రేపు ఒకటీ పది- అన్నాడు వస్తూ వస్తూనే సన్యాసి.....
‘‘అర్ధం కాలేదు’’ అన్నాడు శంకరం.
‘‘ఒక్కరి కోసం-పదిమంది కలవడం, పదిమంది కోసం ఒక్కరు కృషి చేయడం అనేదానికి సంకేతం-‘ఒకటీ పదీ’ అని నా భావం. పన్నెండు నెలల్లో అక్టోబర్ పదవది కదా! ఒకటీ అక్టోబర్ తేదీకి ప్రాముఖ్యం ఎంతో ఉందని నా ఉద్దేశ్యం’’ అన్నాడు సన్యాసి.
‘‘ఒక్కడే పదిమంది పెట్టుగా, పదిమందినీ కదిలించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాందీ పుట్టింది అక్టోబర్ రెండున. ఆరోజు జాతీయ సెలవుదినం కూడాను! అది వదిలేసి, ఒకటో తేదీ అంటావేమిటోయ్ గొప్పగా’’ అన్నాడు నవ్వుతూ ప్రసాదు.
‘‘ఒకటిగా ఉండాల్సిన దేశం రెండుగా విభజన అయంది, రెండున జన్మించిన గాంధీతోనే అనేవారున్నారు! అదేరోజున జన్మించిన మాజీ భారత ప్రధాని లాల్బహద్దూర్ శాస్ర్తీ మాత్రం- ‘‘జై జవాన్-జై కిసాన్’’ అంటూ నినదించి, ఏకత్రిత భావనలకే కాదు, పొట్టివాడయినా గట్టివాడుగా, ఒక నిజాయితీకీ నిరాడంబరతకూ, అవినీతి రహిత అధికార ప్రాతినిధ్యానికీ, నేటికీ ఏకైక ఆదర్శమూర్తిగా ఉన్నాడు. కానీ ఆయనగురించి ఎవరకూ పట్టదు .
పేరుకే తప్ప ఇంకా తొలగిపోని ‘కుల వ్యవస్థకు’ దర్పణంగా కూడా, అక్టోబర్ రెండుంది.
‘‘పదిమందిగా ఉండే కుటుంబం కోసం-ఒక్కడిగా కష్టపడి పైకి తెచ్చి, పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, ఆ పదిలో ఒకటిగా మిగిలిపోయే, వయసుడిగిన ‘వృద్ధుల దినోత్సవం’రేపు అక్టోబర్ ఒకటి! పెరుగుతున్న జీవన ఆయుఃప్రమాణాలు ఆనందదాయకాలే కానీ, 2020 సంవత్సరంనాటికి-ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్యే అధికంగా ఉంటుందంటున్నారు! రేపు ఏమవుతుందో, ఎలా ఉంటామో తెలియని వృద్ధుల పరిస్థితి, ఏ దేశంలో చెప్పుకున్నా పదే పదే ఒకటిగానే ఉంటోంది. మన దేశంలో మరీను! వృద్ధాశ్రమాల పెరుగుదల గొప్ప అనీ, సేవా కార్యక్రమాల మహత్తర చర్య అనీ భావించే దశకు వచ్చాంగానీ, మన భారతీయ కుటుంబ జీవన విధానానికే ప్రతీఘాతుక చర్య, అని గుర్తించలేకపోతున్నాం. ‘డబ్బు’ అనేదే ముఖ్యమైపోయి, వృద్ధులైన తల్లిదండ్రులకు ‘పుష్కలంగా డబ్బులిస్తున్నాం.అది చాలదా’ అనుకునే స్థితికి పిల్లలను నెట్టివేస్తున్న కాలం నిజానికి విచారించదగింది! పదిమంది కోసం కష్టించిన ఒక్కడికి-పదిమంది కాదు కదా, ఒక్కడైనా కొడుకు కూడా, ఆసరా కాలేకపోవడమన్నదానికన్నా విషాదం ఏముంది? ‘‘ఒకటీ పది’’ వృద్ధుల దినోత్సవంగా దీనిని సంకేతిస్తోంది’’ అన్నాడు సన్యాసి ఆర్తిగా.
‘‘నిజమే! ఇవాళ కొలతలూ, తూనికలు మారిపోయాయి; మానవ విలువల విషయంలో కూడాను.రేపటి రోజయిన ‘ఒకటీపదినే’ 1958లో-వెయిట్స్ అండ్ మెజర్స్ మెట్రిక్ సిస్టం మొదలైంది. తూనికలు, కొలతల వార్షికోత్సవం కూడా ఒకటీ పదినే సుమా’’ అన్నాడు ప్రసాదు గుర్తు చేసుకుంటూ.
‘‘పదిమందీ అయిన తన స్నేహితులకూ, బంధువులకూ వర్తమానం పంపడానికి-ఒకప్పుడు ‘ఉత్తరాలే’ ఆధారం! మంచి అయినా, చెడు అయినా లేఖలద్వారా పరస్పరం తెలియజేసుకునేవారు. అలా ఉత్తరం పంపడానికి ముఖ్యమైనది దానికి అంటిపెట్టుకు ఉండే ‘తపాలా బిళ్ల’. భారతదేశంలో 1854 అక్టోబర్ ఒకటినే-‘పోస్టల్ స్టాంప్’ అనేది మొదలైంది.
‘అనిబిసెంట్' జన్మించింది,
చలనచిత్రరంగంకు చెందిన శివాజీ గణేశన్ జన్మించిందీ,
గూడవల్లి రామబ్రహ్మంగారు అస్తమించిందీ
రఘుపతి వెంకటరత్నం నాయుడు జన్మించిందీ,
‘ఒకటీ పదినే’.
ఈ దేహమనేదే ప్రాణికి ఇల్లు అన్నారు.సకల జీవకోటికీ నివాస స్థలం అనేది మరీముఖ్యం! ‘ఒకటీ పది‘ ప్రపంచ ఆవాస దినోత్సవం కూడాను.
రేపటి గురించి-ఇలా ఒకటికి పది విషయాలు మాట్లాడుకోవడమే-నేటి ఆనందానికి పదిలం మరి!’’ అని నవ్వుతూ లేచాడు సన్యాసి.
***
1.10.2011
2 comments:
బావుంది
అక్టోబర్ 1,2 తేదీలలో జరిగిన సంఘటనలను పుసగ్రుచ్చి వ్యాసంగా అందించారు.ఈ విషయాలు జనరల్ నాలెడ్జ్ కి బాగా ఉపయోగపడతాయి.
Post a Comment