ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 31, 2011

దిగ్దర్శనమ్ (వచన కవితల సంపుటి)పరిచయం...

‘‘ఒంటరిగా బిందువులం/ కలివిడిగా సింధువులం’ -అంటూ అమృతాహ్వానంతో ‘దిగ్దర్శనమ్’ వెలువరిస్తున్న వచనకవి డా. మోపిదేవి విజయగోపాల్.

వృత్తిపరంగా మానసిక వైద్య నిపుణుడైన వ్యక్తి కావడంతో కవిత్వంలో సజావైన సమాజం కోసం స్వప్నించే తన ప్రవృత్తిని అక్షరీకరిస్తున్నాడీయన!

జాతీయ భావపూరితంగా - వందకు అయిదు తక్కువగా వున్న ఈ కవితా సంపుటిలోని అధిక శాతం కవితలు గోచరిస్తున్నాయి. ‘జాగృతి’ ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది వీరి కవిత్వ రచనకు.

‘‘నిద్దుర వదలిరా
నడుం బిగించి నడచిరా
నిశ్చయ సంకల్పంతో కదలిరా
స్వరాలను కలుపుదాం
సంకెళ్ళను కలుపుదాం
భారతి మెడలో
విజయహారమై మెరుద్దాం!’’

అని ఉత్సహిస్తున్నారు గానీ, ఆ ఉత్సాహంలో ‘సంకెళ్ళను కలపడం’ అంటే ఏమిటో అది ‘మానవ హారం’గా కాక, ఎలా వ్యతిరేకార్థాన్ని ప్రతిఫలింపచేస్తోందో గుర్తించినట్లు లేదు!

పర్యావరణం గురించీ, పండగల గురించీ కూడా రాశారు. అక్కడక్కడా మినీ కవితలూ మెరిపించారు.

‘‘నా తలరాతను నేనే
నా ఆలోచనల లోచనాల స్పందనలో
నా ఏరుకున్న పువ్వుల గవ్వలు -

నా మానస అలల అలజడితో
నే కూర్చుకున్న కుసుమాలు -

గడ్డిపువ్వులు’’ అంటారు.

‘‘నాప్రపంచాన్ని
నేనే కూర్చుకున్నాక
ఎవరిని నిందించను’’ అన్న స్వస్వరూప జ్ఞానం ‘మోపి’, కావించుకున్న
‘దిగ్దర్శనమ్’ ఇది.

ప్రతులకు: 14-6-11, అంఠోని రోడ్, మహారాణి పేట, విశాఖపట్నం-530 002

0 comments: