ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, September 23, 2017

‘సంవేదన’లకు అద్దం పట్టే చేహొవ్ కథలు


కాలంలో వెనక్కి వెళ్లి చూడవలసిన కథలు కొన్ని వుంటాయి. ఇప్పటి పరిస్థితులతో, విలువలతో బేరీజు వేస్తే అవి చిత్రంగానూ, హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. కానీ మనుషులు, వారి స్వభావాలు, ప్రవర్తనలు కాలావధులను అధిగమించి నేటికీ ద్యోతకం అవుతూనే ఉంటాయి. అలాంటి పాత్రలతో రూపుదిద్దుకున్న కథలు, కాల పరిణామాలు ఎలా వున్నా కాలం వెంట నిలిచే కథలే. కన్యాశుల్కం అనే సమస్య యథారీతి ఈనాడు ఏ మాత్రమూ లేకపోయినా నేటికీ గురజాడ వారి ఆ రచన ఆ పాత్రలతో, స్వభావాలతో గిరీశం సంస్కృతితో ఎలా నవనవోన్మేషమో అలానే ప్రపంచవ్యాప్తంగా కాలావధులను దాటి నిలుస్తున్న కథకులున్నారు.

రష్యా అక్టోబర్ విప్లవం అనంతరం కనబట్టే తీరుకీ, అంతకు పూర్వపు తీరుకీ తేడా ఉంది. ఆ ప్రాచీన రష్యా సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపకరించే రష్యన్ కథకుడు అంతోన్ చేహొవ్! చేహొవ్ కథలు ధనార్జన, స్వీయ అభివృద్ధికే అంకితమైన వారి గురించీ, పటాటోపం, సంకుచిత మనస్తత్వం గల వారి గురించీ, అలాగే దాస్య భావనతో, అతి విధేయతతో అణకువతో వర్తించే బలహీనతల గురించీ అందంగానూ, ఉద్విగ్నంగానూ కనబడతాయి. నిజానికి ఆయన కథల్లో హాస్యం, వ్యంగ్యం తొలి రచనల్లో ఎంతగా కనబడతాయో, పరిణతి నందుకున్న దశలో రాసిన పెద్ద కథల్లో జీవితం ఎలా వున్నదీ, ఎలా వుండవలసిందీ చెప్పేవిగా సాక్షాత్కరిస్తాయి. అలాగని నీతులూ, ఉపదేశాలూ చెప్పడు ఆ కథల్లో.

1904లో మరణించిన చేహొవ్ కథల్లో ఆయన జీవించిన నాటి సమాజమే చిత్రితమైంది. అదంతా గతమే! ఆ ఛాయలేవీ రష్యాలో ఇప్పుడు లేవు. అయినా ఇవాళ్టికీ రచయితగా రష్యన్ సమాజం ఆయన పుస్తకాలకై ఎగబడి చదువుతూనే ఉంది. సోవియట్ రష్యాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చేహొవ్ ఎందరికో ఒక అభిమాన రచయిత.

‘తాను వాస్తవంగా ఎలా వున్నదీ మానవునికి చూపిస్తే అతను బాగుపడతాడు’ అన్నదే ఆయన రచనల వెనుకగల ఆశయగత సిద్ధాంతం. ఆ మాట ఆయన అన్నదే కాదు తన కథల్లో ఆ విశ్వాసపు సత్యాన్నే, ఆశనే చిత్రించి చూపించాడు. చేహొవ్ కథలను నాలుగు దశాబ్దాల క్రితమే అనువదించి తెలుగు పాఠకులకు అందించినవారు రా.రాగా ప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డి. మానవ జీవన ‘సంవేదన’లకు అద్దం పట్టే ఎ.చేహొవ్ కథలు సరికొత్తగా ఈ తరానికి అందించేందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ ప్రచురించిన కథల్లో చేహొవ్ ప్రశస్తమైన ఎనిమిది కథలున్నాయి.

అంతస్తును బట్టి, హోదానుబట్టి మనుషులకు విలువనిచ్చే మనుషులు సమాజంలో అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు. బహుశా ఎప్పుడూ వుంటారేమో కూడా. చేహొవ్ 1884లో రాసిన ‘ఊసరవెల్లి’ కథ అలా అత్యంత జనాదరణ పొందిన కటిక సత్యం కథ. మార్కెట్ వద్ద ఒక మనిషిని కుక్క కరుస్తుంది. డ్యూటీలో ఉన్న పోలీసు విచారణ మొదలెట్టి అలా కుక్కలను ఊరి మీద వదిలి పెట్టిన వాళ్లను తిడుతూంటాడు. ఆ కుక్క పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌దని ఎవరో చెబుతారు. అంతే ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పోలీసు వెంటనే కుక్క కరిచిన మనిషిని తిట్టడం మొదలెడతాడు. ఇంతలో ఇంకెవరో ఆ కుక్క జనరల్‌ది కాదంటాడు. పోలీసు వైఖరి, మాట తీరు మళ్లీ మారిపోతుంది. కుక్క యజమాని సాంఘిక అంతస్తు మీద విషయం ఆధారపడిందన్నమాట. అతను గొప్పవాడైతే కుక్కదేం తప్పులేదు. అతని హోదా తక్కువదయితే కుక్కే కాదు ఆ కుక్క యజమానిగా అతనూ నేరస్తులన్నమాట! ‘చట్టం వున్నవాడి చుట్టం’ అన్నట్లుగా చట్టాన్ని రక్షించవలసినవాడే ప్రయత్నించడం ‘ఊసరవెల్లి’ స్వభావమే కదా మరి!

