రాజీనామా చేస్తున్నానోయ్, అంటే భేష్! ఇన్నాళ్లకి ఓ మంచి పనిచేస్తున్నావ్- అని బాపుగారి కార్టూన్ కాబోలు ఒహటుంది! అంటే ఏమిటన్నమాట? తన అసమర్ధతను తాను గుర్తెరిగి ప్రవర్తించాడు అని దాని అంతరార్థం- అన్నాడు ప్రసాదు.
‘‘అలా ఎందుకనుకోవాలి? తన శ్రమను గుర్తించని యాజమాన్యంపై నిరసన అని భావించవచ్చు కదా! తన విలువను గుర్తింపచేయడం కోసం చేసిన ప్రతిఘటనగా తీసుకోవచ్చు కదా!’’ అన్నాడు శంకరం.
‘‘నువ్వెక్కడో అమాయకుడిలా ఉన్నావ్! రాజీనామా చేస్తే వద్దని ఉద్యోగిని బ్రతిమాలే యాజమాన్యాలు సకృత్తుగానే ఉంటాయి. ‘పొమ్మనలేక పొగపెట్టినట్టు’ వారంతట వారే రాజీనామాలు చేసి పోయేటట్లు ప్రవర్తిల్లే ‘బాస్లూ’ ఉంటారు. అందువల్ల ఎవరికి నష్టం? నష్టపోయేదంటూ ఏమన్నా ఉంటే రాజీనామా చేసిన వాడేగానీ, అందుకు హేతువయినవాడు కాదు. ఒకరి రాజీనామావల్ల ఆ ఖాళీని తమకనుగుణంగా భర్తీ చేసుకునే తెలివితేటలూ, అవకాశమూ కంపెనీకే ఉంటాయి’’ అన్నాడు రాంబాబు. ‘రాజీనామా’ చేసిన వాడిని ‘మాజీనారా!’ అంటాం అంతే!’’ అన్నాడు
‘‘సరే! మీరన్నది ఉద్యోగాల విషయంలో పోనీ సరియైనదే అనుకుందాం! కానీ రాజకీయాల్లో రాజీనామాల మాటేమిటి?’’ అన్నాడు శంకరం.
‘‘అలనాడెప్పుడో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆనాడు కేంద్రంలో రైల్వేమంత్రిగా ఉన్న -మాజీ ప్రధాని- దివంగత లాల్‌బహదూర్ శాస్ర్తీ రాజీనామా చేశారు. నాడు అది ఆయన వ్యక్తిత్వానికి ఒక గొప్ప ప్లస్‌పాయింట్‌గా నిలిచింది. ఇవాళ తన పదవికి రాజీనామా చేయడంలో కెసిఆర్ ఒక రికార్డును నెలకొల్పుతూ వస్తున్నారు. అంతేకాదు! ‘రాజీనామా’ అనేదానిని కూడ ఒక నిరసన అస్త్రంగా, తమ అభీష్టం నెరవేర్చుకునేందుకు ఒక సాధనంగా వినియోగిస్తున్నారు’’ అన్నాడు శంకరం.
‘‘అదేనయ్యా! ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాను. తమకు ప్రాతినిధ్యం వహిస్తూ, తమ అభీష్టాన్ని సాధించుకురమ్మని ప్రజలు ఆయనకు ఆ పదవిని కట్టబెడితే, ఆ ప్రాతినిధ్య అధికారం ద్వారా-ఆయన పనిని సానుకూలం చేసుకోకుండా, ఆ రాజకీయ అధికారంతో, చట్టసభలో ప్రవర్తించకుండా, మాటిమాటికీ రాజీనామాలు చేయడం ఏమిటి? నిజంగా రాజీనామా అస్తమ్రే పనిచేసేట్లయితే, ఇప్పటికి పలుమార్లు ‘ఆ పనిచేసిన ఫలితం’ కనబడాలి కదా? ‘రాజీనామాలు చేయడం’ ఒక పిల్లాటగా, తల్లిదగ్గర కుర్రాడి మంకులాగా, మారిపోతుంటే, ఇంక దానికి విలువ ఎక్కడుంటుంది? రాజీనామాలు సమస్యకి పరిష్కారం కాగలవా అనే సందేహం పొటమరించడంలో పొరపాటేముంది’’ అన్నాడు ప్రసాదు. ‘‘పైగా ‘రాజీనామా’ల ప్రహసనం బంద్‌లూ, ఆందోళనలతో ప్రజల బ్రతుకును దెబ్బతీస్తున్నది.’’ అన్నాడు తనే.
‘‘చూడు బ్రదర్! ఒకరు ఒక పనిచేస్తే పిల్లాట అనుకోవచ్చు! వందమంది అదే పని చేసినప్పుడయినా అది ఏదో ఆషామాషీ వ్యవహారం కాదనీ, దాని వెనక బలీయమైన శక్తి వుంది అని గ్రహించాలిగా’’ అన్నాడు శంకరం ఉక్రోషంగా!
‘‘గుర్తిస్తున్నారయ్యా! గుర్తిస్తున్నారు! ‘అమీతుమీ’ తేల్చేయడం వల్ల సమస్య పరిష్కారం కావడం అటుంచి, వౌలికంగా అది-ఒక ప్రాంతంతో తీరిపోయేదిగా కాక, పురోగమన లక్ష్యానికే పెద్ద సమస్యగా మరింత చుట్టుకునేదిగా, సమస్య మరింత విస్తృతంగా మిగతా చోట్లకు కూడ ప్రాకేదిగా మారి, మరింత జటిలమవుతుంది అన్న సంకేతాల కనబడుతున్నప్పుడు, తక్షణ పరిష్కారం కనుగొనడం, ప్రకటించడం, సాధ్యమయ్యే సంగతి కాదుకదా! బడాబడా కంపెనీల్లో కూడ అందుకే-ఒకడు రాజీనామా చేస్తే, ఆ చేసినవారి ప్రభావం-మొత్తం కంపెనీ మీదా, కంపెనీలోని ఇతర ఉద్యోగస్తుల మీదా ఎలా ఉంటుంది అని ఆలోచించి మరీ ఆ రాజీనామాను అంగీకరించే వైఖరి కనబడుతున్న కాలాన, మొత్తం దేశంతో ముడిపడిన అంశాన్ని, రాత్రికి రాత్రి తేల్చి చెప్పడం కుదరని పని అంటే, అందులో ‘కుట్ర’ ఉందనుకోవడం దేనికి? నిజంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా-కొంత కాలయాపన జరిగినా, ఒక శాశ్వతమైన, అందరికీ ప్రయోజనదాయకమైన పరిష్కారాన్ని కనుగొనడమే కేంద్రం బాధ్యత కదా!’’ అన్నాడు రాంబాబు.
‘‘ ‘ఎక్కువమంది చేతులెత్తినంత మాత్రాన అది న్యాయం కాజాలదు’ అనే మాటా ఒకటుంది! సంఖ్యాబలం ఉంటే అది న్యాయం, ధర్మం అనుకోవడం కుదరదు. కౌరవులు వందమంది అయినా, పాండవులు అయిదుగురే అయినా, ‘ధర్మం’ సంఖ్యాబలంవైపు లేదు!- శ్రీకృష్ణుడు ఎటువున్నాడన్నది ముఖ్యమైపోయింది. తమకు ఏం కావాలో ఒక్కోసారి ప్రజలకే తెలియదు. అందుకే వారిని సరైన దారిలో నడిపించే నేత కావాలి. నేతృత్వ దారిద్య్రగ్రస్త సమయంలో జీవిస్తున్నప్పుడు, తమ సమస్యనే ప్రజాససమస్యగా చిత్రించే కుహనా రాజకీయకులు పెరిగినప్పుడు, ప్రతి గల్లీకి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు. ప్రజాస్వామ్యం గొప్పదే! కానీ ప్రజలను చీల్చి పంచుకోవడం కాదు దాని అర్ధం! మన ఎన్నికల వ్యవస్థ ఎంత హేయంగా, ఘోరంగా ఉందో మనకు తెలుసు. ఎన్నికయిన నేతలందరూ అధిక శాతం ఎలా ధనబలం, నేర ప్రవృత్తి బలంతోవోటర్లను తాత్కాలిక ప్రలోభాలలో ముంచీ, రిగ్గింగులు చేసీ, గెలుస్తున్నారో మనకు తెలుసు. నేటి నేతలు నిజమైన ప్రజాప్రతినిధులనుకోవడమూ- నేతి బీరకాయలో ‘నెయ్యి’ చందంగానే ఉన్నప్పుడు, వారు ప్రతిబింబిస్తున్నదీ, వ్యక్తీకరిస్తున్నదీ, ఆందోళన చేస్తున్నదీ-నిజంగా ‘ప్రజాభీష్టమే’ అన్న విశ్వాసమూ పరిష్కర్తలకు కలగడంలేదు! అంచేత రాజీనామాలు ‘రామా’ అనుకుంటూ మధ్యలో ‘జీనా’ అనగా ‘బ్రతకడం’గానే రోజులు వెళ్లమారుతున్నాయి.చివరకు ‘కాలమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది’ అన్న భావనలోకి నెట్టబడుతున్నాం’ అని లేచాడు ప్రసాదు.
(8.7.2011. Friday)
4 comments:
సుధామ గారూ !
రాజకీయ రాజీనామాల బీరకాయల్లోని నీ(నే)తిని చక్కగా వివరించారు.
Prastuta rajakeeya nayakulu valla lifenu chusukunenduku prabhutwalato chelagatam adutunnaru ani, prajalaku ela teliyali sir....
బ్లాగుగా చెప్పారు. రాజీనామా ప్రహసనం రాను రానూ ఓ జోకుగా మారిపోయింది !! చివరకు వీళ్ళంతా "నా", "మా" లను
వదలి "రాజీ"కి వస్తానంటారు!
baga chepparu @apparao garu
Post a Comment