ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, May 19, 2012

ఊతాన్నిచ్చేవే ఊతపదాలు



సొగసు చూడతరమా అని కవిగారు ఊరకే అనలేదు.



సొగసు పాదాల్లో వుంటుందని చైనావారు ఎక్కువగా భావిస్తారట.

మనమూ పాదాల్లో సొగసులు చూస్తాం అయితే అది పద్యపాదాల్లో. వాక్య సముదాయంలోని వాక్యపాదాల్లో.

పాదాల్లో ప్రయోగించే పదాలే భాషలో సొగసు మరి!


ఒకరు మాట్లాడుతూంటే వినవేడుక కలుగుతోంది అంటే అది వారు భాషను ప్రయుక్తం చేసే తీరును బట్టే. భావాభివ్యక్తికి భాషను సొగసుగా వినిమయం చేయడంలోనే వక్త నేర్పు వుంటుంది


కొందరు తమ మాటల్లో సామెతలను జాతీయాలను ప్రయుక్తం చేస్తూంటారు. ఆ సందర్భానికి ఆ సామెత అతికితే సరే కానీ లేకపోయినా కొందరికి అదో అలవాటు.


‘ఏదోసామెత చెప్పినట్లు’ అంటారు. సామెత చెప్పకుండా ఆ మాట ప్రయోగించడం ఒక వైఖరి. ఇలాంటి వైఖరినే ఊతపదాలుగా భాషలో గుర్తించారు.

ఊతపదాలు కూడా ఒక సొగసే
!
అంతేకాదు, ఆ ప్రయోగించే ఊతపదాన్ని బట్టి ఆ వ్యక్తిని గుర్తించే తీరూ వుంటూంటుంది.


అంటే తమ సంభాషణకు ఆ సంభాషణ తొట్రువడకుండా సాగడానికీ ఓ ఊతపదం వారికి ఉండాలి.


ఇది నాకు ఇది చెప్పినప్పట్నుంచీ ఏదో ఇదిగా అనిపించింది. ఇది వద్దనుకున్నా అంత ఇది ఏమీ కాదుగానీ.. అంటూ ఆ ఇది ఏమిటో తెలియకుండా ఒకటే ఇదిగా మాట్లాడే వారుంటూంటారు. ఇది, అది, మరి లాంటి పదాలు ప్రసంగకర్తలు పదే పదే కొందరు ప్రయుక్తం చేసిగానీ, ముందుకువెళ్లలేరు.


ఒకాయన అభివృద్ధి సూచకంగానే కాదు పలు రకాలుగానూ ‘ఆ విధంగా ముందుకు పోతున్నాం’ అంటారు. ఆ ఊతపదం ఏమిటో తెలియగానే ఆ వ్యక్తి ఎవరో కనులముందు ఊహించుకోగలుగుతున్నామంటే అది ఊతపదంలోని సొగసే మరి!


ఒక ప్రాంతంలో విరివిగా వ్యవహృతవౌతూండే పదాలూ ఊతపదాలుగా భాసిస్తూంటాయ్- ‘ఆయ్!’,‘మరేనండి’, ‘కాదుమరీ’ వంటివి అలాంటి పదాలు. ‘వెధవ’ వంటి పదాలు మాత్రమే కాకుండా కొంత అశ్లీలార్థకంగా కనిపించే పదాలనూ తమ మాటల్లో - నిజానికి మనసులో అలాంటి భావం ఏమీ లేకపోయనా అలవోకగా వాడేస్తూంటారు కొందరు. ఒకాయన ప్రతిదానికీ ‘నా తలకాయ’ అంటూంటాడు. ‘సిగదరగ’ అని వాడుతూంటారు ఇంకొకరు.


ఊతపదం అనడంలోనే అర్థం తెలుస్తోంది కదా! ఆ పదం వాళ్లకు ‘ఊత’ అని. సంభాషణ సాగడానికి ఆ పదం వారికి వుండితీరాలి. అలా అనకుండా మాట్లాడమని మీరు శాసిస్తే వారు మూగవోతారు. ప్రయత్నించినా మాట్లాడలేకపోవచ్చు.


సామెతలను సంభాషణల్లో ఊతగా తీసుకునే వైఖరి అలాంటిదే. ఓ రాజుగారి ఆస్థానంలోని ఒక ఉద్యోగి మాట మాటాడితే సామెత చెబుతూండేవాడట. ఆ సామెతలు వినీవినీ రాజు గారికి విసుగొచ్చేసిందట. సామెత ప్రయోగించకుండా మాట్లాడమని హుకుం జారీచేశాడట. ఆ ఉద్యోగి వినిపించుకోకపోయేసరికి అతనికి ఉరిశిక్ష వేసాడట. తీరా ఉరితీసే సమయంలో జాలి కలిగి ‘‘ఇకనైనా సామెతలు చెప్పనని మాట ఇయ్యి, ఉరిశిక్ష రద్దుచేస్తాను’’ అన్నాడట. దానికా ఉద్యోగి ‘‘అలాగే మహారాజా! సామెతలు ప్రయోగించను. అసలు మాట్లాడటం కూడా తగ్గించేస్తాను. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదన్నారు’’ అన్నాడట. ఆ తర్వాత రాజుగారు ఏం చేసారో మరి!




కొందరికి పొడుపు కథలు వేస్తూ మాట్లాడటం అలవాటు. పొడుపు కథలది చాలా ప్రాచీనమైన చరిత్ర. అనేక దేశ విదేశీ భాషల్లో కూడా అవి వున్నాయి. పొడుపు వున్నపుడు విడుపు కూడా వుంటుంది.
'గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ' అంటూ మునుపు చిన్నతరగతి తెలుగు వాచకాల్లో పొడుపు కథలు వేసి, తేలు బొమ్మను అందుకు సమాధానంగా ముద్రించి పిల్లలను అలరించడం వుండేది.


ప్రయోగించే పదాలు, వాక్య నిర్మాణ చతురత, ఆకట్టుకునే తీరు వీటివల్లే భాషలో సంభాషణలు పరస్పర భావ వినిమయానికి సొగసుగా రాణిస్తూవున్నాయి.


సినిమాలలో కొన్ని పాత్రలకు రచయితలు సంభాషణల్లో చొనిపే ఊతపదాలు ఆ పాత్ర ప్రసిద్ధికి హేతువవుతూంటాయి. ‘సరే అలానే కానీయ్’, ‘అయితే ఓకే’, ‘అంత సీన్ లేదు’, ‘లైట్ తీస్కో’ అంటున్నారు నేటి తరం.


భాష భావ వినిమయ సాధనం అని ముందే చెప్పుకున్నాం కదా! లోకంలో సగం అనర్థాలకు అసలు కారణం అపార్థాలు. ఆ అపార్థాలకు హేతువు అనుకున్నది అనుకున్నట్లుగా అవతలివారు అర్థం చేసుకునేట్లుగా మాట్లాడలేకపోవడమే. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం అనే మాట అందుకే వచ్చింది.


మాటలను ప్రయుక్తం చేయడం భావాభివ్యక్తికే అయినా ఆ అభివ్యక్తిలో తనదైన సొగసును చూపి మాట్లాడగలవారే రాణిస్తూంటారు.
అందుకే సంభాషణా చాతురి, ప్రసంగకళ వంటి మాటలు వచ్చాయి.


మాటలతోమోసాలు చేసేవారున్నారు. మాటలతో మానవ సంబంధాలను మెరుగుపరచగలవారూ వున్నారు. మాటతీరుకు భాషలోని సొగసును అందిపుచ్చుకుని సమర్థవంతంగా, సహేతుకంగా సకాలంలో సద్వినియోగపరచుకోవడం అవసరం.


ఏమైనా మన తెలుగు భాషలో సొగసులు గ్రహించి తెలుగులోనే మాట్లాడుకుందాం. బంధుమిత్రులతో కుటుంబసభ్యులతో తెలుగు మాట్లాడుకోవడమేకాదు చదవనూ, రాయనూ వచ్చినవారితో తెలుగులోనే రాతకోతలు సాగిద్దాం. భాషలోని సొగసులతో తెలుగు వెలుగు దీధితులను తేజరిల్లచేసుకుందాం.


-సుధామ 
9849297958


ఆంధ్రభూమి (దినపత్రిక) 'నుడి '19,మే'2012 శనివారం

0 comments: