ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 1, 2011

చూడాలని ఉంది!




చూడాలని ఉంది- అన్నాడు శంకరం.

‘‘ఎవరిని? ఏమిటి?’’ అని అడిగాడు రాంబాబు.

‘‘కలిసి ఉండా? విడిపోయా? అది కూడా చెప్పు’’ అన్నాడు సన్యాసి.

‘‘చూడాలని ఉంటే చూసేయడమే! దానికి ఒక ప్రకటన కూడా ఎందుకు’’ అన్నాడు సుందరయ్య .

‘‘అబ్బే! అదంత అమీతుమీగా తేలే వ్యవహారం అయ్యుండదులే! లేకపోతే ఎలాగూ చూసేకాడికి అలా ఎందుకంటాడు. అది జరగడంలేదు కాబట్టే, మనసులోని ఆ ఆశను, అలా బహిర్గతం చేస్తుండి ఉంటాడు. ఇంతకీ విషయం చెప్పావే కాదు’’ అన్నాడు రాంబాబు.

శంకరం నవ్వాడు. ‘‘ఇదిగో! ఇదే వచ్చిన చిక్కు. ఒకడు ఒక మాట అంటే-దానికి ఊహాగానాలు, సిద్ధాంత రాద్ధాంతాలు మనలో ఎక్కువ. అందునా-ఈ ఛానల్స్ పుణ్యమా అని, జనంలో-వార్త వార్తలా కాక, ఒక ‘వంటకం’లా, అది కూడ-ఎవరికి తోచిన పద్ధతిలో వారు వండి వడ్డించేలా, తయారుతోంది! నేను’చూడాలని ఉంది’ అన్నది నా గురించి కాదు. ఆ మాట, చిరంజీవి అన్నది! ‘ప్రజలు నన్ను సిఎంగా చూడాలనుకుంటున్నారు’ అన్నాడాయన’’. ‘‘పాపం! ఆయన ఊహ ఆయనది. నిజంగా ప్రజలు చిరంజీవిని ‘సిఎం’గా చూడాలనుకుంటూంటే-ఆయన ‘ప్రజారాజ్యం‘పార్టీని బ్రహ్మాండంగా గెలిపించి, గతంలో ఎన్టీఆర్‌కు పట్టం కట్టినట్టు, ఎపుడో పట్టం కట్టేవారు కదా! కేవలం రెండు పదులలోపు అసెంబ్లీ సీట్లతో ‘ప్రజారాజ్యం’ పార్టీ సర్దుకోవాల్సి వచ్చింది కదా!’’ అన్నాడుసన్యాసి .

‘‘ఇంకెక్కడి ప్రజారాజ్యం! అది కాంగ్రెస్‌లో విలీనం అయిపోయింది కదా! అఫ్‌కోర్స్! ఇంకా ‘విలీన సభ’ అంటూ జరగలేదనుకో’’ అన్నాడు ప్రసాదు. ‘‘అవునూ! ప్రజలు ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైతే ‘చూడాలని ఉంది’ అనుకున్నారా? అది చెప్పుముందు! కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాక కాదు, చేయకముందు-పెద్ద బహిరంగ సభ పెట్టి, ‘‘ఇలా కలిపేద్దామనుకుంటున్నాను’’ అని చిరంజీవి ఏమయినా చెప్పాడా. ప్రజాభిప్రాయం ప్రకారం, ప్రజలకు ఎలా తను ఇష్టమో అలా నిజంగా నడుచుకునేటట్లయితే, నిర్ణయాలు తానే ఎందుకు తీసుకుంటాడు’’ అన్నాడు సుందరయ్య.

‘‘ప్రజాసేవ, సామాజిక న్యాయం లాంటి మాటలన్నీ వట్టి సినిమా డైలాగులే! పవర్‌ఫుల్ డైలాగ్ఉంటేచాలదు,పవర్‌ఫుల్ కథఉండాలి.ఆకథనుచిత్తశుద్ధితో,నిజాయితీగా,జనహృదయరంజకంగాతెరకెక్కించలగలగాలి!‘స్వయంకృషి’తో, ‘ఆపద్బాంధవుడు’లా ఆదుకునే, ‘అందరివాడు’ అని అనిపించి ఉంటే,ప్రజలెప్పుడో-ఆయన పార్టీ స్థాపించినప్పుడే, నెత్తికెత్తుకునేవారు! ముందునుంచీ-చిరంజీవికి ‘అధికారమే లక్ష్యం’ అనే మాట తిరుగులేని సత్యం. ఎలాగయినా ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కోరిక. వైఎస్సార్ మరణంతో-రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీలోని అస్థిరత, జగన్ వైయక్తికత, తెలంగాణ వాదం ఇవన్నీ తెరమీదకు వచ్చేసరికి, చిరంజీవి-తాను ‘హీరో’ని కదా, తన చెరిష్మా వల్లనైనా, కాంగ్రెస్‌లో చేరితే-తనకు అధిష్ఠానం ‘కోరిన పదవి కట్టబెట్టదా’ అని ఆశించే విలీనం చేశారు! నిజంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరి రాజకీయాలు మొదలెట్టివుంటే అది వేరు. కాంగ్రెస్‌నీ, తెలుగుదేశంనూ, ఇతర పార్టీలను ఓడించి, తన ‘ప్రజారాజ్యం’ పార్టీతో అధికారం కైవసం చేసుకోవాలనుకున్నవాడు, ప్రజాసేవలో, రాష్ట్ర సంక్షేమంలో తనదైన ‘విధి విధాన నిర్ణయాలనేవే’ స్పష్టంగా చెప్పనే లేకపోయాడు! రాష్ట్ర భవిష్యత్తు చిరంజీవి చేతుల్లోకి వస్తే బాగుంటుందని ప్రజలు ఆనాడు అనుకోలేదు. ఈనాడు అనుకుంటున్నారని ఆయన అనుకుంటున్నాడు. ప్రజలు అలా అనుకుంటున్నారని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకోవాలి కదా! బలీయంగా-‘జగన్’ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్ మరణంతో ఎగిసిపడిన ప్రజాభీష్టం అనిపించినట్లు కనిపించిన దానినే -కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వసించనప్పుడు, అది కృత్రిమంగా రేకెత్తించిన జగన్ స్వార్ధపరుల వర్గం భావనగా భావించి, అతడు తిరుగుబాటు జెండా ఎగరేసినా, ‘పిల్లచేష్ట’గా మిన్నకున్న అధిష్ఠానం, ఇప్పుడు ‘ప్రజలు నన్ను సిఎంగా చూడాలనుకుంటున్నారు’అన్న చిరంజీవి మాటను విశ్వసిస్తుందా? నిజంగా అతనికి కిరణ్‌కుమార్‌ని తొలగించి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందా? పైగా-తెలంగాణ సమస్య ఒకటి ఉండగా, స మైక్యవాద ముద్రే వున్న అప్పటి జగన్‌ని కాని, ఇప్పటి చిరంజీవిని కాని ముఖ్యమంత్రిని చేసే ధైర్యం కేంద్ర అభిష్ఠానానికి ఎక్కడుంది?’’ అన్నాడు శంకరం.

‘‘ తె.రాసను కాంగ్రెస్‌లో విలీనం చేసేట్లయితే కె చంద్రశేఖరరావుకు ముఖ్యమంత్రి పదవి వస్తుందనీ, అప్పుడు మునుపు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేయగానే-తెలంగాణ ఉద్యమం చల్లారినట్లు చల్లారుతుందనీ, ఇవాళ కేంద్రం భావించగల స్థితి కూడ లేదు! ‘తెలంగాణ ఉద్యమం’ కెసిఆర్ చేతుల్లోనే ఉందనుకోవడం కుదరని పని. తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే-తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ అధినేత్రి అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అలా వచ్చే తెలంగాణకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఉండి ఉన్నట్లయితే, కెసిఆర్ ఆ పని ఎప్పుడో చేసేవారు. తెలంగాణ ఇవ్వవలసింది కేంద్రంలో అధికారంలోవున్న కాంగ్రెస్. కానీ కేవలం అదొక్కటే కూడా నిర్ణయం తీసుకోలేదు. యపిఎ పార్టీలన్నీ ఒప్పుకోవాలి. తమ పార్టీలోనే అనుకూలురు, అననుకూలురు ఉన్నప్పుడు- ‘ఏకాభిప్రాయ సాధన’ అనే మల్లగుల్లాలు నడుస్తూనే ఉంటాయి! ‘కర్రా విరగదు పామూ చావదు’ అన్నట్లే ఉంటుంది తంతు’’ అన్నాడు సన్యాసి.

‘‘చిరంజీవి ఏ సినిమాలోనూ ముఖ్యమంత్రి వేషం వేయలేదు. నిజ జీవితంలో తనను ‘సిఎమ్’ గా చూడాలని ప్రజలనుకుంటున్నారని చిరంజీవి అనుకుంటున్నారు గానీ, ‘సిఎమ్’ అంటే బహశా ‘సినిమా మనిషి’ అని ప్రజల భావన కావచ్చు కదా!’’ అన్నాడు రాంబాబు. మిత్రులంతా పడీ పడీ నవ్వారు.

1 comments:

Anonymous said...

‘‘చిరంజీవి ఏ సినిమాలోనూ ముఖ్యమంత్రి వేషం వేయలేదు."

'ముఠామేస్త్రి' చిత్రంలో చిరంజీవి ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు.