ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, August 30, 2011

'నెలనెలావెన్నెల'



శ్రీ.సి.వి.కృష్ణారావ్ గారి
సాహిత్య నేతృత్వంలో
ప్రచురితమైన

'నెలనెలావెన్నెల'
కవితా సంకలనంపై
నా సమీక్ష






(ఇమేజ్ పై డబుల్ క్లిక్ చేసి పెద్దసైజులో చదవవచ్చు)

Sunday, August 28, 2011

సరదాల సం(ద)డే గా....





అమ్మకం


ఓ ఇంగ్లీష్‌వాడు, స్కాటిష్‌వాడు, ఐరిష్‌వాడు ఓరోజు ఇంటింటికీ తిరిగి బైబిల్స్ అమ్మాలనీ ఎవరు ఎక్కువ అమ్ముతారో చూద్దామనీ పందెం వేసుకున్నారు. సాయంత్రం కలుసుకున్నప్పుడు
"నేను రెండు అమ్మాను" అన్నాడు ఇంగ్లీష్‌వాడు
"నేను అయిదు అమ్మాను" అన్నాడు స్కాటిష్‌వాడు
‘‘నే..నే..నే..ను అ..అ..ఆ.. అరవై.. అ..అ.. అమ్మాను’’ అన్నాడు ఐరిష్‌వాడు.
‘‘ఎలా అమ్మావ్’’ అడిగారు మిగతా ఇద్దరూ.
‘‘నే..నే..ను ప్ర..ప్ర..ప్రప్రతి వా..వా..వాళ్ల.. ఇం..ఇం..ఇం.టి... త...త...త... తలుపూ కొ..కొ...కొ...కొట్టి బై.. బై...బై.. బైబిల్ ఒ...ఒ...ఒ... ఒకటి కొ...కొ...కొ... కొంటారా... లే.. లే... లే... లేక న...న..న... నన్ను... చ... చ... చ... చదివి. వి.. వి.. వి...వినిపించ మం... మం... మంటారా... అ... అ... అ... అని... అ... అ... అ... అడిగాను’’ అన్నాడతను.


**
మరణం


వెంగళప్పా, వెర్రిపప్పా టీ త్రాగుతూండగా ఫోన్ మ్రోగింది. వెర్రిపప్ప ఫోన్ విని బేర్‌మని ఏడవసాగాడు.
‘ఏమయింది’ అని అడిగాడు వెంగళప్ప. ‘‘మా అమ్మ ఇప్పుడే ఫోన్‌చేసి మా నాన్నగారు చనిపోయారు అని చెప్పింది’’ అన్నాడు వెర్రిపప్ప.
‘‘అయాం సోసారీ’’ అంటూ వెర్రిపప్పను ఊరడించాడు వెంగళప్ప.
అతను ఏడుపు ఆపుకునే టైంకి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తి వెర్రిపప్ప మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు.
‘‘ఏమయింది’’ అడిగాడు వెంగళప్ప.
‘‘మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. ఆవిడ మామగారు కూడా చనిపోయారట’’ అంటూ బావురుమన్నాడు వెర్రిపప్ప.

**

హింస


గృహహింసకు పాల్పడ్డాడని బాబూరావ్‌ని పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు.
‘‘మీ ఆవిడను అంతలా ఎలా కొట్టావ్’’ అడిగాడు జడ్జి.
‘‘వ్యాయామం చేసిన నా శరీర బలమే దోహదపడిందనుకుంటున్న
నా పొడుగాటి బలిష్ఠమైన చేతులు, పిక్కబలంగల నా కాళ్లు బాగా
ఉపయోగించగలిగాను’’ అన్నాడు బాబూరావు.


**
కాల్పనికం


పూర్ణచంద్ర పుస్తకాల షాపుకు వెళ్లి ‘‘భార్యను లొంగదీసుకోవడం సులభమే అనే పుస్తకం వుందా’’అని అడిగాడు.
అక్కడున్న సేల్స్‌గర్ల్ ‘‘సారీ అండీ! కాల్పనిక సాహిత్యం దొరికేది ఇక్కడ కాదు. వేరేచోట’’ అంది కూల్‌గా.

**
తేడా


‘‘గర్ల్‌ఫ్రెండ్‌కీ సెల్‌ఫోన్‌కీ గల తేడా ఏమిటి?’’ అడిగాడు రమణ చలపతిరావుని.
‘‘సెల్‌ఫోన్‌ని సైలెంట్‌మోడ్‌లో పెట్టగలం’’ అన్నాడు చలపతిరావు.
**

త్రాగినందుకే


ఓ చలికాలం రాత్రి బార్లో బాగా మందుకొట్టేసిన సూర్యం వెయిటర్‌తో బయట కార్లోనే తన భార్యని వదిలి వచ్చానని చెప్పాడు.
వెయిటర్ పాపం ఆవిడెలా వుందో అని కారుదాకా వెళ్లి చూస్తే కారు వెనుక సీట్లో ఆమె ఎవడితోనూ కౌగిలిలో కనబడింది.
వెయిటర్ వచ్చి సూర్యంతో ‘‘ఓసారి మీ ఆవిడను చూసిరండి’’ అన్నాడు. సూర్యం వెళ్లి, నవ్వుకుంటూ మళ్లీ లోపలికొచ్చాడు.
‘‘ఏంటలా నవ్వుకుంటున్నారు’’ అడిగాడు వెయిటర్
‘‘వాడెవడో తెగ తాగేసి వాడిని నేనే అనుకుంటున్నాడు’’ అన్నాడు సూర్యం.
**
ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న:ఆ జంతువు నడవలేదు, మాట్లాడలేదు, వినలేదు. అది బొమ్మకాదు. అదేమిటో చెప్పుచూద్దాం.
జవాబు: తెల్లకాగితం మీద రాసిన ‘జంతువు’అనే పదం.

**
ప్రశ్న: ఒక నిముషం యొక్క విలువ ఎప్పుడు బాగా తెలుస్తుంది.
జవాబు: టాయ్‌లెట్‌లో ఎవరో వుండి మనం బయటవున్నప్పుడు
.
**
ప్రశ్న: ఆఫ్రికాలో పుట్టిన పసిపాప దంతాలు ఏ రంగులో వుంటాయి
జవాబు: పుట్టిన ఏ పసిపాపకూ దంతాలు వుండవు

**
ప్రశ్న: సూరీడు ఉదయమే కానీ ,రాత్రి బయట ఎందుకు కనబడడు
జవాబు: వాళ్ళమ్మ వెళ్లనీయదు కనుక


**
ప్రశ్న: నీళ్లల్లో ఎక్కువసేపు ఉండలేని చేప ఏది
జవాబు: చచ్చిన చేప

**

Friday, August 26, 2011

రింగ రింగా రమణీయం










'రికార్డ్ బ్రేక్-' అన్నాడు వస్తూనే సన్యాసి.


‘‘ఎవరు? ఎక్కడ? ఇంగ్లాండ్‌తో క్రికెట్‌లో మనవాళ్లు పరాజయం పాలయ్యారు కదా’’ అన్నాడు శంకరం.


‘‘రికార్డ్ బ్రేక్ అంటే క్రీడారంగం తప్ప మరేమీ లేదా ఏమిటీ? స్వాతంత్య్రానంతరం అవినీతిపై ఇంతలా ధ్వజం ఎత్తి,‘రెండో స్వాతంత్య్రపు పోరాటం’ అన్నంత స్ఫూర్తి తెచ్చినఅన్నా హజారే కూడా ‘రికార్డ్ బ్రేక్’ చేసినట్లే కదా!’’ అన్నాడు రాంబాబు.


‘‘రాష్ట్రంలో జగన్-అవినీతిలో కూడా ‘రికార్డ్ బ్రేక్’చేసినట్లే అంటున్నారు కదా’’ అన్నాడు ప్రసాద్.

‘‘ఎహే! ఎప్పుడూ ఆ క్రీడలూ, రాజకీయాలు అనే రొడ్డకొట్టుడేనా? విశ్వవిద్యాలయాల్లో-తక్కువ కాలంలో ఎక్కువ డాక్టరేట్లు పంచిపెట్టి,కుప్పం యూనివర్సిటీ రికార్డు బ్రేక్ చేసిందని మీకు తెలీదా! అంతకన్నా విశేషం-మూడేళ్ల పదవీ కాలం ముగించుకున్న అక్కడి వి.సి గారికి ఘనసన్మానం చేసి, హిజ్రాలతో రికార్డింగ్ డ్యాన్స్‌చేయించిన ఘనత, ఆ విశ్వవిద్యాలయానికే దక్కింది’’ అన్నాడు సన్యాసి.


‘‘ఏమిటేమిటి? యూనివర్సిటీ సభలో రికార్డింగ్ డ్యాన్సా? మతుండే మాటాడుతున్నావా’’ అన్నాడు శంకరం.


‘‘మతి ఉండడం కాదు. మతిపోయేలాంటి చర్యే! అత్యున్నత విద్యావిలువలు పాటించవలసిన.., అందునా సంస్కృతికీ, సాహిత్యానికీ అద్దంపట్టి, ద్రవిడ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే-కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంత అనాగరికమా?’’ అన్నాడు ప్రసాదు.

‘‘బావుందయ్యా! హిజ్రాలు నృత్యం చేస్తే తప్పేమిటి? అదీ సంస్కృతే కదా! అనే సమర్ధనీయులూ ఉండచ్చు. ‘రింగ రింగా రింగ రింగా’ అంటూ సినిమా పాటకు హిజ్రాలు మాత్రమే కాదు, వారికి తోడుగా పదవీ విరమణ చేస్తున్న వైస్ ఛాన్సలర్ కూడా ‘రమణీయంగా’ నృత్యం చేయడం విశేషం! వైస్ ఛాన్సలర్‌గారు ‘వయసు’-‘ఛాన్స్’ - అన్నట్లుగా రోడ్డెక్కి నృత్యం చేయడం, సభావేదికపై అర్ధనగ్న ప్రదర్శనల నృత్యంతో తన సన్మాన సభను రక్తికట్టించుకోవడం -చూస్తుంటే, అసలు విద్యా ప్రమాణాలు, విలువలు గురించి మాత్రమే కాదు, హుందాగా, మార్గదర్శకంగా ఉండవలసిన ఉన్నత హోదా వ్యక్తి-ఇలా విలువల పతన ప్రతీక కావడం విషాదం కాక మరేమిటి’’ అన్నాడు సన్యాసి.

‘‘అన్నీ అంత సీరియస్‌గా తీసుకోవడం ఎందుకు చెప్పండి? ఇవాల్టి కుర్రాళ్ల ఫిలాసఫీయే ‘‘లైట్ తీసుకో!’’ అని. ఏదో సరదాగా ఆడిపాడి-వైస్ ఛాన్సలర్‌గారు ‘యువజన మమేకం’ అయితే- అంత గొప్ప వ్యక్తి-ఎంత సాదాసీదాగా, నిరాడంబరంగా ఉన్నాడో చూడండి! పదవీకాలం ముగిసిందన్న చింత లేకుండా, ఎంత ఆనందంగా చిందులు వేసాడోచూడండి!. ‘లైఫ్‌ను అలా లైట్ తీసుకోవాలి’ అనడానికి ఆదర్శ ప్రాయంగా రికార్డు బ్రేక్ చేసాడనుకోవచ్చు కదా!’’ అన్నాడు సుందరయ్య గుంభనంగా నవ్వుతూ.

‘‘లైట్ తీసుకో, లైట్ తీసుకో అని ‘లైట్’ తీసేస్తే-మిగిలేది చీకటే! డబ్బు, అధికారం చీకట్లోకి నెడుతూండడం వల్లనే-ఇవాళ సమాజం ఇంత ‘అవినీతిమయం’ అయిపోయింది! హింసా,నేరాల ‘మరణ’ మృదంగాలు మోగుతున్నాయి. మీకో సంగతి తెలుసా! ఆయన వి.సిగా వెళ్లకముందే-అసలు ఆయన డాక్టరేట్ ఓ ఫార్స్ అనీ, ఆయన సిద్ధాంత గ్రంథం ఒట్టి ‘ఎత్తిపోతల’ పథకం తప్ప మరేమీ కాదనీ, కాపీకొట్టి ‘స్వయం ఉపజ్ఞ‘ లేకుండా సాధించిందనీ, విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఏం లాభం? రాజకీయపు అండదండలు-తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేయగలవు కనుకనే, అలాంటి మహనీయునికే-‘మనీ’ హయం పరుగుల పుణ్యమా అని-ఒక విశ్వవిద్యాలయ ‘ఉపకులపతి’త్వం వచ్చింది. ‘ఉలకు పలకు’ లేకుండా-ఉతికి ఆరేసుకున్నాడు హోదాని! ‘డాక్టరేట్’ పట్టాల ‘పంపిణీ’ పందేరం సాగిందట! ఇంత రొఖ్ఖానికి ఎంఫిల్, ఇంత సొమ్ముకు పిహెచ్‌డి అని రేట్లుకట్టి-వ్యాపారం చేసి, కుప్పంలో ‘కుప్ప‘పోసి, టోకున విద్యావ్యాపారం చిల్లర మనుషులతో ‘ఎల్లర మనముల రంజకం’గా సాగిందట.గవర్నర్‌గారే విషయాలు తెలిసి విస్తుపోయారట. అలాంటి వి.సి పదవీ కాలం ముగిసినందుకు నిజంగా సంబరాలు చేసుకోవాలేమో తెలీదుగానీ, ఆయన సన్మానం పేరిట జరిగిన హడావుడి మాత్రం సభ్య సమాజానికి మింగుడుపడేదిగా లేదు. హిజ్రాలతో వి.సి ఆడిపాడి ఆనందించడం ఎంత సరిపెట్టుకుందామన్నా, ఎందుకో ‘లైట్ తీసుకో’లేకపోతున్నాను’’ అన్నాడు సన్యాసి.



‘‘ఒకప్పుడు ‘రికార్డింగ్ డ్యాన్స్’లపై బ్యాన్ ఉండేది! పాపం పొట్టకూటి కోసం ఏ చవితి పందిళ్లలోనో ఇలాంటి డాన్స్‌లు పల్లెల్లో జరిగితే, పోలీసులు పట్టుకు జుల్మానాలు వేసేవారు. ఇప్పుడు టీవీ ఛానల్స్‌లో ‘గేమ్‌షో‘లలో-ఇంటి ఇల్లాళ్ల చేత కూడా, పచ్చిపాటలకు కూడా స్టెప్పులేయించి, వినోదం పేర బహుమతుల ఎరతో, విజృంభింపచేస్తున్నారు! విశ్వవిద్యాలయం స్థాయిలోనూ జరిగిన సభలో-అదే కల్చర్, బ్రేక్ డాన్స్‌ల కన్నా ఎక్కువగా జరగడం, హిజ్రాలకు పెద్దపీట వేయడం చూస్తుంటే-నిజంగానే ఈ జాతి ‘అనర్ధం’వైపు నెట్టబడుతోందని ఋజువుతోంది! నిన్నా, మొన్నల విలువలు పోయి, ‘రేప్’ల విలువలే పెరుగుతున్నప్పడు, అన్నా హజారేలు ఎన్ని రంగాలలో ఎందరు దీక్షాదక్షులు కావాలో, భవిష్యత్ ఏమైపోతుందో వీక్షించాల్సిందే’’ అన్నాడు సుందరయ్య లేస్తూ.


Monday, August 22, 2011

మర పురానీ మనీ హయులు.



సృజనప్రియ (మాస పత్రిక)

ఆగస్ట్'2011 సంచికలో

నా వ్యంగరచన ఇది.





Sunday, August 21, 2011

ఆదివారం సరదాగా కాసేపు....

పేరు

చైనాలో పాఠశాలలో ఓ పిల్లాడు ఏదో నములుతూంటే అంతకుముందే మరొకరి దగ్గర గమనించిన
టీచర్: నువ్వూ చూయింగ్ గమ్ యేనా? అని అడిగింది.
పిల్లాడు: కాదండీ! నా పేరు జాన్‌స్మిత్.


ఫలితాలు

తండ్రి: ఏమిట్రా ఈ రిజల్ట్స్? ఎప్పుడూ ఇలా తక్కువ మార్కులేనా?
కొడుకు: కాదు నాన్నగారూ! పరీక్షలు రాసినప్పుడే.


పేరు మారు


రామం: జీవితంలో పందెం ఎప్పుడూ వేయకూడదు
సోమం: ఎందుకు
రామం: అందువల్ల పేరు మారిపోయే ప్రమాదం వుంది
సోమం: అదెలా?
రామం: జోజీతా వొహీ ‘సికిందర్’ అన్నారుగా!


అతడు

ప్రీతమ్: ‘దిల్’లో వున్నాడు, ‘మన్’లో వున్నాడు. కానీ ‘ధడ్‌కన్’లో లేడు ఎవరో చెప్పుకో!
ప్రియాంక: తెలీదు ఎవరు ?
ప్రీతమ్: ఇంకెవరు? అమీర్‌ఖాన్!


పుకారు

‘‘అందంగా, తెలివిగా, సున్నితంగా వుండే మగవాడు ఆఫీసులో వున్నాడంటే ఏమనుకోవాలి’’ అడిగింది శైలజ పరిమళను.
‘‘పుకారు’’ అంది పరిమళ.


డ్రైవింగ్

‘‘ఆడవాళ్లు ఎందుకు ఎక్కువ డ్రైవ్ చేయలేరంటావ్’’ అడిగింది శకుంతల శైలజని.
‘‘బెడ్‌రూమ్‌కి కిచెన్‌కు మధ్య రోడ్డు అంటూ వుండదుగా! అందుకే అయ్యుంటుంది’’ అంది శైలజ.


ఎలా


‘‘ఓ చిన్న లారీలో నాలుగు ఏనుగులను ఎక్కించడం ఎలా?’’
‘‘రెండు ముందు, రెండు వెనకాల...’’
‘‘నాలుగు జిరాఫీలను ఎక్కించడం ఎలా?’’
‘‘కుదరదు’’
‘‘ఏం’’
‘‘అప్పటికే నాలుగు ఏనుగులున్నాయికదా!’’


కారణం

‘‘ఆడవాళ్లు మేకప్ వేసుకుని, సెంట్ పూసుకుంటూ వుంటారు ఎక్కువగా ఎందుకంటావ్’’ అడిగాడు విజయ్‌కుమార్ బుచ్చిరాజుని.
‘‘వికారంగా కంపుకొట్టేది వాళ్లేకనుక’’ అన్నాడు బుచ్చిరాజు కూల్‌గా.







చిలిపి ఊహలు



* కుక్కలు రోజంతా ఖాళీగా కూర్చుంటూంటాయికదా మరి ‘వాడు కుక్కలా పనిచేస్తాడు’ అని ఎందుకంటూంటారు?


* అన్ని దేశాలూ అప్పుల్లో తామున్నామంటూంటే అసలు డబ్బంతా ఎక్కడికి పోయినట్లు?

* కాపీరైట్ చిహ్నాన్ని కాపీరైట్ చేసిందెవరు?

నడక

‘‘నిన్ను వారంరోజుల్లో చకచకా నడిచేలా చేస్తానని మీ డాక్టర్ అన్నాడన్నావ్. ఏమయింది?’’ అడిగాడు చంద్ర కృష్ణమోహన్‌ని.
‘‘డాక్టర్ బిల్లు చెల్లించడానికి కారు అమ్మేసానుగా! ఆ పనే జరుగుతోంది’’అన్నాడు కృష్ణమోహన్.


ప్రశ్నలు- జవాబులు


ప్రశ్న: ప్రపంచంలో అతి బద్ధకం మనిషి ఎవరు
జవాబు: అలారంలో ‘స్నూజ్’ఆప్షన్ కనిపెట్టినవాడు

**

ప్రశ్న: అతనేమిటి రోజూ పొద్దున్నే చెట్టుకొమ్మ ఎక్కి కూర్చుంటాడు
జవాబు: అదా! ఎం.బి.ఎ. చేసిన అతనికి మతి తప్పింది. తాను ‘బ్రాంచ్ మేనేజర్’ననుకుంటూంటాడు.

**
ప్రశ్న: చిల్లర లేదనేమాట సాధారణంగా ఎక్కడ ఎక్కువ వినిపిస్తూంటుంది
జవాబు: ముష్టివాడి దగ్గర

**
ప్రశ్న: ఆడవాళ్లు తమ బుద్ధికన్నా చూడడానికి అందంగా వుండటం మీదా ఎక్కువ దృష్టిపెడతారెందుకు
జవాబు: మగవాళ్లు బుద్ధిహీనులే కానీ అంధులు కారని తెలుసుకనుక

**

ప్రశ్న: పెళ్లాడకుండా ఉండటంవల్ల ప్రయోజనం ఏమిటి
జవాబు: మంచం ఎటు ప్రక్కనుంచయినా దిగవచ్చు.


సముద్రమంత గాయం (పరిచయం)




విషాద బీభత్సాలే వస్తువుగా ద్యోతకమయ్యే యాభై ఒక్క కవితల సంపుటి
కెరె జగదీష్ - ‘సముద్రమంత గాయం’.

రాయలసీమ జీవనం నేపథ్యంగా గల జగదీష్ కవిత్వంలో
బాంబులుకాక భావాల విస్ఫోటనం కానవస్తుంది.






"‘మరణంలో రణం అంతర్ముఖమైనప్పుడు

నీ మరణం

రణరంగానికి బీజం కావాలి’"


అని పేర్కొంటూనే- శాంతినారాయణ మిత్రుడు కనుక ,శాంతి గురించి నారాయణ మంత్రంలా, పలు కవితల్లో పదే పదే జపిస్తాడు కూడా.

"నా ప్రతి శ్వాసా కవిత్వమై

జీవితమంతా కవిత్వంలో జీవిస్తాను

అగాధ లోయల్లోకి జారినా

వెంటపడిన కవితా స్పర్శ

ఊయల లూగిస్తుంది

నా మస్తిష్కంతో కవితాక్షరాలు

కనుమరుగయితే

జీవన శ్వాస ఆగి మరణిస్తాను."


-అంటూ కవిత్వమే బ్రతుకుగా సంభావిస్తాడు.

తన మాతృభాష తెలుగుకాక కన్నడమే అయినా జర్నలిజం వృత్తిగా, కవిత్వమే ప్రవృత్తిగా చేసుకుని తెలుగు కన్నడాల సంస్కృతీ సమ్మేళనంతో కూడిన అంతరంగంనుండి అభివ్యక్తమయిన ఈ భావాలు తొలి సంపుటే అయినా మరీ తొలకరిగా లేవు.

కాలం కఠోర పరీక్షలకు గాయపడుతున్న ప్రతి సందర్భాన్నీ, మనిషినీ ,తన కవిత్వలేపనంతో సేదతీరుస్తున్న కవి.


(ప్రతులకు: కెర్ అండ్ కెర్ కంప్యూటర్స్, 10-2-219 (21) చర్చిరోడ్, రాయదుర్గం (పోస్టు), అనంతపురం, 515865, వెల: రూ.100/-)

యోగి ఆత్మకథ!





టిబెట్‌వారు అపర బుద్ధునిగా భావించే ధర్మ భిక్షువు ‘మిలారేపా’.



12వ శతాబ్దానికి చెందిన ఈ యోగి కథను శ్రీ శార్వరీ మంచి ఆధ్యాత్మికానుభూతినివ్వగల గ్రంథంగా మలిచారు.


ఉద్రేకం ఉరకలువేసే యవ్వనంలో తన మంత్రశక్తితో వడగళ్లవాన కురిపించి, చేలను నాశనం చేసి, గ్రామస్థుల్ని భయభ్రాంతులను చేసిన వ్యక్తే. 83 ఏళ్ల వయసులో - ఆ గ్రామస్తులకే ‘ఆరాధ్య దైవ’మన్నంతగా మారిన సద్గురువు - ‘మిలారేపా’.


సాధకులకు ఈ యోగి ఆత్మకథ ఆవశ్య పఠనీయం! బుద్దుని బోధనలు, ధ్యాన సూత్రాలు ‘మహాముద్ర’గా టిబెట్‌లో అందిపుచ్చుకున్న వారిలో ‘మార్వా’ ఈ ‘మిలారేపా’కు గురువు.


దక్షిణ టిబెట్‌లో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ‘మిలారేపా’ తండ్రి మరణంతో, సాటి బంధువుల ఈసడింపులకు గురియై, తల్లి మాట మీద, ప్రతీకారం తీర్చుకోవడానికై క్షుద్ర విద్యలు అభ్యసిస్తాడు. అయితే తదనంతరం, తన దృష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూసి, ఆత్మ విచారణ చేసి, చైతన్యంపొంది, సన్మార్గంలోకి వస్తాడు.


భౌతిక దశలో గురువు సహాయ సహకారాలు అవసరంగానీ, సాధన తీవ)తరమై, అంతర్ చైతన్యం ఆవిష్కృతమైన దశలో, గురు చైతన్యంలో తన చైతన్యం కలిసిపోయి, ఒక మహా చైతన్యంగా పరిణమిస్తుందని ‘మిలారేపా’ కథ మనకు చెబుతుంది.


ఒకసత్యాన్వేషి సాధనాక్రమాన్నిమనకళ్లముందుంచుతుంది. శిష్యుల మానసిక స్థితిగతులను బట్టిసద్గురువు నిర్దేశించే పద్ధతులుంటాయనికూడా ఈ రచన చెబుతుంది.


ఆత్మజ్ఞానం ఎవరికివారు పొందవలసిందే. ఈ ఒక్క మానవ జన్మలోనే జన్మ జన్మల కర్మశేషాలు విదుల్చుకుని జన్మరహితులo కావచ్చని మిలారేపా కథ ప్రబోధిస్తుంది.


మిలారేపా కథ, రచన: శ్రీ శార్వరి
వెల. రూ.100/-
ప్రతులకు: మాస్టర్ యోగాశ్రమం
89, కృష్ణా ఎన్‌క్లేవ్, మిలటరీ డైరీ ఫారం రోడ్
తిరుమలగిరి, సికిందరాబాద్ - 15

Saturday, August 20, 2011

పదాల పదనిసలు











బస్సులోనో, రైల్లోనో ప్రయాణం చేస్తుంటారు. చదివే అలవాటున్న వాళ్లు ఏ దినపత్రికో, వార పత్రికో చదువుతుంటారు. చదవడం కంటే కాలక్షేపానికీ, సరదాకీ, కాస్త మెదడు ఆలోచనకీ పనికొచ్చేదేమైనా వుందేమో అని ఆ పత్రికలోకి తొంగిచూస్తే సాధారణంగా చప్పున కనిపించేది మాటలకోట లాంటి గళ్ల నుడికట్టే. లేదా ఇప్పుడిప్పుడు కొంతకాలంగా చోటుచేసుకుంటున్న అంకెల క్రీడ సుడోకు. గళ్ల నుడికట్టు వైపు ఎక్కువమంది పాఠకులు ఆకర్షితులు కావడానికి కారణం! ఇచ్చిన ఆధారాలతో ఆ పదాలను కనుక్కుంటూ అడ్డగళ్లు, నిలువు గళ్లూ అక్షరాలతో నింపుతూ తద్వారా తన భాషా పరిజ్ఞానాన్ని, పద సంపదనూ, ఒక పదానికి అది కనుక్కునేందుకు పజిల్‌ నిర్మాత రకరకాలుగా ఇచ్చే ఆధారాల నుండి ఒక ఆలోచననూ, ఆనందాన్ని పొందడానికి దోహదపడడమే.

శ్రీశ్రీ ప్రస్థాన త్రయం ఆవిష్కరణ సభ జూబ్లీ హాల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సభా ప్రారంభానికి ఇంకా సమయముంది. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారిని పలకరించితే ''సుధామ.. మీరు నాకు బాగా గుర్తే! మీ పజిల్స్‌ నింపుతుంటాను. ఈ ముదిమి వయసులో మెదడును చురుగ్గా ఉంచడానికి అవెంతో పనికొస్తాయి'' అన్నారు.

అలాగే ఓ సభలో కొన్నాళ్ల క్రితం చేకూరి రామారావుగారు ప్రముఖ సాహిత్య విమర్శకులు పలకరిస్తూ ''గళ్లు ఇచ్చేటప్పుడు నిలువు గళ్లలో పదాలు నింపేందుకు విధిగా ఒక అడ్డం గడిలో అక్షరం కూడా ఉండేలా నిర్మాణంచేస్తూ ఆధారాలు ఇవ్వండి. కేవలం అడ్డానికో, నిలువుకో మాత్రమే వుండేవి సరికాదేమో!'' అని సూచించారు. ఇలా గళ్ల నుడికట్టులు నింపేవారిలో ఆసక్తి, శ్రద్ధ కనబరిచే సాహితీ దిగ్దంతుల నుండి సామాన్య పాఠకుల వరకు ఉండడమే ఈపజిల్స్‌ ప్రాచుర్యానికి నిదర్శనం.

పదవినోదం, పదరంగం, పదచదరంగం, పదరసం, పదశోధన, పదబంధం, పదనిసలు, సండే పజిల్‌, మాటలకొలువు, పద్మవ్యూహం, పజిలింగ్‌ పజిల్‌, పదక్రీడ, పదవిన్యాసం, పదప్రజ్ఞ, పదగారడి, పదకేళి ఇలా పేరు ఏదయితేనేం వివిధ దిన, వార, మాస పత్రికల్లో ఇంగ్లీషులో క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ అని పిలుచుకునే ఈ గళ్లనుడికట్టులు నేటికీ దర్శనమిస్తున్నాయి.

సరదాగా నింపి సమాధానాలు సరి చూసుకునేలాంటివి కొన్నయితే, నింపి పంపితే సరియైన సమాధానాలు రాసిన వారి పేర్లు ప్రచురించేవి కొన్ని, నింపి పంపినందుకు పుస్తకాలు, విలువైన నగదు బహుమతులను ఇచ్చేవి మరికొన్ని. ఇలా వివిధ పత్రికలు ఈ గళ్లనుడికట్టులను నిర్వహిస్తున్నాయి.

మన తెలుగులో ఆరుద్రగారే తొలుత గళ్లనుడికట్టు నిర్మించారనీ, అయితే శ్రీశ్రీ 'పదబంధ ప్రహేళిక' పేరున దానిని ప్రాచుర్యం లోకి తెచ్చారని అంటారు. ప్రాచీన ప్రబంధాల్లో బంధ కవిత్వం, చిత్ర కవిత్వం పేర ఇలా ఒక ఆకృతిలో అర్థవంతమైన అక్షర సముదాయాన్ని కూర్చడం వుంది. అయితే ఈ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తరహా మాత్రం ఇలా ఒక నిర్దుష్ట చదరపు ఆకారపు గళ్లతో నిర్మితమై వచ్చింది మాత్రం ఆంగ్లం నుండే.

కాస్‌వర్డ్‌ పజిల్‌ పుట్టిందిలా...


ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పద క్రీడ ఈ క్రాస్‌వర్డ్‌ పజిల్‌. మొట్టమొదట 19వ శతాబ్దిలో ఇంగ్లాండులో తొలిసారిగా రూపుదాల్చింది. అడ్డంగానూ, నిలువుగానూ గళ్లలో అక్షరాలు నింపుతూ పదాలను నింపడం ఈ క్రీడలో ప్రధానం. ఆ పదాలు కనుక్కోడానికి ఆధారాలు ఇవ్వబడతాయి.

యు.ఎస్‌లో ఇది పెద్దల కాలక్షేపానికి ప్రధానమైందిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. లివర్‌పుల్‌ వాసి అయిన ఒక జర్నలిస్టు ఆర్థర్‌ వ్యిన్నె దీనికి ఆద్యునిగా గుర్తింపబడ్డారు. 21 డిసెంబర్‌ 1913లో 'న్యూయార్క్‌ వరల్డ్‌' దినపత్రిక ఆదివారం సంచికలో తొలిసారి క్రాస్‌వర్డ్‌ పజిల్‌ వచ్చింది. అప్పుడు ఇప్పటి నలుచదరపు ఆకారంలో లేదు. డైమండ్‌ ఆకారంలో మొదటి క్రాస్‌వర్డ్‌ పజిల్‌ వచ్చింది. అంతేకాదు లోపల ఎక్కడా నల్లగళ్లు లేవు అందులో. వారాంతపు పజిల్‌గా కామిక్‌ సెక్షన్‌లో వ్యిన్నె దానిని ప్రకటించడంతో విపరీతమైన స్పందన వచ్చింది. 1914లో పాఠకులు కూడా అలా పజిల్‌ నిర్మించి పంపడం మొదలు పెట్టారు. వ్యిన్నె వాటిని కూడా వినియోగించేవాడట. అయితే కూర్పులో అచ్చుతప్పులు (గళ్లల్లోనూ, ఆధారాల్లోనూ ఇప్పుడూ తారట్లాడుతూనే వుంటాయి) వివరీతమవడంతో క్రాస్‌వర్డ్‌పజిల్‌ ఆపేస్తే ,పాఠకులు నానా గోల చేసి తిరిగి ప్రారంభమయ్యేలా చూశారట.

1920లో ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న చదరపు పద్ధతి నిర్మాణం మొదలై దాదాపు అమెరికన్‌ న్యూస్‌ పేపర్లన్నీ క్రాస్‌వర్డ్‌ పజిల్‌ ప్రచురిస్తూ సాగాయి. ఆ తరువాత పదేళ్లకు అట్లాంటిక్‌, యూరప్‌ దేశాలకు ఈ అక్షర క్రీడ వ్యాపించింది. బ్రిటీష్‌ పత్రికల్లో తొలిసారి పియర్సన్స్‌ మ్యాగజైన్‌లో 1922 ఫిబ్రవరిలో, 1930 ఫిబ్రవరి 1న టైమ్స్‌ మ్యాగజైన్‌లో క్రాస్‌వర్డ్‌ పజిల్‌ సాక్షాత్కరించింది. అమెరికన్‌ పజిల్స్‌ కన్నా బ్రిటీష్‌ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తమదైన ముద్రతో మెదడుకి నిజంగా ఒక మేతగా వుండసాగాయి. మార్మికమైన, గూఢార్ధభరితమైన గళ్లనుడికట్టులను ఎ.ఎఫ్‌.రిట్చి, డి.ఎస్‌.మాక్‌నట్ట్‌ ఆధారాలు ఇవ్వడంలో ఒక గజిబిజి తనాన్ని, చమత్కారాన్ని పాటిస్తూ ఒక స్థాయి కల్పించారు.

ఎలా చేస్తారు?

చదరం, ధీర్ఘచతురస్రాకారంలో తెల్లని మరియు నల్లని గడులతో వుండే దీంట్లో గళ్లను అక్షరాలతో నింపుతూ, పదాలను లేదా వాక్యాన్ని కనుక్కోవాలి. ఆధారాలను బట్టి సమాధానాలు సాధించాలి. అడ్డంగానూ, నిలువుగానూ ఈ అక్షరాలు గళ్లలో నింపడం వుంటుంది. ఒక్కసారి కుడినుండి ఎడమకు, కిందినుండి పైకి చదువుకునేలాగానూ నింపడానికి ఆధారాలు ఇస్తుంటారు. పదం ప్రారంభమయ్యే గడిలో సంఖ్యను చూపించడం జరుగుతుంది. నాలుగు అడ్డం, పద్దెనిమిది నిలువు అన్నట్లుగా సంఖ్యతో మొదలయ్యే పదాలు కనుగొనే ఆధారాలు ఇస్తారు.

అసలు మజా అంతా ఆధారాలలోనే వుంటుంది. ఆ ఆధారాలను మెదడుకు మేత పెడుతూ సరిగ్గా అర్థం చేసుకుని పట్టుకోగలిగితే నింపడం అలవోకగానే అనిపిస్తుంది. ఒక పదానికి గల నానార్ధాలు, పర్యాయపదాలు, సామెతలు, జాతీయాలు, నుడులు, సాహిత్య పరిజ్ఞానం, వర్తమాన అంశాల అవగాహన ఇలా అన్నీ అవసరం పడుతుంటాయి.


ఆయా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ రూపొందిన విధానం బట్టి, ఆధారం చివర మొత్తం పదంలోని అక్షరాల సంఖ్యను బ్రాకెట్లలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ సంఖ్య సూచించని పదబంధ ప్రహేళికలూ వుంటాయి. ఒకవేళ వాక్యం కనుక్కోవాల్సి వస్తే ఆ వాక్యంలో ఎన్ని పదాలు వుంటాయినే సూచన కూడా ఇస్తారు. ఈ గళ్లనుడికట్టులలో తేలికవీ, కొంచెం కష్టమైనవీ, అతిగా బుర్రకు శ్రమ కలిగించాల్సినవీ కూడా వుంటాయి. 7×7, 9×9 గళ్లవి ఎక్కువగా తెలుగు పత్రికల్లో ముఖ్యంగా దిన, వార పత్రికల్లో చూస్తాం. 8 గళ్లవీ, 10 గళ్లవీ, 12 గళ్లవీ వుంటాయి. అలాగే ఆంగ్లపత్రికల్లో 15×15, 21×21, 23×23, 25×25 గళ్లతో వుండేవీ వస్తుంటాయి. మాసపత్రికల్లో పన్నెండు గళ్లు అడ్డం ప్లస్‌ నిలువుగా వుడేవి, అడ్డం 17 నిలువు 9 గా పజిల్‌ 'రచన'గా వుండేవి వున్నాయి. అలాగే పిల్లల కోసం కొన్ని పత్రికల్లో అయిదు గళ్ల పజిల్స్‌ రూపొందించబడ్డాయి.

ఎన్ని రకాలో...












ఇక ఈ క్రాస్‌వర్డ్‌ పజిళ్లలో ప్రత్యేకం భాషా సంబంధంగానూ, భక్తి, సంస్కృతి సంబంధంగానూ ఇలా ప్రత్యేకించి రూపొందించబడి ఇచ్చే పదబంధాలూ వుంటుంటాయి. సినిమా మాధ్యమం ఇవాళ చాలా ప్రభావోపేతమైనది కాబట్టి సినీపదరంగం అంటూ ప్రత్యేకించి పత్రికలు సినిమా గళ్లనుడికట్టులు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. 'సితార, సంతోషం' వంటి సినిమా పత్రికలు గతంలో ఇలాంటి సినిమా పజిల్స్‌ ఇచ్చినవే.


విదేశాల్లోనూ వాషింగ్‌టన్‌ పోస్ట్‌, ది యు.ఎస్‌.ఎ టుడే, న్యూయార్క్‌ టైమ్స్‌, ది హెరిటేజ్‌ న్యూస్‌ పేపర్‌ వంటి అమెరికన్‌ పత్రికలే కాదు హిందూ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి పత్రికలూ క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ ఇస్తున్నాయి.

తెలుగు దిన పత్రికల్లో రోజువారీగా ప్రస్తుతం ఆంధ్రప్రభ దినపత్రికలో సుధామ, ఆంధ్రభూమి దిన పత్రికలో పెద్దిభాట్ల సుబ్బరామయ్య పదనిసలు, పదకేళి నివ్వహిస్తూనే వున్నారు. ఎడ్యుకేషనల్‌ క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ విదేశాల్లో ప్రాముఖ్యంగా వున్నాయి. భాష, కెమిస్ట్రీ, బైబిల్‌ ఆధారంగా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ ఇప్పటికీ అక్కడ సాగుతున్నాయి. తేలికగా, సులభంగా, కష్టంగా, కష్టతరంగా, ఎలా వున్నా -వీటిని నింపే వ్యసనానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో లోనయ్యారు. వీటిని నింపడంలో ఆనందాన్ని, పూర్తి చేయగానే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ధీమానీ పొందుతుంటారు.


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో ది డైలీ టెలిగ్రాఫ్‌లో వస్తున్న క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ మిలిటరీ ఆపరేషన్స్‌కు చెందిన రహస్యాలను బహిర్గతం చేస్తున్నాయని రక్షణ అధికారులకు అనుమానం కలిగింది. 1944 మే 2 వ తేదీ ఉటా అనే లాండింగ్‌ స్థావరం పేరు, అలాగే కృత్రిమ ఓడ రేవుల పేర్లు, జూన్‌ 2 న నెఫ్ట్యూన్‌ అనే 'నేవల్‌ ఆపరేషనల్‌ ప్లాన్‌' పేరు వచ్చింది. ఆ క్రాస్‌వర్డ్‌ పజిల్‌ను ఇచ్చింది 'లియొనార్డ్‌ డావె' అనే స్కూల్‌ టీచర్‌. అతన్ని అనుమానించి అరెస్టు చేశారు. 1984లో 'ది డైలీ టెలిగ్రాఫ్‌' పత్రిక క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ ఎడిటర్‌ ఆర్మీ క్యాంపుల్లోని కబుర్ల నుండి ఆ టీచర్‌ ఒక స్టూడెంట్‌ చెప్పిన పదాలను వినియోగించడం వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని తెలిసింది.


క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ నింపే వ్యసనంలో పడి పనులు కూడా మందగిస్తున్నాయని బ్రిటన్‌లో ఒక సందర్భంలో వీటిమీద నిషేధం చూడా విధించారట. ఆ తరువాతనే పనివేళల్లో విశ్రాంతి సమయాన్ని విభజించి అనుమతించారట.

గిన్నిస్‌ బుక్‌ రికార్డుల ప్రకారం రోగర్‌ స్క్వెయిర్స్‌ అత్యధిక క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తయారు చేసిన వ్యక్తిగా 15 మే 2007న నమోదయ్యాడు.ది టైమ్స్‌, ది డైలీ టెలిగ్రాఫ్‌, ది గార్డియన్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ది ఇండిపెండెంట్‌ మొదలైన పత్రికల్లో గళ్లనుడికట్టులు ఇచ్చిన అతను 14 మే 2007 నాటికి మొత్తం ఆరవైఆరు వేల ఆరువందల అరవై ఆరు పజిల్స్‌ రెండు మిలియన్ల ఆధారాలతో ఇచ్చాడట. గళ్లనుడికట్టులో యాభై ఎనిమిది అక్షరాల పదం ఇచ్చిన పజిల్‌ నిర్మాత కూడా తానే!


ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, పోలెండ్‌, హిబ్రూ మొదలైన అనేక భాషల్లో క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ దూసుకువెడుతున్నాయి.

మన రాష్ట్రాల్లో...

ఇక మన దేశంలోనూ వివిధ భాషా పత్రికల్లో ఈ పదబంధ ప్రహేళికలు వస్తున్నాయి. మన దేశానికి చెంది ఎ.ఎన్‌.ప్రహ్లాదరావ్‌ అనే బెంగుళూరు వాసి కన్నడ భాషలో ఇప్పటికీ ఇరవైమూడువేల గళ్లనుడికట్టులు చేశాడట. వాటిల్లో ఆరువేలు సినిమాలకు సంబంధించి రూపొందించినవి. ప్రహ్లాదరావు మూడు దినపత్రికలకూ, ఇరవైనాలుగు వివిధ మ్యాగజైన్లకూ తయారు చేసిన ఈ ప్రహేళికలకై ఆరులక్షల ఇరవైవేల ఆధారాలు ఇచ్చినవాడయ్యాడు. ఇక బెంగాలీలో కూడా బ్రిటీష్‌ నుడికట్టు పద్ధతిలో పదచదరంగాలు రూపొంచింది ప్రకటిస్తున్నారు. అయితే బెంగాలీ గళ్లనుడికట్టులో రెండక్షరాల పదాలను ఇప్పుడు పరిహరించారట! నిజంగా అదో విశేషమే!

అంకెల పజిల్‌

గణితంలో లాటిన్‌ స్క్వెర్‌ మూలంగా లియాన్‌ హార్డ్‌ ఈలర్‌ అనే గణితశాస్త్రవేత్త 1780లో అంకెలను వరుసగళ్లతో ఒకసారి వచ్చిన అంకె మరొకసారి రాకుండా ఒకటినుండి తొమ్మిది వరకు వచ్చే పద్ధతి పజిల్‌ కనుక్కున్నాడు. డెల్‌ పత్రికలు వీటిని అందిపుచ్చుకున్నాయి. అమెరికాలో కనుక్కున్నా జపాన్‌లో వేనీగౌల్డ్‌ అనే హాంగ్‌కాంగ్‌ రిటైర్డ్‌ జడ్జి టోకియో బుక్‌ స్టోర్‌లో 1997లో వీటిని ప్రవేశపెట్టాడు.

అంకెలు ఒంటరిగా జత కట్టకుండా ఉండడం అనే అర్థంలో జపనీస్‌ పదం కుదింపబడి 'సుడోకు'గా ఇవాళ ప్రపంచ వ్యాప్తమైన అంకెల క్రీడగా ప్రాచుర్యం చెందింది. బ్రిటీష్‌ న్యూస్‌పేపర్‌ ది టైమ్స్‌ 12 నవంబర్‌ 2004లో తొలిసారి 'సుడోకు' ప్రచురించింది. యు.ఎస్‌ కు ఆ తర్వాత పరివ్యాప్తమై ఇవాళ ప్రపంచ ప్రసిద్ధమైంది.9×9 గళ్లల్లో, తొమ్మిది 3×3 అనుబంధిత గళ్లలో ఒకటి నుండి తొమ్మిది వరకు వేసిన అంకె వేయకుండా గళ్లలో ముందే ఇచ్చిన అంకెను మార్చకుండా నింపే ఆ పద్ధతి ఇవాళ ఓ పెద్ద క్రేజ్‌! వాటికి పోటీలు, బహుమతులు కూడాను. ఏ గడికి ఆ గడి ఖచ్చితమైన నియమిత అంకెతోనే సుడోకు రూపొందుతుంది.


9×9 గళ్లలో పూర్తి చేయదగిన సుడోకు కాంబినేషన్స్‌ ఎన్ని వుండడానికి అవకాశం వుందంటే 6,670, 91, 752,021,072, 936, 960 రకాలుగా ఇవ్వవచ్చు నన్నమాట.అయితే భారతదేశం ప్రపంచానికి కానుక ఇచ్చిన సున్న '0' సుడోకులో లేదు. ఈ అంకెల క్రీడ కన్నా భాషా, సాహిత్యాలు, ప్రపంచ పరిజ్ఞానం, కాలక్షేపానికి కాలక్షేపం, మెదడుకి చురుకు, హృదయానికి ఆనందం కలిగించే గళ్ల నుడికట్టుల వల్లనే ఎక్కువ లాభం వుందంటున్నారు.

ఈ తరం పిల్లలకు మన భాషా, సాహిత్య సంస్కృతుల పట్ల ఆభిరుచి పెరగడానికి పదబంధ ప్రహేళికలే ఎక్కువ ఉపకరిస్తాయని, అందువల్ల 'సుడోకు' కు బదులు అన్ని పత్రికలు క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ను ప్రోత్సహించడమే సబబనీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ఇంటర్నెట్‌లో కూడా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ చోటు చేసుకుంటున్నాయి. థింక్స్‌ డాట్‌ కామ్‌, క్రాస్‌వర్డ్‌ సైట్‌, పజిల్‌ ఎక్స్‌ప్రెస్‌, డైలీ కోడెడ్‌ క్రాస్‌ వర్డ్‌ వంటి సైట్లు వున్నాయి. 1997లో క్రాస్‌వర్డ్‌ వీవర్‌ పేర కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం అభివృద్ధి పరిచారు. తొలుత 'వర్డ్‌క్రాస్‌' పేరిట మొదలైన ఈ గళ్ల నుడికట్టును 1924లో సైమన్‌, స్కూస్టర్‌ వారు పుస్తక రూపంలోప్రచురించారు.గళ్లనుడికట్టుపుస్తకాలుఇప్పుడిప్పుడు మన దగ్గరా విస్తృతంగా రావడం మొదలైంది.

మన పెద్దలు... పదబంధాలు


తెలుగులో ఆరుద్ర, శ్రీశ్రీ పదబంధప్రహేళికల పట్ల పాఠకులకు ఆసక్తిని పెంచారు. ఆధారాలు ఇవ్వడంలో శ్రీశ్రీ ఆరుద్రలు చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. భాషాచమత్కారాలతో, రెండర్థాలతో, పదంలోనే సమాధానం దాగి వుండే రీతిలో, నానార్ధాలు , సామెతలు, ప్రాచీన ప్రబంధ, సాహిత్యాది అంశాల పరిచితి వల్ల సాధించగలిగే రీతిలో వారు పజిల్స్‌ నిర్మించేవారు.

'పిల్లి లేని పినతల్లి వికారంతో కూడితే గరుత్మంతుడి తల్లి'' అని వినత అనే పదానికి, 'కత్తిలో తోక' అంటే 'కరవాలము'లో వాలము అని రాయడం. ఇలా వారు ఆరంభించిన చమత్కార వైఖరులను ఆపై ఎందరో అంది పుచ్చుకుని అభివృద్ధిపరిచారు.

తెలుగులో ఇప్పటికీ అత్యధిక పదబంధ ప్రహేళికలను కూర్చింది ఎవరంటే ఇతమిద్థంగా చెప్పడం కష్టం! కానీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సుధామ, నిశాపతి, అదృష్టదీపక్‌, ఎన్‌.సురేంద్ర, ఘంటసాల నిర్మల, వాడ్రేవు ఉమాశంకర్‌, బాలు, వాణిశ్రీ, కావూరి వెంకట సుబ్బారావు, హుమయూన్‌ సంఘీర్‌, జి.శుభాకరరావు, కె.బి.గోపాలం, ప్రదీప్‌, గొరుసు, వెలివల సాంబశివరావు ఇలా ఎందరెందరో (కొన్ని పత్రికల్లో తమపేరు పేర్కొనకుండా కూడా మరెందరో) ఈ గళ్లనుడికట్టులను నిర్మిస్తున్నారు.

ఆంద్రభూమి దినపత్రికలో పెద్దిబొట్ల సుబ్బరామయ్య, ఆంధ్రప్రభ దినపత్రిక, వార్త (ఆదివారం),నవ్య వార పత్రిక, ఆంధ్రభూమి, రచన మానపత్రికల్లో సుధామ ,ఆ తర్వాత నిశాపతి అంతకుముందు యామినీ సరస్వతి గారు అత్యధిక సంఖ్యలో, అంటే వేలాదిగా పదబంధ ప్రహేళికలను రూపొందించిన వారుగా చెప్పుకోవచ్చు. పెన్నా శివరామకృష్ణ వంటి కవులు, మణికుమారి, నిర్మల, నీరజ కూడా పదబంధాలు తయారు చేసారు. గతంలో గళ్ల నుడికట్టులు నిర్మించినవారు ఈ వ్యాసకర్త దృష్టిలోకి రాని వారెందరో వుండి వుంటారు. అలాగే పత్రికల్లో కాక వినోదాలు, వేడుకల కోసం, గేమ్‌షోల కోసం ఈ గళ్లనుడికట్టు పదక్రీడలు రూపొందించి అలరించేవారూ ఎందరో!

ప్రయోజనాలెన్నో


ఏమయినా ఈ గళ్లనుడికట్టు పదబంధ క్రీడలు మన భాషను, పదసంపదను పరిరక్షించుకోవడానికీ, పాఠకులలో పరివ్యాప్తం చేయడానికీ అలాగే మన సంస్కృతీ సంప్రదాయాలలోని, ఆచార్య వ్యవహారాలలోని, జానపద మధురిమల్లోని విషయ గత పదబంధాలను నిక్షిప్తపరుచుకోవడానికీ, వర్తమాన సామాజిక, రాజకీయ, చలనచిత్రాది అంశాలతో నిరంతరం సంబంధం కలిగివుండేందుకూ ఎంతగానో ఉపకరిస్తాయి.

మెదడుకు మేతగా అన్ని వయస్సులవారికీ ఉపయోగపడే శీర్షికగా పదబంధప్రహేళికలు అన్ని పత్రికల్లోనూ రాణిస్తాయి. ఎన్ని రకాల కొత్త కొత్త పజిల్స్‌ వచ్చినా నిర్మాణపరంగా పజిల్స్‌ అన్నింటిలోనూ మకుటాయమానమైనది క్రాస్‌వర్డ్‌ పజిల్‌ అనే పదబంధ్ర ప్రహేళికే. గళ్లనుడికట్టుపై పట్టు సాధించిన పాఠకుడికి కలిగే ఆనందం, విజయానుభవం వర్ణనాతీతాలు. ఈ సందర్భంగా వీటిని రూపొందించే స్రష్టలకు, సమాధానాలిస్తున్న పాఠకశ్రేష్టులకూ ప్రజాశక్తి స్నేహాభినందనలు.

సుధామ

Friday, August 19, 2011

అంతా తెలుగేగా!



భాష చచ్చిపోతోంది, చచ్చిపోతోంది- అని గోలపెడుతూ ఉంటారూ, నిజంగా భాష ‘చచ్చిపోవడానికి’, అదేమయినా ‘ముసలిదై‘పోయేదా? తనంతట తాను ప్రాణం పోగొట్టుకోవడానికి, అదేమయినా ‘పిరికిదా?’ లేక ఏమయినా దీర్ఘవ్యాధి సోకిన ‘రోగి’యా? అని ప్రశ్నించాడు ఆవేశంగా రాంబాబు.

‘‘భాషను మనం చంపుకుంటాం, మనం హత్య చేస్తాం, మనం దూరం చేసుకుంటామేమోగానీ-నిజానికి భాషకు చావులేదర్రా! అది చిరంజీవి. ఏటికేడాదిగా నవజీవనం పోసుకోగల ‘జీవధార’ భాష. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సుసంపన్నం కాగల ‘అభివ్యక్తి’-భాష. తెలుగుకు-‘తెగులు’ సోకిందంటే, అది మన నిర్లక్ష్యమేగాని, భాష తనంతట తానుగా అస్తమించదు’’ అన్నాడు ప్రసాదు.

‘‘తెలుగు ‘ప్రాచీనభాష’ అంటూ, ఒక హోదాకోసం మనం పాకులాడి పోరాడడం-దాన్ని ముసలిదాన్ని చేసి ‘హరీ!’మనిపించడం కోసం కాదు కదా! మన తెలుగును మనం పరిరక్షించుకోవడం కోసం, తరం తరువాత తరంగా భావితరాల వారంతా తెలుగులో మాట్లాడడం, రాయడం ఆలోచించడం, అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రగతినంతా కూడా మాతృభాషలో పరివ్యాప్తం చేసుకోవడం కోసం. తెలుగుకోసం తపించడం-మన మాతృభాష విస్తృతం కావడంకోసం’’ అన్నాడు శంకరం.

సన్యాసి నవ్వాడు....

‘‘ఏం అలా నవ్వుతావ్?’’ అడిగారు మిత్రత్రయం

‘‘అబ్బే! అది కాదు. అసలు ‘తెలుగు’-అంటే, ‘తెలుగుభాష’ అంటే ఏమిటని ప్రశ్న. అలా ప్రశ్నించేలా చేసింది ఈనాటి వాతావరణమే! ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర అనేవి ప్రాంతాలుగా కాక, మనం ‘భాషకు’తగిలించి , ఎవరికివారు, తాము మాట్లాడేది మాత్రమే అసలు తెలుగనీ, భాషలో వైషమ్యాలు పెంచుకుంటున్నారనిపిస్తోంది.

ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం భాషని, ‘తెలుగు భాషే’ అయినా కొందరు ఆధిపత్య ధోరణులతోను, కొందరు చులకన దృష్టితోను చూసుకుంటున్న స్థితి ఏదయితే నేడు ఏర్పడిందో, అదే భాషా వికాసానికి, భాషాభివృద్ధి కృషికీ-అంతర్గత అవరోధంగాను, ఒక్కొక్కసారి శత్రుత్వంగాను కూడా మారుతోంది! దానికి తోడు మన రాజకీయాలు ప్రాంతం పేరుతోకాదు, భాషలోనే...చిచ్చు పెడుతున్నాయి.

‘ఆంధ్ర’, ‘తెలుగు’ భాష విషయకంగా సమనార్ధకాలేనని, ప్రాంతం దృష్ట్యా సౌలభ్యం కోసం విడివడినా- ‘వచ్చిండన్నా, వస్తాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అన్న భావన కుంటుపడే వైషమ్యం నాటుతున్నారు. నిజానికి, అసలే ఇంగ్లీషు పెత్తనం పెరిగి ఉపాధి అవకాశాలకు అది అనివార్యం కాగా, తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతుండగా, ప్రాంతాల వ్యవహారాలకు, యాసలకూ, మాండలికాలకూ అతీతంగా-ఏదయినా ‘తెలుగేనని’ అన్ని పదాలనూ, భావ సంపదనూ, తెలుగు భాషాభివ్యక్తికి ‘ఒకటిగా’ సమకూర్చుకోవలసింది పోయి, ‘‘ఏది అసలైన తెలుగు?’’ అనే అనవసర గోల పెంచుకుని, పద ప్రయోగాలను, అభివ్యక్తి సామర్ధ్యాన్నీ మనం మరింతగా దూరం చేసుకుంటున్నామనిపిస్తోంది.....

నిజానికి వ్యవహారిక భాషోద్యమం-భావ వినిమయ సాధనమైన భాషకు ఎంతో దోహదం చేయాలి! గ్రాంథికంగా ఉన్న రచనలలో మనకు అనేక పద ప్రయోగాలు కనిపిస్తాయి. అవన్నీ పండితులకు మాత్రమే అర్ధమయ్యేవనీ, సామాన్య జనావళికి కాదనీ, వాటిని ఎలాగూ దూరం చేసుకుంటూ వచ్చి-ఇవాళ భాషకు ప్రాంతీయతలను ఆపాదించి, ఒకరి మాట ఒకరికి అర్ధం కాదనీ, మా భాష, మా సంప్రదాయం వేరు అనీ, తెలుగునీ, మాతృభాషనీ మనమే ముక్కలు చేసి బలహీన పరుచుకుంటున్నాం!

ఒకే తానులోని ముక్కల్లా భాసించవలసిన పదాలను-వాటికవే వైయక్తిక ‘అస్తిత్వాలు’ కలిగినవిగా పేర్కొంటూ, భాషాభిమానం కాక, భాషా వైషమ్యం పెంచుతున్నాం!! తత్సమాలయినా, తద్భవాలయినా, దేశ్యాలయినా, మాండలికాలయినా మొత్తంగా భాషను పరిపుష్టం చేయడానికేగా!

అంతెందుకు! ఇవాళ ‘ఇంగ్లీషుపదం’ లేకుండా తెలుగు మాట్లాడలేని స్థితికి వచ్చిన మనం, ఆ అన్యభాష పద సంపదను కూడా మనలో కలుపుకునే విశాలతను ప్రదర్శిస్తుండగా- మన భాషలోంచే ఆంధ్ర, తెలుగు, సీమ అని వేరుచేసి చూసే-కేవలం మాండలికంలో రాయడమే తమ భాష అస్తిత్వానికి గొప్ప దోహదంగా, మేలుగా భావించడం ఎలా సమర్ధనీయమో, భాషా వికాసానికి చైతన్యదాయకమో అర్ధం కావడంలేదు’’ అన్నాడు సన్యాసి.

‘‘నువ్వన్నది నిజం సన్యాసీ! వ్యవహారంలోకి తెలుగు పదాలు ఎక్కువగా తీసుకురావాలి. నిఘంటులు శ్మశానాలు అనుకోనక్కర్లేదు! జన వ్యవహారంలోని పదాలే, రచయితలు తమ గ్రంథ రచనల్లో, జనాలు తమ దైనందిన వ్యవహారాల్లో వాడిన పదాలే పదకోశాలు, నిఘంటువులు అవుతాయి. అవ్వాలి!

నిజానికి భాషా శాస్తజ్ఞ్రులు, భాషా పండితులు తెలుగు భాష అభివృద్ధికి-మారుతున్న కాలానికీ , తరానికీ ఉపయుక్తంగా తెలుగుపదాల సృష్టికి కృషిచేసి వ్యాప్తిలోకి తేవాలి. పత్రికలు, ఛానల్స్ నిజానికి భాషా సేవలో అనివార్యంగా కృషి చేస్తూ కొత్త సృష్టి చేస్తున్నాయి. కానీ అది ‘టింగ్లీష్’గానో, ‘హింగ్లీష్’గానో ఒక ‘సంకర‘ భాషను సృష్టించేవిగా కాక భావ వినిమయానికి-అందరికీ అందుబాటులో ఉండే తెలుగు భాషాపదాలుగా సృజింపబడాలి!

‘పాతబడిన మాట’లన్న మాటా సరికాదు. అలాగే కొత్తపదాల సృష్టికి వైముఖ్యం పనికిరాదు! ‘‘పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా’’ భాషా వికాసం జరగాలి! విజయవాడలో ఈ మధ్య జరిగిన తెలుగుమహా సభలు తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూంటాయి’’అనే ఆశ పెంచాయి అన్నాడు రాంబాబు లేస్తూ!

Monday, August 15, 2011

ఇంకేమి కావాలె!.






మువ్వన్నెల స్వాతంత్ర్యం
చాతుర్వర్ణ
స్వాహాతంత్రం గా చెంగలిస్తోంది

హిందూదేశం భారతితో
ఇంగ్లీషును ప్రసవిస్తోంది

ఇక్కడ ఏ అమరిక అయినా
అమెరికా మెలికతో
ముడిపడుతోంది

నీతి,ధర్మం,న్యాయం మటుకే కాదు
భాషా,సంస్కృతి,సంప్రదాయం
అన్నీ స్వచ్చందంగా కోల్పోవడానికి
అందరికీ బోలెడు స్వాతంత్ర్యం వుంది

ఇంకేమి కావాలె
ఇంకేమి రావాలె
స్వీయ బంధనమె తొలగాలె
స్వయం బానిసతనమె చావాలె

రాజకీయ శరీరమేకాదు
స్వాతంత్ర్య ఆత్మ వెలగాలె


(ఈ కవిత లోని కొంత భాగం
15.8.2011 ఈనాడు దినపత్రిక
హైదరాబాద్ ఎడిషన్లో ప్రచురితం)

Sunday, August 14, 2011

నవ్వుకుందురు గాక!





తేడా

‘‘సుతారానికీ, మొరటుకీ తేడా ఏమిటి?’’
‘‘ఓ పక్షి ‘ఈక’తో చెంప నిమరడం సుతారం. ‘పక్షి’నే చెంప మీద రాయడం మొరటు’’.


రంగు

వెంగళప్ప ఎలక్ట్రానిక్స్ షాప్‌కు వెళ్లి- ‘‘మీ దగ్గర ‘కలర్ టీవీ’లు వున్నాయా’’ అని అడిగాడు.
‘‘ఉన్నాయి సార్!’’ అన్నాడు షాప్ వాడు.
‘‘అయితే ఓ బ్రౌన్ కలర్‌ది ఇవ్వండి’’ అన్నాడు వెంగళప్ప.


సినిమా

కళాకృష్ణ, సుందరం సినిమాకు వెళ్లారుగా అయితే అప్పటికే అరగంట సినిమా అయిపోయినా బానే వుందనుకున్నారా? ఎందుకలా?
వాళ్లు వెళ్లిన సినిమా ‘అలా మొదలైంది’ మరి!


నచ్చదు మరి

‘‘భార్యలకు తమ మొగుళ్లు తాగడం అస్సలు నచ్చదు ఎందుకంటావ్’’ అడిగాడు కృష్ణమాచారి పాత్రోని.
‘‘పిల్లిలా వుండే మొగుడు తాగాక పులిలా ప్రవర్తిస్తాడనే’’ అన్నాడు పాత్రో.


ప్రాంతం

‘‘నువ్వెక్కడ పుట్టావ్’’ అడిగాడు బాస్ సర్దార్జీని
‘‘పంజాబ్’’ సర్దార్జీ అన్నాడు గర్వంగా.
‘‘ఏ ప్రాంతం’’
‘‘ఏ ప్రాంతం ఏమిటి? మొత్తం శరీరం అంతా పంజాబ్‌లోనే పుట్టింది’’ అన్నాడు సర్దార్జీ.


కారణం

‘‘డాక్టర్ గారూ! నేనూ, మా ఆయనా ఒకేసారి కొవ్వు తగ్గడానికి మీ దగ్గర మందు తీసుకున్నాం కదా! ఆయన పది పౌండ్లు తగ్గి, నేను అలానే వున్నానేమిటి’’ అడిగింది ఉష అజయ్‌ని.
‘‘నా దగ్గర మందు తీసుకున్న ఆయనకు బుర్ర లేదు కదమ్మా’’ - డాక్టర్ అజయ్ సమాధానం.



బిల్డింగ్

కొత్తగా కట్టిన ఓ మేడని చూపించి, ‘‘అదేంటి’’అని అడిగాడు జెన్నీ-సాయిని.
‘బిల్డింగ్’ అన్నాడు సాయి.
‘‘ఆల్‌రెడీ బిల్ట్’ అయిన దానిని, ‘బిల్డింగ్’ అంటావేమిటి’’ కోప్పడ్డాడు జెన్నీ.


సాధనం

‘‘మన పిల్లల మీద, పెద్దలకు కోపం వుంటే- విషమో, నిద్రమాత్రలో ఇచ్చో, ఉరేసో, కొండమీంచి తోసేసో చంపేయకుండా ఏం చేస్తారు చెప్పు?’’ అంది సుమిర ప్రతీతితో క్లాసులో. ‘‘ఏవుంది’’ ‘చదువు’అంటూ బడిలో పడేస్తారు. మనం అలాగే కదా ఛస్తున్నాం’’ అంది ప్రతీతి.


జీవిత సత్యం

ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహమాడతాం.
వివాహమాడిన వ్యక్తి జీవిత భాగస్వామి కాగా,
ప్రేమించిన వ్యక్తి ఈ మెయిల్ ఐ.డి పాస్‌వర్డ్‌గా పరిణమించడం జరుగుతుంది.





ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న: తప్పు చేస్తున్నారని తెలిసీ ఇతరులను మనం అభినందించి శుభాకాంక్షలు ఎప్పుడు చెబుతాం
జవాబు: వారి వివాహ వేళ

**

ప్రశ్న: కలలను వాస్తవాలు చేసుకోలేకపోతే ఏమవుతుంది
జవాబు: వాస్తవం కలగా మిగిలిపోతుంది.

**

ప్రశ్న: స్ర్తిలకు ‘అభ్యున్నతి’ చెందాలని ఉండదా! ఎందుకు?
జవాబు: అదే ఉంటే మగవాళ్లతో ‘సమానత్వం’ ఎందుకు కోరుకుంటారు?

**

ప్రశ్న: మా నాన్నగారు పెద్ద పండితుడని నీకెలా తెలుసు?
జవాబు: నువ్వు ‘శుంఠ’వుకాబట్టి.

**

ప్రశ్న: మొగపిల్లలంతా వట్టి మొండివాళ్లని నువ్వెలా చెప్పగలవు
జవాబు: వాళ్ల నాన్ననే నేను పెళ్లాడాను కాబట్టి.

**

ప్రశ్న: తను నీకు ‘హాయ్’ చెప్పట్లేదని ఎలా అనుకుంటున్నావ్
జవాబు: వేలెత్తి చూపుతున్నాడు కాబట్టి

**

ఓ మంచి కిక్కు!






అదేదో సినిమాలో బ్రహ్మానందం టపాకాయలు దీపావళికే ఎందుకు కాల్చాలి, హోలికి కాలుస్తాను నేను, రంగులు హోలీనాడే ఎందుకు చల్లుకోవాలి, దీపావళికి చల్లుకుంటే ఏం? అని ప్రవర్తించే పాత్రను చిత్రించారు.

హాస్యానికి ఆలంబనగా జరిగిన ఆ చిత్రణ నేపథ్యంలో జర్మన్ కథ పీటర్ బిక్‌సెల్ రాసిన ‘వింత భాష’ వుందేమోనని మల్లాది వెంకట కృష్ణమూర్తి విదేశీ కథలు (అనువాద కథలు) చదువుతుంటే అనిపించింది.

వింత భాష కథలో ముసలివాడు మంచాన్ని ఫోటో అని, బల్లపేరుని కార్పెట్‌గానూ మార్చి అలా ప్రతిదీ కొత్తకొత్త పేర్లతో మార్చేసి ఆల్బం తొమ్మిదిన్నరకి మోగేదాకా ఫొటో మీద పడుకుని, మోగాక లేచి బీరువామీద నిలబడి, బట్టలని పేపర్ తలుపు తెరిచి తీసుకుని తొడుక్కుని, గోడమీద వేలాడే పుస్తకంలో మోహం చూసుకుని, గడియారం మీద కూర్చుని నవ్వుకునేవాడు.

ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, జపనీస్, ఇద్దిష్, హిబ్రూవంటి అనేక విదేశీ కథలను మల్లాది అనుదించి హాస్యం, విషాదం, క్రైం, సస్పెన్స్, ప్రేమ మొదలైన అంశాల్లోని ఆ రచయితల ఊహా పార్శ్వాలను మనకు అందించారు. అనువాద కథలు మాసపత్రికగా పేరొందిన ‘విపుల’లో వచ్చిన ఈ 31 కథలలో ఎంతో వైవిధ్యాన్ని, విభిన్న మానవ స్వభావాలనూ అవగతం చేసుకుని ఆనందించగలం.

ఇవన్నీ మరీ పెద్ద కథలేమీ కాదు. తెలుగు కథల్లో కనబడని విశేష ఇతివృత్తాలను పరిచయం చేసే కథలను ఎక్కువుగా ఎన్నుకుని సరళమైన తెలుగులో అనువదించి అందించడంవల్ల ఈ కథలు చదువుతున్నంతసేపూ కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో సంచరిస్తున్న థ్రిల్ కలుగుతుంది.

యూద్ మతంలో రేబై (ఫాదర్) పర్యవేక్షణలో చంపబడ్డ జంతుమాంసంతో వండేదే కోషర్‌మీల్. అలా చంపని జంతు మాంసాన్ని తినడం చాలా పాపంగా భావించే యూత్ యువకుడు విమాన ప్రయాణంలో తనకోసం కోషర్‌మీల్‌ను త్యాగంచేసి ఆదుకున్న జూడీస్టోన్ అనే అమ్మాయిని జోనాధన్ బ్రాండే అనే యువకుడు పెళ్లి చేసుకున్న హిబ్రూకధ ప్రేమకు ఒక భోజన పదార్థం ఎలా వారధి అయ్యిందీ చెబుతుంది.

బ్రీఫ్‌కేస్, ఆఖరి టెలిఫోన్, రాబంధుగుడ్డ మొదలైన ఈ సంకలనంలోని కథలు వింతగా ఉంటూనే ఆశ్చర్యానందాలు కలిగించేవిగా చదివిస్తాయి.

విదేశీ కథలు చదవడం ముఖ్యంగా నేటి యువతకు ఒక మంచి థ్రిల్, ఓ మంచి కిక్కు కూడా!

(విదేశీకథలు (అనువాద కథలు),అనువాదకులు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
వెల-రూ.100/- లిపి పబ్లికేషన్స్,గాంధీనగర్, హైదరాబాద్-80)

Friday, August 12, 2011

ఇక ‘బంద్’ చేద్దాం




‘శ్రుతిమించి రాగాన పడుతున్నది..పడనున్నది’ అని ఏదో పాటలో చరణం పాడుకుంటూ ప్రవేశించాడు సన్యాసి.

‘‘ఏదయినా శ్రుతి మించితే ‘వెగటే’ నాయనా! మంచి అయినా, చెడుఅయినా సరే, శ్రుతి మించితే అది చివరకు అందరూ ఛీత్కరించుకునే స్థితికి వస్తుంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఇప్పుడు ‘బంద్’ల విషయంలో జరుగుతున్నది అదే కదా! నిజానికి ‘బంద్’ అనే హిందీ పదానికి ‘మూసివేయు’ అని అర్ధం. రాజకీయ పార్టీలు ‘బంద్’ పాటించమని పిలుపు ఇవ్వగానే, అందరూ స్వచ్ఛందంగా పాటించేయాలని వారి ఉద్దేశం! ‘నిరసన’కు అదొక పద్ధతి అని రాజకీయపార్టీల భావన. బలవంతంగా ‘బంద్’ చేయించడం చేస్తుంటాయి అవి! ‘బంద్’లవల్ల దైనందిన ప్రజా జీవితానికి భంగం కలుగుతుంది. వర్తక, వ్యాపారాలు చేసుకుని బతికే వారికి, వారు చిల్లరవ్యాపారస్తులైనా, పెద్ద పెద్ద మాల్స్ నిర్వాహకులయినా ‘బంద్’వల్ల, తమ రోజువారీ ఆర్థిక ఆర్జనలను కోల్పోతారు. రవాణా నిలిచిపోవడంవల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడతారు’’ అన్నాడు రాంబాబు.

‘‘ ‘సమ్మె’ వేరు, ‘బంద్’ వేరు. ‘సమ్మె’ అనేది అంతర్జాతీయంగా అంగీకరింపబడిన ‘కార్మకుల హక్కు’ కూడాను! తమ పనిగంటలు కుదించాలని 1870లో అమెరికాలో జరిగిన కార్మిక సమ్మెయే ‘మేడే’గా ప్రపంచ కార్మికులందరినీ ఏకత్రితం చేసింది. ‘సమ్మె’ అనేది ప్రణాళికాబద్ధంగా చేయబడేది. ధర్నాలు, సత్యాగ్రహాలు, నిరసన దీక్షలు, ఊరేగింపులు, ర్యాలీలు ఇవన్నీ ఓకే! అవి తమ నిరసనను తెలపడానికీ, తమ న్యాయమైన కోర్కెల సాధనకూ పార్టీలు అవలంబించడంలో తప్పులేదు. కానీ ‘బంద్‌‘ పాటించమని బలవంతం చేయడం, బలవంతంగా దుకాణాలు, విద్యాసంస్థలూ,బస్సులూ మూయించడం, ప్రజాస్వామ్య విధానానికి, పౌరుల ‘స్వతంత్య్ర జీవనానికీ’ విఘాతమైన చర్యలు. ‘బంద్’ ప్రజా జీవితాన్ని భగ్నం చేస్తుంది. అలా భగ్నం చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఎక్కడుంది? ప్రజాక్షేమం చూడవలసినపార్టీలు-సమ్మెలూ, సత్యాగ్రహాలూ, నిరసన దీక్షలూ ఏవయినా చేయమనండి. మన దేశంలో 1946లో జరిగిన నావికాదళం ‘సమ్మె’, ఉత్పాదకతకనుగుణంగా ‘బోనస్’ పొందేలా ఫలితం ఇచ్చిన 1974 నాటి రైల్వేసమ్మె, ప్రయోజనం సిద్ధింప చేసాయా లేదా? కానీ ‘బంద్’లవల్ల-ఇబ్బందులు తప్పవు. లక్ష్యానికి తగిన నిరసన చర్య కాదు సరికదా, ప్రజల ఛీత్కారాన్ని పొందే ప్రమాదం పెరుగుతుంది’’ అన్నాడు సన్యాసి.
‘‘ఎన్నో అత్యవసర స్థితిగతులకు అఘాతమవుతుంది’’ అని కూడా అన్నాడు.

‘‘ కొన్ని గంటలనుండి రెండు మూడు రోజుల వరకు కూడా ‘బంద్’ పాటింపచేస్తూ, జనజీవితాన్ని స్తంభింపచేసిన పరిస్థితులు మన నగరాల్లో ఏర్పడుతున్నాయి. హైకోర్టు కూడా మన రాష్ట్రంలో ఈ మధ్య ఈ ‘బంద్’ల గురించి రాజకీయ పార్టీలకు ‘అది తగని పని’ అని హెచ్చరికలు జారీ చేసింది.’’ అన్నాడు రాంబాబు.

‘‘జనానికి ‘బంద్’ అంటేనే ‘వెగటు’ పుడుతోంది! బలవంతపు మూత వేయించడాలే తప్ప, స్వచ్ఛందంగా, ‘బంద్’ పాటించాలని ఎవరికీ లేదు! ఎందుకంటే-అది నిజానికి హేతుబద్ధమైన నిరసన కాదు. అందువల్ల ప్రజలకు ఇబ్బందే తప్ప, సమస్యకు ‘బంద్’ పరిష్కారం కానే కాదు! ‘బంద్’ అనేది నిరసన చర్యగా రాజకీయ పార్టీలు భావించడమే తప్పు! అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలే కానీ, ప్రజాసేవ, సంక్షేమం తమ లక్ష్యం అని కబుర్లు చెప్పే రాజకీయనాయకులు ప్రజా జీవితంలోఅల్లకల్లోలం సృష్టంచే ‘బంద్’లకు పిలువునివ్వడం తగదు’’ అన్నాడుప్రసాదు దృఢంగా.

‘‘మనదేశంలో 18వ శతాబ్దంలోనే 1729 మార్చి 8వతేదీన ఢిల్లీలో మొదటిసారిగా బంద్ జరిగింది. ఆ కాలంలో చెప్పుల దుకాణదారులు తమ షాపులను మూసివేసి, ఇతర వర్తకులుకూడ దుకాణాలు మూసేసేలా చేశారు. కారణం నిజానికి చాలా చిత్రంగానే తోచవచ్చు!‘సుఖ్ కరణ్’ అనే నగలవ్యాపారి-ఎర్రకోటలో రాజును కలుసుకుని, సాయంత్రం ఇంటికి చె ప్పుల బజారు మీదుగా వస్తుండగా, అప్పుడు పండుగ రోజులవడం వల్ల టపాకాయలు కాలుస్తుంటే ఒకటి అతని బట్టలమీద పడి కాల్చిందట! దాంతో అతను మనుషులను పంపి చెప్పుల బజారు వాళ్లను తిన్నగ ఉండమని బెదిరింపు చేశాడట. వార్త రాజుగారికి చేరింది. అతను సుఖకరణ్‌నుండి బంగారు ఆభరణాలు కానుకలుగా పొందడం, చేయించుకోవడం చేస్తుండడంవలన అతనినే సమర్ధించి కోట మనుషులను పంపడంతో, పాదరక్షల దుకాణదారులు ఆగ్రహించి మూడురోజులు తమ దుకాణాలు మూసివేశారు. వారికి మద్దతుగా ఇతర ‘ధాన్యం’ మొదలైన వ్యాపారస్తులు బంద్ చేశారు. చాందినీ చౌక్, జుమా మసీదు ప్రాంతంలో జరిగిన ఈ బంద్‌వల్ల అక్కడ రోటీ,చాయ్ కూడా దొరక్క పేదలు ఇబ్బంది పడుతున్నారని రెండోరోజే ఓ వర్తకుడు తండూరీ రోటీలు చేయించి జనానికి అమ్మడం చేయగా చెప్పుల దుకాణదారులు అతన్ని కొట్టి చంపేంత పనిచేసారు. అతగాడి భార్య, కూతురు కాళ్ల వేళ్లా పడడంతో వదిలేశారు. నిజానికి సుఖ్ కరణ్‌కు రకరకాల చెప్పుల పిచ్చి, ఏటా ఫ్యాషన్ చెప్పులు అనేకం అతను కొంటుండేవాడు. జన జీవనానికి అఘాతం కలిగించిన బంద్ అది అనీ, ఛాట్, దాల్‌సేవ్ వంటివి కూడా లభించక, ఆకలితో అలమటించారనీ ఆ బంద్ గురించి మహమ్మద్ మియన్ అక్బర్ అనే చెప్పులదుకాణదారుడే రాశాడు! అలా బంద్‌లకు మనదేశమే ఆద్యమైంది. ఇవాళ శ్రుతి మించి రాగాన కాదు ‘రోగాన’పడుతోంది’’ అన్నాడు సన్యాసి తనకు తెలిసిన వృత్తాంతం చెబుతూ.

‘‘ఇక జనం పాటించవలసింది ఒకే ఒక బంద్! అదే ‘బంద్’లకు బంద్!!’’ అన్నాడు రాంబాబు లేస్తూ.

Wednesday, August 10, 2011

ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి సాహిత్య వ్యాసావళి


ఈ వారం
నవ్య వార పత్రికలో
వచ్చిన
నా
పుస్తక సమీక్షలు

Sunday, August 7, 2011

ఆదివారం సరదాగా కాసేపు...





ఆత్మహత్య

ఓ కప్ప వెంగళప్పతో: ‘‘నీకు బుద్ధిలేదు’’ అంది.
వెంగళప్ప: ఉంది
కప్ప: లేదు
వెంగళప్ప: ఉంది
కప్ప: లేదుగాక లేదుఅనినీటిలోకిదూకేసింది
వెంగళప్ప: ‘‘ఇంత మాత్రానికే ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు.’’ అన్నాడు.

***

దేనికి

రన్నింగ్ రేస్ జరుగుతోంది.
వెంగళప్ప- ‘‘ఎందుకు వీళ్లంతా ఇలా పరిగెడుతున్నారు’’ అని అడిగాడు.
‘‘ఇది రన్నింగ్ రేస్! గెలిచిన వాడికి పెద్దకప్పు ఇస్తారు’’ అని నిర్వాహకుడు చెప్పగా, 
‘‘ఒక్కడికే కప్పు ఇచ్చేటప్పుడు, ఇంతమంది పరిగెట్టడం ఎందుకు’’ అన్నాడు వెంగళప్ప.

***


భవిష్యత్తు

‘‘నేను హత్యచేసాను- దీనికి భవిష్యత్ కాలం చెప్పు విరించీ’’ అడిగింది టీచర్.
‘‘మీరు జైలుకి వెళ్లడం ఖాయం’’ అని సమాధానం ఇచ్చాడు విరించి.

***

సర్దార్

ఓ సర్దార్ హోటల్‌కు వెళ్లాడు.
చికెన్ ఆర్డర్ ఇవ్వగా వెయిటర్ పట్టుకొచ్చాడు.
సర్దార్: దీనికి ఓ కాలులేదు
వెయిటర్: అది కుంటిది
సర్దార్: దీని గుండె నో?
వెయిటర్: అది ‘పుంజు’దగ్గరుంది.
సర్దార్: దీనికి ‘మెదడు’ కూడా లేదు.
వెయిటర్: ఈ కోడి సర్దార్జీ అండీ!

***

నాది నాకిచ్చేయ్

ఇరవై రూపాయల లాటరీ టిక్కెట్టు కొన్న వెంగళప్పకు ఇరవై కోట్ల రూపాయల బహుమతి వచ్చింది.
టాక్స్ మినహాయించుకుని పదకొండు కోట్లు ఇచ్చారు.
కోపం వచ్చిన వెంగళప్ప ‘‘నేను గెలుచుకున్న ఇరవై కోట్లూ నాకివ్వండి. లేదా నా ఇరవై రూపాయలూ నాకిచ్చేయండి’’ అన్నాడు.

***

నెమ్మది

వెంగళప్ప ఏదో చాలా నెమ్మదిగా రాస్తున్నాడు.
‘‘ఏంటది అంత మెల్లిగా రాస్తున్నావ్’’ అడిగాడు మిత్రుడు.
‘‘నేను నా ఆరేళ్ల బాబుకి ఉత్తరం రాస్తున్నాను. వాడు గబగబా చదవలేడు అందుకని’’అన్నాడు వెంగళప్ప.

***

కారణం


మన్మోహన్‌సింగ్ ఉదయంకాక సాయంత్రం వాకింగ్‌కు వెడతారట ఎందుకో తెలుసా అడిగాడు ఒకాయన వెంగళప్పను. ‘‘ఆమాత్రం తెలియదా? మన్మోహన్‌సింగ్ ‘పి.ఎం’కానీ, ‘ఏ.ఎం’కాదుగా!’’ అన్నాడు వెంగళప్ప.

***

సమస్య

‘‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ నా ఫొటో పెట్టుకుని ఆఫీసుకు వెడతావెందుకు మృణాళినీ’’ అడిగాడు భర్త భాను. ‘‘నాకు ఏ సమస్య వచ్చినా మీ ఫొటో చూస్తాను. దానితో ఆ సమస్య తేలికవుతుంది’’ అంది మృణాళిని.
‘‘చూసావా! నీకు నేనెంత మిరక్యులస్‌గా, పవర్‌ఫుల్‌గా వున్నానో’’ అన్నాడు భాను.
‘‘అవును! మీ ఫొటో చూసి ‘ఇంతకన్నా నాకు పెద్ద సమస్య ఇంకేముంటుంది’ అనుకుంటానుగా’’ అంది మృణాళిని.

**

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న: చదువుతున్న స్కూల్లోనే లేదా కాలేజీలోనే గర్ల్‌ఫ్రెండ్ వుండడంవల్ల కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటి?
జవాబు: నూటికి నూరు శాతం అటెండెన్స్.

* * *

ప్రశ్న: కెమిస్ట్రీ ఎలా వుంటుందో చెప్పు.
జవాబు: హైడ్రోజన్, సోడియం, హీలియం, క్లోరిన్, ఫ్లోరిన్, షిరీన్, నౌషీన్, ఫర్హీన్, అమ్రిన్, ఆసిన్, యాస్మిన్, నస్రీన్......

* * *

ప్రశ్న: నిద్రపోవడంలో ప్రమాదకరమైన పొజిషన్ ఏది
జవాబు: ఆఫీస్ టేబుల్ మీద కాళ్లు బారచాపి నిద్రపోవడం

* * *

ప్రశ్న: పొటాషియం, నికిల్, ఐరన్ కలిపి ఓ ఆయుధాన్ని తయారుచేయవచ్చు
జవాబు: నైఫ్ (చాకు) అర్ధం కాలేదా ఓకే పొటాషియం కెమికల్ సింబల్-కె, నికిల్‌ది- ఎన్.ఐ, ఐరన్‌ది- ఎఫ్.ఇ. కనుక కె.ఎన్.ఐ.ఎఫ్.ఇ కలిపితే నైఫ్ అవుతుంది మరి!

* * *

ప్రశ్న: స్ర్తి అంటే
జవాబు: గుమ్మం దగ్గర నిలబడి గంటలకొద్దీ మాట్లాడుతూ వచ్చి కూర్చోమంటే టైమ్ లేదనేది
.
***