ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 26, 2011

విడిపొయ్యి..



రేఖకు ఎగువన ఉండటమా, దిగువన ఉండటమా అంటే- ఎగువున వున్నా నలుగురి దృష్టిలో దిగువన ఉన్నట్టే అగుపించడంలో, బోలెడు లాభాలున్నాయి. గొప్పనిరాడంబరుడూ, సాదా సీదా మనిషీ అనిపించుకోవడానికీ వీలుంటుంది. దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారు, ఎగువన వున్నవారు అనేదే కదా ఇప్పటి విభజన! ప్రభుత్వం దానినిబట్టే కదా-సంక్షేమ పథకాల రూపకల్పనలు చేసేది, పన్ను భారాలు పడవేసీదును’’ అన్నాడు సన్యాసి.

‘‘సరే!‘ఆయనే ఉంటే’ అని ఏదో సామెత చెప్పినట్టు ప్రభుత్వాల గణాంకాలన్నీ సగం ‘కాకిలెక్క’లే కదా! సర్వేలన్నీ సజావుగానే ఉంటాయి అనుకోవడం మన అమాయకత్వం! మన అమాయకత్వమే నేతలకూ, పాలకులకూ పెట్టుబడి. నిజంగా అలాంటి కరెక్టు లెక్కలు, అందుకు తగినట్లు చర్యలు ఉంటే దొంగ రేషన్ కార్డుల ఏరివేతలంటూ, అర్హులకు సరికొత్త రేషన్ కార్డుల డ్రైవలంటూ ఎందుకు తరచు జరుగుతుంటాయి?పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను కూడా బినానీపేర్లతో, దొడ్డిదారిన కొందరు ఎగరేసుకుపోయి వాటిని సొమ్ము చేసుకుని లాభ పడడం, పైకిమటుకు తమ పేర ఏదీ లేదు కాబట్టి తాము దారిద్య్ర రేఖకు దిగువున వున్న వారిగానే నమోదు చేసుకు చెలామణి కావడం జరుగుతోందంటే, అవినీతిలో అదీ భాగమే కదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘నన్నడిగితే అభివృద్ధికీ, అవినీతికీ కూడా లంకె ఉందర్రా! అభివృద్ధి-నిజమైన అభివృద్ధి అయితే అలాంటి పక్కదారులకు అవకాశం ఉండదు, ఉండకూడదు! కానీ అభివృద్ధి పేరిట సంక్షేమం పేరిట జరిగే వాటిల్లోనే అవినీతి చొరబడినప్పుడు అది ‘సంక్షేమం అభివృద్ధి’ కాక ‘అవినీతి అభివృద్ధి’గా మారుతోంది. తెలంగాణలో అభివృద్ధి జరగలేదనీ, తాము అన్నివిధాలా వెనుకబడి ఉన్నామన, అందుకు ఆంధ్రా దోపిడీదారులే కారణమనీ, అందుకే తమకు స్వయంపాలనా అధికారం, స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తి కావాలనే కదా ఇప్పుడు ఆందోళన! రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వం కోసం సిద్ధాంతకర్తగా మొన్న దివంగతులైన ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి‘ఆర్తీ’ అదే కదా! ‘‘నాకు కావలసింది వేరు తెలంగాణ కాదు. వీర తెలంగాణ’’ అని ఒకమారు సినారె అన్నారట కూడాను’’ అన్నాడు శంకరం.

‘‘అదే చెబుతున్నాను! అస్సలు అభివృద్ధి జరగలేదని ఎలా అంటారు? అభివృద్ధి జరిగింది. అయితే ఆ అభివృద్ధిలో అవినీతి, పాక్షికత వంటివి ఉండడంవల్ల అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవలసిన రీతిలో చేరలేదు. తెలంణలోను-దొరలు దొరలుగా ఉన్నారు. సామాన్యులు కొందరు సామాన్యులుగానే ఉన్నారు. ఎందుకంటే పాలనలో తెలంగాణా వారూ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన కాలాలు ఉన్నాయి కదా! ఆ కాలం-మిగతా ప్రాంతాలవారి పెత్తనంతో పోలిస్తే తక్కువే కావచ్చు. కానీ తమ పరిపాలనా కాలంలో తాము మాత్రం చేసింది ఏమిటి? ఎవరో ద్రోహం చేసారనడం సులభమే! మరి అవకాశం వచ్చినపుడు తమ వాళ్లే తమను ద్రోహం చేయడం గురించి మాట్లాడరేం! విడిపోతే అభివృద్ధి అద్భుతంగా సాగుతుంది అనుకుంటే అదేతక్షణ కర్తవ్యం! కానీ ‘్ఛత్తీస్ గఢ్’ వంటి రాష్ట్రాలు విడిపోయాక జరిగిన పరిణామాలు-‘వేర్పాటే గొప్ప పరిష్కారం’ అన్న విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాయి కదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘రాజకీయం అనేది- ‘దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవడం’’గానే అవుతోంది. ‘ఏ రాయి అయితేనేం- పళ్లూడగొట్టుకోవడానికి’ అన్నట్లు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, సామాన్యునికి ఒరుగుతున్నదేమీ లేదు! పైగా-వాళ్లుపనిచేసి తమ సామర్ధ్యాలు పెంచుకుంటూ ఎదిగే అవకాశాలు, జీవనోపాధితో నాణ్యతా ప్రమాణాల బతుకును గడిపే వీలు కలిగించేందుకు బదులు, ఉచితాల పేరుతో, సంక్షేమాల పేరుతో వారిని సోమరులుగా ఎవరి కరుణా కటాక్షాల మీదనో ఆధారపడే వారిగా, ఎవరు తమకు కష్టపడకుండా అన్ని సమకూరుస్తారనే ‘ప్రలోభ జీవులుగా, ‘పరాన్న భుక్కు’లుగా చేయడం అంత మహాపరాధం మరొకటి లేదు!‘రోజూ ఓ చేపను తినడానికి ఉచితంగా ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పించడం ముఖ్యం’- అన్న సూత్రం రాజకీయం విస్మరించిందంటే ప్రతిపార్టీ, తమస్వార్ధాలు,తమ అభివృధ్ధులే చూసుకోవడం కారణం. కలసివున్నప్పుడు తెలివిగలవాడితొ పోటీ పడడం వుంటుంది.తన తెలివిని పెంచుకోవడమూ ఉంటుంది. తెలివిగలవాడు వంచనకు,మోసానికీ పాల్పడేవాడు కాక, సంస్కారి, సహృదయుడూ అయ్యి, సాటివాడిని ఆదుకుని చేదుకునేవాడగా, మానవీయ విలువలతో సమానంగా సమస్థాయిలో చూసేవాడూ, తీసుకు రాగలిగేవాడూ కావాలి. ‘దారిద్య్ర రేఖ’ అంటూ గీస్తున్నదీ, దానికి కిందా మీదా తోచినట్టుగ తోచిన మనుషుల్ని సర్దుతున్నదీ కొందరికి అకారణ ప్రాధాన్యం, కొందరికి ఉదాసీనత ఉద్దీపింప చేస్తున్నదీ మన కుహాన రాజకీయాలే!’’ అన్నాడు సన్యాసి సీరియ్‌గా.

‘‘సంబంధం అన్నదమ్ములదిగా ఉందా? భార్యా భర్తలదిగా ఉందా అని ఆలోచిస్తే-ఎవరి సంసారం వారు గడుపుకునే అన్నదమ్ములుగా కాక భార్యాభర్తలుగానే ప్రాంతాల ఏకీకరణ జరిగింది. ఎప్పుడైతే ‘దాంపత్యం’ అన్నామో, సర్దుబాట్లు, పరస్పర విశ్వాసం, అవగాహనా, ఓర్పూ ఉండాలి. విడాకులు ఇప్పించడమే పుచ్చుకోవడమే లక్ష్యంగా, సంసారంలో చిచ్చుపెట్టే వైఖరుల బదులు-్భర్యభర్తలు ఇద్దరూ- తమ అస్తిత్వాలు నిలబెట్టుకుంటూనే సహజీవనం సాగించగల కౌన్సిలింగ్, మన జీవన విధానంలో ఆరోగ్యదాయకమైన సంగతే! కేంద్రం తొందరపడడంలేదంటే బహుశా ఇదే కారణం కావచ్చు! పైగా ఇనే్నళ్లు కలిసి సాగి ఇరువురి మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, రాష్టమ్రనే ‘సంసారం’ దేశంలో నలుగురికీ ఆదర్శంగానే కనిపించిన దాఖలా నిజానికి మన తెలుగువారిదే! ‘రోడ్డుమీదే వండి వడ్డించుకు తినే కాడికి వేరే ఇల్లు అనే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు’అని -కేంద్రం అనే ప్రమాదమూ ఉంది! ప్రస్తుతం భార్యాభర్తలు విడాకులకని కోర్టుకెక్కారు. అన్నదమ్ముల్లా భార్యాభర్తలు విడిపోవడం సాధ్యవౌతుందా’అని అన్నాడు ప్రసాద్.

0 comments: