ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, March 1, 2012

ప్రియమైన మాట

‘‘సత్యమునే పలుకవలెను’’ - ‘‘అబద్ధమాడరాదు’’ అంటూ తరగతి గోడలమీద - పాఠశాలల్లో ఒకనాడు సూక్తులు బాగా కన్పించేవి. నిత్య జీవితంలో - అబద్ధాలు తేలికగా ఆడేసేవారే ఎక్కువగా కన్పిస్తూంటారుగానీ. సత్యవాక్కు నంటిపెట్టుకునేవారు సకృత్తుగానే ఉంటూంటారు.

‘వెయ్యి అబద్ధాలాడయినా ఒక పెళ్లి చెయ్యి’ లాంటి సామెతలున్నమాట నిజమేగానీ, అబద్ధమాడడమే వ్రతంగా పెట్టుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు పతనానికి దారితీస్తుంది. ‘నిజం నిప్పులాంటిది’ అని మనవాళ్ళు ఊరికే అనలేదు’. సత్యాన్ని అబద్ధాలతో ఎంతోకాలం కప్పెట్టి ఉంచలేం’ అన్నది యథార్థం.

సత్యవాక్కు యొక్క మహిమ గొప్పది! సత్య సంధుల నోటివెంట వెలువడిన మాట ‘మంత్రంలా’ నిజమై తీరుతుంది. సత్య హరిశ్చంద్రుడు - సత్యవాక్కుకు ప్రతీక. ఎన్ని కష్ట నిష్టూరాలు ఎదురయినా ఆడినమాట తప్పనివాడతడు


నీళ్ళున్న వందనూతులకంటే ఒక మంచినీటి బావి గొప్పది. అలాంటి వంద బావులు తవ్వించడంకంటే ఒక యజ్ఞం చేయడం పవిత్రం. అలాంటి వంద యజ్ఞాలకంటె ఒక కొడుకును కలిగి ఉండడం ప్రయోజనం. అలాంటి వందమంది కొడుకులవల్ల కలిగే మేలుకంటే ఒక సూనృతవాక్యం అనగా ‘సత్యవాక్కు’ గొప్పది అని నన్నయ అంటారు.

నిజం చెప్పేవాడిదే ‘వాక్‌శుద్ధి’. పనె్నండేళ్లు అబద్ధం ఆడకుండా ఉంటే అన్నమాట నిజమైపోతుందని పెద్దలంటారు. పండితులు, నిష్టాగరిష్ఠులు, జ్యోతిషవేత్తలు ‘సత్యసంధులుగా’ ఓ మాట అన్నారంటే అందుకే అది నిజమై తీరుతుంది. వాళ్ళు ప్రాపంచికంగా ఉంటూనే సదా భగవత్సేవలో దీక్షాదక్షులై ఉనప్పుడు ఇంద్రియ లోలులు కానప్పుడే ఇది సాధ్యం.


న్యాయస్థానాలు సత్యాన్ని నిలబెట్టడానికి నెల కొల్పినవె. ‘‘దేవుని ఎదుట ప్రమాణంచేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను’’ అని ఏ భగవద్గీతమీదో ప్రమాణం చేసినా, అంతఃకరణం నిర్మలం కానప్పుడు, సత్యవాక్కు వెలువడుతుందన్న విశ్వాసం ఏర్పడదు. ఈ రోజుల్లో ‘నార్కో ఎనలిటికల్’ పరీక్షలద్వారా- నేరస్థుల నుండి నిజాలు రాబట్టే యత్నాలు జరుగుతున్నాయి. ఒకడు సత్యం చెప్పడానికి ఇచ్చగించనప్పుడు, ఒక అబద్ధం ఆడితే దానిని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలాడాల్సి వస్తుంటుంది. నిజం అంత దుర్భరభమైంది అవడంబట్టే ‘నీరు పల్లమెరుగు - నిజము దేవుడెరుగు’ వంటి సామెతలు పుట్టాయి.


ఇంతకీ ‘సత్యవాక్కు’ అంటే నిజం నిప్పులాంటిది. నిప్పుని ఊకతో కప్పిఉంచినా, నిప్పును ముట్టుకుంటే అది కాలక మానదు. అలాగే ఎన్ని అబద్ధాలను గోడలుగా పేర్చినా- ఎప్పుడో అప్పుడు ఆ గోడ కూలక తప్పదు. సత్యం బహిర్గతం కాక తప్పదు. నిజానికి సత్యం చాలా విలువైనది, పదునైనది. 

నిజాలకు తట్టుకోవడం కూడా నిజానికి కష్టమైనపనే!కాని ప్రాణ, విత్త, మాన, భంగం కలిగేటప్పుడు ఓ అబద్ధపు పలుకు తప్పుకాదనడమూ కనబడుతుంది. కానీ ఎప్పుడూ నిజమే చెప్పాలి! అయితే ఆ సత్యవాక్కు నిష్ఠూరమైంది కారాదట!


సత్యమే చెప్పాలి కానీ, ప్రియమారా చెప్పాలి. అప్రియమైనదయితే - సత్యవాక్కునయినా ఆచి తూచి చెప్పాలి అబద్ధాలవల్ల అరిష్ఠాలేతప్ప, తాత్కాలిక ప్రయోజనాలుకలిగితే కలుగవచ్చుననేమోగానీ, నిలిచి వెలిగేది సత్యమే! వంచనతో కపటంతో మెరమెచ్చు మాటలతో అనృతాలతో తాత్కాలిక ప్రయోజనాలు నెరవేరుతాయేమోగానీ- సత్యాన్ని అవి మరుగుపరచలేవు! పైగా ఒకసారి విశ్వాసం కోల్పోయేలా ఒకరి అబద్ధం పనిచేసిదంటే, ఇంక ఆ వ్యక్తి సత్యదూరుడుగానే సంభావితుడవుతాడు. ‘విశ్వసనీయత’ సత్యవాక్కువలనే సంక్రమించిన లక్షణం. అది సమాదరణీయం. వాక్కును మించిన భూషణం లేదన్నారు. సత్యవాక్కు మాత్రమే అటువంటి ‘వ్యక్తి సౌందర్యాభరణం’. మాటతోనే మహానీయ కార్యాలెన్నింటినో సాధించడం సాధ్యమవుతుంది.

- సుధామ

(28/02/2012 Andhrabhoomi (Daily))

0 comments: