ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, July 30, 2011

పరి..పరి "హాసం "




అదే నయంగా

‘‘ఏమండోయ్ డాక్టర్ వివేకానందమూర్తిగారూ! ఎక్కడా కనబడ్డం లేదు నాల్రోజుల్నుంచీ’’ కొత్తగా ప్రాక్టీసు పెట్టిన డాక్టరు మిత్రుడిని అడిగాడు భ.రా.గో.
‘‘తుపాకీ కొన్నానుకదా! వేటాడదామని శ్రీకాకుళం అడవులకెళ్లాను’’ అన్నాడు డాక్టరు.
‘‘మరేమైనా చంపారా లేదా?’’
‘‘ఉహూ! ఒక్కటి కూడా దొరకలేదు.’’
‘‘అయితే ఊళ్లోనే ఉందురూ! ఇక్కడ మీ ప్రాక్టీసేనయం కదా!’’ అన్నాడు భరాగో.

**

గాడిదలు


ఓ సాహిత్య సభలో పాల్గోవడానికి మునిమాణిక్యం, జాషువా హైదరాబాద్ వెళ్లారు. ఆంధ్ర రాజధానిగా ‘హైదరాబాద్’ గుర్తింపబడిన మొదటి రోజులవి. ఇద్దరూ నగరమంతా తిరిగి ఓచోట కబుర్లు మొదలెట్టారు.
‘‘ఏమండీ మునిమాణిక్యంగారూ! మన ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కనబడే గాడిదలు ఇక్కడ ఒక్కటీ కనిపించదేమండీ’’ అన్నారు జాషువా.
దానికి మునిమాణిక్యం ‘‘మొన్ననేకదండీ ఈ హైదరాబాద్ మన రాజధాని అయ్యింది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయ్! నాలుగురోజులుపోతే మీకు కావలసినన్ని గాడిదలు కనబడతాయ్ ఎక్కడబడితే అక్కడ’’ అన్నారట.


**

సైగల్

భరాగో సంగీత ప్రియుడనీ అందులోనూ సైగల్ అభిమాని అనీ తెల్సిన మిత్రులు కొందరు విశాఖ సాహితి పిక్నిక్‌లో ఆయన్ను సైగల్ పాటలు పాడమని బలవంతం చేశారు.
ఆయనందుకు ఒప్పుకోకపోవడంతో కొంతమంది ‘‘సైగలు- సైగలు’’ అని ఆయనను చూసి గొడవ చేశారు.
అపుడు భరాగో లేచి ‘‘సైగలు చేసే వయసు దాటిపోయింది నాకు .దయచేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి’’అని చక్కా కూర్చున్నాడు.

**

షార్ట్ స్టోరీ

కథా రచయిత శివల జగన్నాథరావు పొట్టివారయినా కథా రచనలో గట్టివారే.
భరాగో ఆయనకోసారి ఉత్తరం రాస్తూ ఎడ్రస్‌లో ఇలా రాశారు శ్రీ.శివలజగన్నాథరావు ,'షార్ట్'.. స్టోరీ రైటర్...’’


**

బుర్రలు

ఓమారు ద్విభాష్యం రాజేశ్వర్రావ్ భరాగో రూంకి వెళ్ళి గోడకున్న ఓ గ్రూప్ ఫొటో చూసి ‘‘ ఫొటో గ్రాఫరెవరో గానీ సరిగా తీయలేదు. బుర్రలన్నీ చిన్నవిగానూ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదిగానూ తీశాడు’’ అన్నాడట.
దానికి భరాగో ‘‘పాపం! ఫొటోగ్రాఫర్‌ని ఏం అనకండి! ఇందులో ఎవరి బుర్రలూ పెద్దవికావు’’ అన్నాడు.


**

దండగ

భరాగో ఓ సినిమాకు వెళ్లాడు. పావుగంట చూసేసరికి వళ్ళుమండిపోయింది.
‘‘ఇంతోటి సినిమా చూడటానికి కళ్ళజోడు కూడా ఎందుకు దండగ’’అని కళ్ళజోడు తీసేసాడు
.

**

సహాయం

దేవెళ్ళ బాలకృష్ణ తూలుతూ ఇంటికొచ్చి తలుపు తాళం తీయడానికి నానా అవస్థా పడుతున్నాడు.
అదంతా గమనిస్తున్న భరాగో జాలిపడి ‘‘తాళంచెవి యిటివ్వండి! నేను తీస్తాను’’ అన్నాడు.
‘‘అవసరం లేదు! నేను తియ్యగలను. కాస్త ఇల్లు కదలకుండా పట్టుకోండి చాలు’’ అన్నాడాయన.


**

జబ్బు

‘‘నా భార్యకు జబ్బు వచ్చిందోయ్ ఈమధ్య. రాత్రి రెండు మూడింటివరకూ మేలుకుని కూర్చుంటోంది’’ భరాగో చిరాగ్గా తన స్నేహితుడితో అన్నాడు.
‘‘అరె పాపం! అంతవరకూ ఏం చేస్తూంటుంది’’ అడిగాడతను.
‘‘నాకోసం ఎదురుచూస్తూంటుంది వీధి తలుపు తీసిపెట్టి’’ జవాబిచ్చాడు భరాగో.


**

SMS (సరదా మాటల శైలి)

కలికాలం

‘‘నేను నీ చేతులను ముద్దాడవచ్చా’’
అని అడిగితే అబ్బాయి-
‘‘ఏం నేనెలా కనబడుతున్నా నీకు
నా పెదవులకు లిప్‌స్టిక్ కాక
విషం పూసుకున్నాననుకుంటున్నావా’’
అని గంయ్యిమందిట ఆ అమ్మాయి.


**

3 comments:

SRRao said...

సుధామ గారూ !
సుధా మధురం మీరందించిన ఛలోక్తులు. ధన్యవాదాలు.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

సుధామ గారు ఇంత మంచి జోకులు చెబితే నువ్వు నవ్వమేమిటి అప్పారావ్?
ఆయనంటె నాకు కోపం ! నెట్ క్లోజు చేసాక నవ్వుకుంటా !!
చాలా బాగున్నాయండి!

A K Sastry said...

నేను మొదటిసారిగా వింటున్న కొన్ని, ముఖ్యంగా భరాగో జోకులని అందించారు.

అనేక ధన్యవాదాలు.