తొడిమెల్ల కృష్ణమూర్తి (టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి)గారి పది కథల సంపుటి ‘ఈగాలి నాది... ఈనేల నాది..’ మదనపల్లె మున్సిపాలిటీలో చిరుద్యోగిగా పనిచేసి, పదవీవిరమణ మూడేళ్ళ క్రితమే పొందిన కృష్ణమూర్తి మంచి కథకునిగా పేరు పొందారు. రెండువందల కథలు, పదినవలికలు, నాలుగు నవలలు రాసారు. ఆంధ్రభూమి వీక్లీలోనే వచ్చిన కొత్తబంగారు లోకం తెలుగు విశ్వవిద్యాలయంవారి అత్యున్నత సాహితీ పురస్కారం పొందింది. ఆకాశవాణి తిరుపతి, కడప కేంద్రాల నుండి కూడా ఆయన రచనలు ప్రసారం అయ్యాయి. తన సాహితీ యాత్రలో పలు పురస్కారాలు అందుకున్నారు.
కృష్ణమూర్తిగారి కథల్లోని విశేషం - తాను, తన అనుభవ పరిధి ప్రాంతాలలోని ఇతివృత్తాలనే ఎంచుకున్నా కేవలం మాండలికాన్ని మాత్రమే పట్టుకు వ్రేలాడుతూ అదేగొప్ప అనుకోలేదు. రచనలతో సంచలనాలు కాక జీవన వాస్తవాలను ప్రతిబింబించడం ఆయనరచనా స్వభావం.
భౌతికపరమైన సామర్థ్యాన్నిబట్టి కాక దృఢదీక్ష నుండి మాత్రమే అజేయమైన శక్తి లభిస్తుందంటారు గాంధీ. దానినే ఆత్మవిశ్వాసంగా సంభవించి నత్తగుల్లనే ఇన్స్ఫిరేషన్‌గా తనమీద దాడి చేయబోయిన వారి నుండి తననుతాను సంరక్షించుకున్న అనిత కథ ‘నత్తగుల్ల’. ఈనాటి అమ్మాయిలు అందునా కళాశాల విద్యార్థినులు ఆత్మవిశ్వాసం అలవరచుకోవాలని విశదీకరించే రచన ఇది. ‘ఎఱ్ఱని ఎఱుపు’ ఒక చిత్రమైన కథ. వృద్ధాప్యం అందునా పిల్లల పంచన వుండలేక ఉన్న పల్లెలోనే గడపడం వర్తమాన పరిస్థితుల్లో ఎంత గహనమో కలిసి చనిపోదామన్నా తుప్పుపట్టిన సరిగా పనిచేయని తుపాకీ ఒకరి ప్రాణాన్ని హరించి తనను జైలుపాలు చేస్తే ఆ వృద్ధుడి మానసిక స్థితి, అనంతర ఆలోచన ఏమిటో చెప్పిన కథ.
‘ఆనంద బాష్పం’ కథ సాహిత్య సంబంధిత అంశాలతో పఠనీయ గ్రంథాల విశే్లషణతో సాగడం ఒక కొత్తదనం. ఈ కథలో రాజారావు అన్నమాటలు కృష్ణమూర్తిగారి కథలకీ వర్తిస్తాయి. ‘మీకథలలో హృదయస్పర్శ, చదివించే గుణం ఉంటున్నాయి. అంటే.. మీరు మనుషుల్ని ప్రేమించడం, మనుషుల్ని గూర్చి ఆలోచించడం, ప్రపంచాన్ని పరిశీలించడం, పరిస్థితులకు స్పందించడంమీకుతెలియకుండానేఅలవరుచుకంటున్నారన్నమాట.’’
ఈకథలోనే రాజారావు పాత్ర ద్వారా చివరలో చెప్పిన విషయం రచయితలందరూ కూడా గమనించదగింది. ‘‘కొంతమంది రచయితలు తాము ఆలోచించే విధానమే సరయినదనీ, తాము నమ్మే విషయాలే సమాజాన్ని ఉద్ధరించగలవని భావిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే... తాము సృష్టించేదే అత్యుత్తమ సాహిత్యమనీ, తాము అక్షరీకరించే విధానమే అత్యున్నతమనీ భావిస్తుంటారు. వాదాలు, ఇజాలు అంటూ గిరిగీసుకుని కొన్ని పరిధులలో ఇమిడిపోతూండడం కూడా కద్దు. నీవలాంటి భ్రమలకూ, విశ్వాసాలకు లోను కాకుండా సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ, సమాజ అవసరాలను గమనిస్తూ సంఘహితం కోరి నీ రచనా వ్యాసంగాన్ని అద్భుత వాస్తవికతతో కొనసాగిస్తావని ఆశిస్తాను’’. సభ్య సమాజం నడుమ ఆటవిక వ్యవస్థ స్థిరపడుతున్న సామాజిక రుగ్మతలమీద చికిత్స కోసం ప్రేమ అనే గుణానే్న శస్త్ర చికిత్సకు ఆయుధంగా అందుకుని ఆర్.ఎస్. సుదర్శనం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటి పెద్ద ఫక్కీలో మనుషుల్ని సాహిత్యాన్ని గురించి ఆలోచించడం విశే్లషించడం నేర్చుకుని వైవిధ్యభరితమైన కథలు రాస్తున్న కృష్ణమూర్తిగారి సృజనాత్మకతకూ, సామాజిక బాధ్యతకూ ఈ కథలు నిదర్శనాలుగా ఉన్నాయి. రచయిత అభినందనీయులు.
(ఈ గాలి నాది... ఈ నేల నాది (కథల సంపుటి) రచన: టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి జయంతి పబ్లికేషన్స్, దిల్‌సుఖ్‌నగర్ హైదరాబాద్-60, వెల: రూ. 60/- )
0 comments:
Post a Comment