ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 15, 2013

పిల్ల(ల) సినిమాలు


  • 15/11/2013

‘‘పిల్లల సినిమా అనే మాట వినడానికి బాగుంది కానీ, ఇంతవరకూ తెలుగులో ఇదీ అని చెప్పుకోదగిన బాలల చిత్రం అనేది రూపొందిందా చెప్పండి. బాల రామాయణం, బాలభారతం, బాలరాజు కథ, హరివిల్లు అంటూ చెప్పే పేర్లు కూడా వేళ్ళమీద లెక్కించే సంఖ్య దాటాయా చెప్పండి. నిజానికి విదేశాలలో రూపొందుతున్న బాలల చిత్రాలతో పోలిస్తే మనం ఎంత వెనకపడి వున్నామో తెలుస్తుంది’’ అన్నాడు శంకరం.

‘‘బాలల చిత్రాల సంగతి దేవుడెరుగు. మన సినిమాల్లో బాల పాత్రలు కూడా ఎంతో అసహజంగా, ముదిపేరక్క సంభాషణలతో, హీరోహీరోయిన్లు వలపు రాయబారాల మూసల్లో, వెకిలితనంతో ఎంత కృతకంగా వుంటున్నాయో చూస్తే బాధవేస్తుంది. పిల్లలకు నీతులు బోధించక్కర్లేదు కానీ మరీ సెక్స్, క్రైమ్, హింస ప్రభావాలు పడేలా సినిమాలు రావడం బాధాకరమే. పిల్లలకూ చిరంజీవి లాంటి వాడే హీరో గానీ ఓ బాలహీరో అంటూ ఎవరూ లేరు కదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘దేశ స్వాతంత్య్రానంతరం పిల్లల పట్ల ప్రేమాదరాలుండిన ప్రధానిగా పిల్లలందరికీ చాచా నెహ్రూగా సమాదరణీయుడైన జవహర్‌లాల్ నెహ్రూయే బాలల సర్వతోముఖాభివృద్ధికి చలనచిత్రాల ప్రభావం ఆవశ్యకతను గుర్తించినందువల్లనే స్వయంగా చిల్డ్రన్స్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎఫ్‌ఎస్‌ఐకు అంకురార్పణ చేశారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఇండియా ఐసిఎఫ్‌ఎఫ్‌ఐకు దారులువేసి పిల్లల చిత్రాలను పెంపొందింపచేయాలన్న ఆకాంక్ష ఆయనతోనే మొదలైంది.
దేశ విదేశాల నాగరికతలు, అక్కడి బాల బాలికల తీరుతెన్నులు, సరదాలు, మానవీయ కోణాలు వీటన్నింటితో బాలల చలనచిత్రోత్సవ చిత్రాలు ఉపయుక్తమై మన దేశ భావిపౌరులకు అందాలన్న సంకల్పం మంచిదే. ప్రతి ఏటా జవహర్‌లాల్ జన్మదినం అయిన 14 నవంబర్ బాలల దినోత్సవంగా పరిగణిస్తున్నాం. సరిగా అదేరోజున మొదలై రెండేళ్ళకొకసారి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు వారం రోజులపాటు నిర్వహించుకుంటున్నాం. వివిధ దేశాలనుంచి ఎంట్రీలు, వాటితోబాటు బాల ప్రతినిధులు హాజరవుతున్నారు. నిజంగా ఇది ఒక వేడుకల సంరంభమే! కానీ వీటిల్లో పెద్దల హడావుడి ఎక్కువ కన్పిస్తోంది కానీ పిల్లల ఇన్వాల్వ్‌మెంట్ నిజానికి ఎక్కువగా వుండాలి మరి’’ అన్నాడు శంకరం
.

‘‘మరీ అలా తీసిపారేయకు శంకరం! వేలాది పిల్లలు ఈ సినిమాలు చూసే వీలు కల్పించారు. పట్టణాల్లోని పిల్లలే కాదు గ్రామాలనుంచి కూడా ప్రతినిధులుగా ఈ సినిమాలు చూడడానికి వస్తున్న పిల్లలున్నారు. సినిమా గురించిన అవగాహన కల్పించడానికి వారికి వర్క్‌షాపులు, సినిమాల విశే్లషణ గురించి సెమినార్లు కూడా ఏర్పాటుచేశారు. పెద్దఎత్తున జరుగుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు, అవకతవకలు వుంటే వుండవచ్చు గానీ అంతమాత్రాన వీటిని నిష్ప్రయోజనకరమైనవంటూ కొట్టిపారేయడం సరికాదు. ఈ చలనచిత్స్రవాల్లో మన పిల్లలకు దేశ దేశాల బాలల చిత్రాలు చూడడానికి, అర్థం చేసుకోవడానికీ, చర్చించడానికీ, తమ సృజనాత్మకతనూ, అధ్యయన శీలతనూ పెంచుకోడానికీ అవకాశాలున్నాయి. నిన్నటినుంచీ 18వ బాలల చలనచిత్రోత్సవాలు మొదలయ్యాయి. నవంబర్ 20వరకూ జరిగే ఈ ప్రదర్శనల్లోంచి నటన, యానిమేషన్ ఫీచర్, బాల దర్శకులు అన్న మూడు కేటగిరీల్లో అవార్డులకు సినిమాలు ఎంపిక చేస్తారు. ఎంపికైన ఉత్తమ పిల్లల సినిమాలకు బంగారు ఏనుగుతోపాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. ఇలా మొదటి బహుమతిగా 12 ఉత్తమ బాలల చలనచిత్రాలు పురస్కారం పొందుతాయి. ద్వితీయ బహుమతిగా ఆరు చిత్రాలకు రజత ఏనుగు, లక్ష రూపాయల నగదు లభిస్తుంది. మొత్తం అద్భుతమైన 18 చిత్రాలు బహుమతులందుకుంటాయన్నమాట. 72 దేశాల నుంచి మొత్తం 894 బాలల సినిమాలు ఎంట్రీగా నమోదుకాగా అవార్డుల పోటీకి 53 బాలల చలన చిత్రాలు ఎంపిక చేశారు. పోటీలో లేకుండా సాధారణ ప్రదర్శనగా 143 చిత్రాలూ ఎంపికయ్యాయి. మొత్తం 48 దేశాల చిత్రాలున్నాయి ఈసారి ఉత్సవాల్లో. ఇదంతా కన్నుల పండుగ కాదా! దేశ విదేశాలనుంచి అయిదువందల యాభై మంది బాల ప్రతినిధులు వస్తున్నారట! మన రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లానుంచి ప్రత్యేకంగా అయిదుగురు బాల ప్రతినిధులను ఎంపిక చేశారు. అలాగ వివిధ రాష్ట్రాలనుంచీ బాల ప్రతినిధులు వస్తారు. దేశ విదేశాలనుంచి తరలివచ్చే వారికోసం మన భాగ్యనగరం అందంగా ముస్తాబుకావడం మాత్రమే కాదు ప్రతినిధులకు కావలసిన వసతి, రవాణా ఏర్పాట్లూ చేస్తున్నారు. తెలుగు లలిత కళాతోరణం, ప్రసాద్ ఐమాక్స్ ఈ వారంరోజులూ కళకళలాడిపోతాయి. జవహర్ బాలభవన్‌లో పిల్లలకు సినిమా రూపొందించడం, యానిమేషన్, స్క్రిప్టు రచన, చిత్రాల మంచిచెడులపై సదస్సులు నిర్వహిస్తున్నారు. సినీ బాల మేధావులను సత్కరించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా బాలల సినిమాలపై సంపూర్ణ సమాచారంతో తెలుగులో ఒక సావనీర్ రాబోతోంది. ఇవన్నీ ఆహ్వానించదగిన పరిణామాలు. ఏమంటారు?’’ అన్నాడు రాంబాబు శంకరం, ప్రసాద్‌ల భుజాలపై చెయ్యివేసి దగ్గరవుతూ.





0 comments: