‘‘పాడకే నా రాణి
పాడకే పాట
పాట మాధుర్యాన
ప్రాణాలు తీయకే"
అంటూ ఘంటసాల గారు పాడిన ఓ లలిత గీతం ఆ రోజుల్లో నిజంగా హాయితో ప్రాణాలు తీసినట్లుండేది. ఇవాళ మాధుర్యానికి మరీ మరీ మార్పు వచ్చేసింది’’ అన్నాడు ప్రసాదు.
‘‘అది ‘వెరీ వెరీ’ మామూలే మిత్రమా! నీకు ‘వెర్రి’గా తోచేది, ఈ తరానికి గొప్ప సంతోషాన్ని, మాధుర్యాన్ని కలిగిస్తుంది. వారు కలవరించి పలవరించే పాట మాధుర్యం వేరు. అది గ్రహించాలి’’ అన్నాడు సుందరయ్య.
‘‘దేని గురించి మీరు మాటాడుతోంది మహానుభావా’’ అన్నాడు శంకరం పేపర్నుంచి దృష్టి మరల్చి.
‘‘ఇప్పుడు యువతను వెర్రెక్కిస్తున్న పాట గురించే! ‘వై దిస్ కొలవరి కొలవరి డి’ అంటూ తమిళ చిత్రం ‘3’లోని పాట ఆడియో, ‘యూట్యూబ్’లో దానిని పాడుతున్న గాయకుడితో యువతను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆ పాట మీద ఇరవై మిలియన్ల ‘హిట్స్’ వచ్చాయట. ఈ ‘హిట్స్’ కూడా ‘ఫిట్స్’ లాంటివే అని ఎద్దేవా చేసేవారున్నా, యువతను ఇంతగా ఆకట్టుకోవడం ఆ ‘కొలవరి’ గొప్పదనం అని ఒప్పుకు తీరాల్సిందేమరి’’ అన్నాడు సుందరయ్య.
‘‘ ‘వెర్రి వెయ్యి విధాలు’ అన్నారు. ఇంతకీ ‘వెర్రి’ అనేది నేటి కుర్రకారుకు నిజంగా ‘కిర్రె’క్కించేది. వెరీ వెరీగా వెరైటీగా నచ్చేదే- ‘వెర్రి’ అనాలి ఇవాళ. ‘కొలవరి’ పాట తమిళ జనాన్నేకాదు, దేశవ్యాప్తంగా యువజనాన్ని ఓ సంతోషపు ‘క్రేజ్’లో పడవేసేదిగా నిజంగా ‘పాట మాధుర్యాన ప్రాణాలు తీయకే’ అని ఈ తరం భావించేదిగా రూపొందింది’’ అన్నాడు ప్రసాదు.
‘‘నేనేదో ‘కాలవెర్రి’, ‘వెర్రి కాలం’ అనుకుంటున్నానర్రా! ఇంతకీ ఏమిటీ ‘కొలవరి’కి అర్ధం. లేక అర్ధం పర్ధం లేకపోవడమే పాట పరమార్ధమా’’ అని అడిగాడు శంకరం.
‘‘తమిళంలో ‘కొలయ్’ అంటే మర్డర్. ‘వరి’ అంటే రేజ్. కొలవరి అంటే ‘మర్డర్ రేజ్’ అని ఇంగ్లీషు అర్ధం. నిజానికి గుంపులో రెచ్చిపోతున్న ఒకడిని ఉద్దేశించి అనే పదంట కొలవరి. ‘మర్డర్ రేజ్’ అన్న దానిని మన భాషలో చెప్పుకోవాలంటే హత్య చేసేంత భావోద్రేకపు తీవ్రత అన్నమాట. కానీ పాటలో ‘ప్రాణాలు తీయడమన్న’ ఈ భావ తీవ్రత అమ్మాయి తన ప్రేమను కాదన్నందుకు అబ్బాయి పొందేదనేట’’ అన్నాడు ప్రసాదు వివరిస్తూ.