మరో మంచి కథ ‘గుల్లలో జీవించిన మనిషి’ (1898) బేవికోవ్ ఏడాది పొడుగునా వాతావరణం ఎలా వున్నా బూట్ల తొడుగులు తొడుక్కొని, గొడుగు వేసుకుని, చందినీ కింద పడుకునే రకం. అతడు బ్రహ్మచారి. ఆడవారికి ఆమడ దూరం. అలాంటి వాడికి ఓ పార్టీలో ఉక్రైనా భాష పాటలు పాడే వార్యాతో పరిచయమవుతుంది. స్వభావతః ఏకాంత జీవికీ, ఆమెకూ వివాహం దాకా విషయ ప్రస్తావనమవుతుంది. వార్యా ఫొటోను బేవికోవ్ తన టేబుల్ మీద అమర్చుకుంటాడు కూడాను. ఒకరోజు వార్యా, తన సోదరుడు కొవలేంకొతో బాటుగా సైకిల్స్ మీద వెడుతూ బేవికోవ్‌కు కనబడుతుంది. ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేదే మింగుడుపడని బేవికోవ్ నిర్ఘాంతపోతాడు. ఆ ఊహనే తట్టుకోలేని అతను వార్యా సైకిల్ తొక్కడం వల్ల తన జీవితంలోకి ఆహ్వానించలేక ఆమె ఫొటో తొలగిస్తాడు. దుర్భర వేదనతో నెల్లాళ్లకే మరణిస్తాడు. ఇవాన్ ఇవానిచ్ అనే పాత్ర చెప్పిన కథగా సాగే ఇందులో - గుల్లలో జీవించే మనుషులు ఎందరో వున్నారు అనీ, పట్టణాలలో గాలి రాని ఇరుగు గదులలో నివసించడం, అక్కరకురాని కాగితాలు రాయడం, పేకాట ఆడటం, కుక్షింభరుల మధ్య కుసంస్కారపు వారి మధ్యా పనిలేని, మతిలేని ఆడవాళ్ల మధ్యా జీవితమంతా గడుపుతూ నిత్యం చెత్త మాట్లాడుతూ, చెత్త వింటూ ఉండడం ఇదంతా కూడా నత్తగుల్లలో జీవించే బ్రతుకే అనే అన్పింపచేస్తాడు!

‘సీతాకోక చిలుక’ కథ ఓల్గా అనే స్త్రీ వివాహితురాలయ్యీ సాగించే స్వేచ్ఛా జీవనం, డాక్టరయిన భర్త దీమొవ్‌తో వుంటూనే ఓ చిత్రకారుడితో సంబంధం నెరపడమూ, అది గ్రహించినా దీమొవ్ ఆమెను ఏమీ అనకపోవడమూ, చిత్రకారుడితో మోసపోయిన ఓల్గా భర్త ఔన్నత్యాన్ని గ్రహించేసరికి డిఫ్తీరియాతో దీమొవ్ మరణించడమూ జరుగుతుంది. 1892 నాటి కథ ఇది.

పాఠకుడి భావుకత్వం మీదా, గ్రహింపు మీదా నమ్మకం వున్న రచయిత చేహొవ్. అందువల్లే అతని కథలు యథాతథ స్థితిని వివరించే దిశగానే సాగుతాయి. అదే సమయంలో మనిషితనాన్ని నిలబెట్టే దిశగా, బ్యురాక్రటిక్ తనాన్ని నిరసించే దిశగా మేల్కొల్పుతాడు. ‘ఇయొనిచ్’ ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’ ‘పెండ్లికూతురు’ ‘బురఖా’ వంటి కథలన్నీ తన కాలంనాటి పరిసరాలను, మనుషులను చిత్రిస్తూనే భవిష్యత్ దర్శనాన్ని కూడా కలిగి వున్న రచయితగా నిరూపిస్తాయి. ‘లైలాక్ పూల మీద వ్యాపించే చిక్కని పొగమంచు’ వంటి ఉపమలు తరచుగా అనేక కథలలో కనిపిస్తాయి.

చేహొవ్ కథలు చదవడమంటే జీవితాన్ని చదవడం, మనుషులను చదవడం, నాలుగు దశాబ్దాల క్రితంనాటి అనువాద రచన కనుక రాచమల్లు రామచంద్రారెడ్డి తెలుగు అనువాదం సాఫీగా, హృదయమంగానే సాగినా ఇప్పుడు ఈ కథలను మరింత సరళంగా, హృద్యంగా అనువదించి చెప్పడం ఈ తరానికి ఇంకా బాగుంటుందనిపిస్తుంది.
-సుధామ

ఎ.చేహొవ్ కథలు
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి
వెల: రూ.100/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
సిఆర్ రోడ్, చుట్టుగుంట
విజయవాడ-4
Friday, September 22, 2017

సంసారానందం (జోక్స్ )
పాడుకాలం 

భార్య: నేనే కాలాన్ని అయ్యుంటే అంతా నాకోసం ఆసక్తిగా 
ఎదురుచూస్తారు కదండీ!
భర్త : నిన్ను చూసి అంతా భయపడతారు 
భార్య:అదేంటీ?
భర్త: చూడు 'పాడుకాలం దాపరిస్తోంది' అని. 

*****పోస్టర్ 

'నేను యజమానిని .జాగ్రత్త మీరు హద్దుల్లో వుండండి '
అని రాసి వున్న ఓ పోస్టర్ ను 
ఆఫీసర్ గారు పట్టుకొచ్చి తన చాంబర్ లో పెట్టారు 

మధ్యాహ్నం బయట ఎవరితోనో లంచ్ కెళ్ళి వచ్చేసరికి అది 
చుట్టబెట్టి టేబుల్ మీద వుంది.

లోపలికొచ్చిన ప్యూన్ 
"మీరుబయటి కెళ్ళినప్పుడు ఇంటినుంచి అమ్మగారు 
ఫోన్ చేసారండీచాలా కోపంగా వున్నారు. మీరు ఇంటినుంచి 
ఆఫీస్ కు పట్టుకెళ్ళిన పోస్టర్ సాయంకాలం ఇంటికి తిరిగి 
తీసుకురాకపోతే జాగ్రత్త అని  చెప్పమన్నారు." అన్నాడు 

*****
 ఏక రక్తం 

భార్య: మీతో కాకుండా ఏ రాక్షసుడితో పెళ్ళయినా హాయిగా 
వుండేదాన్ని 

భర్త: కానీ ఏకరక్త సంబంధీకుల  మధ్య పెళ్ళిళ్ళు చెల్లవు కదుటోయ్ !

*****
హతవిధీ!

"ఏమిటోయ్ నిన్న  అంత దిగాలుగా కనిపించావ్ " అడిగాడు 
విద్యాలంకార్  కళాకృష్ణను 

" మా ఆవిడ చీర కొనుక్కుంటా 5000 ఇమ్మని హఠం చేస్తే 
ఇవ్వాల్సి వచ్చింది "

"మరి ఇవ్వాళేమిటి ఇంత సంతోషంగా వున్నావు "

" మా ఆవిడ ఆ చీరకట్టుకుని మీ ఆవిడనే కలుసుకుంటానని 
వెళ్ళిందిగా!"

*****
జాగ్రత్త 

ఆఫీస్ కు బయలుదేరాడు భర్త 
కాసేపటికి భార్య ఫోన్ చేసింది 

" ఎక్కడున్నారు ?"

భర్త:" దారిలో యాక్సిడేంట్ అయ్యింది. ఆస్పత్రికి 
వెడుతున్నాను"

భార్య:" ఆ టిఫెన్ డబ్బా మూత ఊడిపోలేదు కదా! పప్పంతా 
అనవసరంగా ఒలొకిపోతుంది జాగ్రత్త :

*****Saturday, September 16, 2017

తెలుగు సమాజం -మార్క్సిజం

తెలుగు సమాజం - మార్క్సిజం
(వ్యాస స్రవంతి)
సంపాదకుడు: డా.ఎస్వీ సత్యనారాయణ
నవచేతన పబ్లిషింగ్ హౌస్
12-1-493/విఎ, గిరిప్రసాద్ భవన్
బండ్లగూడ (నాగోలు)
హైదరాబాద్-68
వెల: రూ.75/-

*
‘సమాజ రుగ్మతల కన్నింటికీ మార్క్సిజమే - మందు’ అనే భావన ప్రచులితంగానే వున్నవారున్నారు. మార్క్సిస్టు దృక్పథంతో చూసినప్పుడే, ఆ చూపునకు అది నిలిచినపుడే దేనికయినా సార్థకత! ప్రయోజనం! సంపదకు మూలం శ్రమ. శ్రమలో సమష్టి కృషిలోనే కళ ఆవిర్భావమూ జరిగిందనే మాట ఉంది. హేతువాద ధోరణిని, సాంఘిక చైతన్యాన్ని పెంపొందించి - అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకు, అభివృద్ధి నిరోధక వ్యవహారాలకు మూలమైన గ్రామాలలో, ఒక గొప్ప సాంఘిక, సాంస్కృతిక మార్పులకు మార్క్సిజం, దానిని విశ్వసించి సమాజాన్ని చైతన్యపరిచిన వ్యక్తులు కారణం కాగలిగారు కూడాను.

అసలు తెలుగు సమాజంపై మార్క్సిజం ప్రభావాలు, వైభవ ప్రాభవాలు ప్రజల ఆలోచనా ధోరణిపై దాని అనుకూల ప్రతికూల ప్రకంపనలు చర్చనీయాంశంగానే ఉంది. అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవ సందర్భంగా నేటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా.ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ వెలువరించిన వ్యాస స్రవంతి గ్రంథమే ‘తెలుగు సమాజం - మార్క్సిజం’.

ఇందులో వున్న ఎనిమిది వ్యాసాలూ అష్టదిక్కుల్లా అన్ని వైపుల నుంచీ ఆలోచనా ద్వారాలు తెరిచేవిగా ఉన్నాయి. ఈ వ్యాస రచయితల్లో ఒకరిద్దరు తప్ప నేడు మన మధ్య లేని మేధావులే. మార్క్సిజం వేకువ రేకలు గురించి రాంభట్ల కృష్ణమూర్తి తెలుగు ప్రజల సామాజిక జీవితంపై మార్క్సిజం ప్రభావం గురించి ఏటుకూరి బలరామమూర్తి, సాంస్కృతిక జీవనంపై ప్రభావం గూర్చి పరకాల పట్ట్భా రామారావు, సాంస్కృతిక రంగంపై గల ప్రభావం గూర్చి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ఆంధ్ర నాటక రంగంపై మార్క్సిజం ప్రభావం గురించి కర్నాటి లక్ష్మీనరసయ్య, ప్రజా కళారూపాలపై మార్క్సిజం ప్రభావం గురించి కందిమళ్ల ప్రతాపరెడ్డి, అలాగే ప్రధానమైన ఆధునిక తెలుగు సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం గురించి ఆర్వియార్, తెలుగు నవలపై ప్రభావం గురించి ప్రత్యేకంగా చూపు సారించి నిఖిలేశ్వర్ రాసిన వ్యాసాలున్నాయి.

ఈ వ్యాస రచయితలందరూ అభ్యుదయవాదులే. మార్క్సిస్టు మేధావులు, కవులు, కళాకారులు ఎందరో వున్నారు. సంపాదకులు ఎస్వీ అన్నట్లుగా దళిత రచయితలయిన బొజ్జా తారకం, కత్తి పద్మారావు, ఉ.సా.సాహూ, బి.ఎస్.రాములు గార్ల దళిత వాద తాత్త్విక భూమిక, అలాగే రంగనాయకమ్మ, ఓల్గా, కాత్యాయనీ విద్మహే, కాత్యాయిని వంటి సామ్యవాద స్త్రీ వాదుల  సైద్ధాంతిక పునాది మార్క్సిజమే. నిజానికి ఈ వ్యాస స్రవంతిలో అలా ఓ దళితవాద,  స్త్రీ వాద ప్రాతినిధ్య ప్రభావ వ్యాసం ఉంటే మరింతగా బాగుండేది.

‘మార్క్సిజాన్ని స్టాలినిజం రూపంలో గ్రహించినందున మృత్యునీడలాగా మార్క్సిజాన్ని స్టాలినిజం, ఆ పిమ్మట మావోయిజం వెంటాడుతూ వచ్చిన మేరకు మన అవగాహనలో ఆ విషబీజాలు నాటిన మేరకు మన ఆలోచన, ఆచరణ వక్రమార్గాన పడుతూ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగాలలో వ్యతిరేక ఫలితాలను కలిగిస్తూ వచ్చింది. నూతన ఆలోచనా విధానం ద్వారా మాత్రమే సృజనాత్మక మార్క్సిస్టు అవగాహన ఏర్పడి, ప్రజాతంత్ర మానవతా పూరిత శాస్త్రీయ తత్వశాస్త్రం రూపొందగలదు’ అని తన వ్యాసం ముగింపులో తీర్మానిస్తారు ఏటుకూరు బలరామమూర్తి.

‘సామ్రాజ్యవాదానికీ, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సాగిన ఈ మహత్తర విప్లవం (అక్టోబర్ విప్లవం) ప్రపంచ పీడిత ప్రజలందరికీ కనువిప్పు కలిగించింది. మార్క్సిస్టు కమ్యూనిస్టు మూలసూత్రాలు పీడిత ప్రజలను ప్రభావితం చేసాయి. ఆ విధంగా కమ్యూనిజం వ్యాప్తిలోకి వచ్చింది. ప్రపంచంలో పేద రైతు కూలీ ప్రజానీకానికి సోవియట్ రష్యా ఆశాజ్యోతిగా ప్రకాశించింది.’ అని మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తన వ్యాసారంభంలో అన్న మాట ఒకప్పటి మాట! 
సోవియట్ రష్యా ఛిద్రమవడం జరిగింది. ‘గర్జించు రష్యా! గాండ్రించు రష్యా!’ అని శ్రీశ్రీ అన్న కాలం వెళ్లేపోయింది. అయితే అక్టోబర్ విప్లవ స్ఫూర్తి అంతరించేది కాదన్నమాట వాస్తవం.

అక్టోబర్ విప్లవం గురించి తనకు జ్ఞానపీఠం సమకూర్చిన ‘విశ్వంభర’లో కీ.శే.డా.సి.నారాయణరెడ్డి ప్రస్తుతించారు. ఆ స్వప్నం చెదిరి పోతున్నప్పుడు, ఆ ఆశలు ఆవిరైపోతున్నప్పుడు, ఆ జెండా చిరిగిపోతున్నప్పుడు, ఆ తత్వం అపహాస్యం పాలవుతున్నప్పుడు సైతం ఆవేదనతో అభివ్యక్తీకరించారిలా-

ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని
ఎవ్వడురా కూసింది ఎర్రజెండా నేలకొరిగిందని
తూర్పున సూర్యుడు పొడిచినంతకాలం
మనిషిలో రక్తం ప్రవహిస్తున్నంత కాలం
అజేయం విప్లవం
అజేయం సోషలిజం
దానిని ఆపడం ఎవడబ్బ తరం??

ఏమయినా నిఖిలేశ్వర్ తన వ్యాసాంతంలో ఒకచోట పేర్కొన్నట్లు ‘గత అరవై సంవత్సరాల కాలంలో ఈ దేశంలోని వర్గ వ్యవస్థలోని కులజాఢ్యం, మత మౌఢ్యంతో బాటు  ధనిక పెట్టుబడిదారి పెత్తనాన్ని, ఆర్థిక ప్రాబల్యాన్ని ఎండగడుతూ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వర్తమాన రాజ్యం, దాని స్వభావం, ఎన్నికల జూదంలో నెగ్గుకొస్తున్న పాలకుల ఆచరణల వల్ల దుష్ఫలితాలు, కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు, యధార్థ గాథలుగా సజీవ జీవన దృశ్యాలుగా సాహిత్యంలో నవలలు వచ్చాయి. వీటిపై మార్క్సిస్టు ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది’ 

సాహిత్యంలోనూ సాంస్కృతికంగానూ మార్క్సిజం తెలుగు సమాజంతో పెనవేసుకుని వుందనే మాట యధార్థం.

-సుధామ  
       

Sunday, September 10, 2017

సాహితీదీపికలుకీ.శే.కోట శ్రీనివాస వ్యాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ కె.పి.వ్యాస్- ఐ.పి.ఎస్ అంటే తెలియని వారు లేరు.రాజధాని రోడ్ల మీద వాహన సంచారాన్ని గీతలు గీసి నిబంధనల్లో నియంత్రించి ట్రాఫిక్ సెన్స్ అంటూ కలిగించింది ఆయనే!నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్ గా ఖ్యాతిగాంచి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో దారుణ హత్యకు గురి అయినది ఆయనే!ఆయన పేర పోలీస్ అకాడమీలో ఏటా స్మారకప్రసంగాలు జరుగుతున్నాయి.ఆయన కాంస్య విగ్రహం విజయవాడలో కూడా వుంది.

వ్యాస్ గారి ధర్మపత్నియే శ్రీమతి అరుణ. పుట్టింటి వారు గంటి వారు.జీవితపు ఆఘాతాన్ని తట్టుకున్న సాధికారక మహిళగా ఆమె సంస్కృతాంధ్ర ఆంగ్లాలలో నిష్ణాతురాలై ఒక రచయిత్రిగా,గొప్ప విదుషీమణిగా రాణిస్తున్నారు. ఇప్పటికే పది పుస్తకాలకు పైగా రచించి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం.సర్వార్థ సంక్షేమ సమితి,విజయభావనమిత్ర ,రాగరాగిణి సంస్థ;ల ద్వారా ఉత్తమరచయిత్రి అవార్డులు పొందిన శ్రీమతి అరుణావ్యాస్ సరికొత్త వ్యాస సంకలనం ' సాహితీ దీపికలు ' నవచేతన బుక్ హౌస్ ప్రచురణగా వెలువడింది.మీ సుధామ పై గల గౌరవాదరాలతో సాహితీదీపికలు గ్రంధానికి పీఠిక రాయమని శ్రీమతి అరుణ కోరారు. ముద్రితప్రతి శ్రీమతి అరుణావ్యాస్ గారినుండి అందుకున్నాను.ఆ పీఠిక ,ఆవిడ పలుకు సాహితీదీపికలు గ్రంథంనుండి ఇక్కడ మీ కోసం......

Monday, September 4, 2017

సెరిబ్రల్ పాల్సీకి - కవి భిషక్కుకవి భిషక్కు’ - ఈ మాట ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో వుండేది. ఆయుర్వేద వైద్యానికి, కవిత్వ రచనకు అవినాభావ సంబంధం వున్నట్లుగా బాగా దాఖలాలున్న ఆ రోజుల్లో- అలాంటి మహనీయులను ‘కవి భిషక్కు’లనేవారు. సాహిత్య సృష్టిలోనూ, వైద్య చికిత్సలోనూ ఆరితేరినవారు ‘కవి భిషక్కు’లు. ఆధునికంగా అలాంటి ‘కవి భిషక్కు’ అనడానికి నిలువెత్తు నిదర్శనంగా వుండేవారు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి.
గత నెల ఆగస్టు 17వ తేదీన కాలధర్మం చెందిన శ్రీరామమూర్తిగారు వైద్యంలో, సాహితీ సేద్యంలో రెండింటిలోనూ నిష్ణాతులు. జూన్ ఒకటిన సప్తతి పూర్తిచేసుకుని రెండు నెలలయినా కాకముందే, తొందరపడి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన ఆయన రామసుబ్బారావు, ఆదిలక్ష్మమ్మ దంపతులకు 1947లో జన్మించారు. చీరాల స్థిరనివాసంగా సంగీత సాహిత్యాల కుటుంబ నేపథ్యంలో ఎదిగి, ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో పి.యు.సి చదివి, అనంతరం హైదరాబాద్ ప్రభుత్వ ఆయర్వేద కళాశాలలో బి.ఎ.ఎమ్.ఎస్ (బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ) పట్టా పొందారు. మూడు దశాబ్దాలపాటు భారతీయ వైద్యశాఖలో వివిధ హోదాలలో పనిచేసి, 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ‘శ్రీయం’ పేర (సిద్దేశ్వరి రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం) సంస్థను ఏర్పాటుచేసి ఆయుర్వేద వైద్య విధాన విస్తృతికి అపారమైన కృషిచేశారు. కవిగా, కధకునిగా, వ్యాసకర్తగా తనదైన సాహితీ సృజనతో విమర్శకుల మన్ననలు కూడా సమాంతరంగా అందుకున్న ప్రతిభామతి ఆయన. అంతేకాదు ‘స్నిగ్ధ్ఛాయ’ అనే నవల, ‘కామరూప’ అనే నవ్య ధారావాహిక నవలికలతో నవలకారునిగా కూడా వాసికెక్కారు.
గురజాడ అన్నట్లు ‘కొత్తపాతల మేలుకలయిక క్రొమ్మెరుంగుల్ చిమ్మగా’ భాసించిన రచయిత ధేనువకొండ. ఎంత సంప్రదాయ అభిజ్ఞులో అంత ఆధునికత సంతరించుకున్న సృజనశీలి.
శ్రీలలితాసహస్రనామ వైశిష్ట్యమ్ 2003లో వ్యాసాలుగా రాసిన సంప్రదాయం ఒకవంక, తన వృత్తి అయిన ఆయుర్వేద వైద్య విషయాలు రచనలుగా చేసిన శాస్ర్తియ దృక్పథం మరోవంకా ధేనువకొండ శ్రీరామమూర్తిగారి సొత్తు. హైదరాబాద్‌లో నివశిస్తున్నా ఒంగోలులోని వాడరేవు ప్రాంతంలో నాలుగు దశాబ్దాలకుపైగా ఆయుర్వేద వైద్యునిగా తన సేవలు అందిస్తూనే వచ్చారు. ప్రతినెలా అక్కడికి విధిగా వెళ్లి అక్కడి ప్రజల యోగక్షేమాలు చూసేవారు. ముఖ్యంగా వైద్యునిగా సెరిబ్రల్ పాల్సీ చికిత్సలో ఆయన వైద్య విధానం ఎంతో ప్రశస్తిపొందింది. శిశువు ఎదుగుదలో మెడ నిలపలేకపోవడం, కూర్చోలేకపోవడం, చూపు నిలపలేకపోవడం, మాటలు అస్పష్టంగా రావడం, నడక సరిగ్గా లేకపోవడం, బుద్ధిమాంద్యం, చిన్న శబ్దానికే ఉలిక్కిపడడం, ఫిట్స్, చొంగకార్చడం, గ్రహణశక్తి లోపం, తొందరగా అన్నం నమిలి మింగలేకపోవడం వంటి లక్షణాలు కొందరి పిల్లల్లో పూర్తిగాను, మరికొందరిలో కొన్ని లక్షణాలే వుండటం గమనిస్తూంటాం. ఈ లక్షణాల కలయికనే సెరిబ్రల్ పాల్సీ అంటారు. తన ఆయుర్వేద విధానంలోని కొన్ని ప్రత్యేక చికిత్సలతో ఆయన విజయవంతమైన ఫలితాలు సాధించి కొద్ది వారాలలోనే అటువంటి పిల్లలను ఆరోగ్యవంతులుగా చేశారు. సెరిబ్రల్ పాల్సీకి మూలకారణం మెదడులో వుంటుంది. ఆయుర్వేద మేధ్య రసాయనాలతో, తైలాలతో, లేపనాలతో చేసే క్లిష్టతర చికిత్సలలో అందెవేసిన చేయిగా ఎందరో శిశువులకు కొత్త జీవితం ఇచ్చిన ఆయన వ్యక్తిగా పసిహృదయుడే. తన ఆధ్యాత్మిక, సాహిత్య జ్ఞానంతో కూడా చికిత్స చేసే నిజమైన కవి భిషక్కు ఆయన.
కవి మిత్రుడు, మంచి విమర్శకుడు గుడిపాటి ధేనువకొండకు మంచి స్నేహితుడు. గుడిపాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధానికి ధేనువకొండ శ్రీరామమూర్తి ఆయతనమ్, ఐలాండ్ విల్లా, కోర్టు సెంటర్, క్రౌంచవియోగం, జలయజ్ఞ సమిధలు, దక్షిణపొలం, పశుర్వేతి, పశ్యంతి వంటి అద్భుతమైన కథలు రాశారు. తమ ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం పంతులు గారు నివసించిన ఇల్లు భూమికగా ఆయన రాసిన ‘ఐలాండ్ విల్లా’ కథల సంపుటి ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చింది. ఆ సంపుటికే 2009లో ఆయన శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సేవా సమితి నుండి కుర్రా కోటాసూర్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం అందుకున్నారు. ‘ఐలాండ్‌విల్లా’ ఆడియో కథా సంపుటిగా కూడా రూపొందడం ఒక విశేషం. అలాగే మరో కథా సంపుటి ‘మోహతిమిరం’ కూడా కథకునిగా ఆయన స్థానాన్ని తెలుగు కథా ప్రపంచంలో చాటి చూపింది.
కథకునిగా ఆయన కథలు మానవ జీవన పార్శ్వాలను మహోన్నతంగా కనులముందు నిలుపుతాయి. శంకరాభరణం శంకరశాస్ర్తీలా ధేనువకొండ శ్రీరామమూర్తిగారి ‘ఆయతనమ్’ కథలోని చయనులు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అనీ, తాను విశ్వసించిన సంస్కృతీ సంప్రదాయాలకు అంకితమైన చయనులు విశ్వనాథవారి ధర్మారావు కంటే ఉన్నతుడిగా గోచరిస్తాడు అనీ- కె.పి.అశోక్‌కుమార్ ‘ఆయతనమ్’ కథ ఒక్కటి చాలు కథకునిగా ధేనువకొండ శిఖరస్థాయిని తెల్పడానికి అని చెప్పడం అతిశయోక్తి అనలేము. ఆధునికత పేరుతో బ్రాహ్మణ కుటుంబాలలో విచ్ఛిన్నమవుతున్న సంప్రదాయరీతుల పట్ల ఆర్తి, ఆవేదన, సంస్కృతి సంప్రదాయలపట్ల కథకుని వల్లమాలిన ఆపేక్ష ‘ఆయతనమ్’, ‘యజ్ఞోపవీతం’, ‘జలయజ్ఞ సమిధలు’ వంటి కథలలో కానవస్తుంది. ‘క్రౌంచ వియోగం’ కథలోని శేషయ్య తాత భోజన ప్రియత్వం ‘మిధునం’ సినిమాలోని బాలసుబ్రహ్మణ్యం పాత్రను తలపిస్తుంది. ధేనువకొండలోని తాత్త్వికత, ఆధ్యాత్మిక చింతన మఖమల్ గులాబీ, దక్షిణపొలం వంటి కథల్లో తొంగి చూస్తుంది. నేటి కార్పొరేట్ రంగపు యువతీ యువకులు చదివి తీరాల్సిన కథ - ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. డాట్‌కామ్’. అలాగే ‘మోహతిమిరం’ కథ చదివితే వివాహేతర సంబంధాలవల్ల ఒనగూడే అనర్థాలు కనువిప్పు కలిగించేలా తెలుస్తాయి. ముందు చెప్పుకున్న డాక్టర్‌గా ఆయన చికిత్స చేసే ‘సెరిబ్రల్ పాల్సీ’ నేపథ్యంలోనే ‘చిగురించిన శిశిరం’ అనే అద్భుతమైన కథను రాశారు. వృత్తినీ ప్రవృత్తినీ అందంగా ముడివేసిన కలం నైపుణి అది. సంగీతం పట్లగల ఆసక్తితో రాసిన కధేతివృత్తాలు కూడా కానవస్తాయి. ఆయన కథల్లో కవిత్వ భాష వుంది. అందుకు వౌలికంగా ఆయన ‘కవి భిషక్కు’ కావడమే కారణం.
కవిగా ధేనువకొండ శ్రీరామమూర్తిగారు వెలువరించిన తొలి కవితా సంపుటి ‘ఆశల సముద్రం’ అలాగే ‘అమ్మఒడి’ అనే దీర్ఘకవితా సంపుటి వెలువరించారు. స్వల్ప వ్యవధిలోనే రెట్టింపు ముద్రణలు పొందింది ఆ కావ్యం. అలాగే ‘వల్మీకం’, ‘చింతయామి’ కవితా సంపుటులు కవిగా ధేనువకొండకు విమర్శకుల ప్రశంసలను ఉత్తాలంగా సమకూర్చిపెట్టాయి. ఎంపిక చేసిన కొన్ని కవితల ఆంగ్లానువాదాలతో ‘సమ్ సైలెంట్ మెలోడీస్’ అనే సంపుటి వెలువడింది. హిందీ కవితల అనువాదంతోనూ ఒక గ్రంథం వెలువడింది. భోపాల్‌లో జరిగిన ‘కవిభారతి’ కార్యక్రమంలోనూ కేంద్ర సాహిత్య అకాడమీయే 2014లో నిర్వహించిన దక్షిణ భారతీయ భాషల కవితోత్సవంలోనూ తెలుగు కవిగా ధేనువకొండ శ్రీరామమూర్తి పాల్గొన్నారు. తన సేవాతత్పరతతో ‘పాలపిట్ట’ సాహిత్య పత్రికకు, స్ప్రెడింగ్ లైట్స్ వంటి సేవాకృషికి బాసటగానిల్చిన వదాన్యత వారిది.
ఈ కవిభిషక్కు కవిత్వంలో తనదైన విలక్షణతను ముద్రవేసుకున్నాడు. ‘అమ్మఒడి’ కావ్యం తమను కవిత్వ ప్రేమికులను చేసిందని ప్రకటించినవారున్నారు. కవిగా తన సొంత గొంతుకను నిలుపుకుంటూ అఖిల భారత సమ్మేళనాలకు బెంగుళూర్, గోవా, కొచ్చిన్, భోపాల్‌లకు తెలుగు కవిత్వ ప్రతినిధిగా కేంద్ర సాహిత్య అకాడమీ పంపున వెళ్లి ప్రశంసలందుకున్న వారాయన. చింతయామి కవితా సంపుటికి నాలుగేండ్ల ఆయన మనుమడు ‘అచ్యుత్’ ముఖచిత్రాన్ని సంతరిచ్చి ఇచ్చాడు. కన్న తల్లినీ, ఉన్న ఊరునీ మరువని మట్టి పరీమళం, ఒక సంప్రదాయభిజ్ఞతతో కూడిన తాత్త్వికచింతన ఆయన కవితల మూలాధారనాడి. ‘జీవితం ఒకటి జ్ఞాపకాలు అనేకం’, ‘పురాతన శబ్దమాలికలు’, ‘మా కశ్చిత్ దుఃఖమాగ్భవేత్’, ‘మాజిక్ రియాలిటీ’, ‘మృత్యుముఖం నవ్వుతోంది’, ‘విశ్వాత్మ ఒక్కసారి కళ్ళుతెరు’ వంటి కవితా ఖండికలు ఆయన కవితా గరిమకు అరచేతి కంకణాలు.
కనుల మూయకనే స్వప్నం
స్వాప్నిక ట్రాన్స్‌లో
నడుస్తూ, ఈదుకుంటూ ఎగురుకుంటూ
నెమ్మదిగా సాహసంగా, అమాయకంగా
శాశ్వతంగా శిథిలమైన
జలసమాధిలోని గ్రామాన్ని
మునిగిపోయిన మనిషి జాడను వెతుక్కుంటున్నాను
- అంటారొకచోట. ధేనువు తిరుగాడిన కొండ ధేనువకొండ అయింది. ఆ స్వచ్ఛత, పావనత హృదయంలో నిలుపుకుని సమాజహిత చింతనతో సేవాభావంతో జీవిక సాగించిన వారాయన. మానవ జీవితపు అనేక కోణాలను, అనేక పార్శ్వాలను చిత్రిస్తూ ఆయన రాసిన నవల ‘స్నిగ్థ్ఛాయ’. అనేక అవరోధాలను ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించడానికి మొక్కవోని జీవిత ప్రస్థానాన్ని సాగించిన స్ర్తి పాత్ర రేవతి. విమానంలో అమెరికా వెళుతూ తన జీవితాన్ని నాస్టాల్జియాగా మననం చేసుకోవడంతో మొదలయ్యే ‘స్నిగ్థ్ఛాయ’ నవల అద్యంతం ఆసక్తిగా చదివిస్తుంది. రచయిత తొలి నవలకు ఇచ్చే పదివేల రూపాయల నగదును ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు’, ‘స్నిగ్థ్ఛాయ’కు ప్రదానం చేసింది. 2015 ఏప్రిల్‌లో ఆవిష్కృతమైన ‘స్నిగ్థచ్ఛాయ’ పాఠకుల, పత్రికల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే గత సంవత్సరం నవ్య వారపత్రిక, లక్ష్మీనారాయణ జైని మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలో డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తిగారి ‘కామరూప’ నవలకు ద్వితీయ బహుమతి లభించింది. ధారావాహికగా పాఠకులను ఆకట్టుకుంటూ ఉత్కంఠభరితంగా సాగిన నవల ఇది. సరోగసీ, ఐఫీ పద్ధతుల్లో సంతానప్రాప్తి పొందటం వంటి నవీన వైద్య అంశాల చిత్తికపై మానవ జీవన పరిణామ విశే్లషణను తాత్వికంగా చేయడంలో అందులో కానవస్తుంది. ‘అతడి ధాతువును తన క్షేత్రంలో పోషించడం తప్పుకానప్పుడు అతన్ని కోరుకోవడంలో తప్పేంటి’ అని నీలాంబరి పాత్ర తన మనసునిండా రామచంద్రుడిని నిలుపుకోవడం, ఆమె ఏం చేయబోయింది? అనే ఉత్కంఠతో సాగే ఈ నవలలో మరో ప్రధాన ఆలోచనా ధార ఏమిటంటే- ‘‘మానవాతీత శక్తుల్ని కొట్టిపారేయలేం. కానీ ఒక వైద్యుడు వైద్యపరంగా పరీక్షలు జరిపి శాస్ర్తియ పద్ధతిలో నిర్థారణ చేసిన విషయాన్ని ఎక్కడో దూరంగా ఒక పల్లెటూర్లో కూర్చున్న నరసింహం పంతులుగారు సిద్ధయోగ మార్గం ద్వారా చెప్పగలిగారు. ఇదెలా సాధ్యమైంది? అదేవిధంగా వెంకట్రామన్ కూడా సియాన్స్ ప్రయోగం ద్వారా ఎక్కడో అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుంటున్న వ్యక్తి ప్రాణాలు కాపాడాడు! ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఈ విషయాలన్నీ ‘కామరూప’ నవల పాఠకులను పఠనాసక్తితో అలరింపజేసింది.
ధేనువకొండ శ్రీరామమూర్తి ధన్వంతరి జయంతి పాటించేవారు. ఆయుర్వేద వైద్యాన్నీ, సాహిత్య క్షేత్రంలో నవల, కథ, కవితా, వ్యాసరచనా సేద్యాన్ని ప్రతిభావంతంగా నిర్వర్తించిన సవ్యసాచి ఆయన. ఆయన మరణం వైద్య రంగానికే కాదు సాహిత్య ప్రపంచానికీ ఒక తీరని లోటు. ఆ ‘కవి భిషక్కు’ ధేనువకొండ శ్రీరామమూర్తికి అక్షరనివాళి!

- సుధామ, 
9849297958