ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 19, 2011

అంతా తెలుగేగా!భాష చచ్చిపోతోంది, చచ్చిపోతోంది- అని గోలపెడుతూ ఉంటారూ, నిజంగా భాష ‘చచ్చిపోవడానికి’, అదేమయినా ‘ముసలిదై‘పోయేదా? తనంతట తాను ప్రాణం పోగొట్టుకోవడానికి, అదేమయినా ‘పిరికిదా?’ లేక ఏమయినా దీర్ఘవ్యాధి సోకిన ‘రోగి’యా? అని ప్రశ్నించాడు ఆవేశంగా రాంబాబు.

‘‘భాషను మనం చంపుకుంటాం, మనం హత్య చేస్తాం, మనం దూరం చేసుకుంటామేమోగానీ-నిజానికి భాషకు చావులేదర్రా! అది చిరంజీవి. ఏటికేడాదిగా నవజీవనం పోసుకోగల ‘జీవధార’ భాష. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సుసంపన్నం కాగల ‘అభివ్యక్తి’-భాష. తెలుగుకు-‘తెగులు’ సోకిందంటే, అది మన నిర్లక్ష్యమేగాని, భాష తనంతట తానుగా అస్తమించదు’’ అన్నాడు ప్రసాదు.

‘‘తెలుగు ‘ప్రాచీనభాష’ అంటూ, ఒక హోదాకోసం మనం పాకులాడి పోరాడడం-దాన్ని ముసలిదాన్ని చేసి ‘హరీ!’మనిపించడం కోసం కాదు కదా! మన తెలుగును మనం పరిరక్షించుకోవడం కోసం, తరం తరువాత తరంగా భావితరాల వారంతా తెలుగులో మాట్లాడడం, రాయడం ఆలోచించడం, అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రగతినంతా కూడా మాతృభాషలో పరివ్యాప్తం చేసుకోవడం కోసం. తెలుగుకోసం తపించడం-మన మాతృభాష విస్తృతం కావడంకోసం’’ అన్నాడు శంకరం.

సన్యాసి నవ్వాడు....

‘‘ఏం అలా నవ్వుతావ్?’’ అడిగారు మిత్రత్రయం

‘‘అబ్బే! అది కాదు. అసలు ‘తెలుగు’-అంటే, ‘తెలుగుభాష’ అంటే ఏమిటని ప్రశ్న. అలా ప్రశ్నించేలా చేసింది ఈనాటి వాతావరణమే! ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర అనేవి ప్రాంతాలుగా కాక, మనం ‘భాషకు’తగిలించి , ఎవరికివారు, తాము మాట్లాడేది మాత్రమే అసలు తెలుగనీ, భాషలో వైషమ్యాలు పెంచుకుంటున్నారనిపిస్తోంది.

ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం భాషని, ‘తెలుగు భాషే’ అయినా కొందరు ఆధిపత్య ధోరణులతోను, కొందరు చులకన దృష్టితోను చూసుకుంటున్న స్థితి ఏదయితే నేడు ఏర్పడిందో, అదే భాషా వికాసానికి, భాషాభివృద్ధి కృషికీ-అంతర్గత అవరోధంగాను, ఒక్కొక్కసారి శత్రుత్వంగాను కూడా మారుతోంది! దానికి తోడు మన రాజకీయాలు ప్రాంతం పేరుతోకాదు, భాషలోనే...చిచ్చు పెడుతున్నాయి.

‘ఆంధ్ర’, ‘తెలుగు’ భాష విషయకంగా సమనార్ధకాలేనని, ప్రాంతం దృష్ట్యా సౌలభ్యం కోసం విడివడినా- ‘వచ్చిండన్నా, వస్తాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అన్న భావన కుంటుపడే వైషమ్యం నాటుతున్నారు. నిజానికి, అసలే ఇంగ్లీషు పెత్తనం పెరిగి ఉపాధి అవకాశాలకు అది అనివార్యం కాగా, తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతుండగా, ప్రాంతాల వ్యవహారాలకు, యాసలకూ, మాండలికాలకూ అతీతంగా-ఏదయినా ‘తెలుగేనని’ అన్ని పదాలనూ, భావ సంపదనూ, తెలుగు భాషాభివ్యక్తికి ‘ఒకటిగా’ సమకూర్చుకోవలసింది పోయి, ‘‘ఏది అసలైన తెలుగు?’’ అనే అనవసర గోల పెంచుకుని, పద ప్రయోగాలను, అభివ్యక్తి సామర్ధ్యాన్నీ మనం మరింతగా దూరం చేసుకుంటున్నామనిపిస్తోంది.....

నిజానికి వ్యవహారిక భాషోద్యమం-భావ వినిమయ సాధనమైన భాషకు ఎంతో దోహదం చేయాలి! గ్రాంథికంగా ఉన్న రచనలలో మనకు అనేక పద ప్రయోగాలు కనిపిస్తాయి. అవన్నీ పండితులకు మాత్రమే అర్ధమయ్యేవనీ, సామాన్య జనావళికి కాదనీ, వాటిని ఎలాగూ దూరం చేసుకుంటూ వచ్చి-ఇవాళ భాషకు ప్రాంతీయతలను ఆపాదించి, ఒకరి మాట ఒకరికి అర్ధం కాదనీ, మా భాష, మా సంప్రదాయం వేరు అనీ, తెలుగునీ, మాతృభాషనీ మనమే ముక్కలు చేసి బలహీన పరుచుకుంటున్నాం!

ఒకే తానులోని ముక్కల్లా భాసించవలసిన పదాలను-వాటికవే వైయక్తిక ‘అస్తిత్వాలు’ కలిగినవిగా పేర్కొంటూ, భాషాభిమానం కాక, భాషా వైషమ్యం పెంచుతున్నాం!! తత్సమాలయినా, తద్భవాలయినా, దేశ్యాలయినా, మాండలికాలయినా మొత్తంగా భాషను పరిపుష్టం చేయడానికేగా!

అంతెందుకు! ఇవాళ ‘ఇంగ్లీషుపదం’ లేకుండా తెలుగు మాట్లాడలేని స్థితికి వచ్చిన మనం, ఆ అన్యభాష పద సంపదను కూడా మనలో కలుపుకునే విశాలతను ప్రదర్శిస్తుండగా- మన భాషలోంచే ఆంధ్ర, తెలుగు, సీమ అని వేరుచేసి చూసే-కేవలం మాండలికంలో రాయడమే తమ భాష అస్తిత్వానికి గొప్ప దోహదంగా, మేలుగా భావించడం ఎలా సమర్ధనీయమో, భాషా వికాసానికి చైతన్యదాయకమో అర్ధం కావడంలేదు’’ అన్నాడు సన్యాసి.

‘‘నువ్వన్నది నిజం సన్యాసీ! వ్యవహారంలోకి తెలుగు పదాలు ఎక్కువగా తీసుకురావాలి. నిఘంటులు శ్మశానాలు అనుకోనక్కర్లేదు! జన వ్యవహారంలోని పదాలే, రచయితలు తమ గ్రంథ రచనల్లో, జనాలు తమ దైనందిన వ్యవహారాల్లో వాడిన పదాలే పదకోశాలు, నిఘంటువులు అవుతాయి. అవ్వాలి!

నిజానికి భాషా శాస్తజ్ఞ్రులు, భాషా పండితులు తెలుగు భాష అభివృద్ధికి-మారుతున్న కాలానికీ , తరానికీ ఉపయుక్తంగా తెలుగుపదాల సృష్టికి కృషిచేసి వ్యాప్తిలోకి తేవాలి. పత్రికలు, ఛానల్స్ నిజానికి భాషా సేవలో అనివార్యంగా కృషి చేస్తూ కొత్త సృష్టి చేస్తున్నాయి. కానీ అది ‘టింగ్లీష్’గానో, ‘హింగ్లీష్’గానో ఒక ‘సంకర‘ భాషను సృష్టించేవిగా కాక భావ వినిమయానికి-అందరికీ అందుబాటులో ఉండే తెలుగు భాషాపదాలుగా సృజింపబడాలి!

‘పాతబడిన మాట’లన్న మాటా సరికాదు. అలాగే కొత్తపదాల సృష్టికి వైముఖ్యం పనికిరాదు! ‘‘పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా’’ భాషా వికాసం జరగాలి! విజయవాడలో ఈ మధ్య జరిగిన తెలుగుమహా సభలు తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూంటాయి’’అనే ఆశ పెంచాయి అన్నాడు రాంబాబు లేస్తూ!

5 comments:

Varsha Bhargavi said...

నిజమే గురూజీ, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఒకరితో ఒకరు ఇంగ్లీషులోనే మాట్లాడేస్తున్నారు. మీరన్నది అక్షరాలా నిజం. "ఇవాళ ‘ఇంగ్లీషుపదం’ లేకుండా తెలుగు మాట్లాడలేని స్థితికి వచ్చిన మనం, ఆ అన్యభాష పద సంపదను కూడా మనలో కలుపుకునే విశాలతను ప్రదర్శిస్తుండగా- మన భాషలోంచే ఆంధ్ర, తెలుగు, సీమ అని వేరుచేసి చూసే-కేవలం మాండలికంలో రాయడమే తమ భాష అస్తిత్వానికి గొప్ప దోహదంగా, మేలుగా భావించడం ఎలా సమర్ధనీయమో, భాషా వికాసానికి చైతన్యదాయకమో అర్ధం కావడంలేదు" ఇకనైనా తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుకుందాము అని తీర్మానించుకుని అమలు పరిస్తే భావితరానికి మన మాతృభాష రుచి కొంచెమైనా చూపించినట్టుంటుంది.

Phanindra said...

చాలా చక్కని వ్యాసం. "మా తెలుగు తల్లికీ" పాటనీ కొందరు వ్యతిరేకించే దుస్థితిలో ఈ వ్యాసం ఒక వెలుగురేఖ.

good said...

కొండల్లో కోనల్లో సెలఎరులై పారి,ఓ నదిగా పరవళ్ళు త్రొక్కి , తెనుగు ప్రజ భావ జలధికి గాంభీర్యత సమకూర్చే భాష ,నాటి కృష్ణ రాయల "లెస్స" ను లెస్సు "చేయకుండా", శంకరంబాడి మల్లెపూదండను వాడకుండా, యాస ఏదైనా భాషఒకటిగా,అందరమొకటిగా అమ్మను బ్రతికించుకుందాం.ఆ స్తన్యంరుచిదక్కిన్చుకుందాం!

Pramod said...

Very nice article babai...kaani Telugu lo type cheyyadam kashtam, andukami English lo type chestunna... koddiga contradictory ga undi kaani Telugu option ledu!

సో మా ర్క said...

సుధామ గారూ!చాలా చాలా బాగుంది మీ వ్యాసం.ఎందరికో కను విప్పు కాగలదు.వారికే హ్రుదయమంటూ ఉంటె! ఆందించిన మీకు ధన్యవాదాలు,
సోమార్క