బాల్యానుభూతులు
‘‘బార్ బార్ ఆతీహై ముఝుకో
మధుర్ యాద్ బచ్‌పన్ తేరీ
గయాలేగయా తూ జీవన్‌కే
సబ్‌సే బడీ ఖుష్ మేరీ’’
-అని సుభద్రా కుమారీ చౌహాన్ బాల్యం గురించి రాసిన కవిత బాల్యంలో చదువుకున్నది ఇప్పటికీ హృదయంగమమై అనుభూతి తరంగితమవుతూనే ఉంటుంది. వృద్ధాప్యదశకి వచ్చేసరికి బాల్యం గురించి తలచుకోవడం ఎంతో ఇష్టమైన అంశంగా మారిపోతుంది. ‘నా చిన్నప్పుడు...’ అని పెద్దల నుండి వాక్యం మొదలవగానే ఒక చరిత్ర విచ్చుకుంటుందని యువకులకు పెద్దలు చెప్పే విషయాలకు చెవి ఒగ్గి తీరాలన్న భీతి పొటమరిస్తున్నా నిజానికి గతం తవ్వుకోవడంలో ఒక నిధిని ప్రోగుచేసుకోవడంగా జ్ఞాపకాల నిక్షేపంగా పెద్దలు ఆనందకందళితులవుతుంటారు. అందుకే ఎవరు విన్నా, వినకున్నా తమను తామే శ్రోతగా చేసుకుని పైకి మాట్లాడేసుకునే పెద్దలనూ చూస్తుంటాం.
జీవితం సంక్లిష్టమూ, సమస్యాయుతమూ అవుతున్న కొలదీ ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అనే భావన కలుగుతుండడం నైజమే ‘మంచిగతమున కొంచెమేనోయ్’ అన్నది కటిక వాస్తవమయినా ఆ కొద్ది మంచినే విస్తరించుకుని, ద్విగుణీకృతం చేసుకుని సాంత్వనం పొందుతూండడం కద్దు. ‘పుస్తకంలో నెమలీక’ అనేది బాల్యంలోని ఓ మధుర స్మృతి. పుస్తకాల నడుమ ఒక నెమలి ఈక పెడితే కొన్నాళ్లకు అది నెమలికన్ను అవుతుందని బాల్య విశ్వాసం. భద్రపరుచుకున్నది ఏదయినా భవిష్యత్తులో విశాల ప్రయోజకమవుతుందన్న దృష్టికి అది సంకేతం కావచ్చునేమో కూడా!
పనికిరానిది పనె్నండేళ్ళు దాచమని కూడా ఒక సామెత వుంది. నిజానికి మనస్సనే పుస్తకంలో పసితనాన్ని నెమలీకలా భద్రపరచుకున్నప్పుడే కాలావధులుకు నిలిచే అక్షరంలో దృష్టి విస్తారమవుతుందేమో! పసితనాన్ని పారేసుకోకుండా ఎదలో భద్రపరుచుకు నిలుపుకోగలవాడు స్వచ్ఛతను, నైర్మల్యాన్నీ, జీవనానంద ప్రదమైన ఆశనూ ఆసాంతం నిలుపుకోగలుగుతాడు.
ఓరుగంటి పురుషోత్తం ‘పుస్తకంలో నెమలీక’ బాల్యానుభూతులకు అందమైన కవిత్వీకరణం. అందుకే ఎర్రగులాబీలో ఇప్పటికీ ఏ విప్లవ స్పృహనో, ప్రాంతీయ అస్తిత్వాన్నో కాకుండా బాలలచాచానే భావించ గలుగుతున్నాడు కవి. బాల్యంలోని ఆటపాటలు, అనుభూతులు, ప్రదేశాలు, ప్రకృతి, జ్ఞాపకాలు, ఆలోచనలు ఈ సంపుటిలోని యాభై ఆరు కవితల్లో తొణికిసలాడుతూ ‘ఇక జీవితాన్ని బాల్యచేద్దాం’ అనిపింపచేస్తాయి.
బాల్యంలోకి మొత్తం పుస్తకం ఆప్యాయంగా, కవితాత్మకంగా తీసుకుపోతుంది. అప్పటి ఊహల పల్లకిలో మరోమారు ఊరేగిస్తుంది. పసితనాల జాడను చెరగిపోని ముద్రలతో గురు‘జాడ’గా అవ్యక్త సందేశాన్ని సంకలిస్తుంది. 1952లో పుట్టినకవి రచయితగా ఎదిగింది. 1982 నుంచే అయినా తొలి కవితా సంపుటి ఈ గ్రంథమే.
తేనీగ, పిట్టగూడు, సిన్మాబండి, నుమాయిష్, సర్కస్, రేడియోలో బాలానందం, పూలబుట్ట, ముల్లుగర్ర, ఉట్లపండగ, పీర్ల పండగ, బతకమ్మ, దసరా, దీపావళి, అమ్మ, నాయిన, దద్దాయి, చిన్నన్న, చిట్టితమ్ముడు ఇలా తలబోసుకున్న ప్రతిదీ బాల్య సంబంధియే. అంతా కవిత్వమేనా అంటే బాల్యంలోని ఏది ముట్టినా నేడు అనుభూతి రసపారమ్యతలో అంతా కవిత్వమేననిపిస్తుంది. దేవరకొండ, మిర్యాలగూడెం, సూర్యాపేట, సాగర్, రామన్నపేట ఊర్లు అప్పటికీ ఇప్పటికీ ఎంత కాలానుగుణ పరిణామశీలతకు లోనయినా ఆ ప్రదేశాలపట్ల బాల్య జ్ఞాపకమే ఇప్పటికీ ఆర్ద్రతను అనుభవిస్తూంటుంది.
కాలం పరీక్ష నాలికతో పసితనం మసలుతోంది ఇవాళ. సూర్యుడిలా సాగుతున్న జీవితం పడమరకు వాలుతుంది. వర్తమాన యాంత్రిక పరిస్థితుల కాంటామల్లు చేతినిండా గుచ్చుకుని మకరందం సగానికి సగం మాయమైపోతుంది. అయినా రేపటి తలుపులు తెరుచుకునే వుంటాయి. కృషినే విజయంగా భావించేవాడు ముమ్మాటికీ తేనీగే. పుస్తకంలో నెమలీకను దాచి, స్వచ్ఛతకు, అమాయకతకు, ఆశకు రేపటి పరిపూర్ణ జీవనశ్వాసకు, బతుకు పుస్తకం తీరుగంటి ననిపింపచేసిన ఓరుగంటి పురుషోత్తం అభినందనీయుడు. కుహనా సాహిత్య విలువలు నమిలేయక ఈ స్వచ్ఛ సాహిత్య భావుక నెమలీకను ఇలానే కవి భద్రపరుచుకుంటాడని ఆకాంక్ష.
(పుస్తకంలో నెమలీక (కవితా సంపుటి).రచన: ఓరుగంటి పురుషోత్తంవెల: రూ. 50/-
ప్రతులకు: యువరచయితుల సమితి,6-3-180/ఎ, కనకదుర్గ గుడివీధి,రామగిరి, నల్లగొండ - 508 001)
0 comments:
Post a Comment