"త్వరలో విడుదల కాబోతున్న తమిళ చిత్రం ‘3’లోని ఈ పాట విడుదలై యువ సంచలనమై కూర్చుంది. చిత్రహీరో ‘ధనుష్’ స్వయంగా పాడడం, ఆ పాటలో ఇవాల్టి యువతను అలరించే ఇంగ్లీషు పదాల కూర్పు, పాటకు కట్టిన ‘ట్యూన్’, యూట్యూబ్‌లో దాని ‘షాన్’ను అంటే గౌరవాన్ని పెంచాయి. ఇంకో విశేషం ఏమిటంటే- చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది ‘ధనుష్’ భార్య అయిన ‘ఐశ్వర్య’. ఇంతకీ ఈ ‘ఐశ్వర్య’ ఎవరో కాదు. తమిళ సూపర్‌స్టార్ ‘రజనీకాంత్’ కూతురు. రజనీకాంత్ అల్లుడు హీరోగా వేస్తూ పాడిన ఈ పాటకు ట్యూన్ కట్టింది కూడా ఓ పద్దెనిమిదేళ్ల కుర్ర సంగీత దర్శకుడు ‘అనిరుద్ధ్ రవిచందర్’. అదీ విశేషం!’’ అన్నాడు సుందరయ్య.
‘‘అసలింతకీ పాటలో సాహిత్యం ఏమిటి?’’ అడిగాడు ఈసారి శంకరం.
ప్రసాదు గొల్లున నవ్వాడు- ‘‘పాటలో సాహిత్యమా? ఎక్కడో పిచ్చోడిలా ఉన్నావ్! ఇప్పుడదంతా ఎవరిక్కావాలి. కోకిల పాట వింటూ...‘‘సాహిత్యం లేని పాట ఇంత బాగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందండీ’’ అంటూ ఓ పాటల రచయిత భార్య అంటున్నట్లు, కొత్తగా విడుదలయిన తన కార్టూన్స్ పుస్తకంలో ‘సరసి’ చమత్కరించినట్లు-పాట మాధుర్యం, దాని స్వర సంచారం అదే ‘బీట్’ అన్నది కుర్రకారుకు ఇవాళ క్రేజీ ‘రూట్’. అంచేత పాటది ఇవాళ ‘బీట్రూట్’ అంతే!’’ అన్నాడు.
‘‘ ‘సోప్’సాంగ్, ‘ఫ్లాప్’సాంగ్ అంటూ ధనుష్ ఈ పాటలో కుర్రకారుకు నచ్చే- ‘సూపర్ మామా’ అనేలా, ఓన్లీ ఇంగ్లీష్‌తో ‘ఛేంజ్ ది ట్యూన్’ అనుకుంటూ- ‘‘మూన్ కలరూ వైట్- వైట్ బ్యాక్ గ్రౌండ్ నైట్-నైట్ కలర్ బ్లాక్’’ అని ప్రకృతితో మొదలెట్టి, ‘‘వైట్ కలర్ గర్ల్ గర్ల్-గర్ల్ హార్ట్ బ్లాక్’’ అని ప్రేయసి తిరస్కారాన్ని తెలిపి, ‘‘ఐస్ ఐస్ మీటు- వైది ఫ్యూచర్ డార్క్’ అంటూ కళ్లూ కళ్లూ కలిసిన ప్రేమ భవిష్యత్తును ఎలా అతలాకుతలం చేస్తుందో సరదాగా ప్రకటించాడు. ‘హ్యాండ్లో గ్లాసు-గ్లాసులో విస్కీ’తో భగ్నప్రేమ పరిస్థితిని సరదాగానే ప్రతిబింబించాడు. నిజానికి జీవితాన్ని ‘లైట్ తీస్కో’ అన్న ‘ఉమర్ఖయ్యం’ ధోరణే నేటి కుర్ర కారుకు నచ్చుతోందర్రా! కానీ మన పెద్దవాళ్లే-గాఢతా, లోతూ, విలువలూ అంటూ పాపం వాళ్లను ఊదరగొడుతూంటాం అనుకుంటా’’ అన్నాడు సుందరయ్య.
‘‘ఇదా నాయనా! ‘కొలవరి’ పాట వైనం! నిజమే! భావోద్రేకపు తీవ్రతలు ప్రకటించే ఒకనాటి వైఖరికీ, నేటి వైఖరికీ చాలా తేడా వచ్చింది. నేటి యువతరాన్ని మునుపటి రోజుల విలువలతో, కొలమానాలతో చూసినప్పుడు ‘కొలవరి’-‘కాలవెర్రి’గానే అనిపిస్తుంది. అసలు ప్రతి మనిషికీ వేపకాయంత ‘వెర్రి’ ఉంటుందిట. ఆ వెర్రినే ఇవాళ ‘క్రేజీ’ అనవచ్చు. కేజీల కేజీల కొద్దీ ‘క్రేజీ’లు పెరిగిపోతుంటే నువ్వు ‘సున్నితపు’ త్రాసులో కొలవడమూ సరికాదు. సినిమా పేరు ‘త్రి’ట కదా! కమల్‌హాసన్ కూతురు ‘శృతిహాసన్’కూడా నాయికగా నటిస్తోందని చదివాను పేపర్లో. ‘కొలవరి’ పాట ఓ భగ్నప్రేమికుడి గీతమే అయినా కుర్రకారు హృదయానికి ఇంత దగ్గరగా స్వయంగా రాసి, పాడి మెప్పించిన ధనుష్‌ని అభినందించాల్సిందే’’ అన్నాడు శంకరం.
‘‘ ‘కొలవరి’ని..‘శుభపంతువరళి’ రాగంలోకి మార్చుకుని కూడా మన కుర్రకారు ఆనందిస్తున్నారట. తమిళింగ్లీష్ పాట యువతరాన్నంతా ఊపుతోందంటే కుర్రకారు సరదాను కాదనగలమా’’ అని నవ్వుతూ లేచాడు సుందరయ్య.
16 comments:
చాలా బాగుందండి మీరు రాసిన విధానం. చిన్న సవరణ
కొలవరి కాదు కొలె వెఱి
హహహ...భలే రాసారు!
కొలవరి పాట గురించి (సుధా)మధురంగా చెప్పిన మీకు శుభాభినందనలు !
ఆ పాటకి అర్ధం యేమిటా అందరూ ఇంత వెఱ్ఱెత్తి పోతున్నారూ.. అనుకున్నా..
అర్ధం బాగా వివరించారు.
ఇదే పాటని ప్రముఖ గాయకుడు సోనూ నిగం నాలుగేళ్ళ కొడుకు తనదైన ధోరణిలో పాడి, యూ ట్యూబ్ లో పెడితే అది కూడా చాలా హిట్లు కొట్టిందని ఎక్కడో చదివాను.
వెఱ్ఱి యనగ విందు వేయి విధములని
వేయి మీద నొక్క విధము పుట్టె
కొలవెరి యగు గాక కొల వెఱ్ఱి యగు గాక
పిల్ల తరము వెఱ్ఱి పెచ్చు మీరె
ధన్యవాదాలు అన్నోన్ గారూ! సౌమ్య గారు,అప్పారావ్ గారూ,శ్రీలలిత గారూ బహుధా కృతజ్ఞతలు.శ్యామలీయం గారూ మీ పద్యం చాలా హృద్యంగా వుంది.అందరికీ వందనాలు.
హహహ బాగా వ్రాసారు! నాకు ఈ పాట అస్సలు నచ్చలేదు ఇంతమందికి ఎలా నచ్చిందా అని ఆశ్చర్యం కూడా వేసింది!
మీ రసజ్ఞ వ్యాఖ్యకు ధన్యవాదాలు
బాగా రాశారండీ..సూపరు
థాంక్యూ! రాజ్ కుమార్ గారూ!
meeku bagaa raasaaru ekkada vinnaa ee paatae.
teluguvaramandi.net
Sudhama gara... paatalo sahityam chala chakkaga vivarinchaaru.. hats off.
Thank you Telugu varamadi and Rajesh babu for your nice response.Thanks a lot.
chala bagundhi sir
Thank you satish
Post a Comment