సమర్థత ఎవడికి కావాలోయ్! మనకి అనుకూలమా కాదా అన్నది ప్రధానం. మనవాళ్ళకు సహాయపడుతున్నాడా లేదా అన్నది చూస్తాం. అస్మదీయుడిగా ఉండాల్సిన వాడు తస్మదీయుడిగా మారితే - తస్మాత్ జాగ్రత్త! అని మనచేత కాగలకార్యంతో కసి తీర్చుకుంటాం’’ అన్నాడు రాంబాబు కొంచెం ఆవేశపడుతూ.
‘‘కూల్ డౌన్! కూల్ డౌన్! ఇంతకీ దేన్ని గురించి నాయనా నీ ఆవేశం?’’ అన్నాడు ప్రసాదు.
‘‘ఒకవేళ ఐ.ఎ.ఎస్. అధికారుల బదిలీల గురించి కాదు కదా రాంబాబూ!’’ అన్నాడు శంకరం నవ్వుతూ.
‘‘కాకపోవడమేమిటి? దాన్ని గురించే! అసలు ప్రభుత్వానికి ఎవరిని, ఎక్కడ, వినియోగించుకోవాలో తెలియాలి! కొందరు జిల్లా కలెక్టరు ల ప్రత్యర్థి పార్టీ గెలుపుకు దోహదపడ్డారని అనుమానపడి, బదిలీవేటు వేసారని అందరూ అనుకుంటున్నారంటే అనుకోరా మరి! పైగా అప్రధాన శాఖలకు సమర్థులనూ, ప్రధానశాఖలకు అప్రసిద్ధులనూ బదిలీ చేయడమెందుకో! సజావుగా సాగేవాటిని కూడా అస్తవ్యస్థం చేయడం ఏమిటో?’’ అన్నాడు రాంబాబు.
‘‘చూడు బ్రదర్! బదిలీలనేవి ప్రభుత్వోద్యోగులకు మామూలే! ఐ.ఎ.ఎస్లు అయినా, ఐ.పి.ఎస్లు అయినా దానికి మినహాయింపులేం కాదు. పైగా ఒకరు ఒక శాఖను ఎక్కువకాలం అంటిపెట్టుకు ఉండడంవల్ల అక్కడ అవినీతి మేటవేసే ప్రమాదం ఉంది. సమర్థుడైనవాడు శాఖతో సంబంధం లేకుండా ఎక్కడైనా రాణిస్తాడు. అంతెందుకు? కె.వి. రమణ సమర్థునిగా పేరు తెచ్చుకోలేదా! ఆయనను వికలాంగుల సంక్షేమానికి వేయడంఆశ్చర్యంగానే వుంది’’ అన్నాడు ప్రసాదు.
‘‘అదేమన్నమాట! ఇప్పుడు నిజంగా వికలాంగులకు సంక్షేమం మరింతగా సమకూడుతుంది కదా! వ్యక్తి సమర్థతలు శాఖలను బట్టి ఉండవు. ఆయా శాఖలకు వారు పనిచేసే తీరులను బట్టి ఉంటాయి’’ అన్నాడు శంకరం.
‘‘కావచ్చు! కానీ అధికారులకూ కొన్నికొన్ని అంశాలపట్ల అభిరుచులూ, అభినివేశం ఉంటాయి. ఆయా అంశాలపట్ల క్షుణ్ణమైన అవగాహన, ప్రతిభగల వారిని తదనుగుణమైన స్థానాలలో ఉంచితే పరిపాలన మరింత సజావుగా సాగుతుంది కదా!’’ అన్నాడు రాంబాబు.
‘‘అక్కడే వుంది అసలు సంగతి! ఫలానా వాడికి ఫలానాది ఇష్టమూ, అందులో చక్కగా శ్రమించి, మంచి ఫలితాలు తేగలడు అంటే - అందువల్ల అతనేదో లాభపడిపోతాడనీ, ఏదో కీర్తి ప్రతిష్ఠలార్జించివేసి ఆశాఖమీద ఉన్న పట్టువల్ల, తమకు అందులో అనుకూలమైన వ్యవహారాలూ నెరపజాలడనే అభిప్రాయంతోనే, బహుశః ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తూంటుందేమో! కార్యాలయాల్లో కూడా చూస్తూఉంటాంగా. ఎవరు చేయదగిన పనిని వారు అవలీలగా చేసుకుపోవడం ‘బాస్’లకు నచ్చదు! అందుచేత తమకు నచ్చినవారికీ, భజనపరులకూ వారడిగిన సీట్ ఇచ్చి, నిజంగా సమర్థులకు ఎప్పటికప్పుడు క్షాళన చేయదగిన శాఖలను అంటగడుతూ, వారు కష్టపడి ఒకదారిలో పెట్టాక, ఇంక అది నల్లేరుమీద బండినడక అయ్యక, సమర్థులను అక్కడనుండి కదిపి, తమవారిని ఆ సీట్లలో నియమించి ప్రోత్సహించడం చూస్తూనే ఉన్నాం!’’ అన్నాడు ప్రసాదు.
‘‘పనిచేసే సంస్కృతి’’ క్రమంగా దెబ్బతింటుండడానికి ఇది కూడా ఒక కారణం అనిపిస్తోంది! అందరూ అన్ని పనులూ చేయాలి, చేయగలగాలి - అన్నది అనడానికి, వినడానికీ బానే వుంటుంది గానీ, ఎంతకాదన్నా కొందరు కొన్ని పనులే చేయగలరు! పని చేయడంలో - ఒక్కొక్క పనికీ ఒక్కొక్క ఒడుపూ, ఒక సొబగూ ఉంటాయి. శ్రద్ధతో, ఇష్టంతో పనిచేయడం వేరు. తన మీద రుద్దబడిందని బలవంతంగా చేయడం వేరు. విధిలేకో, కాదనలేకో తనకు అంతగా నచ్చని పనిని అంగీకరించి చేయబూనినా, అందులో మనసు లగ్నం కానప్పుడు, అదేదో మొక్కుబడిగానే సాగుతుంటుంది! ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పుడీ తరహా మరీ పెరిగిపోయింది. ‘్ఫలానా సీటు చూడడానికి ఫలానా కులం వాడే ఎందుకు ఉండాలి? ఫలానా మరో కులం వాడికి ఎందుకివ్వరు’ అంటూ అక్కడా - కులాల కుంపట్లు పెడుతూంటే పనులకు సెగతగిలి - ఆవిరైపోవడమో, మాడి పోవడమో జరుగుతున్న సందర్భాలున్నాయి’’ అన్నాడు రాంబాబు.
‘‘ కులవృత్తులు క్రమేపీ మంటగలిసి పోతున్నాయి. శ్రమ విభజనబట్టి ఒకప్పుడు సమాజం సవ్యంగా, ధర్మబద్దంగా ఉండింది ఎప్పుడైతే కొందరికి - తమ వృత్తులే తమకు ఆత్మన్యూనతకూ, కంటగింపుకు హేతవవుతూ వచ్చాయో, దానికి తగ్గట్లు కొన్ని వృత్తులు నిజానికి సమాజానికీ, మనుష్యులకు ఎంత ఆవశ్యకాలో అయినా, వాటిపట్ల ఒక వర్గం వారు ఉపేక్షనూ ప్రదర్శించడం వల్లనే అగ్రకులాహంకారాలవల్లనే పరిణామశీలమైన సమాజంలో అనేక మార్పులు వచ్చాయి! ఇవాళ బ్రాహ్మణుడు ఒకరు చెప్పుల దుకాణం పెట్టుకున్నా, ఆలయంలో అర్చకత్వం ఒక దళితుడు నిర్వహిస్తున్నా - అది పరిణామక్రమంలో ఏర్పడిన స్థితే! మార్పుకు అలవాటు పడలేక సమర్థతలు, అసమర్థతలు అనే మాటలెత్తుతున్నారనీ, నేడు ‘సర్వం జగన్నాధం’ అని గ్రహించకపోవడం పొరబాటనీ, బహుశా అవగాహన పరుచుకోవలసిందేనేమో!’’ అన్నాడు శంకరం.
‘‘ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి... అన్నట్లు... ‘‘పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్’’ అన్నది నిజం! అన్నాహజారేలు, రాందేవ్ బాబాలు ఎన్ని దీక్షలు పట్టినా, పతనమైపోతున్న సమాజ సముద్ధరణ కేవలం చిత్తశుద్ధి, నిజాయితీగల అధికారయంత్రాంగం విస్తరిస్తే కానీ సాధ్యం కాదు! అందుకు దోహదపడని రాజకీయం... ప్రజా సంక్షేమానికి గానీ, ధర్మబద్ధతకు గానీ కాపుకాయలేదు’’ అనిలేచాడు రాంబాబు
4 comments:
మీ బ్లాగు బేనర్ కింద ఉన్న మహాభారత సూక్తి "....పరమధర్మ పథములకెల్లన్" అని ముగియాలి.
...తా నొరులకవి చేయకునికి...."
అవును.ముందే గ్రహించానుగానీ ఇప్పటికి సవరించడమైంది.థాంక్యూ!
అవును.ముందే గ్రహించానుగానీ ఇప్పటికి సవరించడమైంది.థాంక్యూ!
Post a Comment