ విధములన్

అంటూ - తన నాటక నాటికాభిరుచులకు దోహదమైన మిత్రునిగా తలుచుకున్నారు. అలాగే ‘స్వస్ర్తి అభిశంస’ అంటూ - తను ప్రేమించి పెళ్లాడిన, సాహిత్య సంగీత సమలంకృత ‘జానకీబాల’ గురించి కూడా సరదాగా రాశారు. బహుశా గొప్ప గాయని కూడా అయిన జానకీబాల, కుమార్తె కిరణ్మయిలే ఆయన పాటల రచనా పాటవానికి పరోక్ష ప్రేరకులు కావచ్చు. ‘ఏకాంత కోకిల’లో శర్మగారి ‘ఆరాటాలు’ ‘ఆలోచనలు’ ‘కవి హృదయం’ అవిష్కృతమయ్యాయి. బహుమతులు బడసిన తమ సృజన రేడియో రచనల్లోని పాటలను కూడా ఇందులో చేర్చారు.

రూప, చైతన్య సంగమ రూఢి దెలుపు
సృజనశక్తికి శాస్తమ్మ్రు సిగ్ధతనువు
గంధలహరిని బోలెడు కళ మనస్సు
మనుపజేసెడి యనుభూతి మనిషిభూతి

అంటారు. అనుభూతి కవిగా శ్రీకాంత శర్మను కవితా లోకం ఏనాడో గుర్తించింది. తిలక్, ఇస్మాయిల్ వంటి వారిని అజంతాను ఎంతో ఇష్టపడతారు శర్మగారు. యక్షగాన రచనలో శర్మగారి కవితా ప్రావీణ్యం వల్లనే ఆయనను పండిత కవి అనేవారున్నారు. రేడియోలో సంగీత రూపకాలు, వేదికలపై శోభానాయుడు వంటి నర్తకీమణుల కోరికపై రచించి ఇచ్చిన నృత్య రూపకాలు శ్రోతలను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నవే. కొన్ని సినిమా పాటలు రాసినా సినీ కవిగా స్థిరపడ(దలచ)లేదు ఆయన.

శ్రీకాంత శర్మ నాటకాలు పధ్నాలుగు, నాటికలు పదిహేను ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. పాత్రోచిత సంభాషణలతో, ఔచితీమంతమైన సన్నివేశ కల్పనలతో, ఇతివృత్తానికి దృశ్య శ్రవణ స్పర్శనిచ్చే ప్రజ్ఞ కానవస్తుంది. ‘శిలామురళి’ ‘కెరటాల పల్లకి’ ‘స్మృతి’ ‘ఆషాఢమేఘం’ ‘తెరలు’ వంటి నాటకాలు, 1990-91 నడుమ విజయవాడ ఆకాశవాణి నుండి ‘ఇరుగు పొరుగు’ పేర నలభై వారాలపాటు ప్రసారమైన నాటికలు శ్రోతృజన హృదయ రంజకాలైనవే.

‘సమూహం నుంచి ఏకాంతానికి
ఏకాంతం నుంచి సమూహానికి
లోలకం మాదిరి ఊగులాడుతూ
ఎంత ఉద్విగ్నత!!’

అంటూ ‘సుపర్ణ’ అనే తన ఒక పక్షి ఆత్మకథా కావ్యంలో పేర్కొన్నట్లు - శ్రీకాంతశర్మ అనుభూతి కవిగా ఒక ఏకాంతం నుంచే జన మాధ్యమాలైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల సమూహానికి చేసిన రచనలెన్నో ఉన్నాయి. కథకునిగా కన్నా ఎక్కువగా ‘తూర్పున వాలిన సూర్యుడు’ ‘ఉపాసన’ ‘క్షణికం’ అనే మూడు నవలలతో ఒక నవలా రచయితగా కూడా నిలిచారు. క్షుద్ర సాహిత్యం రాసారన్న అపవాదు కొంత పొందినా, నిజానికి ఆ శాస్త్ర వైదుష్యమే తద్రచన కావించిందని గ్రహించినప్పుడు, ఆయన పాండితీగరిమను ప్రశంసించక ఉండలేం!

ఈ మొదటి సంపుటి ఆయనలోని అనుభూతి కవికీ, శ్రవ్య, దృశ్య రచనా ప్రతిభా పాటవాలకు నెలవైన రచయితకూ అద్దం పడుతోంది. మనిషి సామూహికంగానూ, పది మందిలో ఒంటరిగానూ కూడా జీవించవలసి రావడం బ్రతుకు యధార్థం. వ్యక్తి సమూహాలను శాసించగలుగుతాడనేది పాక్షిక సత్యమే కావచ్చు కానీ, వ్యక్తులవల్లే వ్యవస్థలకు దీప్తి! ఎన్ని అవస్థలు పడినా వ్యవస్థలోనే వ్యక్తి ఉనికి, మనికి! నిత్య చైతన్యశీలమైన పత్రికా ప్రసార రంగాల భిత్తికపై శ్రీకాంతశర్మగారి ‘సృజన’ పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల ప్రశంసాపాత్రమైంది. మనిషితనం ప్రయోజనాలను కాపాడింది. వెనుదిరిగి చూసుకుంటే.. ‘సంతోష స్వాంతం’ మించినదేముంది? ఈ ‘సృజన’లో శాశ్వతంగా నిలిచేదేదో, విస్మృతమయ్యేదేదో నిర్ణయించేది మాత్రం కాలమే! ఇంద్ర పదవికి నూరు యజ్ఞాలు చేయాలిట కనీసం! శ్రీకాంత శర్మ నిరంతర రచనా యజ్ఞం నిజమైన ‘ఇంద్ర’గంటి

  • -సుధామ

సృజన
-శ్రీకాంతశర్మ సాహిత్యం
ఒకటవ సంపుటి
ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ
104, సాహితి రెసిడెన్సీ,
ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ)
సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94
వెల: రూ.2500
(రెండు సంపుటాలకూ కలిపి)(Andhrabhoomi-Akshara-11.10.2014)0 comments: